విడుదల తేదీ : ఏప్రిల్ 6, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : నందు, సౌమ్య వేణుగోపాల్, పూజ రామచంద్రన్
దర్శకత్వం : వరప్రసాద్ వరికూటి
నిర్మాతలు : ఎం.శ్రీకాంత్ రెడ్డి, ఇప్పిలి రామమోహనరావు
సంగీతం : యాజమాన్య
సినిమాటోగ్రఫర్ : ఎస్.మురళి మోహన్ రెడ్డి
ఎడిటర్ : చోటా కె ప్రసాద్
స్క్రీన్ ప్లే : వరప్రసాద్ వరికూటి
నూతన దర్శకుడు వరప్రసాద్ వరికూటి దర్శకత్వంలో నందు, సౌమ్య వేణుగోపాల్ జంటగా నటించిన చిత్రం ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ:
విష్ణు (నందు), వందన (సౌమ్య వేణుగోపాల్) ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెద్దలు కూడ వారి పెళ్ళికి అంగీకరిస్తారు. అలా పెళ్ళికి ఇంకోక్క రోజే సమయం ఉందనగా విష్ణు, స్నేహితులతో కలిసి బ్యాచిలర్స్ పార్టీ చేసుకుంటాడు.
ఆ పార్టీ దగ్గర వాళ్లకు తార (పూజ రామచంద్రన్) అనే అమ్మాయి కలుస్తుంది. ఆమె కారణంగా విష్ణు, అతని స్నేహితులు తెల్లారేసరికి ఒక్కొక్కరు ఒక్కో ఇబ్బందిలో ఇరుక్కుపోతారు. ఆ ఇబ్బందులు ఏంటి, వాటి నుండి వాళ్లెలా బయటపడ్డారు, చివరికి వందనతో విష్ణు పెళ్లి జరిగిందా లేదా, అసలు వాళ్ళ ప్రేమ కథేంటి అనేదే ఈ సినిమా.
ప్లస్ పాయింట్స్ :
సినిమాలో ప్లస్ పాయింట్ అంటే దర్శకుడు తను ఎంచుకున్న స్క్రీన్ ప్లే ఆధారితమైన స్క్రిప్ట్ ను ఎక్కడా కనెక్షన్స్ మిస్సవకుండా స్పష్టంగా చెప్పడం. సన్నివేశాలోని బలం సంగతి అటుంచితే ప్రతి సన్నివేశానికి ఒక ఖచ్చితమైన రీజన్ కనబడింది. హీరో స్నేహితుల పాత్రల ద్వారానే దర్శకుడు వరప్రసాద్ ఫస్టాఫ్, సెకండాఫ్లలో కొన్ని చోట్ల నవ్వుకోదగిన హాస్యాన్ని పండించారు.
హీరో నందు తన నటనతో సినిమాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా ఎమోషన్స్ కలిగిన తార పాత్రలో పూజా రామచంద్రన్ నటన మెప్పించింది. అలాగే ప్రతినాయకుడిగా అభినందించదగిన నటన కనబర్చిన గగన్ విహారికి ఇదొక మంచి అటెంప్ట్. ఆయనలో విలన్ కు కావాల్సిన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయని ఈ సినిమా ద్వారా బయటపడింది. ద్వితీయార్థంలో నడిచే రెండు ఎమోషనల్ సన్నివేశాలు కొంత మెప్పించాయి.
మైనస్ పాయింట్స్ :
హాలీవుడ్ సినిమా ‘ది హ్యాంగోవర్’ స్పూర్తితో తెరకెక్కిన ఈ సినిమా ప్లాట్ చిన్న చిన్న కారణాల మినహా మిగతా మొత్తం మార్పు లేకుండా అచ్చు ఆ ఇంగ్లీష్ సినిమాకు కాపీలా ఉంటుంది. హీరో అతని స్నేహితులు ఫుల్లుగా డ్రింక్ చేయడం ఆ మత్తులో ఏదేదో చేసేయడం, తెల్లారేసరికి ఇబ్బందుల్లో ఇరుక్కుని వాటిని నుండి బయటపడటానికి నానా తిప్పలు పడటం అనే ప్లాట్ మొదటిసారి వినడానికి చూడటానికి థ్రిల్లింగా ఉంటుంది కానీ మళ్ళీ మళ్ళీ చూడాలంటే ఖచ్చితంగా బోరే కొడుతుంది. కాబట్టి దర్శకుడు ఆ ప్లాట్ ను కొత్త తరహా సన్నివేశాలతో, బలమైన కథనంతో భిన్నంగా ప్రెజెంట్ చేయాలి.
కానీ ఈ సినిమాలో మాత్రం దర్శకుడు క్రియేట్ చేసే ప్రతి పరిస్థితి కన్విన్సింగానే ఉన్నా సన్నివేశాల్లో బలం లోపించడం, నందు, పూజ, గగన్ మినహా మిగతా నటీ నటుల నుండి మెప్పించే స్థాయి పెర్ఫార్మెన్స్ బయటకురాకపోవడం, టేకింగ్ కూడ పేలవంగా ఉండటంతో సినిమా చతికిలపడిపోయింది. సినిమా చూస్తున్నంతసేపు ఇదంతా రొటీన్ కథే అనే ఫీలింగ్స్ ను పోగొట్టలేకపోయాడు దర్శకుడు. ఇక మధ్యలో వచ్చే పాటలు ఇంకొంత నీరసం తెప్పించగా, కొన్ని కామెడీ సీన్స్ ఓవర్ ది టాప్ ఉండి ఇబ్బందిపెడతాయి.
సాంకేతిక విభాగం :
దర్శకుడు వరప్రసాద్ హాలీవుడ్ సినిమా నుండి హిట్ ప్లాట్ ను తీసుకుని ఎక్కడా కనెక్షన్స్ పోకుండా పద్దతిగా, కొంత హాస్యాన్ని పండించి కథను చెప్పాడు కానీ దాన్ని ఆసక్తికరమైన, బలమైన సన్నివేశాలతో, కథనంతో నింపి థ్రిల్ చేయలేకపోయాడు.
మాజమాన్య అందించిన సంగీతం పర్వాలేదు. ఎస్.మురళి మోహన్ రెడ్డి సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకె అనేలా మాత్రమే ఉండగా చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాగానే ఉంది. చిత్ర నిర్మాతలు ఎం.శ్రీకాంత్ రెడ్డి, ఇప్పిలి రామమోహనరావులు పాటించిన నిర్మాణ విలువలు పర్వాలేదు.
తీర్పు :
‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’ అంటూ వచ్చిన ఈ చిత్రం స్క్రీన్ మీద థ్రిల్ చేసే వింతలేమీ చూపలేకపోయింది. కథను ఒక ఫార్మాట్లో పద్దతిగానే చెప్పగలిగిన దర్శకుడు దాన్ని మంచి థ్రిల్ చేసే, కొత్తగా అనిపించే సన్నివేశాలతో ఆసక్తికరంగా మలచలేకపోయాడు. దీంతో సినిమా చాలా చోట్ల బోర్ కొట్టించింది. అక్కడక్కడా పండిన హాస్యం, నందు, పూజా, గగన్ విహరిల నటన మినహా ఈ చిత్రంలో పెద్దగా ఎంటర్టైన్ చేసే వేరే అంశాలేవీ దొరకవు.
123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team