విడుదల తేదీ : నవంబర్ 25, 2016
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
దర్శకత్వం : శివ రాజ్ కనుమూరి
నిర్మాత : శివ రాజ్ కనుమూరి, సతీష్ కనుమూరి
సంగీతం : రవిచంద్ర
నటీనటులు : శ్రీనివాస్ రెడ్డి, పూర్ణ
‘గీతాంజలి’ సినిమాతో హీరోగా కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టి సక్సెస్ అందుకున్న కమెడియన్ ‘శ్రీనివాస్ రెడ్డి’ మరో ప్రయత్నంగా చేసిన చిత్రమే ఈ ‘జయమ్ము నిశ్చయమ్మురా’. టీమ్ భారీ ప్రమోషన్ల మధ్య, మంచి పాజిటివ్ టాక్ మహద్య ఈరోజే విడుదలైన ఈ చిత్రం ఎలా ఏందో ఇప్పుడు చూద్దాం…
కథ :
సర్వ మంగళం (శ్రీనివాస్ రెడ్డి) తెలంగాణలోని కరీంనగర్ నుండి కాకినాడ ఉద్యోగరీత్యా వచ్చిన ఒక పల్లెటూరి వ్యక్తి. మూఢనమ్మకాలను, స్వామిజీలను ఎక్కువగా నమ్మే సర్వమంగళం కాకినాడలో రాణి (పూర్ణ) అనే అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకుని తన బాస్ ద్వారా త్వరగా ట్రాన్ఫర్ చేయించుకుని సొంత ఊరికి వెళ్లిపోవాలనే లక్ష్యం పెట్టుకుని ఆ పని మీదే ఉంటాడు.
కానీ ఇంతలోనే రాణి తనకు దూరమయ్యే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితుల ప్రభావం వలన సర్వమంగళం తన చుట్టూ ఉన్న రాణికి దగ్గరవలేక, ఆ క్లిష్ట పరిస్థితుల్లో వదిలి వెళ్లలేక నానా అవస్థలు పడుతుంటాడు. అలా మానసిక సంఘర్షణలో ఉన్న సర్వమంగళం రాణిని ఎలా కాపాడుకున్నాడు ? ఎలా తన ప్రేమను రాణికి చెప్పాడు ? చివరికి తన లక్ష్యమైన ట్రాన్ఫర్ ను పొందాడా లేదా ? అన్నదే ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
సినిమాలోని ప్లస్ పాయింట్స్ కొస్తే ముందుగా చెప్పుకోవలసింది దర్శకుడు ఎంచుకున్న సాధారణమైన స్టోరీ లైన్ , దాని చుట్టూ కథను అల్లుకున్న తీరుని గురించి చెప్పాలి. డైరెక్టర్ శివ రాజ్ రోజువారీ జీవితంలో మనకు కనబడే ఒక పిరికి పాత్రను తీసుకుని ఆ పాత్రను కష్టమైన పరిస్థితుల ప్రభావంలో ఇరికించి చివరికి దాన్నే హీరోని చేసిన తీరు, ఎక్కడికక్కడ ప్రేక్షకుడికి సంతృప్తినిచ్చే మలుపుల్లాంటి సన్నివేశాలు బాగున్నాయి. అలాగే కథను మొత్తాన్ని కరీంనగర్, కాకినాడల్లోనే నడుపుతూ ఎక్కడా బోర్ కొట్టకుండా లోకేషన్లని తెలివిగా వాడుతూ ఆహ్లాదకరంగా సినిమాని తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంది.
అలాగే ఫస్టాఫ్, సెకాండాఫ్ లలో పేద బ్రాహ్మణుడి పాత్రలో పోసాని చేత, ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో కృష్ణ భగవాన్ చేత చేయించిన కామెడీ ఆద్యంతం రంజింపజేసింది. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ లో పోసాని కామెడీ బాగా కనెక్టయింది. అలాగే నటుడు శ్రీనివాస్ రెడ్డి ఒక మూఢనమ్మకాలను కలిగి ఆత్మవిశ్వాసం లేక వెనకబడుతున్న మంచివాడిగా తన నటనతో మెప్పించాడు. హీరోయిన్ పూర్ణ కూడా సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టి స్వయం కృషితో బ్రతకాలనుకునే అమ్మాయిగా మెప్పించింది.
మైనస్ పాయింట్స్ :
సినిమా ఫస్టాఫ్ ను బాగానే మొదలుపెట్టినా మొదటి 20 నిముషాల తరువాత కథ చాలా నెమ్మదించింది. దర్శకుడు చాలా సేపటి వరకూ అసలు కథలోకి వెళ్లకుండా పాత్రలను పరిచయం చేయడంలో ఎక్కువ సమయాన్ని కేటాయించి ప్రీ ఇంటర్వెల్ సన్నివేశం ముందు వరకూ బోర్ కొట్టించాడు. అలాగే సినిమాలో సర్వమంగళం పాత్ర చుట్టూ కొన్ని అనవసరమైన సన్నివేశాలు నడిచి కాస్త విసిగించాయి.
ఇక సెకండాఫ్ లో కూడా సర్వమంగళం పాత్ర పూర్తిగా మారిపోయిన తరువాత వచ్చే కొన్ని అనవసరమైన సన్నివేశాలు, పాత్రలు కథను కాస్త పక్కదారి పట్టించాయి. సర్వమంగళం పాత్ర పూర్తిగా హీరోగా మారిపోయే కీలకమైన సందర్భం బలంగానే ఉనప్పటికీ ఆ సన్నివేశం ప్రభావితంగా స్క్రీన్ పై చూపబడలేదు.
సాంకేతిక విభాగం :
నవలా ఇతివృత్తాన్ని ఆధారంగా చేసుకుని ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టు కథను, దానికి తగినంత కామెడీని కలుపుకుని కథనం రాసుకున్న దర్శకుడి రచనా ప్రతిభ, ఫస్టాఫ్ లో, సెకండాఫ్ లలో కథనం కాస్త నెమ్మదించినా దాన్ని తెరక్కించిన ఆయన దర్శకత్వ తీరు బాగున్నాయి. చాలా సన్నివేశాల్లో డైరెక్టర్ ప్రతిభ, సునిశిత పరిశీలన స్పష్టంగా బయటపడ్డాయి. ఇక కాకినాడ, భీమిలీ లొకేషన్లను అద్భుతంగా చూపించిన కెమెరా పనితనాన్ని మెచ్చుకోవలసిందే.
రవిచంద్ర అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలరించింది. ఎడిటింగ్ కూడా బాగుంది. సినిమాలోని అన్ని పాత్రలకు ముఖ్యంగా పోసాని, కృష్ణ భగవాన్ పాత్రకు రాసిన డైలాగులు బాగున్నాయి. ఇక నిర్మాతగా కూడా వ్యవహరించిన శివరాజ్ కనుమూరి నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
‘జయమ్ము నిశ్చయమ్మురా’ చిత్రం నిజ జీవితంలోని ఒక పాత్ర చుట్టూ తెలివిగా అల్లిన కథ, కథనాలతో సాగిపోయే సరదా చిత్రం. వాస్తవికతకు దగ్గరగా ఉండే కథ, మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్, శ్రీనివాస్ రెడ్డి, పూర్ణల నటన ఈ చిత్రంలోని ప్లస్ పాయింట్స్ కాగా ఫస్టాఫ్ కథనం చాలా వరకూ సాగదీయబడి నెమ్మదించడం, సెకండాఫ్ కథ కాస్త దారి తప్పడం, అనవసరమైన సన్నివేశాలు ఇందులో మైనస్ పాయింట్స్. మొత్తం మీద ఈ చిత్రం వాస్తవిక కథలను, కామెడీ ఎంటర్టైన్మెంట్ ను ఇష్టపడుతూ కాస్త నెమ్మదించిన కథనాన్ని అంగీకరించగల ప్రేక్షకులకు ఒక మంచి చిత్రంగా నిలుస్తుంది.
123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team