విడుదల తేదీ : డిసెంబర్ 15, 2017
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
నటీనటులు : నవీన్ చంద్ర, నివేత థామస్
దర్శకత్వం : అజయ్ ఒదిరాల
నిర్మాత : కొత్తపల్లి రఘబాబు, కెబి. చౌదరి
సంగీతం : రతీష్ వేగ
సినిమాటోగ్రఫర్ : ఆర్థర్ ఏ.విల్సన్
ఎడిటర్ : ఎస్.బి.ఉద్దవ్
గత రెండేళ్లుగా చిత్రీకరణ జరుపుకున్న ‘జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్’ సినిమా అన్ని అడ్డంకుల్ని తొలగించుకుని ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ:
వాలెట్ పార్కింగ్ డ్రైవర్ గా పనిచేసే వర (నవీన్ చంద్ర) జూలీ(నివేత థామస్) తో ప్రేమలో పడతాడు. అదే సమయంలో అతని కస్టమర్ ఒకరి కార్లో ముఖ్యమైన బ్రీఫ్ కేస్ ఇరుక్కుపోతుంది. అందులో డేంజరస్ క్రిమినల్ ఖాన్ (అభిమన్యు సింగ్) కు సంబందించిన అన్ని వివరాలు, ఆధారాలు ఉంటాయి. దాంతో ఖాన్ వర వెనుక పడతాడు. ఆలా అనుకోని చిక్కుల్లో పడిన వర ఖాన్ నుండి ఎలా తప్పించుకున్నాడు, అతని ప్రేమ కథ ఏమైంది అనేదే సినిమా.
ప్లస్ పాయింట్స్ :
హీరోయిన్ నివేత థామస్ కు తెలుగులో ఇదే మొదటి సినిమా. కానీ ఆలస్యంగా విడుదలైంది. నివేత తన పాత్రలో చాలా బాగా నటించింది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఆకట్టుకుంది. సాదా సీదా కుర్రాడిగా నవీన్ చంద్ర పెర్ఫార్మెన్స్ ఓకే అనేలా ఉంది.
ఆలీకి కథలో ప్రాముఖ్యత ఉన్న పాత్ర దొరికింది. గన్ లాడెన్ గా ఆయన నటన ఊరటనిచ్చింది. సినిమాకు అవసరమైన చోట టైమింగ్ తో కూడిన కామెడీని అందించాడు. ఫస్టాఫ్ ఇంటర్వెల్ సమయంలో వచ్చే కొన్ని ట్విస్టులు బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ :
ఒక నిర్ధిష్టమైన కథంటూ లేకుండా పలు ఉపకథలు ఉండటమే సినిమాకి ప్రధాన మైనస్. ఒకేసారి పలురకాల కథలు నడుస్తుండటంతో ప్రేక్షకులు సినిమాపై దృష్టి పెట్టలేని పరిస్థితి తలెత్తింది. ఉదాహరణకు సినిమా క్రైమ్ థ్రిల్లర్ లా నడుస్తున్నప్పుడు మహద్యలో రొమాంటిక్ సీన్స్, పాటలు వస్తూ ఏకాగ్రతను చెడగొట్టి చిరాకు తెప్పిస్తాయి.
ఇక సెకండాఫ్ అయితే మరీ రొటీన్ సన్నివేశాలతో బోరింగా నడుస్తున్నప్పుడు అనవసరమైన ట్రాక్స్ ఒకదాని తర్వాత ఒకటిగా వస్తూ విసిగించేస్తాయి. సినిమాలోని మథర్ సెంటిమెంట్ దాన్ని కథకు కనెక్ట్ చేసిన విధానం మరీ సిల్లీగా అనిపిస్తాయి.
అలా సాగదీయబడిన సినిమా కాస్త ఉన్నట్టుండి క్లైమాక్స్ కు చేరుకొని ముగిసిపోవడం భారీ నిరుత్సాహాన్ని మిగులుస్తుంది. ప్రతినాయకుడి పాత్ర బలంగా లేకపోవడంతో అది సినిమాపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.
సాంకేతిక విభాగం :
రెండు సంవత్సరాల క్రితం సినిమా కాబట్టి పాతదిలానే కనిపించింది. కెమెరా వర్క్ సరిగాలేదు. నిర్మాణ విలువలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఎడిటింగ్ సరిగాలేదు. 15 నిముషాల సినిమాను సులభంగా కత్తిరించేయవచ్చు. సంగీతం అంతంత మాత్రంగానే ఉంది.
దర్శకుడు అజయ్ పనితనం నిరుత్సాహకరంగా ఉంది. అతను సినిమాను కేవలం క్రైమ్ థ్రిల్లర్ లానే చెప్పుంటే బాగుండేది. కానీ మధ్యలో మధర్ సెంటిమెంట్, రొమాంటిక్ ట్రాక్ వంటివి జోడించడంతో రిజల్ట్ పూర్తిగా తలకిందులైపోయింది.
తీర్పు :
మొత్తం మీద ‘జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్’ పాతబడిపోయిన క్రైమ్ థ్రిల్లర్. ఇందులోని పలు ఉపకథలు, అవసరంలేని రొమాంటిక్ సీన్స్, లాజిక్స్ కు అందని నరేషన్ ప్రేక్షకులకి బోర్ కొట్టిస్తాయి. కేవలం అక్కడక్కడా వర్కవుట్ అయినా అలీ కామెడీ మినహా ఈ సినిమాలో ఎంజాయ్ చేయడానికి ఏం దొరకదు. కాబట్టి ఎక్కడా ఆకట్టులేకపోయిన ఈ చిత్రాన్ని ఈ వారాంతంలో దూరం పెడితే మంచింది.
123telugu.com Rating : 2/5
Reviewed by 123telugu Team