విడుదల తేదీ : ఫిబ్రవరి 23, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : రంజిత్, పాలక్ లాల్వాని, అర్జున్
దర్శకత్వం : త్రికోటి.పి
నిర్మాత : డా. భరత్ సోమి
సంగీతం : ఎమ్.ఎమ్. కీరవాణి
సినిమాటోగ్రఫర్ : సురేష్
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావ్
‘నువ్వు నేను ఒకటవుదాం’ సినిమాతో హీరోగా పరిచయమైన రంజిత్ సోమి కొంత గ్యాప్ తరువాత ‘జువ్వ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమా తరువాత త్రికోటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ:
బసవరాజు (అర్జున్) చిన్న వయసులోనే శ్రుతి (లాల్వానీ)పై మనసు పారేసుకుంటాడు. ప్రేమిస్తున్నానంటూ శ్రుతి వెంటపడతాడు. బసవరాజు చేసే పని తప్పు అని టీచర్ చెప్పడంతో అతి దారుణంగా ఆమెను హతమారుస్తాడు. చేసిన తప్పు కారణంగా బసవరాజు జైలుశిక్ష అనుభవిస్తాడు. జైలు నుండి బయటికి వచ్చిన బసవరాజు శ్రుతి ఎక్కడుందో కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఇంతలో శ్రుతి రాణా(రంజిత్)ను ప్రేమిస్తుంది. రాణాకు కూడ శ్రుతి సమస్య తెలుస్తుంది. ఆ తరువాత రాణా బసవరాజు నుండి శ్రుతిని ఎలా కాపాడాడు అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
రంజిత్ కొత్త హీరో అయినా డ్యాన్సుల్లో, డైలాగుల్లో పర్వాలేదనిపించాడు. ఒక సరదా కుర్రాడిగా అయన నటన బాగుంది. పాలక్ లాల్వానీ చూడ్డానికి చూడ్డానికి బాగుండి గ్లామర్ తో మెప్పించింది. పోసాని కృష్ణ మురళి, సప్తగిరి, అర్జున ,మురళీ శర్మ, అలీ, సప్తగిరి, భద్రం తదితరులు వారి పాత్రల మేరకు నటించి మెప్పించారు. వీరు నటించిన వినోదాత్మక సన్నివేశాలు బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో కుటుంబ నేపథ్యంలో వచ్చే సీన్స్ పరువాలేదు.
సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. కీలక సన్నివేశాల్ని గ్రాండ్ గా తెరకెక్కించడం జరిగింది. ఒక కొత్త హీరో మీద ఎంత బడ్జెట్ పెట్టి సినిమా నిర్మించిన నిర్మాతలను మెచ్చుకోవాలి. బసవరాజు చిన్నప్పటి పాత్ర చేసిన కుర్రాడు బాగా చేసాడు. అతని నటనతో సినిమాలో తీవ్రత కనబడింది. హీరోయిన్ అంటే పడిచచ్చే విలన్, ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలనే పంతంతో సినిమా నడవడం. హీరోయిన్ కోసం విపరీతమైన చేసే పనులు చేయడం వంటి బాగున్నాయి. ఆ ఎపిసోడ్స్ లో అర్జున్ నటన ఆకట్టుకుంది. ఎం.రత్నం అందించిన కథ బాగుంది. ముఖ్యంగా కథలో డెప్త్ ప్రేక్షకులకు నచ్చుతుంది.
మైనస్ పాయింట్స్ :
చిన్నపాటి నుండి ఒక అమ్మాయిని చూసి ఇష్టపడడం, ఆ అమ్మాయికోసం ఏమైనా చేసే పాత్రల్లో విలన్ ఉండడం ఈ సినిమా ప్రధాన కథాంశం. అయితే ఇదే పాయింట్ తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కథలో కొత్తదనం లేకపోవడం స్క్రీన్ ప్లే కూడా రొటీన్ గా సాగడం జువ్వ సినిమాకు మైనస్. ఆకట్టుకునే కథ, కథనాలు లేకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు కనెక్ట్ అవ్వలేరు.
డైరెక్టర్ ఎంచుకున్న కథ చిన్నది కావడంతో దాన్నే అటూ ఇటూ తిప్పుతూ సాగదీయడం వల్ల స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా లేదు. సినిమా మొత్తం కొత్తగా లేకపోయినా క్లైమాక్స్ బాగుంటుందని, మనకు తెలియంది జరుగుతుందని అనుకుంటే పొరపాటే అక్కడ కూడా కొత్తదనం ఏమీ లేదు. భావోద్వేగాలు పండకపోవడం సినిమాకు ప్రధాన మైనస్ గా చెప్పుకోవచ్చు. జైలు నుండి బయటికి వచ్చిన విలన్ హీరోయిన్ కోసం చేసే ప్రయత్నాలు ప్రేక్షకుల సహనాన్ని పరిక్షిస్తాయి.
సాంకేతిక వర్గం :
డైరెక్టర్ త్రికోటి ఎంచుకున్న కథ పాతదే అయినా దాన్ని ఇంటరెస్టింగ్ గా చూపించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. కీరవాణి సంగీతం, సురేష్ కెమెరా పనితనం సినిమాకు మెయిన్ హైలెట్ అని చెప్పాలి. ఎడిటింగ్ మరియు ఇతర టెక్నికల్ అంశాలు పరువాలేదు. కోటగిరి వెంకటేశ్వరరావుగారు చేసిన ఎడిటింగ్ బాగానే ఉంది. రామ్ అరసవిల్లి ఆర్ట్ వర్క్ బాగుంది. ఫైట్ మాస్టర్ రూపొందించిన స్టంట్స్ బాగున్నాయి. సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం బాగానే ఉండగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని సన్నివేశాల్లో గొప్పగా అనిపిస్తుంది.
తీర్పు :
మొత్తం మీద ఈ ‘జువ్వ’ ఆకట్టుకునే కొన్ని మూమెంట్స్ మాత్రమే కలిగిన రెగ్యులర్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్. కొన్ని ఫన్ సీన్స్, ఆసక్తికరమైన ఇంటర్వెల్ బ్లాక్, కీరవాణి సంగీతం ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా దర్శకుడు త్రికోటి ఇలాంటి అంశాల్ని సినిమా మొత్తం నడపడంలో విఫలమయ్యాడు. కాబట్టి కొన్ని మెరుపుల్ని మాత్రమే మెరిపించిన ఈ చిత్రాన్ని మాస్ ఎంటరటైనర్లను, కామెడీని ఎక్కువగా కోరుకునే ప్రేక్షకులు ఒక్కసారి ట్రై చేయవచ్చేమోగాని కొత్తదనం ఆశించేవారికి మాత్రం చిత్రం అంతగా నచ్చదు.
123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team