విడుదల తేదీ : సెప్టెంబర్ 9, 2016
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5
దర్శకత్వం : అవసరాల శ్రీనివాస్
నిర్మాత : సాయి కొర్రపాటి
సంగీతం : శ్రీ కళ్యాణ్ రమణ
నటీనటులు : నారా రోహిత్, నాగ శౌర్య, రెజీనా…
దర్శకుడిగా మారి మొదటి సినిమా ‘ఊహలు గుసగుసలాడే’తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్, తాజాగా ‘జ్యో అచ్యుతానంద’ అనే సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకొచ్చారు. నారా రోహిత్, నాగ శౌర్య, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కొద్దిరోజులుగా విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తూ వచ్చింది. మరి ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను సినిమా నిజం చేసిందా? చూద్దాం..
కథ :
అచ్యుత్ (నారా రోహిత్), ఆనంద్ (నాగ శౌర్య) ఇద్దరు మంచి అన్నదమ్ములు. చిన్న చిన్న ఆనందాలతో బతికే ఓ మధ్య తరగతి కుటుంబ యువకులైన ఈ ఇద్దరూ, సరదాగా కాలం వెళ్ళదీస్తున్న సమయంలో వారింటికి జ్యోత్స్న (రెజీనా) అనే అమ్మాయి అద్దెకు దిగుతుంది. కొద్దికాలంలోనే ఈ ముగ్గురూ మంచి మిత్రులైపోతారు. అచ్యుత్, ఆనంద్.. ఇద్దరూ జ్యోత్స్నని ప్రేమిస్తూ ఉంటారు. అయితే జ్యోత్స్న మాత్రం తాను అప్పటికే ఒకరితో ప్రేమలో ఉన్నానని చెప్పి ఇద్దరి ప్రేమనూ తిరస్కరిస్తుంది. అదే సమయంలో కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల అచ్యుత్, ఆనంద్‌ల మధ్య దూరం పెరుగుతుంది. ఒకే ఇంట్లో కలిసి ఉన్నా, ఇద్దరూ సొంత అన్నదమ్ముల్లా ఉండరు. పెళ్ళిళ్ళై కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన వీరిద్దరి జీవితాల్లోకి జ్యోత్స్న మళ్ళీ వస్తుంది. దాంతో వీరిద్దరి కథ ఏయే మలుపులు తిరిగిందీ? అన్నది సినిమా.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ అంటే ఎంతో క్లారిటీతో పక్కాగా రాసుకున్న స్క్రిప్ట్ అనే చెప్పాలి. చెప్పుకోవడానికి చాలా చిన్నదిగా, సింపుల్‌గా కనిపించే కథనే సినిమాగా మలచడంలో స్క్రీన్‌ప్లేతో చేసిన మ్యాజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదటి ముప్పై నిమిషాలు ఒకే కథను రెండు కోణాల్లో చెప్పడం, ఆ తర్వాత మళ్ళీ అదే కథను దర్శకుడి కోణంలో మొదలుపెట్టడం ఇవన్నీ చాలా ఫ్రెష్ ఫీలింగ్ తెచ్చిపెట్టాయి. నారా రోహిత్, నాగ శౌర్య, రెజీనా ఈ ముగ్గురి మధ్యన వచ్చే సన్నివేశాలు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. సెకండాఫ్‌లో నారా రోహిత్, నాగ శౌర్యల మధ్యన వచ్చే సన్నివేశాలు కథకు మంచి అర్థాన్ని తెచ్చిపెట్టాయి. సినిమా ఆద్యాంతం డైలాగులతో, సన్నివేశాల్లో వచ్చే కన్ఫ్యూజన్‌తో పుట్టించిన కామెడీ కట్టిపడేసేలా ఉంది.
నారా రోహిత్ తన పాత్రలో ఒదిగిపోయి నటించాడు. లుక్స్ విషయంలో అక్కడక్కడా తేలిపోయినా, నటన పరంగా మాత్రం బాగా ఆకట్టుకున్నాడు. అతడి డైలాగ్ డెలివరీ కూడా ఫస్టాఫ్‌లో చాలా బాగుంది. నాగ శౌర్య యువహీరోల్లో ఎప్పటికప్పుడు తానంటూ ఒకడిని ఉన్నానని తన నటనతో ఉనికి చాటుకుంటూనే ఉన్నాడు. ఈ సినిమాలోనూ శౌర్య అన్నివిధాలా ది బెస్ట్ అనిపించే నటన ప్రదర్శించాడు. ఇక వీరిద్దరూ కలిసి కనిపించిన ప్రతిసారీ చూడడానికి చాలా బాగుంది. కథను మలుపు తిప్పే పాత్రలో రెజీనా కూడా చాలా బాగా ఆకట్టుకుంది. ఈ ముగ్గురి పాత్రలూ ఎక్కడా స్థాయిని దాటకుండా, సింపుల్‌గా ఉండడం అన్నింటికంటే బిగ్గెస్ట్ ప్లస్.
సినిమా పరంగా చూసుకుంటే ఫస్టాఫ్, సెకండాఫ్ వేటికవే ఒక ప్రత్యేకమైన ఎమోషన్‌తో నడిచాయి. ఇందులో ఇంటర్వెల్ బ్లాక్, మొదటి ముఫ్పై నిమిషాల పాటు సాగే సరికొత్త నెరేషన్, క్లైమాక్స్ లాంటివి హైలైట్స్‌గా చెప్పొచ్చు.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాకు ఉన్నవాటిల్లో పెద్ద మైనస్ అంటే సెకండాఫ్‌లో రివెంజ్ తీర్చుకోవడం అంటూ రెజీనా పాత్ర చేసే డ్రామా అనే చెప్పాలి. తెలిసీ ఒక ఎంగేజ్‍మెంట్ ఒప్పుకొని, మళ్ళీ చెడగొడ్డడం లాంటివి కథ పరంగా కూడా అనవసరమైనవనే అనిపించింది. అదేవిధంగా ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌లో ఎమోషనల్ డ్రామా ఎక్కువై, కొన్నిచోట్ల సినిమా నెమ్మదించింది.
సాంకేతిక విభాగం :
ముందుగా దర్శకుడు అవసరాల శ్రీనివాస్ విషయానికి వస్తే, తన మొదటి సినిమాతో కేవలం రైటింగ్ పరంగానే ఎక్కువ మార్కులు వేయించుకున్న అవసరాల శ్రీనివాస్, ఈ సినిమాతో రైటింగ్, మేకింగ్ రెండింట్లోనూ ఒక స్థాయి తెచ్చుకున్నాడు. ముఖ్యంగా చూడ్డానికి సింపుల్‌గా కనిపించే కథను కూడా ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లేతో, మంచి టైమింగ్ ఉన్న డైలాగులతో, ఎమోషన్ దెబ్బతినకుండానే కథ నుంచే పుట్టే సందర్భానుసారమైన కామెడీతో నడిపించి ఆద్యంతం కట్టిపడేశాడు. మొదటి ఇరవై నిమిషాల్లో, క్లైమాక్స్ సన్నివేశాల్లో మేకింగ్ పరంగా శ్రీనివాస్ చేసిన ప్రయోగాలు చాలా బాగున్నాయి. ఇలా రెండు బాధ్యతలనూ సమర్ధవంతంగా చేపట్టిన శ్రీనివాస్, సెకండాఫ్‌లో ఒక అనవసరమైన ఎపిసోడ్ రాయడం వదిలేస్తే అన్నివిధాలా ది బెస్ట్ ఇచ్చాడనే చెప్పొచ్చు.
కళ్యాణ్ రమణ అందించిన పాటలు ఎంత బాగున్నాయో, అవి వచ్చే సందర్భాలు కూడా అంతే బాగున్నాయి. ‘ఒక లాలనా’ పాట సినిమా అయిపోయాక కూడా వెంట వచ్చేసేలా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీకి ఎక్కడా వంక పెట్టలేం. రామకృష్ణ ఆర్ట్ వర్క్ సినిమాకు ఓ స్థాయి తీసుకొచ్చింది. (ఎగువ) మధ్యతరగతి ఇంటి నేపథ్యాన్ని అందంగా, రియలిస్టిక్‌గా చూపించడంలో సినిమాటోగ్రాఫర్, ఆర్ట్ డైరెక్టర్ ప్రతిభను గమనించొచ్చు. కిరణ్ గంటి ఎడిటింగ్ చాలా బాగుంది. వారాహి చలన చిత్రం ప్రొడక్షన్ వ్యాల్యూస్ సూపర్బ్ అనేలా ఉన్నాయి.
తీర్పు :
వాస్తవికతకు దగ్గరగా, నిజ జీవితంలో జరిగే కథలే సినిమాలైతే అలాంటి సినిమాలు చూడడానికి ఎప్పుడూ బాగుంటాయి. అలాంటి సినిమాలకు మంచి రచన, అందులో సరిగ్గా ఒదిగిపోయే పాత్రలు, సందర్భానుసారంగా నవ్వించే సన్నివేశాలు కూడా తోడైతే అవి చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. అవసరాల శ్రీనివాస్ తన రచనతో చేసిన అలాంటి మ్యాజిక్కే ‘జ్యో అచ్యుతానంద’. కథగా చూస్తే చాలా సింపుల్‌గా కనిపించే దాన్నే చివరివరకూ ఆసక్తికరంగా, ఓ బలమైన సినిమాగా మలచడంలో సఫలమవ్వడం, తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించిన నటులు, సరదాగా సాగుతూనే ఎక్కడో ఓచోట ఆలోచింపజేసేలా సాగే సన్నివేశాలు.. ఇలా చాలా ప్లస్‌లతో వచ్చిన ఈ సినిమాలో సెకండాఫ్ కాస్త స్లో అవ్వడం అన్నది ఒక్కటే మైనస్. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘జ్యో’ రాకతో బలంగా బలపడిన ‘అచ్యుత్’, ‘ఆనంద్’ల అందమైన కథే ‘జ్యో అచ్యుతానంద’!
123telugu.com Rating : 3.5/5
Reviewed by 123telugu Team