సమీక్ష : కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ – మనసుకు నచ్చే కృష్ణమ్మ ప్రేమకథ!

సమీక్ష : కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ – మనసుకు నచ్చే కృష్ణమ్మ ప్రేమకథ!

Published on Jun 20, 2015 8:44 PM IST
Krishnamma Kalipindi-Iddari

విడుదల తేదీ : 19 జూన్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : ఆర్. చంద్రు

నిర్మాత : లగడపాటి శ్రీధర్

సంగీతం : హరి

నటీనటులు : సుధీర్ బాబు, నందిత

సుధీర్ బాబు, నందితలు హీరో హీరోయిన్లుగా రామలక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మించిన సినిమా ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’. కన్నడలో సూపర్ హిట్ అయిన ‘ఛార్మినార్’ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. చార్మినార్‌ సినిమాకు దర్శకుడైన ఆర్. చంద్రుయే తెలుగు రీమేక్‌ను కూడా తెరకెక్కించారు. మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా పలుసార్లు వాయిదా పడి చివరకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ అందమైన ప్రేమకథ అనిపించుకుందా? లేదా.? అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

అమెరికాలో ఓ పెద్ద కంపెనీకి సీఇఓగా పనిచేసే కృష్ణ (సుధీర్ బాబు), తాను చదివిన స్కూల్‌ గెట్ టుగెదర్ ఫంక్షన్ లో పాల్గొనడానికి తన సొంత ఊరు కృష్ణాపురంకి బయలుదేరడంతో సినిమా మొదలవుతుంది. హైదరాబాద్ లో దిగి కృష్ణాపురంకి జర్నీ మొదలవ్వగానే కృష్ణకు బాగా గుర్తొచ్చే వ్యక్తి రాధ (నందిత). కృష్ణా నది పరిసర ప్రాంతంలోని ఓ చిన్న ఊర్లో ఓ దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన కృష్ణ, స్కూల్లో తనతో పాటే చదివే రాధను ప్రేమిస్తాడు. ఇంటర్‌లో కూడా కృష్ణ, రాధ ఒకే కాలేజ్‌లో చేరతారు. అక్కడే రాధను కృష్ణ మరింత ఎక్కువగా ప్రేమించడం మొదలుపెడతాడు.

రాధకు తన ప్రేమను ఎలాగైనా వ్యక్తపరచాలని కృష్ణ చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలోనే రాధకు ప్రేమపై ఎటువంటి ఆసక్తి లేదని తెలుసుకుంటాడు. ఆ తర్వాత కృష్ణ హైద్రాబాద్‌లో ఇంజనీరింగ్ చదువుకు వెళ్ళిపోవడం, హైద్రాబాద్‌లో రాధ-కృష్ణలు మళ్ళీ కలవడం, కొన్ని కారణాల చేత మళ్ళీ విడిపోవడం, కృష్ణ బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించడం.. ఇలా నడుస్తుంది కథ. చివరకు కృష్ణ-రాధల ప్రేమకథ ఎక్కడ తేలింది? వారిద్దరి ప్రేమకు ఎవరు అడ్డుపడ్డారు? కృష్ణమ్మ(నది) వారిద్దరినీ ఎలా కలిపింది? అన్న ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటే.. మూడు స్టేజ్‌లలో హీరో హీరోయిన్ల కథ చెప్పడం గురించి చెప్పుకోవాలి. చిన్నప్పుడు, ఇంటర్ కాలేజీ చదివే రోజుల్లో, ఇంజనీరింగ్ చదివే రోజుల్లో.. ఇలా ఒక్కో దశలో కృష్ణ ప్రేమలోని ఎమోషన్ మారుతూ ఉండడాన్ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. ప్రేమకథల్లో ఎక్కువగా కనిపించే కలవడం, విడిపోవడం, మళ్ళీ కలవడం.. ఈ కాన్సెప్ట్‌ను స్క్రీన్‌ప్లేలోని కొన్ని పాయింట్ల ద్వారా బాగా డీల్ చేశారు. ఒక ఎదిగే కుర్రాడి జీవితంలో కలిగే తల్లి, తండ్రి, గురువు, ప్రేమ మరియు లక్ష్య సాధన అనే పాయింట్స్ ని చాలా బాగా చెప్పాడు.

కృష్ణగా సుధీర్ బాబు చాలా బాగా నటించాడు. ఇప్పటివరకూ ఆయన చేసిన సినిమాలన్నింటిలోకెల్లా ఈ సినిమాలోని యాక్టింగ్‌ ది బెస్ట్‌గా చెప్పుకోవచ్చు. క్యారెక్టర్‌లోని మూడు వేరియేషన్లను పర్ఫెక్ట్ గా చూపించాడు. ముఖ్యంగా కృష్ణ పాత్రలో ప్రతి దశలో వచ్చే ఎమోషన్స్ ని సుధీర్ బాబు చాలా బాగా చూపించాడు. కొన్ని సీన్స్ లో కంటతడి పెట్టించాడు. ఇక నందిత తన పాత్రలో ఒదిగిపోయి నటించింది. క్లైమాక్స్‌లో వీరిద్దరి యాక్టింగ్ కట్టిపడేస్తుంది. నందిత తల్లిగా నటించిన ప్రగతి, సుధీర్ బాబు తండ్రిగా గిరిబాబు బాగా నటించారు. సుధీర్ బాబు, నందితల కెమిస్ట్రీ బాగుంది.

సినిమా పరంగా చూసుకుంటే.. ఫస్టాఫ్ మొత్తం సరదాగా సాగిపోతూనే రాధ-కృష్ణలు కలుస్తారా? అనే సస్పెన్స్ ఎలిమెంట్‌తో బాగానే ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో కొంత భాగం తర్వాత సినిమా భావోద్వేగ పూరిత సన్నివేశాలతో నిండిపోతుంది. చివర్లో వచ్చే క్లైమాక్స్‌తో ఇటు టైటిల్‌కు, అటు ప్రేమకథకు సరైన న్యాయం చేశారు. పోసాని కృష్ణ మురళి చేత చేయించిన రెండు సీన్స్ సినిమాకి ఎంతో అర్థాన్ని తీసుకువచ్చాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే అసందర్భంగా వచ్చే పాటలు, కొన్ని అనవసర సన్నివేశాల గురించి చెప్పుకోవాలి. వినడానికి చూడటానికి పాటలు బాగున్నాయి కానీ అవి వచ్చే సందర్భం అస్సలు మ్యాచ్ అవ్వలేదు. నిజానికి ఈ సినిమాకు రెగ్యులర్ ఫార్ములా ప్రేమకథనే ఎంచుకున్నా, స్క్రీన్‌ప్లేలోని కొన్ని గ్రిప్పింగ్ పాయింట్లతో ఆసక్తికరంగా చెప్పడానికి ట్రై చేసారు. కానీ ఈ పాటలు, అనవసర లాగ్ సీన్స్ ఆఫీల్ ని కాస్త చెడగొట్టాయి. వీటి వలన సినిమాలో సీన్ కి సీన్ కి మధ్య కనెక్టివిటీ మిస్ అవుతుంది.

కాలేజీ నేపథ్యంలో వచ్చే కొన్ని సన్నివేశాలు, ఇంజనీరింగ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే మరో లేడీ లవ్ ట్రాక్ సినిమాకి అవసరం లేదు. అలాగే చైతన్య కృష్ణ పాత్రకి పెద్ద ప్రాముఖ్యత లేదు.. ఏదో కథని ఇంకాస్త లెంగ్త్ పెంచాలి, ఒక ఫైట్ కోసం అన్నట్లు ఆ పాత్రని డిజైన్ చేసారు. సినిమా మొదటి నుంచి చివరి వరకూ నెరేషన్ చాలా స్లోగా ఉంటుంది, అందులోనూ ఇంటర్వెల్ తర్వాత కొద్దిసేపు మరీ నెమ్మదిగా నడుస్తుంది. ఇక హీరో అమెరికా నుంచి మళ్ళీ తన సొంత ఊరికి వచ్చేవరకూ హీరోయిన్‌ను మరిచిపోయాడా? అనే ఆలోచన కలుగుతుంది. అలాగే సినిమాలో నందిత సైడ్ నుంచి ఒక్కసారి కూడా కృష్ణ మీద లవ్ ఉందని చూపించకుండా ఇద్దరినీ కలపడంలో లాజిక్ కనిపించలేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ముందుగా దర్శకుడు ఆర్. చంద్రు గురించి చెప్పుకోవాలి. ఒక ఫార్ములా కథనే ఆసక్తికరంగా మలిచే ప్రయత్నంలో చాలా వరకు విజయం సాధించాడు. స్క్రీన్‌ప్లే బాగుంది. సినిమా మొదట్లో మొదలైన సస్పెన్స్ ఎలిమెంట్‌ను చివరివరకూ బాగా క్యారీ చేశాడు. సినిమా టైటిల్‌కు, కొంత కన్ఫ్యూజన్‌తో నడిచే కృష్ణ ప్రేమకథకు చివర్లో చక్కటి న్యాయం చేశాడు. కానీ నెరేషన్ విషయంలో కేర్ తీసుకొని ఉండాల్సింది.

సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఒక్కో దశలో మారుతూ ఉన్న ఎమోషన్స్‌ను సినిమాటోగ్రాఫర్ సరిగ్గా బంధించే ప్రయత్నం చేశారు. హరి అందించిన సంగీతం బాగుంది. పాటలు వినడానికి బాగున్నాయి కానీ సినిమాలో అసందర్భంగా రావడంతో, అవి వృథా అయినట్టు కనిపిస్తుంది. నేపధ్య సంగీతం సినిమాకి ప్రాణం పోసిందని చెప్పాలి. ఎడిటింగ్ ఫర్వాలేదనేలా ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కట్టిపడేస్తాయి.

తీర్పు :

ప్రేమకథల్లో నిజమైన ప్రేమని, ఆ భావాలని పర్ఫెక్ట్ గా చూపించగలిగే సినిమాలన్నీ ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తాయ్! ఆ కోవలోకె ఈ సినిమా వస్తుంది. మనం ఇంతకుముందు చూసిన కథని మరో కొత్త కోణంలో చెప్పే ప్రయత్నమే ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’. మంచి అనుభూతినిచ్చే ప్రేమకథ, సుధీర్ బాబు మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మన్స్, మనసును కదిలించే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాకు అనుకూలించే అంశాలు. ఇక కొన్ని అసందర్భంగా వచ్చే పాటలు, అనవసర సన్నివేశాలు, స్లో నెరేషన్ ఈ సినిమాకు ఇబ్బందిగా మారిన అంశాలు. ఒక్క మాటలో చెప్పాలంటే.. కమర్షియాలిటీ పేరుతో సినిమాను దారి తప్పించేలా ఉన్న సన్నివేశాలు, పాటలను పక్కనబెడితే, ప్రేమకథల్లోని అనుభూతిని ఆస్వాధించే వారికి బాగా నచ్చే సినిమా ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ..’!

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు