విడుదల తేదీ : డిసెంబర్ 15, 2017
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : నందు, శ్రీముఖి, కమల్ కామరాజ్
దర్శకత్వం,స్టోరీ, స్క్రీన్ ప్లే : వి.ఎస్. వాసు
నిర్మాత : దాసరి భాస్కర్ యాదవ్
సంగీతం : సునీల్ కశ్యప్
సినిమాటోగ్రఫర్ : మల్హర్ భట్ జోషి
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
నందు, శ్రీముఖిలు జంటగా కమల్ కామరాజ్ కీలక పాత్రలో రూపొందిన చిత్రమే ‘కుటుంబ కథా చిత్రం’. వి.ఎస్. వాసు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఏ స్థాయిలో అలరించిందో ఇప్పుడు చూద్దాం…
కథ:
భార్యా భర్తలైన చరణ్, పల్లవులు ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ, ఆత్మ గౌరవం, సంపాదన పేరుతో అసలైన జీవన మాధుర్యాన్ని మర్చిపోయి ఆర్టిఫిషియల్ లైఫ్ స్టైల్ కు అలవాటుపడిపోతారు. దాంతో ఎవరి కోణం నుండి వారు సబబుగానే కనిపించినా ఇద్దరి ఆలోచనలు కలవక వారి మధ్య మనస్పర్థలు మొదలవుతాయి.
అలా విడిపోయే స్థాయికి చేరుకున్న వారికి కనువిప్పు ఎలా కలిగింది, ఏయే పరిస్థితులు వారికి అసలైన జీవితం అంటే తెలియజేశాయి అనేదే ఈ సినిమా.
ప్లస్ పాయింట్స్ :
దర్శకుడు వి.ఎస్. వాసు ప్రస్తుత నాగరిక సమాజంలో ప్రతి ఇంట్లోని భార్యాభర్తల మధ్య తొంగిచూసే ప్రధాన సమస్యను కథాంశంగా ఎంచుకోవటం, దాన్ని రెగ్యులర్ ఫార్మాట్లోలా ఫ్యామిలీ డ్రామాతో చూపించకుండా సస్పెన్స్ థ్రిల్లర్ గా సరికొత్తగా ప్రెజెంట్ చేయాలనుకోవడం బాగుంది. అందుకోసం కేవలం వ్యక్తుల మానసిక స్థితిని బట్టి నిద్రపోయేప్పుడు వచ్చే కలల ఆధారంగా కథనాన్ని రాసుకున్న దర్శకుడి ప్రయత్నం బాగుంది.
అలాగే కీలక సన్నివేశాల్లోని సంభాషణల ద్వారా ఈకాలపు భార్యా భర్తలు జీవితమంటే సరైన ఆవగాహన లేక చిన్న చిన్న సమస్యలకే బంధాల్ని ఎలా కోల్పోతున్నారు, భార్యకి, భర్తకి జీవితంలో అసలైన ఆనందం అంటే ఏమిటి లాంటి అంశాలని సవివరంగా చెప్పి మెప్పించారు. హీరోయిన్ శ్రీముఖి స్క్రీన్ మీద అందంగా కనిపిస్తూ అక్కడక్కడా అలరించింది. ఈ సినిమా మొత్తని కేవలం మూడు రోజుల్లో రాత్రి వేళల్లో మాత్రమే చిత్రీకరణ జరిపి ముగించడం ఇక్కడ మరొక విశేషం. ఈ చర్య వెనుక చిత్ర టీమ్ చేసిన గ్రౌండ్ వర్కును అభినందించాల్సిందే.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు ఎంచుకున్న కథాంశం, దాన్ని ప్రయోగాత్మకంగా తీయాలన్న ప్రయత్నం అభినందించదగినవే అయినా ప్రయోగ ఫలితం మాత్రం దారుణంగా దెబ్బతింది. సినిమా ఆరంభం నుండి ఆఖరు వరకు కేవలం కథలోని ముఖ్య పాత్రల కలల ఆధారంగానే కథనం మొత్తాన్ని రాయడంతో సినిమా చూస్తున్నంతసేపు ఎలాగూ ఇది కకలే కదా సీరియస్ గా తీసుకొనవసరంలేదు అనే భావన ఏర్పడిపోయింది. దీంతో సినిమా పట్ల ప్రేక్షకుడికి ఉండాల్సిన అటెంక్షన్ లోపించిపోయింది.
పైగా ఆ కలలో నడిచే సన్నివేశాలైనా బలంగా ఉన్నాయా అంటే అదీ లేదు. హడావుడిగా చిత్రీకరణ జరపడంతో చిన్న చిన్న అంశాల్ని కూడా నిరలక్ష్యం చేసి మరీ ఇలా అయితే ఎలా అనే విసుగును మళ్ళీ మళ్ళీ తెప్పించారు. కీలకమైనవిగా భావించే ఏ సీన్ కూడా పూర్తి పర్ఫెక్షన్ తో లేదు. అంతేగాక వ్యక్త్యుల కలలకు వాటి మధ్యలో వచ్చే ప్రస్తుత వాస్తవ సంఘటనలకు సరైన కనెక్షన్ కుదరలేదు. దీంతో కన్ఫ్యూజన్ ఇంకాస్త పెరిగిపోయింది.
సినిమా నడుస్తున్నప్పుడు దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో కొద్దికొద్దిగా తెలుస్తూనే ఉన్నా చివర్లో సారాంశ వివరణ కార్డు పడేవరకు పూర్తిగా అవగాహనకు రాలేరు ప్రేక్షకులు.
సాంకేతిక విభాగం :
దర్శకుడు వి.ఎస్. వాసు కథాంశం ఎంచుకోవడం, ప్రయోగానికి సాహసించడం మెచ్చుకోదగినవే అయినా ఆ ప్రయోగం సఫలమవడానికి కావల్సిన సరైన కథనాన్ని, బలమైన సన్నివేశాల్ని రాసుకోవడంలో ఆయన విఫలమయ్యారు. దీంతో చిత్ర ఫలితం తలకిందులైంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ కథనంలోని సంక్లిష్టతను మాయం చేయలేకపోయింది.
జోషి సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్ ను చూడాలనిపించేలా తీశారు. దాసరి భాస్కర్ యాదవ్ పెట్టున బడ్జెట్ తక్కువే అయినా సినిమా క్వాలిటీగానే కనబడింది. గతంలో ‘లోఫర్, ఒక మనసు, జ్యోతిలక్ష్మి’ వంటి చిత్రాలకు సంగీతం అందించిన సునీల్ కశ్యప్ వాటిలోని క్వాలిటీని ఈ సినిమా సంగీతంలో చూపించలేకపోయారు.
తీర్పు :
ప్రయోగం చేయాలన్న ఆలోచనతో పాటే దానికి తగిన ముడిసరుకు, సరైన ఆచరణా విధానం ఉండాలి. ఈ సినిమాలో ఆలోచన, ముడి సరుకు కొంతవరకు బాగానే ఉన్నా ఆచరణ మాత్రం సక్రమంగాలేదు. ఏమాత్రం బలంలేని కథనం, అందులోని సన్నివేశాలు, వెతక్కుండానే దొరికిపోయే పొరపాట్లు చిత్ర ఫలితాన్ని బాగా దెబ్బతీశాయి. మొత్తం మీద కలల్లోనే నడిచే ఈ కలల కథా చిత్రం నుండి చిన్నపాటి సామాజిక సందేశం మినహా ఎలాంటి వినోదం దొరకదు.
123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team