విడుదల తేదీ : ఏప్రిల్ 21, 2017
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
దర్శకత్వం : సంజీవ్ నాయుడు
నిర్మాత : శీరం జయ హరనాథ్
సంగీతం : అమన్
నటీనటులు : సంజీవ్ నాయుడు, ప్రియాంక. ఎస్
చాలా వరకు కొత్తగా, చిన్న సినిమాల్ని చేసేవారు ప్రేమ కథలతోనే సినిమాల్ని చేస్తుంటారు. ఇప్పుడు దర్శకుడు సంజీవ్ నాయుడు కూడా ఆ ప్రేమ కథ నైపథ్యంలోనే చేసిన సినిమా ‘లవర్ బోయ్’ ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…
కథ :
కాలేజ్ లో చదువునుకునే కుర్రాడు రాజ్ (సంజీవ్ నాయుడు) తనకు నచ్చినట్టే ప్రవర్తిస్తూ కాలేజ్ లో, బయట గొడవలు పడుతూ అందరి దగ్గరా చెడ్డవాడనిపించుకుంటాడు. అదే సమయంలో వాళ్ళ కాలేజ్ లో నీలిమ (ప్రియాంక) అనే అమ్మాయి చేరుతుంది.
ఆమె కూడా రాజ్ ను మొదట అపార్థం చేసుకున్నా తర్వాత తర్వాత అతనిలోని మంచితనాన్ని గుర్తించి అతన్ని పూర్తిగా మార్చాలని అతనికో పరీక్ష పెడుతుంది. ఆ పరీక్ష ఏమిటి ? దాని వలన రాజ్ మారాడా లేదా ? ఆ పరీక్షతో ఎవరకి మేలు జరిగింది ? అనేదే ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ చిత్రంలో అంతగా చెప్పుకోదగిన గొప్ప అంశాలేవీ లేకపోయినా మెప్పించే కొన్ని చిన్న చిన్న విషయాలు మాత్రం ఉన్నాయి. వాటిలో మొదటిది ఒక ప్రేమ కథ నైపథ్యంలో దర్శకుడు కమ్ హీరో సంజీవ్ నాయుడు సమాజానికి ఒక కొత్త మెసేజ్ ఇద్దామని చేసిన ప్రయత్నం బాగుంది. ఆ మెసేజ్ కూడా కొంచెం హుందాగానే ఉండటం ఇంకో మెచ్చుకోదగిన అంశం.
ఇక సెకండాఫ్లో మాల్యాద్రి అనే ప్రధాన విలన్ పాత్ర పోషించిన నటుడు సినిమాలోని అందరు నటీనటులలోకి కాస్త మేలుగా కన్పించాడు. కొన్ని సందర్భాల్లో అతని నటన కాస్త ఓవర్ గా అనిపించినా కథాపరంగా కొన్ని చోట్ల మాత్రం పర్వాలేదు బాగానే చేశాడు అనిపించాడు. అలాగే కాలేజ్ బ్యాక్ డ్రాప్లో హీరో, హీరోయిన్ల మధ్య నడిచే రెండు మూడు సీన్లు కూడా బాగానే ఉన్నాయి. విలన్ పాత్ర తర్వాత హీరోయిన్ పాత్రలో నటించిన ప్రియాంక నటన కాస్త పర్వాలేదనిపించింది.
మైనస్ పాయింట్స్ :
ఈ చిత్రంలోని మైనస్ పాయింట్స్ గురించి చెప్పడం మొదలుపెడితే చాలానే దొరుకుతాయి. మొదట నటీనటుల విషయానికొస్తే సినిమా కాలేజ్ బ్యాక్ డ్రాప్లో నడిచే ప్రేమ కథ. అంటే అందులో నటించే నటులు కూడా కాస్త యుక్త వయసులో ఉండేవాళ్ళైతేనే బాగుంటుంది. కానీ ఈ సినిమాలో నటించిన హీరో సంజీవ్ నాయుడు మాత్రం స్క్రీన్ మీద కాస్త ఎక్కువ వయస్కుడిలా కన్పించాడు. దాంతో సినిమా ఆద్యంతం గొప్ప నిరుత్సాహంతోనే సాగింది. అలాగే కోటి అనే విలన్ పాత్రదారి కూడా కనిపించిన ప్రతి ఫ్రేమ్ లోనూ చిరాకు పుట్టించాడు.
కథ కొంచెంలో కొంచెం బాగానే ఉన్నా దానికి దర్శకుడు సంజీవ్ నాయుడు రాసిన కథనం మాత్రం పరమ చెత్తగా ఉంది. హీరోయిన్ కనిపించే రెండు మూడు సీన్లు తప్ప మిగతా ఏ సన్నివేశం కూడా ఆకట్టుకోలేకపోయింది. హీరో యొక్క స్నేహితులు ఆద్యంతం అతన్ని ఆకాశానికెత్తేస్తూ మాట్లాడే మాటలు పెద్ద తలనొప్పిగా అనిపించాయి. అలాగే హీరో తన యాటిట్యూడ్ ను ప్రదర్శించడానికి చూపిన హావ భావాలు, బాడీ లాంగ్వేజ్, ఫైట్స్ పూర్తి అసహజంగా ఉండి బాగా నిరుత్సాహపరిచాయి.
ఇక పాటల మేకింగ్ అయితే మరీ కామెడీగా అనిపించింది. ఎప్పుడో పాత కాలం నాటి గ్రాఫిక్స్ ను ఉపయోగించి చేసిన ఆ పాటల్లో హీరో హీరోయిన్ల డాన్స్ అస్సలు చూడలేకపోయాం. ఫస్టాఫ్ ఎలాగు నిరుత్సాహపరిచింది కనీసం రెండవ అర్థభాగమైనా బాగుంటుందా అనుకుంటే అది కూడా అలానే బోరింగా, చిరాకుగా ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనిపించింది.
సాంకేతిక విభాగం :
సినిమాలో నటీనటులు తమ పాత్రలకు చెప్పిన డబ్బింగ్ లిప్ సింక్ అనేదే లేకుండా చాలా ఘోరంగా అనిపించింది. కెమెరా వర్క్ ఏ ఫ్రేమ్ లోనూ బాగోలేదు. ఎడిటింగ్ కూడా సరిగా లేదు. సీన్లను ఒక తీరు తెన్నూ లేకుండా కత్తిరించుకుంటూ పోయారు.
అలాగే హీరో కోసం కంపోజ్ చేసిన ఫైట్స్, డ్యాన్సులు ఏమాత్రం ఆకట్టుకోలేదు. అమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటల్లోని సంగీతం ఎక్కడా మెప్పించలేదు. దర్శకుడిగా సినిమాలు తీయడంలో, రచయితగా స్క్రీన్ ఆకట్టుకునే కథనం, మాటలు రాసుకోవడంలో సంజీవ్ నాయుడు చాలా వరకు విఫలమయ్యాడు. చిత్ర నిర్మాణ విలువలు ఏదో పర్వాలేదనిపించాయి.
తీర్పు :
సాధారణంగా మెసేజ్ తో కూడిన ప్రేమ కథలంటే మొత్తంగా కాకపోయినా ఎక్కడో ఒక దగ్గరైనా ఆకట్టుకోవాలి. కానీ ఈచిత్రం మాత్రం ఎక్కడా ఆ పని చేయలేదు. కాస్త బాగుందనిపించిన స్టోరీ లైన్, అందులోని మెసేజ్, విలన్, హీరోయిన్ల నటన ఇందులో ప్లస్ పాయింట్స్ కాగా మినిమమ్ క్వాలిటీ కూడా లేకుండా రాసిన కథనం, సినిమాను తెరకెక్కించిన తీరు, హీరో పెర్ఫార్మెన్స్, ఏమాత్రం క్రమశిక్షణ లేకుండా పనిచేసిన ముఖ్య విభాగాల పనితీరు ఈ చిత్రాన్ని పూర్తిగా చెడగొట్టాయి. మొత్తంగా చెప్పాలంటే పోస్టర్, టైటిల్ చూసి లవ్ స్టోరీ కదా ఏదో ఉంటుందనుకుని సినిమాకి వెళితే మాత్రం పూర్తిస్థాయి నిరుత్సాహం ఖాయం.
123telugu.com Rating : 2/5
Reviewed by 123telugu Team