సమీక్ష : లవర్స్ క్లబ్ – టెక్నికల్ గా ఓకే కానీ..

సమీక్ష : లవర్స్ క్లబ్ – టెక్నికల్ గా ఓకే కానీ..

Published on Nov 17, 2017 11:41 AM IST
Lovers Club movie review

విడుదల తేదీ : నవంబర్ 17, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : ధృవ శంకర్

నిర్మాత : భరత్ అవ్వారి

సంగీతం : జరవి నిడమర్తి

నటీనటులు : అనీష్ చంద్ర, పావని, పూర్ణి

ఇండియాలో మొదటిసారి ఐఫోన్ ను ఉపయోగించి తీసిన సినిమా ‘లవర్స్ క్లబ్’. ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం…

కథ:

రిషి భరద్వాజ్ అనే వ్యక్తి లవర్స్ కోసం ‘లవర్స్ క్లబ్’ ను ఏర్పాటు చేసి వాళ్ళను కలుపుతుంటాడు. అలా అనుకోకుండా ఒకసారి పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమార్తె వివాహం చేస్తాడు. తన కుమార్తెకు వేరే కులం వాడితో పెళ్లి చేశాడనే కోపంతో రిషి మీద పగ పెంచుకున్న ఆ అమ్మాయి తండ్రి రిషిపై పగ ఎలా తీర్చుకున్నాడు ? అనుకోకుండా రాజు ఈ కథలోకి ఎందుకు వచ్చాడు ? రాజుకు రిషికి సంబంధం ఏంటి ? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవల్సింది ఏంటంటే.. చిత్రం మొత్తం ఐఫోన్ తో చిత్రీకరించడం. రెండు గంటల సినిమాను ఐఫోన్ సహాయంతో ఎలా కష్టపడి చిత్రీకరించారు అన్నది సినిమా పూర్తయ్యాక ఎండ్ టైటిల్స్ సమయంలో మేకింగ్ విడియోలో చూపించడం జరిగింది.

ప్రేమికులకు అండగా నిలబడే రిషి పాత్రలో అనీష్ చంద్ర నటన బాగుంది. అతని పాత్రను మలిచిన విధానం మెప్పించింది. రిషి లవర్ గా నటించిన అమ్మాయి కూడా బాగా నటించిది. ప్రేమికులుగా నటించిన రాజు, రాణి పాత్రల్లో నటించిన ఇద్దరు బాగా చేశారు. సినిమాలో కీలక సీన్స్ లో కనిపించిన వారు ప్రేక్షకులను మెప్పిస్తారు. ముఖ్యంగా రాణి పాత్ర చేసిన అమ్మాయి తెలంగాణా భాషలో మెప్పించింది.

మైనస్ పాయింట్స్ :

డైరెక్టర్ ఎంచుకున్న కథ పాతగా ఉంది, ఇలాంటి కథలు ఇదివరుకు చాలా చూశాం. స్క్రీన్ ప్లే లో కొత్తదనం లేకపోవడం, ముందు జరగబోయే సన్నివేశాలు మన ఊహకు సులభంగా అందడం సినిమాకు మైనస్ గా చెప్పవచ్చు.

చిత్ర యూనిట్ ఈ సినిమాను ఐఫోన్ లో చిత్రీకరించామని ఎక్కడా పబ్లిసిటి చెయ్యలేదు. ఐఫోన్ తో సినిమా తీసామని ముందే చెప్పి ఉంటే సినిమా ఇంకాస్త ఎక్కువగా జనాల్లో వెళ్లి ఉండేది.

సినిమా మొదటి సగంలో ఎంటర్టైన్మెంట్ లేకపోవడంతో ప్రేక్షకులు బోర్ ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సెకెండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు రొటీన్ గా సాగడం కథలో దమ్ములేకపోవడంతో, అక్కడ కూడా వినోదం లేకపోవడం తో సినిమా నిరాశ కలిగిస్తుంది. ఇక క్లైమాక్స్ లో వచ్చే పాటకు కూడా ఖచ్చితమైన కారణం ఉండక కొంత విసిగిస్తుంది.

సాంకేతిక విభాగం :

డైరెక్టర్ ధ్రువ శంకర్ ఐఫోన్ తో సినిమా తీయాలనుకోవడం మంచి ఆలోచన, కాని చిత్ర కథ కథనంలో కొత్తదనం లేకపోవడంతో సినిమా తేలిపోయింది. కెమెరామెన్ తన పనితనంతో మెప్పించాడు. పాటలు పెద్దగా లేనప్పటికీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. తక్కువ బడ్జెట్ లో సినిమాను నిర్మించారు. ఎక్కువ ఖర్చు లేకుండా తెలంగాణా పరిసర ప్రాంతాల్లో సినిమా తీయడం జరిగింది.

తీర్పు :

ఈ ‘లవర్స్ క్లబ్’ అనేది పాత ధోరణిలో సాగే సినిమా. కథ, కథనం కొత్తగా లేకపోవడం, డైరెక్టర్ రాసుకున్న సన్నివేశాలు ఆసక్తిగా అనిపించకపోవడంతో సినిమా నిరాశ పరుస్తుంది. సమాజంలో స్త్రీకి భద్రత లేదని చూపించే సన్నివేశాలు బాగున్నాయి. అలాగే చిత్రం మొత్తాన్ని ఐఫోన్ తో షూట్ చేయడం కూడా మెచ్చుకోదగిన విషయమే. మొత్తం మీద చెప్పాలంటే సినిమాను ఐఫోన్ తో ఎలా చిత్రీకరిస్తారో తెలుసుకోవాలనే ఔత్సాహికులకు టెక్నికల్ గా ఈ సినిమా ఓకే కానీ రెగ్యులర్ ఆడియన్సుకు నచ్చకపోవచ్చు.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు