సమీక్ష : మధనం – ఎమోషన్ ఉన్నా ఇంట్రస్ట్ గా సాగదు !

సమీక్ష : మధనం – ఎమోషన్ ఉన్నా ఇంట్రస్ట్ గా సాగదు !

Published on Dec 8, 2019 9:00 AM IST
Madhanamreview

విడుదల తేదీ : డిసెంబర్  06, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు :  శ్రీనివాస్ సాయి, భావన రావ్

దర్శకత్వం : అజయ్ సాయి మణికంధన్

నిర్మాత‌లు : దివ్య ప్రసాద్, అశోక్ ప్రసాద్

సంగీతం :  రాన్ ఈతన్ యోహాన్

సినిమాటోగ్రఫర్ : పి జి వింద

ఎడిటర్:  కోటగిరి వెంకటేశ్వర రావు


శ్రీనివాస సాయి, భావన రావ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం మథనం. దర్శకుడు అజయ్ సాయి మనకందన్ యూత్ ఫుల్ మరియు ఎమోషన్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని కాశి ప్రొడక్షన్స్ బ్యానర్ పై దివ్య ప్రసాద్, అశోక్ ప్రసాద్ నిర్మించారు. కాగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

 

రామ్ (శ్రీనివాస సాయి)కి తన తండ్రి (రాజీవ్ కనకాల) అంటే అమితమైన ప్రేమ. అయితే అతని బాల్యంలో జరిగిన ఓ సంఘటన కారణంగా అతను పద్నాలుగు సంవత్సరాల పాటు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా రూమ్ లోనే బతుకుతుంటాడు. ఈ క్రమంలో అతని జీవితంలోకి సుజాత ( భావన రావ్) వస్తోంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. కానీ ఆ విషయం రామ్ కి అర్ధం అయ్యేలోపే ఇద్దరూ దూరం అవుతారు. మళ్లీ వాళ్లిద్దరూ ఎలా కలుసుకున్నారు ? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి ? ఇంతకీ రామ్ బయట ప్రపంచంతో పాటు కనీసం తన తల్లితో కూడా మాట్లాడకుండా ఒంటరిగా ఎందుకు ఉంటున్నాడు ? అతను అలా మారడానికి గల కారణం ఏమిటి ? ఫైనల్ గా రామ్ మాములు మనిషి అయ్యాడా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

సినిమా పేరులోనే మథనం ఉన్నట్లు.. ఈ సినిమా కూడా ఎక్కువుగా ఆ ‘మథనం’ అనే ఫీలింగ్ చుట్టే తిరుగుతుంది. హీరో తన బాల్యంలో జరిగిన విషాదవంతమైన ఓ సంఘటన కారణంగా అతను జీవితంలో ప్రతిరోజూ ప్రతి క్షణం మథన పడుతూనే ఉంటాడు. ఈ సినిమాలో హీరోగా నటించిన శ్రీనివాస సాయి తన పాత్రకు తగ్గట్లు.. బాధతో లోలోపలే నలిగిపోతున్న ఎక్స్ ప్రెషన్స్ తో పాటు తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. ముఖ్యంగా క్లైమాక్స్ తో పాటు హీరోయిన్ తో సాగే లవ్ ట్రాక్ లో, అలాగే తనకు తన తల్లి పాత్రకి మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశంలో కూడా ఎంతో అనుభవం ఉన్న నటుడిలా శ్రీనివాస సాయి చాలా బాగా నటించాడు.

ఇక హీరోయిన్ గా నటించిన భావన రావ్ లవ్ సీన్స్ లో అవలీలగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. అలాగే రౌడీ గ్యాంగ్ కి లీడర్ గా నటించిన అజయ్ ఘోష్ కూడా బాగా నటించాడు. తన కామెడీ టైమింగ్ తో తానూ కనిపించిన నాలుగైదు సీన్స్ లోనూ ఆయన అలరిస్తారు. తండ్రి పాత్రలో కనిపించిన రాజీవ్ కనకాల, మరియు తల్లి పాత్రలో నటించిన సితార కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. దర్శకుడు అజయ్ సాయి మనకందన్ రాసుకున్న కొన్ని లవ్ సీన్స్ బాగున్నాయి. అలాగే మెయిన్ గా.. హీరో క్యారెక్టర్ చుట్టూ అల్లుకున్న డ్రామా (కొన్ని చోట్ల) కూడా బాగుంది. ఇక సినిమాలో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

 

మైనస్ పాయింట్స్:

 

సినిమా ఇంట్రస్టింగ్ గానే మొదలైనా.. ఆ తరువాత ఆసక్తి కరంగా సాగని సీన్స్ తో డైవర్ట్ అయింది. హీరో, కనీసం అతని కన్నతల్లి వైపు చూడకుండా (ప్రేమ ఉన్నప్పటికీ) ఒంటరిగా ఎందుకు బతుకుతున్నాడు..? అతని జీవితంలో జరిగిన సంఘటన ఏమిటి..? అని ఆడియన్స్ లో ఒక ఆసక్తి మెయింటైన్ చేద్దామని దర్శకుడు ఇంటర్వెల్ దాకా స్టోరీలో మరియు హీరో క్యారెక్టర్ విషయంలో పూర్తి క్లారిటీ ఇవ్వకపోవడంతో.. ఫస్ట్ హాఫ్ అంతా అసలేం జరుగుతుంది ? ఎందుకు అతను అలా వింతగా బిహేవ్ చేస్తున్నాడు అనే ప్రశ్నల చుట్టే ఫస్ట్ హాఫ్ అంతా తిరుగుతూ ఉంది.

అయినా ఏం జరిగిందో తెలిస్తేనే కదా.. జరుగుతున్న దాని గురించి ఇంట్రస్ట్, జరగబోయేదాని గురించి ఆసక్తి ఉండేది. దీనికి తోడు అసలు కన్వీన్స్ కాని పాయింట్ తో లాజిక్ లేని ట్రీట్మెంట్ తో స్క్రీన్ ప్లే స్లోగా సాగుతూ బోర్ కొడుతోంది. అయితే దర్శకుడు రాసుకున్న కొన్ని ప్రేమ సన్నివేశాలు పర్వాలేదనిపించినప్పటికీ.. కథ కథనాలు మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా సాగవు. అన్నిటికి మించి సినిమాలో మెయిన్ ప్లాట్ కూడా బలహీనమైన సంఘటనలకు లోబడి బలహీనంగా సాగడంతో.. సినిమాలో బలమైన సంఘర్షణ మిస్ అయింది. హీరో పాత్రలో ఎమోషనల్ డ్రామా చాలానే ఉన్నా.. అది సినిమాటిక్ గా అనిపించడంతో ఆ ఎమోషన్ కి ఆడియన్ అవ్వాల్సిన స్థాయిలో ఇన్ వాల్వ్ అవ్వడు. దీంతో సినిమా పై విజువల్ ఇంట్రస్ట్ తప్ప. కంటెంట్ పరంగా ఇంట్రస్ట్ మిస్ అయింది.

 

సాంకేతిక విభాగం :

 

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు రాన్ ఏతాన్ యోహాన్ అందించిన పాటలు బాగున్నాయి. ముఖ్యంగా చందమామ…చందమామ అనే సాంగ్ సినిమాకే హైలైట్ గా నిలుస్తోంది. అలాగే నేపధ్య సంగీతం కూడా బాగుంది. పి జి వింద సినిమాటోగ్రఫీ ఆకట్టుకున్నేలా ఉంది. కీలక సన్నివేశాల్లోని విజువల్స్ ను ఆయన చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. మెయిన్ గా ఓపెనింగ్ సీక్వెన్స్ అండ్ లవ్ సీన్స్ లో సినిమాటోగ్రఫీ బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఎడిటింగ్ సినిమాకి మైనస్ గా నిలుస్తోంది. సినిమాని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసే అవకాశం ఉన్నా ఎడిటర్ ల్యాగ్ ను అలాగే ఉంచాడు. నిర్మాతలు దివ్య ప్రసాద్, అశోక్ ప్రసాద్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

తీర్పు :

 

శ్రీనివాస సాయి, భావన రావ్ హీరో హీరోయిన్లుగా ‘మథనం’ అంటూ వచ్చిన ఈ చిత్రం ఎమోషనల్ డ్రామాతో కొన్ని ఆకట్టుకునే లవ్ సీన్స్ తో కొన్ని చోట్ల బాగానే సాగిన.. ఓవరాల్ గా సినిమా మాత్రం ఆకట్టుకునే విధంగా సాగలేదు. దర్శకుడు సినిమాని ఆసక్తికరంగా మలచలేకపోయారు. సినిమాలో ఇన్ వాల్వ్ అయ్యేవిధంగా ఇంట్రస్టింగ్ కథాకథనాలు లేకపోవడం, పైగా కథలో నాటకీయత ఎక్కువవ్వడం, అలాగే ప్లే కూడా స్లోగా సాగుతూ బోర్ కొట్టించడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు నిలబడుతుందో చూడాలి.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click Here English Vesrion

సంబంధిత సమాచారం

తాజా వార్తలు