విడుదల తేదీ : సెప్టెంబర్ 9, 2016
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
దర్శకత్వం : ఎస్.కె.బషీద్
నిర్మాత : ఎస్.కె.కరీమున్నిసా
సంగీతం : సాయి కార్తీక్
నటీనటులు : శ్రీకాంత్, అక్ష..
కెరీర్ మొదట్లో విలన్ తరహా పాత్రలతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీకాంత్, గత కొద్దికాలంగా పూర్తి స్థాయి హీరోగా సినిమాలను తగ్గించారు. కాగా ఆయన పూర్తి స్థాయి హీరోగా నటించిన ’మెంటల్’ అనే సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ పోలీస్ స్టోరీ ఎలా ఉందో చూద్దాం..
కథ :
దుర్గా ప్రసాద్ (శ్రీకాంత్) చిన్నప్పుడే తన తల్లిని చంపిన వారిపై పగ తీర్చుకొని జైలుకి వెళతాడు. జైలు నుంచి తిరిగొచ్చాక నేరస్థులను శిక్షించడం ఒక్క పోలీస్ వల్లే సాధ్యమని దుర్గా పోలీస్ అవుతాడు. ఎలాంటి అన్యాయం జరిగినా అస్సలు ఊరుకొని పోలీస్‌గా అవతారమెత్తిన దుర్గాకు తానుండే ఏరియాలో ఓ పెద్ద రౌడీ అయిన అజయ్ ఘోష్‌తో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆ ఇబ్బందులు ఏంటీ? అజయ్ ఘోష్ ఆగడాలను దుర్గా ఎలా ఎదుర్కున్నాడూ? అన్నదే సినిమా.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏదీ అంటే సమాజంలో ఇప్పటికీ కొన్ని సమస్యలు ఎలా ఉన్నాయో చూపే ప్రయత్నం చేయడం గురించి చెప్పొచ్చు. ఇక హీరో శ్రీకాంత్ సినిమాను తన భుజాలపై మోసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా విలన్‍తో పోరాడే సన్నివేశాల్లో శ్రీకాంత్ చెప్పే డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. మొదటి పావుగంటలోనే కథను పరిచయం చేసిన విధానం బాగుంది. ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలు బాగానే ఉన్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా చాలా బాగుంది.
మైనస్ పాయింట్స్ :
తెలుగు సినిమాలో ఇప్పటివరకూ ఎన్నోసార్లు చూసి ఉన్న, అరిగిపోయిన పాత కథ, కథనాలను ఎంచుకోవడమే ఈ సినిమాకు అతిపెద్ద మైనస్. ఎన్నోసార్లు చూసిన కథ కావడంతో తర్వాతి సీన్ ఏంటో ముందే చెప్పేసంత నీరసంగా సినిమా నడిచింది. ఇక శ్రీకాంత్ మినహా ఏ ఒక్క పాత్రకూ సరైన క్లారిటీ లేదు.
అటూ ఇటుగా ఉన్న ఫస్టాఫ్ తర్వాత వచ్చే సెకండాఫ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అన్నీ పక్కాగా పేర్చిన అర్థం పర్థం లేని సన్నివేశాలు వస్తూ సెకండాఫ్ బోరింగ్‌గా తయారైంది. హీరోయిన్ అక్ష పాత్ర ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. అసందర్భంగా వచ్చే రెండు, మూడు పాటలు విసుగు పుట్టించాయి. కావాలని ఇరికించిన కామెడీ సన్నివేశాలు కూడా అలాగే తయారయ్యాయి.
సాంకేతిక విభాగం :
ముందుగా దర్శకుడు బషీద్ గురించి చెప్పుకుంటే సమాజంలో జరిగే అన్యాయాలపై ఏదో పోరాటంలా సినిమా తీద్దామని అనుకొని అసలు కథను మరిచిపోయినట్లనిపించింది. దీంతో కథనంలోనూ చేయదగ్గ మ్యాజిక్ లేక పూర్తిగా విఫలమయ్యాడు.
సాయి కార్తీక్ అందించిన మ్యూజిక్ ఫర్వాలేదు. ఎడిటింగ్ అంతంతమాత్రమే. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా ఫర్వాలేదనేలానే ఉన్నాయి. ఉన్నంతలో సినిమాటోగ్రఫీ బాగానే ఉంది.
తీర్పు :
తెలుగు సినిమా ఇప్పటికే ఎన్నో సార్లు చూసి ఉన్న ఓ కథను, ఏమాత్రం కొత్తదనం లేకుండా చెప్పి తీసుకొస్తే ఎలా ఉంటుందో అలా ఉన్న సినిమా ’మెంటల్’. ఒక్క శ్రీకాంత్ బాగా చేశాడన్నది మినహాయిస్తే ఈ సినిమాలో ఆ స్థాయిలో చెప్పుకోదగ్గవి ఏమీ లేవు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ పోలీస్ కథ, చాలా పాతదే కాదు.. అరిగిపోయింది, బోర్ కొట్టించేది కూడా!
123telugu.com Rating : 2/5
Reviewed by 123telugu Team