విడుదల తేదీ : 20 సెప్టెంబర్ 2013 | ||
123తెలుగు.కామ్ రేటింగ్ : 1/5 |
||
దర్శకుడు : మంత్రాక్షర్ |
||
నిర్మాత : శ్రీ కాంత్ రెడ్డి |
||
సంగీతం : జోసఫ్, పద్మనాభం |
||
నటీనటులు : రాహుల్, కిమాయ, ఎల్బీ శ్రీరాం.. |
చాలా మంది వివిధ రంగాల్లో సెటిల్ అయ్యి ఆ తర్వాత సినిమాపై ఉన్న మక్కువతో సినీ రంగంలోకి వచ్చి దర్శకులుగా, నటులుగా, నిర్మాతలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అదే రీతిలో ఐటి రంగం నుండి ఇండస్ట్రీకి వచ్చిన శ్రీ కాంత్ రెడ్డి తొలి ప్రయత్నంగా నూతన తారలతో చేసిన సినిమా ‘మ్యూజిక్ మ్యాజిక్’. రాహుల్, కిమాయ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ద్వారా మంత్రాక్షర్ డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. ఇంతకీ మ్యూజిక్ తో ఏమి మ్యాజిక్ చేసారో ఇప్పుడు చూద్దాం..
కథ :
సంజయ్(రాహుల్) – రాక్ స్టార్, టోనీ – కీ బోర్డ్ ప్లేయర్, అమిత్ – గిటారిస్ట్, ప్రేమ్ – డ్రమ్స్ స్పెషలిస్ట్, తానియా – గిటారిస్ట్.. వీరు ఐదుగురు మంచి ఫ్రెండ్స్. అలాగే వీరి మ్యూజిక్ ట్రూప్ కి క్రేజీ రాక్ బ్యాండ్ అని పేరు. వీరు చవివే కాలేజీలోనే పల్లవి(కిమాయ) కూడా చేరుతుంది. పల్లవికి క్లాసికల్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. పల్లవికి – సంజయ్ గ్రూప్ కి అస్సలు పడదు. అదే తరుణంలో నేషనల్ మ్యూజిక్ కాంపిటీషన్ ని వైజాగ్ లో నిర్వహిస్తారు. తమ కాలేజ్ ఆ కాంపిటీషన్లో పాల్గొనడం కోసం సంజయ్ గ్రూప్, పల్లవి కలవాల్సి వస్తుంది. కాంపిటీషన్లో పాల్గొనడానికి వీళ్ళు వైజాగ్ వెళ్తారు. అక్కడ వీరికి ఢిల్లీ రాజధాని కాలేజ్ నుంచి వచ్చిన రాహుల్ గ్రూప్ గట్టి పోటీని ఇస్తుంది. అక్కడ సంజయ్ – రాహుల్ గ్యాంగ్ లకి మధ్య జరిగిన గొడవలేమిటి? ఆ నేషనల్ లెవల్ మ్యూజిక్ కాంపిటీషన్ లో చివరికి విజేతలు ఎవరు? అనేది మీరు తెరపైనే చూడాలి.
ప్లస్ :
హీరో పాత్ర చేసిన రాహుల్ డాన్సులు బాగున్నాయి, నటన పరవాలేధనిపించేలా ఉంది. టోనీ పాత్ర చేసిన అతను అక్కడక్కడా నవ్వించడానికి ట్రై చేసాడు. ఎల్బీ శ్రీరాం నటన మరియు ఆయన క్లాంక్స్ లో చెప్పే ఓ చిన్న స్పీచ్ బాగుంటుంది.
మైనస్ పాయింట్స్ :
గత కొద్ది రోజులగా మన హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ వల్ల సిగ్నల్స్ వద్ద వాహనాలు ముందుకు కదలడం లేదు, అదే తరహాలో ఈ సినిమా మొదటి నుండి చివరి వరకు నెమ్మదిగా సాగుతుంది. ఈ సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ మా తాతల కాలం నుండి చాలా మంది దర్శకులు చెబుతూనే వస్తున్నారు. నాకు తెలిసి కె. విశ్వనాధ్, రాఘవేంద్రరావు మొదలైన దర్శకదిగ్గజాలేందరో ఈ కాన్సెప్ట్ పై సినిమాలు చేసారు. వాళ్ళు ఎంతో మంచి సినిమాలు చేసారు. వాళ్ళు అంత బాగా తీసిన కాన్సెప్ట్ ని చెడగొట్టడానికే ఈ మూవీ తీసినట్టుంది.
ముఖ్యంగా డైరెక్టర్ చెప్పాలనుకున్న కాన్సెప్ట్ ని సినిమా మొదట్లోనే వదిలేసి ఏదేదో ఏదేదో చూపిస్తూ సినిమాని పూర్తి చేసాడు. ఈ సినిమాలో మన భారతీయ సంగీత ప్రాముఖ్యతని చూపించాలనుకున్న డైరెక్టర్ సినిమా మొదలయ్యాక మనసు మార్చుకున్నాడేమో పాప్ మ్యూజిక్ పైనే ఎక్కువ శ్రద్ధ తీసుకున్నాడు. ఇక ఈ సినిమాకి హీరోయిన్ పెద్ద మైనస్. అస్సలు ఒక్క ఎక్స్ ప్రెషన్ కూడా సరిగ్గా ఇవ్వలేదు. సినిమా మొత్తం మీద హరో – హీరోయిన్ బద్ద శత్రువులు అలాంటి వారిద్దరూ క్లైమాక్స్ షాట్ లో మాత్రం డీప్ లవర్స్ లాగా చూపించారు. అది ఎలా సాధ్యపడిందో డైరెక్టర్ కే తెలియాలి.
సినిమాలో శాస్త్రీయ సంగీతం అనే కాన్సెప్ట్ చెప్పడం వల్ల రెండు పాటలు పెట్టాడు. అవి పక్కన పెడితే మిగిలిన అన్ని పాటల్లోనూ ఇంగ్లీష్ ఎక్కువ – తెలుగు తక్కువ, అందులోనూ పాట వినపడేది తక్కువ – సౌండ్స్ వినపడేది ఎక్కువ. దాంతో ప్రేక్షకుడి చెవులకి చిల్లులు పడినా పడొచ్చు. సినిమా స్క్రీన్ ప్లే అస్సలు బాలేదు, సినిమా మొదలైన 15 నిమిషాలకే అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు సినిమా ఏంటి ఏమేమి ట్విస్ట్ లు ఉంటాయి అనేది బటానీలు తిన్నంత ఈజీగా చెప్పేయొచ్చు. దీన్ని బట్టే స్క్రీన్ ప్లే ఎంత భీభత్సంగా ఉందొ మీరు అర్థం చేసుకోవచ్చు. సినిమా ఫస్ట్ హాఫ్ గడిచిన ఒక 40 నిమిషాల నుండి కథ మొత్తం కాంపిటీషన్ అనే అంశం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. దాంతో ఆడియన్స్ కి కి సినిమా బోర్ కొడుతుంది.
సాంకేతిక విభాగం :
డైరెక్టర్ గా తొలి ప్రయత్నం చేసేవాళ్ళు తాము ఏమి అనుకున్నాము, ఏమి చేస్తున్నాము అనే విషయాలపై పూర్తి క్లారిటీ ఉండాలి. అలా లేకపోతే పరిస్థితి ఈ సినిమా డైరెక్టర్ లానే తయారవుతుంది. ఈ సినిమాలోని కథ – ఎప్పుడో తాత ముత్తాతల కాలం నాటిది. స్క్రీన్ ప్లే – దాని గురించి మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్. డైరెక్షన్ – తుస్సుమంది. కాస్తో కూస్తో కొన్ని సీన్స్ లో సినిమాటోగ్రఫీ బాగుంటుంది. మ్యూజిక్ పరంగా చేసిన రెండు మూడు మెలోడీ సాంగ్స్ బాగున్నాయి కానీ మిగిలిన రాక్ సాంగ్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అస్సలు బాగోలేవు. డైలాగ్స్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. ఎడిటర్ పెద్దగా శ్రద్ధ తీసుకున్నట్లు లేరు అందుకే సినిమా నెమ్మదిగా వెళుతుంది.
తీర్పు :
‘మ్యూజిక్ మ్యాజిక్’ మ్యాజిక్ లేకుండా మ్యూజిక్ తో ఆడియన్స్ కి చుక్కలు చూపించే సినిమా. ఈ మధ్య కాలంలో రావాల్సిన పెద్ద సినిమాలు రాకపోవడంతో చిన్న సినిమాలు ఆడియన్స్ పై వరుసగా దాడి చేస్తున్నాయి. ఈ సినిమాలన్నీ ఆడియన్స్ కి నిరుత్సాహాన్నే మిగులుస్తున్నాయి. గత కొద్ది రోజులుగా వస్తున్న సినిమాల్లానే ఈ సినిమా కూడా చూడకూడని సినిమా. మీకు అనచ్చే అంశాలు ఇందులో ఒక్కటి కూడా లేవు. ఒకవేళ చూస్తాను అంటే మీ జోబుతో పాటు చెవులకి కూడా చిల్లులు పడతాయి.
123తెలుగు.కామ్ రేటింగ్ : 1/5
రాఘవ