సమీక్ష : నాన్న – నేను – నా బాయ్ ఫ్రెండ్స్ – లవ్ కమ్ ఎమోషనల్ ఎంటర్టైనర్

సమీక్ష : నాన్న – నేను – నా బాయ్ ఫ్రెండ్స్ – లవ్ కమ్ ఎమోషనల్ ఎంటర్టైనర్

Published on Dec 17, 2016 12:56 PM IST
Nanna Nenu Na Boyfriends review

విడుదల తేదీ : డిసెంబర్ 16, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : భాస్కర్ బండి

నిర్మాత : బెక్కం వేణు గోపాల్

సంగీతం : శేఖర్ చంద్ర

నటీనటులు : హెబ్బా పటేల్, అశ్విన్, నోయెల్, పార్వతీశం(నూకరాజు)


సినిమా ప్రేమికులు ఎప్పుడైనా ఆదరించే ప్రేమ కథను ఆధారంగా చేసుకుని నూతన దర్శకుడు భాస్కర్ బండి రూపొందించిన సినిమానే ఈ ‘ నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’. ట్రైలర్స్, పోస్టర్లతోనే మంచి ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా దిల్ రాజు సమర్పించడంతో మరింత అటెంక్షన్ ను దక్కించుకుని ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

ఉద్యోగం కోసం సిటీకొచ్చిన ఒక అమ్మాయి పద్మావతి (హెబ్బా పటేల్) పెద్దలు కుదిర్చిన పెళ్లి కాకుండా తనకిష్టమైన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ముగ్గురు అబ్బాయిల్ని ప్రేమిస్తుంది. ఆ ముగ్గురు అబ్బాయిలు గోకుల్ (నోయెల్), నాని (అశ్విన్), నమో (పార్వతీశం) కూడా పద్మావతిని ప్రాణంగా ప్రేమించి ఆమె కోసం జీవితంలో అన్నీ వదులుకోవడానికి సిద్దపడతారు.

చివరికి పద్మావతి తనను ప్రాణంగా ప్రేమించే ముగ్గురు ప్రేమికుల్లో ఎవరిని పెళ్లి చేసుకోవాలో తెలీక కన్ఫ్యూజన్ లో పడిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న పద్మావతిని ప్రాణంగా చూసుకునే ఆమె తండ్రి (రావు రమేష్) ఎలా అర్థం చేసుకున్నాడు ? పద్మావతిని ప్రేమించిన ఆ ముగ్గురు అబ్బాయిలు చివరికి ఎలా సర్దుకున్నారు ? పద్మావతి ఎవరిని పెళ్లి చేసుకుంది ? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలోని ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా చెప్పుకోవలసింది రచయిత బి. సాయి కృష్ణ ప్రేమ కథను కాస్త భిన్నంగా రాసుకున్న విధానం గురించి. ఒక అమ్మాయి ముగ్గురు అబ్బాయిల్ని ప్రేమించడం అనే విపరీతమైన పాయింట్ చుట్టూ సాయి కృష్ణ ఆమోదయోగ్యమైన కథనే రాసుకున్నాడు. ఆ కథను దర్శకుడు భాస్కర్ బండి బాగానే తెరకెక్కించాడు. ముఖ్యంగా సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ లో వచ్చే సెంటిమెంట్ సీన్లు, కథలోని కీలక మలుపు బాగా ఆకట్టుకున్నాయి. పద్మావతి పాత్రలో హెబ్బా పటేల్ నటన, ఆమె ముగ్గురు అబ్బాయిల్ని ప్రేమించే సన్నివేశాలు కొన్ని ఆకట్టుకున్నాయి.

అలాగే కూతురిని పిచ్చిగా ప్రేమించే తండ్రి పాత్రను డిజైన్ చేసిన విధానం, దాన్ని కథలో ఇన్వాల్వ్ చేసిన తీరు, ఆ పాత్రకు ప్రసన్న కుమార్ రాసిన హెవీ డైలాగ్స్, ఆ పాత్రను పోషించిన రావు రమేష్ నటన సినిమాకే హైలెట్ గా నిలిచాయి. ఫస్టాఫ్, సెకండాఫ్ లలో జబర్దస్త్ టీమ్ తో ట్రై చేసిన కామెడీ కూడా అక్కడక్కడా పండింది. అలాగే సినిమాలో ఆరు పాటలు ఉండాలన్నట్టు కాకుండా ముఖ్యమైన నాలుగు దశల్లో వచ్చే నాలుగు పాటలు బాగున్నాయి. హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో తేజస్వి మడివాడ, ముగ్గురు ప్రేమికుల పాత్రల్లో అశ్విన్, నోయెల్, పార్వతీశం (నూకరాజు)ల నటన మెప్పించాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమా ఫస్టాఫ్ ఓపెనింగ్, హెబ్బా పటేల్, రావు రమేష్ ల క్యారెక్టర్ల ఎలివేషన్ బాగానే ఉన్నా హెబ్బా పటేల్ ముగ్గురు అబ్బాయిల్ని వలలో వేసుకునేందుకు చేసే ప్రయత్నాలు కొన్ని రొటీన్ గా ఉండి బోర్ కొట్టించాయి. పైగా అవి చాలా సాదా సీదాగా ఉండి అబ్బాయిలు మరీ అంత ఈజీగా ప్రేమలో పడిపోతారా అనిపించింది. అలాగే ఫస్టాఫ్ స్క్రీన్ ప్లే కూడా నెమ్మదిగా సాగుతూ అక్కడక్కడా అనవసరమైన సన్నివేశాలు వస్తూ కాస్త బోర్ కొట్టించాయి.

ఇక డైరెక్టర్ సినిమాలో ఎమోషన్, కామెడీ, రొమాన్స్ అన్నీ ఉండాలనే ఉద్దేశ్యంతో అన్నింటినీ టచ్ చేసి చివరికి తండ్రి, కూతుళ్ళ ఎమోషన్, లవ్ మినహా రొమాన్స్, కామెడీని పూర్తి స్థాయిలో పండించలేకపోయాడు. ఫాదర్ – డాటర్ రిలేషన్ గొప్పగా చెప్పడమే డైరెక్టర్ ఉద్దేశ్యమైనప్పటికీ మిగిలిన అంశాలను అలా అసంపూర్తిగా వదిలేయడంతో కాస్త నిరుత్సాహం కలిగింది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో ప్రేమ కథను సరికొత్తగా, కాస్త బోల్డ్ గా రాసుకున్న రచయిత సాయి కృష్ణ పనితనం మెప్పించింది. అలాగే దర్శకుడు భాస్కర్ బండి ఎక్కడా విపరీత ధోరణికి పోకుండా అనుకున్న హద్దుల్లోనే సినిమాని రూపొందించాడు. హెబ్బా పటేల్, రావు రమేష్ ల పాత్రలకు ప్రసన్న కుమార్ రాసిన డైలాగుల గురించి స్పెషల్ గా చెప్పుకోవలసిందే. అలాగే చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా ఉండి ఉంటే బాగుండేది. శేఖర్ చంద్ర సంగీతం బాగుంది. ముఖ్యంగా ‘ఒక పారు ముగ్గురు దేవదాసులు’ పాట స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. బెక్కం వేణు గోపాల్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

ప్రేమ కథ ఆధారంగా రూపొందిన ఈ ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’ చిత్రం అన్నింటిలా రొటీన్ గా కాకుండా కాస్త భిన్నంగా, బోల్డ్ గా బాగుంది. ఆకట్టుకునే హెబ్బా పటేల్, రావు రమేష్ ల పాత్రలు, వాటి డైలాగులు, ప్రేమికుల మధ్య నడిచే కొన్ని లవ్ సీన్స్ , కొన్ని కామెడీ సన్నివేశాలు, ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ ఎమోషనల్ ఎపిసోడ్లు, కథలోని కీలక మలుపు ఆకట్టుకునే అంశాలు కాగా ఫస్టాఫ్ లో నడిచే కొన్ని రొటీన్, బోరింగ్ రొమాంటిక్, కామెడీ సీన్లు, అనవసరపు సన్నివేశాలు మైనస్ పాయింట్స్ గా ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే ప్రేమ కథలను అందులోనూ భిన్నమైన వాటిని, ఫాదర్ సెంటిమెంట్ రిలేటెడ్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతూ కాస్త బోరింగ్ కంటెంట్ ను తట్టుకునే ప్రేక్షకులకు ఈ సినిమా వీకెండ్ లో మంచి చాయిస్ గా నిలుస్తుంది.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు