ఓటీటీ రివ్యూ : నిఫా వైరస్ – ఎమోషనల్ గా సాగే థ్రిల్లర్ డ్రామా !

ఓటీటీ రివ్యూ : నిఫా వైరస్ – ఎమోషనల్ గా సాగే థ్రిల్లర్ డ్రామా !

Published on Dec 6, 2020 1:57 AM IST

నటీనటులు : కుంచకో బోబన్‌, టొవినో థామస్‌, పార్వతి తిరువత్తు, ఆసిఫ్‌ అలీ, రెహమాన్‌, సౌబిన్‌ షాహిర్‌, ఇంద్రజిత్‌ సుకుమారన్‌, రేవతి తదితరులు

దర్శకత్వం : ఆషిక్‌ అబు

నిర్మాత : ఆషిక్‌ అబు, రిమా కళింగల్

సంగీతం : సుశిన్‌ శ్యామ్‌

సినిమాటోగ్రఫీ : రాజీవ్‌ రవి, ఖలీద్‌

 

 

కేరళను వణికించిన నిఫా వైరస్ నేపథ్యంతో తీసిన మెడికల్ థ్రిల్లర్ మూవీ నిఫా వైరస్. కాగా, నిఫా వైరస్ మూవీ కేరళలోని కొన్ని యధార్థ ఘటనలు మిళితంచేసి రూపొందించిన సినిమా. మాలీవుడ్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకుందీ మూవీ. కాగా డిసెంబర్‌ 4న ఆహాలో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా సమీక్షలోకి వెళ్లి తేలుకుందాం.

 

కథ :

గతంలో ప్రపంచ దేశాలతో పాటు భారత్‌ను గడగడలాడించిన నిపా వైరస్ నేపథ్యంలో వచ్చింది ఈ సినిమా. జక్రియా మహ్మద్‌ (జక్రియా) అనే వ్యక్తి తీవ్రమైన దగ్గు, వాంతులతో బాధపడతూ ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌ లో జాయిన్ అవుతాడు. అతనికి ఏమైందో తెలుసుకునేలోపే జక్రియా చనిపోతాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు జక్రియాకి చికిత్స అందించిన నర్స్‌ అఖిల (రైమా) అలాగే మరికొందరు కూడా అవే లక్షణాలతో బాధపడుతూ ఆస్పత్రికి వస్తారు. దీంతో అసలు ఈ వ్యాధి ఏంటి ? ఎందుకు అందరూ ఇలా అస్వస్థతకు గురువుతున్నారు ? చివరకు కేరళ ఈ వైరస్‌ను ఎలా ఎదుర్కొంది ? అందుకు ఎలాంటి చర్యలు తీసుకుంది? నిపా కారణంగా ప్రజలు ఎలా ఇబ్బందులు పడ్డారు? నిపా బారిన పడ్డ వారి కుటుంబాలు సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

 

ప్లస్ పాయింట్స్ :

ప్రపంచ దేశాలను వణికించిన వ్యాధుల్లో నిపా కూడా ఒకటి. కాగా ఈ వ్యాధి 2018లో కేరళలో కలకలం సృష్టించింది. ఈ అంటువ్యాధినే కథా వస్తువుగా తీసుకుని ఆషిక్‌ అబు ‘వైరస్‌’ సినిమాను చాల బాగా తీర్చిదిద్దాడు. వివిధ అనారోగ్య సమస్యలతో ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యులు, నర్సులు ఎలాంటి చికిత్స అందిస్తారు? వారితో ఎలా మాట్లాడతారు? వంటి సన్నివేశాలతో పాటు మంచి ఎమోషన్స్ ను అండ్ వాస్తవికతను సినిమాలో చాల బాగా చూపించాడు.

ఇక నటీనటుల విషయానికి వస్తే.. రేవతి మినహా మిగిలిన వాళ్లందరూ తెలుగు ప్రేక్షకులకు తెలియని వాళ్లే అయినా అందరూ చాల బాగా నటించారు. తమ పాత్రల్లో వాళ్లు చక్కగా ఒదిగిపోయారు. ఇక దర్శకుడు ప్రతి పాత్రకూ ఇందులో ప్రాధాన్యం ఇచ్చాడు. అలాగే ఆస్పత్రి వాతావరణం ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత జక్రియా అనే వ్యక్తి అస్వస్థతకు గురవడం, అతన్ని ఆస్పత్రికి తీసుకురావడం తదితర సన్నివేశాలతో కథలోకి బాగా తీసుకెళ్లగలిగాడు.

అలాగే సినిమాలో నెమ్మదిగా వ్యాధి ఒకరి నుంచి మరొకరికి ఎలా సోకుతుందనే సన్నివేశాలు.. వారందరికీ సోకింది నిపా అని తెలిసిన తర్వాత ఆస్పత్రిలో పనిచేసే ప్రతి ఒక్కరూ ఎలా భయపడ్డారు.. ఆ సమయంలో వాళ్ల ఆలోచనలు ఎలా ఉన్నాయి లాంటి అంశాలు సినిమాలో చాల చక్కగా చూపించారు. అదే సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి ఆస్పత్రిలో పనిచేస్తున్న వారి కుటుంబాలు బయట సమాజం నుంచి ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటాయో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.

 

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు ఆషిక్‌ అబు తీసుకున్న మెయిన్ పాయింట్ బాగా ఆకట్టుకున్నా… ఆ పాయింట్ ను ఎలివేట్ చేస్తూ ఆయన రాసుకున్న ట్రీట్మెంట్ కొన్ని చోట్ల ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఆషిక్‌ అబు సినిమాని ఇంట్రస్టింగ్ గా మొదలు పెట్టినా.. కొన్ని చోట్ల కథనం బాగా నెమ్మదిగా సాగుతుంది.

అలాగే ఫస్టాఫ్ లో వచ్చే ఆ కొన్ని ల్యాగ్ సీన్స్ ను కూడా తగ్గించుకుని ఉండి ఉంటే, సినిమాకి ఇంకా బెటర్ అవుట్ ఫుట్ వచ్చి ఉండేది. అయితే దర్శకుడు రాసుకున్న వైరస్ నేపథ్యం, మెయిన్ క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ.. కొన్ని సీన్స్ బాగా స్లోగా ఉండటం, అలాగే కొన్ని సన్నివేశాల్లో ఇంట్రస్ట్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి.

 

సాంకేతిక విభాగం :

‘నిపా వైరస్‌’లాంటి మెడికల్‌ థ్రిల్లర్‌ ఆకట్టుకోవాలంటే ముందుగా కావాల్సింది మంచి సాంకేతిక బృందం. కాగా సాంకేతిక బృందం పనితీరు చాల బాగుంది. ముఖ్యంగా సుశిన్‌ శ్యామ్‌ చక్కటి సంగీతం అందించాడు. ఆయన పాటలన్నీ కథాగమనంలో బాగా ఇన్ వాల్వ్ అయ్యేలా చేశాయి. రాజీవ్‌ రవి సినిమాటోగ్రఫీ కూడా చాల బాగుంది. ఆస్పత్రి వాతావరణం, రోగుల స్థితిని వారి పరిస్థితులను కెమెరామెన్ బాగా చూపించాడు. సైజు శ్రీధరన్‌ ఎడిటింగ్‌కు ఇంకా బెటర్ గా ఉండి ఉంటే బాగుండేది. నిర్మాత పాటించిన నిర్మాణ విలువలు చాల బాగున్నాయి.

 

తీర్పు :

మానవజాతిని వణికించిన వ్యాధుల్లో నిపా కూడా ఒకటి కావడం, నిపా నేపథ్యంలో దర్శకుడు ఆషిక్‌ అబు కథను రాసుకోవడం, అలాగే సినిమాని కూడా విభిన్నమైనదిగా మలిచే ప్రయత్నం చేయడం ఆకట్టుకుంది. ముఖ్యంగా నిపా వైరస్‌నాటి పరిస్థితులను ప్రేక్షకుల కళ్లకు కట్టే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కాకపోతే వైరస్ నేపథ్యంలో వచ్చే కొన్ని సీన్స్ బోర్ గా సాగడం, కొన్ని కీలక సన్నివేశాలు కూడా స్లోగా అనిపించడం మరియు ప్లే కూడా స్లోగా సాగడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా అనిపిస్తాయి. కానీ వైరస్ నేపథ్యం, అలాగే థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారికి సినిమా బాగానే నచ్చుతుంది.

123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు