విడుదల తేదీ : 03 నవంబర్ 2011 | ||
రేటింగ్ : 3.25/5 | ||
దర్శకుడు : రవి బాబు | ||
నిర్మాత : రామోజీ రావు | ||
సంగీత దర్శకుడు : శేఖర్ చంద్ర | ||
పాత్రలు : అజయ్, హవిష్, ప్రసాద్, యామి గౌతమ్, రేమ్య నంబీసన్ ఇంకా మరికొందరు |
మారుతోన్న సమాజ స్తితిగతులకు అనుగుణంగా సినిమాలు చేయటంలో దర్శకుడు రవిబాబు సముచిత స్థానం పొందారు. ఇంతవరకూ అతను దర్శకత్వం వహించిన అతని సినిమాలే అందుకు నిదర్శనం. అంతా కొత్త నటీనటులు ముఖ్య తారాగణంగా తెరకెక్కించిన ‘నువ్విలా’ చిత్రంతో రవిబాబు మళ్ళీ సిద్దమయ్యారు. ఇవాలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ చిత్ర తీరు తెన్నులు ఎలావున్నాయో ఇప్పుడు చూద్దాం.
కథ : విభిన్న పరిస్తితుల్లో ప్రేమలో పడే ముగ్గురు యువకుల ప్రేమకథా చిత్రం ఇది. ఈ మూవీ లో మూడు వేర్వేరు ప్రేమ కథలున్నాయి. ఆనంద్ (అజయ్), ఫిడేల్ రాజు (ప్రసాద్) మరియు మహేష్ (హవిష్) ఒక పిజ్జా సెంటర్లో కలసి పనిచేసే మంచి స్నేహితులు. వీరిలో ఆనంద్ అతి చంచల మనస్తత్వం కల వ్యక్తి. తన కెరీర్ పరంగా ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేక ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ చదవాలా అన్న మీమాంసలోనే కాలం వృధా చేస్తాడు. అతని పక్కింటమ్మాయ్ అర్చన (యామి) తో ప్రేమలో పడతాడు. దీనిలో ట్విస్ట్ ఏంటంటే అర్చన ఒక ప్రముఖ క్రికెటర్ విష్ణును ప్రేమిస్తుందన్న విషయం తెలుసుకుని తన ప్రేమను వదులుకునేందుకు సిద్దమైన ఆనంద్ జీవితం ఊహించని మలుపుతిరగడం.
ఇక ఫిడేల్ రాజు లక్ష్యం ఒక ప్రముఖ మ్యుజీషియన్ కావాలని. అయితే అతనికి ‘సా’ పలకటం రాదు. అతని చిన్ననాటి స్నేహితురాలు రాణి (రేమ్య) ఒకరికొకరు ఎప్పుడూ ద్వేషించుకుని ఘర్షణ పడుతుంటారు. చివరికి అది ఒక కరుడుగట్టిన ప్రేమని తెలుసుకుంటారు.
టాప్ మోడల్ గా ఉండాలనుకొనే మరో ఫ్రెండ్ మహేష్. ఇతనిది చాలా స్వేచ్చగా మసలే స్వభావం. ఎప్పుడూ అమ్మాయిల వెంట పడుతుంటాడు. అయితే అతనికి మాధవి (సరయు) తో ఒక ఆసక్తికరమైన సంబంధం ఏర్పడుతుంది. ఇక్కడ మరో సైడ్ ట్రాక్ ఏమిటంటే, స్వలింగ సంపర్కుడైన శైలు (హలీం)ని మహేష్ పై ప్రయోగించటం.
ఈ ముగ్గురు స్నేహితులు వారి వారి ప్రేమల్లో ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. అయితే వీరి ప్రేమకథలు సుఖంతమవుతాయ..? లేదా అనేది తెరపైనే చూడాలి.
ప్లస్ పాయింట్స్ : ఈ సినిమాలో అద్భుతమైన కామెడి ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా ప్రధాన పాత్ర దారుల సన్నివేశాలు చాల ఆసక్తి కరంగా, చురుగ్గా సాగుతాయి. హీరోల్లో ప్రసాద్, హవీష్ ఇద్దరూ చాల బాగా నటించారు. వీరి కామెడి టైమింగ్ ఆకట్టుకుంది. ఈ ఇద్దరు కొత్త హీరో లు అద్భుతమైన హాస్యాన్ని పండించారు. ‘సా’ సరిగా పలకటం రాని ప్రసాద్ నటన ఆకట్టుకుంది.
హవిష్, హలీం ల మధ్య చాలా చమత్కారమైన, హాస్య భరిత ట్రాక్ నడుస్తుంది. హాస్యం విషయానికొస్తే ఎక్కడా స్రుతి మించకుండా రసభరితంగా సాగింది. ఇక ముగ్గురు హీరోయిన్లు మంచి ప్రతిభ కనబరిచారు. అర్చన పాత్రలో యామి నటన సూపర్బ్ గా ఉంది. ఆమె నటనకు మంచి భవిష్యత్తు ఉందనిపిస్తోంది. రేమ్య మరియు సరయు నటన చాలా సమర్థవంతంగా సాగింది.
ఇక పోలీసు పాత్రలో రవిబాబు నటన కడుపుబ్బా నవ్వించేదిగా ఉంది. అతని కామెడి టైమింగ్ బావుంది. ఆయన పాత్రకు మరింత నడివి ఉంటే ఇంకా బావుండేది. బామ్మాగా రాధా కుమారి, మాస్టర్ అతులిత్ వారి వారి పాత్రల్లో చక్కగా అభినయించారు . పాటలు వినసొంపుగా ఉన్నాయి.
మైనస్ పాయింట్లు : రెండవ సగం కాస్త నెమ్మదిగా చిత్రం సాగినట్టు కనిపిస్తుంది. స్వలింగ వివాహం, వివాహానికి ముందు సెక్స్, మరియు తండ్రి – కుమారుడు సంబంధాలు వంటివి సమాజం జీర్ణించు కొనేలా ఉండవు. అజయ్ నటనపై మరింత శ్రద్ద కనబరిస్తే బావుందని పించింది. ప్రసాద్ మరియు హవిష్ ల నటనముందు తేలిపోయినట్టు కనిపించింది.
సాంకేతిక విభాగాలు : ఈ చిత్రంలో ఎక్కడా లోబడ్జట్ సినిమా అన్న భావనే రాదు. కామెడి పండించటంలో రవిబాబు ఆరితేరినట్టు కనిపిస్తోంది. సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు మినహా స్క్రీన్ ప్లే చాల బావుంది. సినిమాటోగ్రఫీ చూడ చక్కగా ఉంది. శేఖర్ చంద్ర సంగీతం శ్రావ్యంగా సాగింది. ఎడిటింగ్ డీసెంట్ గా ఉంది. ఓపెనింగ్ టైటిల్స్ వినూత్నం ఉన్నాయి. రవిబాబు డైలాగ్స్, భలే చమత్కారంగా, పదునుగా సాగుతాయి.
విశ్లేషణ : ‘నువ్విలా’ చిత్రం యంగ్ ప్రొఫెషనల్స్ కు విద్యార్ధులకు విపరీతంగా నచ్చే చిత్రం. అర్బన్ కామెడి చిత్రం గా ఈ చిత్రం ప్రసంసలు పొందుతుంది. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించటంలో హాస్యం ప్రధాన భూమిక వహిస్తుంది. స్నేహితులంతా కలసి వెళ్లి ఆనందంగా బయటకు వచ్చే సినిమా ఇది.
– నారాయణ ఎ.వి