సమీక్ష : ఓరి దేవుడోయ్ – మెసేజ్ బాగుంది, ఎగ్జిక్యూషన్ మిస్సింగ్

సమీక్ష : ఓరి దేవుడోయ్ – మెసేజ్ బాగుంది, ఎగ్జిక్యూషన్ మిస్సింగ్

Published on Apr 18, 2015 11:00 AM IST
Ori Devudoy

విడుదల తేదీ : 17 ఏప్రిల్ 2015
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : శ్రీరామ్ వేగరాజ్

నిర్మాత : రవిశంకర్

సంగీతం : కోటి

నటీనటులు : రాజీవ్, మదిరాక్షి, మోనికా…


సంగీత దర్శకుడు కోటి తనయుడు రాహుల్ సాలూరు హీరోగా మదిరాక్షి, మోనికా హీరోయిన్స్ గా నటించిన సినిమా ‘ఓరి దేవుడోయ్’. శ్రీరామ్ వేగరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతూ రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోటి సంగీతం అందించాడు. మరి ‘ఓరి దేవుడోయ్’ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

త్రిశంకు యాడ్ కంపెనీ.. ఈ కంపెనీకి ఓనర్ అయిన త్రిశంకు(రాజీవ్) డబ్బు తీసుకొని ఎలాంటి దానికైనా మార్కెట్ చెయ్యగలడు, ఎంత మార్కెట్ ఉన్న దాన్నైనా కిందకి దించగలడు. తిమ్మిని బమ్మి చేయగల ఘనుడు. ఇలాంటి మన రాజీవ్ దగ్గరికి ఓ రోజు బ్రహ్మ, విష్ణు, ఈశ్వరులు వచ్చి, భూలోకంలో తమకు పబ్లిసిటీ తగ్గిపోతోందని, దాన్ని పెంచాలని కోరతారు. దానికి రాజీవ్ ఒప్పుకుంటాడు. ఆ తర్వాత దేవుల్లైన ప్రతి ఒక్కరూ లక్ష్మీ, పార్వతి, సరస్వతి, వినాయకుడు, ఆంజనేయుడు, దుర్యోధనుడు, రావణుడు, సూర్యుడు, చంద్రుడు ఇలా ఒకరి తర్వాత ఒకరు వచ్చి తమకి పబ్లిసిటీ పెంచాలని చెబుతారు. ఇవి చేసే పనిలో ఉండగా రాజీవ్ పై కొన్ని హత్యా యత్నాలు జరుగుతుంటాయి. అసలు రాజీవ్ మీద హత్యాయత్నాలు చేస్తోంది ఎవరు.? అసలెందుకు చేస్తున్నారు.? అలాగే దేవుళ్ళు రాజీవ్ ని పబ్లిసిటీ చేయడం వెనక ఉన్న కారణం ఏమిట.? దేవుళ్ళు రాజీవ్ ని చివరికి ఏం చేసారు? అన్నది మీరు సిల్వర్ స్క్రీన్ పై చూడాలి..

ప్లస్ పాయింట్స్ :

‘ఓరి దేవుడోయ్’ ఈ సినిమాకి పర్ఫెక్ట్ గా సరిపోయే టైటిల్. ఈ సినిమాలో మెచ్చుకోవాల్సిన పాయింట్ ప్రస్తుతం మనుషుల మధ్య మిస్ అవుతున్న మానవతా విలువలని వదలకూడదని, సాటి మనిషికి హాని కలిగించేలా ఏమీ చెయ్యకూడదని చెప్పిన విషయం బాగుంది. రాహుల్ తనకిచ్చిన పాత్రలో బాగానే చేసాడు, కానీ నటుడిగా చేయాల్సింది, నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. మదిరాక్షి పాటల్లో గ్లామరస్ గా కనిపిస్తే, మోనికా మాత్రం తిలోత్తమ పాత్రలో మొదటి నుంచి అందాలు ఆరబోస్తూనే ఉంది. ముఖ్యంగా పాటల్లో హీరోయిన్స్ అందాల విందు ముందు బెంచ్ వారిని ఆకట్టుకుంటాయి. తనికెళ్ళ భరణి – ఫిష్ వెంకట్ ఎపిసోడ్ బాగుంటుంది.

మైనస్ పాయింట్స్ :

పైన చెప్పాలనుకున్న మెసేజ్ పాయింట్ తప్ప సినిమాలో కథ లేదు. ఏదో రాసుకోవాలి కాబట్టి ఆ పాయింట్ ని సీన్స్ గా రాసారు. తీయాలి కాబట్టి సినిమా తీసారు. అంతే కానీ ఎందుకు ఏమిటి ఎలా అనేది ఎక్కడా ఉండదు. కథే లేదు ఇక కథనం ఎక్కడిది చెప్పండి. గాలి ఎటు వీస్తే అటు దుమ్ము వెళ్ళినట్లు ఎలా పడితే అలా వెళ్తుంటుంది కథనం. అన్ని రకాలుగా మల్లినా మీరు ఊహించవచ్చు ఏం జరుగుతుందా అని. ఇక డైరెక్షన్ అయితే నేను చెప్పలేను.. అంత గొప్పగా ఉంది.

సినిమాలో మాట్లాడితే పాటలు ఎందుకు వస్తాయో తెలియవు. హీరోయిన్ ఊ అన్నా పాట, ఆ అన్నా పాట.. పాటలు ఎక్కువయ్యి చివరికి ఐటెం సాంగ్ పెట్టడానికి ప్లేస్ లేక చివరి ఎండ్ టైటిల్స్ లో పెట్టుకున్నారు. ఇండస్ట్రీలో ఉన్న అందరూ సీనియర్ నటుల్ని వాడుకున్నారే తప్ప వారివల్ల పూచిక పుల్లంత ఉపయోగం లేదు. ఎడిటింగ్ బాలేదు. చూడదగిన సీన్స్ ఏమీ లేవు. సినిమా మొత్తం మొదటి నుంచి దేవెల్ల ప్రమోషన్స్ అని చూపిస్తానే ఉంటారు కానీ అవేమీ లేకుండా, హీరో ప్రమోషన్స్ ఏమీ చూపకుండానే అర్ధాంతరంగా సినిమా ఎందుకు ఆగిపోతుందో ఆ దేవుడికే తెలియాలి.

సాంకేతిక విభాగం :

టెక్నికల్ డిపార్ట్ మెంట్స్ లో చెప్పదగిన డిపార్ట్ మెంట్ ఒకటి కూడా లేదు.. ఆగండి ఆగండి ఒకటుంది. ఇలాంటి సినిమాకి కూడా డబ్బు పెట్టిన నిర్మాతని మెచ్చుకోవాలి. సినిమాటోగ్రఫీ బిలో యావరేజ్.. ఒక్కరినీ సరిగా చూపలేదు. కోటి మ్యూజిక్.. అజ్జ బాబోయ్ ఆయన ట్యూన్స్ ఆయనే కాపీ కొట్టాడు కాబట్టి నో కామెంట్స్. ఎడిటింగ్ అస్సలు బాలేదు. మాటలు కొన్ని చోట్ల ఒక కొన్ని చోట్ల నాట్ ఓకే. ఇక డైరెక్టర్ శ్రీరామ్ వేగరాజ్ గురించి ఏం చెబుతాం, ఆయన గురించి చెప్పడానికి ఏమీ లేదు. సినిమా కూడా చెప్పుకునేంత లేదు.

తీర్పు :

‘ఓరి దేవుడోయ్’.. నిజమే సినిమా చూసాక ప్రేక్షకులు ఓకే మెసేజ్ బానే ఉంది, ఎగ్జిక్యూషన్ ఇంకాస్త బాగుండాలి అని అనుకునేలానే ఉంది. జస్ట్ ఒక మెసేజ్ చెప్పాలంటే షార్ట్ ఫిల్మ్ తీస్తే సరిపోద్ది, షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ కి సినిమా ఎందుకు చెప్పండి. ఈ సినిమాని షార్ట్ గా చెప్పగలిగి ఉంటే బాగుండేదేమో.. కమర్షియాలిటీ అనే ఒక పిచ్చ వలన పాటలు, ఫైట్లు, కామెడీ ఎందుకు అంట. వాటివల్ల సినిమా పక్కదారి పట్టింది. ఓవరాల్ గా ఓరి దేవుడోయ్ సినిమా బి,సి సెంటర్స్ లో నాలుగు డబ్బులు తెచ్చుకునే అవకాశం ఉంది…

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

123తెలుగు టీం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు