విడుదల తేదీ : జనవరి 06, 2017
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.75/5
దర్శకత్వం : వంశీ మునిగంటి
నిర్మాత : లండన్ గణేష్
సంగీతం : కేశవ్ కిరణ్
నటీనటులు : చైతు, షాహేలా..
జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన పడమటి సంధ్యారాగం అన్న సినిమాకు చాలామంది అభిమానులున్నారు. ఆయన తీసిన మంచి కామెడీల్లో ఒకటిగా ఈ సినిమాకు పేరుంది. ఇప్పుడదే సినిమా టైటిల్‌ను ఎంచుకొని, పడమటి సంధ్యారాగం ఈసారి లండన్‌లో అంటూ వచ్చిన సినిమా పడమటి సంధ్యారాగం (లండన్‌లో). నేడు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ :
అరవింద్ (చైతూ) ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఒక అందమైన అమ్మాయిని ప్రేమించి, పెళ్ళి చేసుకోవాలన్నది అతడి కల. ఆ కల అలా ఉండగానే ఒకసారి అతడి మిత్రుడు వేణు (లండన్ గణేష్)తో కలిసి లండన్‌లో ఓ ప్రాజెక్టు కోసం వెళ్ళాల్సి వస్తుంది. కాగా వారు లండన్ వెళ్ళిన వెంటనే వారిని ఒక గ్యాంగ్ మోసం చేయడంతో రోడ్డు మీదకు వస్తారు.
ఈ పరిస్థితుల్లో వారిని అమూల్య (షాహేలా) ఆదుకుంటుంది. ఆ తర్వాత కొద్ది సమయంలోనే అరవింద్ ఆమెకు దగ్గరవుతాడు. ఇక అలా దగ్గరైన అరవింద్, అమూల్యకు తన ప్రేమ విషయం చెప్పాడా? ఈ క్రమంలోనే అతడికి ఎదురైన సవాళ్ళేంటీ? అన్నదే సినిమా.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే లండన్‌లోని పలు అందమైన లొకేషన్స్‌లో కథ చెప్పడం అని చెప్పుకోవచ్చు. ప్రొడక్షన్ వ్యాలూస్ విషయంలో ఎక్కడా తగ్గకపోవడం ఇక్కడ చూడొచ్చు. హీరో ఫ్రెండ్‌గా నటించిన లండన్ గణేష్ అక్కడక్కడా బాగానే నవ్వించాడు.
హీరో ఆకాష్ స్పెషల్ రోల్ బాగుంది. ఆ పాత్రలో ఉన్నంతమేర ఆయన బాగానే ఆకట్టుకున్నాడు. హీరో-ఆకాష్ నేపథ్యంలో వచ్చే కొన్ని సన్నివేశాలు ఫర్వాలేదనిపిస్తాయి.
మైనస్ పాయింట్స్ :
తెలుగు సినిమాలో ఇప్పటికే ఎన్నోసార్లు చూసి ఉన్న అరిగిపోయిన పాత కథను ఈ సినిమాకు ఎంచుకోవడమే అతిపెద్ద మైనస్‌గా చెప్పుకోవాలి. లండన్ నేపథ్యాన్ని ఎంచుకొని, కనీసం కథనంలో కూడా కొత్తదనం చూపకపోవడంతో సినిమా అంతా నీరసంగా సాగినట్లు అనిపించింది. ఆకాష్ మినహాయిస్తే సపోర్టింగ్ క్యాస్ట్ ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. కథలో వచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా అస్సలు బాగోలేవు.
హీరో, హీరోయిన్ల మధ్యన కెమిస్ట్రీ కూడా ఆకట్టుకునేలా లేదు. హీరోయిన్ కాస్త ఫర్వాలేదనిపించినా, హీరో చైతూ చాలా చోట్ల నటనలో తేలిపోవడం కూడా మైనస్‌గానే చెప్పుకోవాలి.
సాంకేతిక విభాగం :
సాంకేతిక అంశాల పరంగా ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ప్రతిభ కనబరిచింది సంగీత దర్శకుడని చెప్పుకోవాలి. ఉన్నంతలో ఆయన కాస్త ఫర్వాలేదనిపించే పాటలతో పాటు, మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఇక ఎడిటింగ్ అస్సలు బాలేదు. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదనే స్థాయిలోనే ఉంది.
దర్శకుడు వంశీ విషయానికి వస్తే, ఒక పాత కథను తీసుకొని ఆయన చేసిన ఈ బోరింగ్ ప్రయత్నం ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. దర్శకుడిగా, రచయితగా ఎక్కడా ఆయన ప్రతిభ చూపలేకపోయాడు.
తీర్పు :
ఒక ఆకట్టుకునే కథే లేకుండా వచ్చే సినిమా ఎంత పెద్ద ప్రచారంతో వచ్చినా నిలవలేదు. చిన్న సినిమాలకు కథే ప్రాణం అని తెలిసి కూడా, ఎలాంటి ప్రచారం లేకుండా, అసలు ఎక్కడా మెప్పించే అంశాలే లేని కథతో వచ్చిన సినిమా ‘పడమటి సంధ్యారాగం'(లండన్‌లో). ఒక్క లండన్ నేపథ్యంలోని లొకేషన్స్ తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేవీ సినిమాలో! ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ ‘పడమటి సంధ్యారాగం’ విసుగు తెప్పించింది.
123telugu.com Rating : 1.75/5
Reviewed by 123telugu Team