విడుదల తేదీ : డిసెంబర్ 24, 2016
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
దర్శకత్వం : కేవీ అనుదీప్
నిర్మాత : రామ్మోహన్. పి
సంగీతం : ప్రాణం కమలాకర్
నటీనటులు : విశ్వదేవ్ రాచకొండ, పునర్నవి భూపాలం
టీజర్లతోనే మంచి స్పందన తెచ్చుకున్న చిన్న సినిమా ‘పిట్టగోడ’. పైగా ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు సమర్పిస్తుండటంతో ఈ సినిమాపై క్రేజ్ మరింతగా పెరిగి సినిమాలో ఏదో విషయం ఉందనే నమ్మకం ప్రేక్షకుల్లో కలిగింది. విశ్వదేవ్, పునర్నవి భూపాలం జంటగా నూతన దర్శకుడు కేవీ ఆనంద్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఆ అంచనాలను ఎంతవరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం…
కథ :
తెలంగాణాలోని గోదావరిఖని అనే ఊరిలో ఎలాంటి పని పాట లేకుండా తిరిగుతూ పిట్టగోడ మీద కూర్చొని కాలక్షేపం చేసే నలుగురు కుర్రాళ్ళ బ్యాచ్ స్ట్రైకర్స్ టీమ్. నిత్యం అందరితోటీ తిట్లు తినే ఈ బ్యాచ్ కు టిప్పు (విశ్వదేవ్) లీడర్ గా ఉంటాడు. ఎలాగైనా అందరిలోనూ గుర్తింపు తెచ్చుకోవాలనే ఆలోచనతో ఈ బ్యాచ్ తమ ఆధ్వర్యంలో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంటును కండక్ట్ చేయాలనుకుని పెద్ద మొత్తంలో ఎంట్రీ ఫీజులు వసూలు చేసి అన్ని ఏర్పాట్లను చేసుకుంటారు.
ఇంతలో టిప్పు వాళ్ళ దివ్య(పునర్నవి) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. తీరా టోర్నమెంట్ కు ముందు రోజు రాత్రి టిప్పు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంటాడు. దాంతో టిప్పు, అతని ముగ్గురు స్నేహితులు తీవ్ర ఇబ్బందుల్లో పడతారు. అసలు టిప్పు తీసుకున్న ఆ సంచలన నిర్ణయం ఏమిటి ? ఎందుకు తీసుకున్నాడు ? దాని వలన టిప్పు ప్రేమకు, స్నేహానికి ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి ? చివరికి వీళ్ళ జీవితాలు ఏమయ్యాయి ? అనేదే ఈ సినిమా కథ..
ప్లస్ పాయింట్స్ :
సినిమాలోని ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా చెప్పుకోవలసింది కథ గురించి. వాస్తవానికి చాలా దగ్గరగా ఉండే ఈ కథను దర్శకుడు ఆసక్తికరంగా చెప్పిన విధానం చాలా బాగుంది. సినిమాలోని చాలా భాగం మనకు చాలా దగ్గరగా, రోజూ చూసే వాతావరణంలాగే ఉంది. ముఖ్యంగా ఫస్టాఫ్ ను ఆరంభం నుండి ఇంటర్వెల్ వరకు సినిమాను నడిపిన తీరు, ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకున్నాయి. ఎక్కడా అనవసరమైన, బలవంతపు సన్నివేశాలు,అంశాల జోలికి పోకుండా నలుగురు కుర్రాళ్ళు, వాళ్ళ జీవన శైలిని వివరించడం నచ్చింది.
అలాగే హీరో టిప్పును వాళ్ళ నాన్న కించపరిచే సన్నివేశాలు, నలుగురు స్నేహితుల స్నేహా బంధాన్ని ఎలివేట్ చేసే సీన్లు ఎమోషనల్ గా కనెక్టయ్యాయి. ఇక సెకండాఫ్ కథనం కూడా క్లైమాక్స్ ముందు వరకు బోర్ కొట్టకుండా బాగానే నడిచింది. హీరో హీరోయిన్ల మధ్య నడిచే లవ్ ట్రాక్ కూడా కొత్తగా, ఫ్రెష్ ఫీల్ ఇచ్చింది. అవసరమైన చోట మాత్రమే వచ్చే పాటలు, వాటికి ప్రాణం కమలాకర్ అందించిన సంగీతం బాగున్నాయి. హీరో, హీరోయిన్ల పాత్రల్లో విశ్వదేవ్, పునర్నవిల సహజ నటన ఆకట్టుకుంది. హీరో స్నేహితులుగా ఉయ్యాలా జంపాలా రాజు, జబర్దస్త్ రాజు, శివ ఆర్.ఎస్, శ్రీకాంత్ ఆర్.ఎన్ లు బాగానే నటించారు.
మైనస్ పాయింట్స్ :
మైనస్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా ప్రస్తావించాల్సింది సెకండాఫ్ క్లైమాక్స్ గురించి. సినిమా ఫస్టాఫ్, సెకండాఫ్ కథా కథనాలను చాలా ఆసక్తికరంగా నడిపిన దర్శకుడు క్లైమాక్స్ ను మాత్రం చాలా సాదాసీదాగా ముగించేశాడు. క్లైమాక్స్ లో మొదటి నుంచి ఉన్నట్టే ఏదైనా పెద్ద ఎమోషనల్ డ్రామా ప్లే అవుతుంది, డైరెక్టర్ ఫ్రెండ్షిప్, లేదా లవ్ లలో ఏదో ఒకదాన్ని తారా స్థాయికి తీసుకెళ్లి ఎమోషనల్ గా సినిమాను ముగిస్తాడని అనుకుంటే నిరుత్సాహం ఎదురైంది.
హీరో, హీరోయిన్, అతని స్నేహితులు ఎలాంటి ఇబ్బందీ పడకుండా సింపుల్ గా కష్టాల్లోంచి బయటపడిపోవడం, ప్రయోజకులుగా మారిపోవడం వంటివి ముగింపును బలహీనం చేశాయి. అక్కడ కాస్త బలమైన డ్రామాను ప్లే చేసి ఉంటే సినిమా ఫలితం ఇంకా బెటర్ గా ఉండేది.
సాకంకేతిక విభాగం :
సాంకేతిక విభాగానికొస్తే సింపుల్ స్టోరీని, రియలిస్టిక్ గా రాసుకుని అలాగే తెరకెక్కించడంలో దర్శకుడు, రచయిత కెవి ఆనంద్ చాలా వరకూ సఫలమయ్యారు. అలాగే క్లైమాక్స్ ను మినహాయిస్తే రామ్మోహన్. పి రాసిన ఫస్టాఫ్, సెకండాఫ్ స్క్రీన్ ప్లే ఆకక్తికరంగా బాగుంది. సినిమాలో పాటలకు, ముఖ్యమైన సన్నివేశాలకు ప్రాణం కమలాకర్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. నగేష్ బానెల్ సినిమాటోగ్రఫీ చూడటానికి చాలా బాగుంది. ఎడిటింగ్ బాగుంది. దినేష్‌కుమార్, రామ్మోహన్. పి ల నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
స్నేహం, ప్రేమ అనే రెండు అంశాలే ప్రధానంగా రూపొందిన ఈ ‘పిట్టగోడ’ చిత్రం మనసుకు హత్తుకునేలా ఉంది. వాస్తవికతకు దగ్గరగా ఉండే కథ, చాలా సరదాగా, ఆసక్తికరంగా సాగిపోయే ఫస్టాఫ్, క్లైమాక్స్ తప్ప బాగుందనిపించే సెకండాఫ్, హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్, నలుగురు స్నేహితుల స్నేహ బంధం, మంచి మ్యూజిక్, నటీ నటుల నటన ఇందులో మెప్పించే అంశాలు కాగా నిరుత్సాహపరిచే క్లైమాక్స్ ఎపిసోడ్, ముగింపులో ప్రధానమైన ప్రేమ, స్నేహం అనే రెండు అంశాలను బలహీనంగా వదిలేయడం వంటివి మైనస్ పాయింట్స్ గా ఉన్నాయి. మొత్తం మీద వాస్తవికతకు దగ్గరగా ఉండే కథా కథనాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా తప్పక నచ్చుతుంది.
123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team