విడుదల తేదీ : 26 జూన్ 2015
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
దర్శకత్వం : తపస్ జెనా, ప్రదీప్ దాస్
నిర్మాత : ప్రదీప్ కుమార్ అర్రా
సంగీతం : శ్యామ్ ప్రసన్
నటీనటులు : సంబిత్, మౌసమి, స్నేహ, ఎల్లి..
సంబిత్, మౌసమి, స్నేహ, ఎల్లి ప్రధానపాత్రల్లో అర్రా మూవీస్ బ్యానర్ రూపొందించిన సినిమా ‘ప్రమాదం’. ప్రదీప్ దాస్, తపస్ జెనాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రదీప్ కుమార్ అర్రా నిర్మాత. హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా శ్రేయాస్ మీడియా ద్వారా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఎన్నో హర్రర్ సినిమాలు చూసి ఉన్న మనకు ప్రమాదం చూపించే కొత్తదనమేంటి? చూద్దాం..
కథ :
వీకెండ్ సెలవులను ఎంజాయ్ చేయడానికి ఆరుగురు మిత్రులు ఒడిశాలోని అటవీ ప్రాంతానికి బయలుదేరుతారు. వారు వెళ్ళే దారిలోనే తాము ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు ఓ చెట్టును ఢీకొని చెడిపోతుంది. ఆ రాత్రి ఎక్కడికీ వెళ్ళలేమన్న విషయాన్ని గుర్తించి కారు ప్రమాదానికి గురైన దగ్గరలో ఎవ్వరూలేని ఓ ఇంట్లోకి ఈ బృందమంతా వెళుతుంది.
ఎవ్వరూలేని ఆ ఇంట్లో అన్ని సదుపాయాలూ ఉండడంతో ఈ బృందమంతా సంతోషంగా ఆ రాత్రి అక్కడే ఉండాలని నిర్ణయించుకుంటుంది. ఎవరికి వారు అంతా అడ్జస్ట్ అయిపోయి ఉండగానే వింత అరుపులు, భయపెట్టే వాతావరణం అందరినీ కలవెరపెడుతుంది. ఆ తర్వాత ఆ బృందంలో ఒక్కొక్కరూ చనిపోతూ ఉంటారు. ఆ ఇంట్లో ఏదో దెయ్యం ఉందన్న విషయం తెలుసుకున్న ఆ బృందం తర్వాత ఏం చేసింది? ఆ బృందంలో చివరకు ఎంతమంది మిగిలారు అన్నదే మిగతా కథ!
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కథకు ఎంచుకున్న ఇంటి సెట్టింగ్, లైటింగ్ గురించి చెప్పుకోవాలి. సాధారణంగా ఇంట్లో దయ్యం ఉండడం నేపథ్యంలో తెరకెక్కే సినిమాల్లో ఆ ఇంటి వాతావరణమే సినిమాకు మూడ్‌ను తీసుకువస్తుంది. ఆ విషయంలో హర్రర్ మూడ్‌ను తీసుకురావడంలో ఈ సినిమా బాగా సక్సెస్ అయింది. అక్కడక్కడా భయపెట్టే ప్రయత్నం చేసిన కొన్ని సన్నివేశాలు ఫర్వాలేదనిపిస్తాయి.
నటీనటులు ఎవరికీ క్లోజ్ షాట్స్ పెద్దగా లేవు. ఉన్నంతలో భయపడుతూ బాగానే చేశారు. ఇక సినిమాటోగ్రఫీ, లైటింగ్ ఈ సినిమాకు మంచి ప్లస్‌పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ అంటే.. కథ, కథనం, దర్శకత్వం ఇలా అన్నీ మైనస్‌లే! ఒక బృందం ఎంజాయ్ చేయడానికి కొత్త ప్లేస్‌కి వెళ్ళడం, అక్కడ దయ్యం ఉండడం, దాన్నుంచి తప్పించుకునే క్రమంలో వారేం చేశారు.. ఇలాంటి నేపథ్యంలో, హర్రర్ పేరుతో ఒకే ఐడియా ఎన్నోసార్లు వచ్చింది. అదే కథను సినిమాగా తీసే క్రమంలో ఎక్కడా గ్రిప్పింగ్ పాయింట్లను పట్టుకోకుండా అర్థం పర్థం లేని సన్నివేశాలతో లాక్కొచ్చారు. హర్రర్ సినిమా అంటే ఏవైనా థ్రిల్లింగ్ సన్నివేశాలను కానీ, భయపెట్టే సన్నివేశాలను కానీ కోరుకుంటే నిరుత్సాహం తప్పదు.
నటీనటులంతా కొత్తవారు, తెలుగు వారు కాకపోవడం, సౌతిండియాది కాని భాష నుండి సినిమా అనువాదం కావడంతో ఎక్కడా కనెక్ట్ అయ్యే అవకాశం కూడా లేదు. తెలుగు డబ్బింగ్ దారుణంగా ఉంది. ముఖ్యంగా నటీనటులు భయపడుతున్నపుడు వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ వినలేం.! ఇక కథంటూ ఒకటి లేని, ఎందుకు ఏ సన్నివేశం వస్తుందో తెలియని సందిగ్ధంలో నడిచే ఈ సినిమాలో ఫస్టాఫ్, సెకండాఫ్‌లలో ఏది హైలైట్ అన్న ప్రశ్నే అనర్థం. ఉన్నంతలో సెకండాఫ్‌లో హాలీవుడ్ సినిమాల నుంచి ప్రేరణ పొంది తీసిన ఓవర్ వయొలెన్స్ సన్నివేశాలు అలాంటి సన్నివేశాలతో వచ్చే సినిమాలు ఇష్టపడేవారికి హైలైట్‌గా కనిపించొచ్చు!
సాంకేతిక విభాగం :
సాంకేతికంగా ఈ సినిమాలో ఒకే ఒక్క విషయం గురించి పాజిటివ్‌గా చెప్పుకోవచ్చు. అదే సినిమాటోగ్రఫీ. వెరీ లో బడ్జెట్ సినిమా అయినా కూడా సినిమాటోగ్రఫీ ఫర్వాలేదనిపిస్తుంది. లైటింగ్ కూడా సినిమాకు హర్రర్ మూడ్‌ను తెచ్చిపెట్టింది. ఇక కథ, కథనాల విషయంలో దర్శకులు ఇద్దరూ చేసిందేమీ లేదు. దర్శకత్వం పరంగా కూడా పెద్దగా మెరుపులేమీ లేవు . అక్కడక్కడా కాస్త భయపెట్టే ప్రయత్నం చేశారు.
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరీ లౌడ్‌గా ఉంది. రీ రికార్డింగ్ గురించి చెప్పుకోవడనికి పెద్దగా ఏమీ లేదు. అక్కడక్కడా హర్రర్ యాంబియన్స్‌ను తీసుకురావడంలో ఫర్వాలేదనిపించారు. ఎడిటింగ్ ఫర్వాలేదనేలా ఉంది. సినిమా మొత్తం ఒకే మూడ్ ఉండడంతో ఎడిటింగ్ పరంగా చేయడానికి పెద్దగా ఏమీ లేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఓ చిన్న సినిమాగా చూసినపుడు బాగానే ఉన్నాయని చెప్పొచ్చు.
తీర్పు :
హర్రర్ సినిమా అనగానే ప్రేక్షకుడు కథంటూ పెద్దగా లేకపోయినా హర్రర్ ఎలిమెంట్స్‌తో సినిమాను ఎంజాయ్ చేయగలడు అనే అభిప్రాయం చాలా సార్లు వినిపిస్తూ ఉంటుంది. ఆ కోవలో వచ్చిన సినిమాల్లో కొత్తదే.. ఈ ‘ప్రమాదం’. కథంటూ ఒకటి లేకపోవడం, పెద్దగా ఆకట్టుకునే కథనం కూడా కాకపోవడం, హర్రర్ సినిమా పేరు చెప్పుకొని భయపెట్టే అంశాలకు అవకాశమివ్వకపోవడం వంటి మైనస్‌లతో వచ్చిన ఈ సినిమాలో అక్కడక్కడా భయపెట్టే ప్రయత్నం చేసిన కొన్ని సన్నివేశాలు, సినిమాటోగ్రఫీ లాంటివి తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. పైన చెప్పిన రెండు ప్లస్‌ల కోసమే వెళితే తప్ప ఈ సినిమా ఏ కోశానా ఆకట్టుకునే అవకాశం లేదు.
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
123తెలుగు టీం