విడుదల తేదీ : నవంబర్ 3, 2017
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు
నిర్మాత : ఎమ్. కోటేశ్వర రాజు
సంగీతం : శ్రీచరణ్ పాకల
నటీనటులు : రాజశేఖర్, పూజ కుమార్, కిశోర్, శ్రద్దా దాస్, ఆదిత్ అరుణ్
రూ. 30 కోట్ల భారీ బడ్జెట్ తో సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పిఎస్వి గరుడ వేగ’. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందించారు. మరి ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం రాజశేఖర్ కు విజయాన్ని అందింస్తుందా లేదా అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం..
కథ :
ఎన్ఐఏలో శేఖర్(రాజశేఖర్) ఆఫీసర్ గా పనిచేస్తుంటాడు. అతడి భార్య(పూజ కుమార్) తో అతనికి నిత్యం గొడవలు జరుగుతుంటాయి. అదే సమయంలో ఓ సంక్లిష్టమైన కేసుని అతడు టేకప్ చేస్తాడు. పోలీస్ లకు సవాల్ గా మారిన ఓ హ్యాకర్(ఆదిత్) అనేక మంది ప్రాణాలు పోవడానికి కారణం అవుతాడు. ఇంతకీ ఆ హ్యాకర్ ఎవరు ? అతనికి ప్రజల ప్రాణాలు తీయవలసిన అవసరం ఏమొచ్చింది ? దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏంటి ? ఈ విషయాల్ని తెలుసుకోవాలనుంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
మొట్టమొదటగా ఈ చిత్రం గురించి చెప్పుకోవాలంటే భారీతనం గురించి మాట్లాడుకోవాలి. ఈ చిత్రంలో ప్రతి అంశం రిచ్ లుక్ లో కనిపిస్తుంది. ఎన్ఐఏ సెటప్, నటీనటుల పెర్ఫామెన్స్, విజువల్స్ అన్నీ గ్రాండ్ గా ఉంటూనే రియలిస్టిక్ గా అనిపిస్తాయి. ఈ చిత్రం కోసం ఖర్చు చేసిన డబ్బుకు దర్శకుడు ప్రవీణ్ సత్తారు న్యాయం చేశారు. ఆయన విజన్, పెట్టిన శ్రమ మొత్తం స్క్రీన్ పై కనిపిస్తుంది.
ఈ చిత్రంతో రాజశేఖర్ పునరాగమనం చేశారనే చెప్పాలి. ఆయన పెర్ఫామెన్స్ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఎన్ఐఏ అధికారి పాత్రలో ఒదిగిపోయి కనిపించారు. యాక్షన్ సన్నివేశాల్లో కూడా ఆయన పెర్ఫామెన్స్ బావుంది. ఇంతకు ముందు రాజశేఖర్ కు ఈ సినిమాలో రాజశేఖర్ కు స్పష్టమైన తేడా కనిపిస్తుంది. హ్యాకర్ పాత్రలో నటించి అదిత్ నటన కూడా మెప్పించింది.
హీరోయిన్ పూజ కుమార్ కూడా చికాకు పుట్టించే భార్య పాత్రలో బాగానే నటించింది. శ్రద్ధాదాస్ పాత్ర పరవాలేదనిపించే విధంగా ఉంటుంది. ఆదర్శ్ బాలకృష్ణ పాత్ర చిన్నదైనప్పటికీ ప్రేక్షకులని థ్రిల్ కు గురిచేస్తుంది. సెకండ్ హాఫ్ లో బాంబ్ ట్రాకింగ్ సన్నివేశం అత్యంత ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఈ క్రెడిట్ మొత్తం దర్శకుడు ప్రవీణ్ సత్తారుకే దక్కుతుంది.
మొదటి అర్థ భాగం మొత్తం ఆసక్తికరంగా సాగుతుంది. ఛేజింగ్ సన్నివేశాలు, పోరాట సన్నివేశాలు ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా ఉంటాయి. సన్నీలియోన్ స్పెషల్ సాంగ్ లో మాస్ జనాల్ని మెప్పిస్తుంది.
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్ ని అత్యంత ఆసక్తికరంగా తెరెకెక్కించిన దర్శకుడు సెకండ్ హాఫ్ పై ఇంకాస్త శ్రద్ద పెట్టాల్సింది. సినిమా ద్వితీయార్థం కాస్త స్లో అయిన ఫీలింగ్ కలుగుతుంది. రాజశేఖర్, పూజా కుమార్ నేపథ్యంలో సాగే కొన్ని సన్నివేశాలని ఇంకాస్త ఎడిటింగ్ చేసి ఉంటే బావుండేది.
కీలకమైన స్కామ్ మొత్తాన్ని రివీల్ చేసే విధానంలో కావాల్సినంత క్లారిటీ మైంటైన్ చేయలేదు. దీని వలన ప్రేక్షకులకు అసలు పాయింట్ ఏంటనే విషయం అర్థం కావడం కష్టంగా అనిపిస్తుంది. ఇక ప్రధాన విలన్ కిషోర్ నటన బాగున్నా ఆయన కనిపించే సన్నివేశాలు ఆశించిన స్థాయిలో లేవనే చెప్పాలి.
సాంకేతిక విభాగం :
టెక్నికల్ పరంగా చూస్తే ఇటీవలకాలంలో వచ్చిన ఉత్తమ చిత్రం గరుడ వేగ అని చెప్పాలి. కెమెరామన్ అంజి పనితనం అద్భుతంగా ఉంది. చిత్రీకరణ స్టైలిష్ గా కనిపిస్తూ హాలీవుడ్ స్థాయిని తలపిస్తుంది. యాక్షన్ సన్నివేశాల్ని షూట్ చేసిన విధానం అయితే ప్రేక్షకులని థ్రిల్ కు గురిచేస్తుంది. ఈ చిత్రానికి బ్యాగ్రౌండ్ స్కోర్ మరో బలం. బ్యాగ్రౌండ్ సంగీతం వలన సినిమా మరో స్థాయికి చేరింది.
ఇక దర్శకుడు ప్రవీణ్ సత్తారు విషయానికి వస్తే గరుడ వేగ చిత్రం ద్వారా అతడు మరో స్థాయిని చేరుకుంటాడు. రాజశేఖర్ పాత్రని అతడు మలచిన విధానం నిజంగా ప్రశంసనీయం. తనకు సరైన బడ్జెట్ అందితే హాలీవుడ్ స్థాయి చిత్రాన్ని టేకప్ చేయగలనని అతడు నిరూపించుకున్నాడు.
తీర్పు :
చివరగా చెప్పాలంటే యాక్షన్ చిత్రానికి కావలసిన అన్ని లక్షణాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ఇలాంటి చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇందులోని స్టైలిష్ మేకింగ్, రియాలిటీకి దగ్గరగా ఉండడం వంటి అంశాలన్నీ ఆకట్టుకుంటాయి. ఎన్ఐఏ సెటప్, ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులని థ్రిల్ చేస్తుంది. సెకండ్ హాఫ్ లో కాస్త మందగించిన కథనాన్ని, కొంత ఓవర్ గా అనిపించే సన్నివేశాలను పక్కన పెడితే.. ఈ చిత్రం ఆకట్టుకునే యాక్షన్ ఎంటర్ టైనర్ అవడమేగాక రాజశేఖర్ కు కావాల్సిన అత్యవసర హిట్ ను కూడా అందిస్తుందనడంలో సందేహం లేదు.
123telugu.com Rating : 3.25/5
Reviewed by 123telugu Team