సమీక్ష : పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్ – అంతగా మెప్పించని ప్రయత్నం..

సమీక్ష : పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్ – అంతగా మెప్పించని ప్రయత్నం..

Published on Aug 10, 2013 2:00 AM IST
pkpm_review విడుదల తేదీ : 09 ఆగష్టు 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకుడు : సాజిద్ ఖురేషి
నిర్మాత : సోహైల్ అన్సారి
సంగీతం : గున్వంత్
నటీనటులు : శ్రీ, సుప్రజ..

‘పిజ్జా’ ఫేం విజయ్ సేతుపతి తమిళంలో చేసిన ‘నడువుల కొంజెం పక్కత కానం’ అనే హిట్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన సినిమా ‘పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్’. ‘ఈ రోజుల్లో’ ఫేం శ్రీ హీరోగా సుప్రజని హీరోయిన్ గా పరిచయం అవుతోంది. అలాగే సాజిద్ ఖురేషి డైరెక్టర్ గా పరిచయం అవుతున్న ఈ సినిమాకి సోహైల్ అన్సారి నిర్మాత. తమిళం నుండి తెలుగు నేటివిటీకి చాలా మార్చి తీసిన ఈ సినిమాతో హీరో శ్రీ, డైరెక్టర్ సాజిద్ ఖురేషిలు తమిళ్ కంటే పెద్ద హిట్ అందుకున్నారా లేక కేవలం పరవాలేదనిపించుకున్నారా అనేది ఇప్పుడు చూద్దాం…

కథ :

విజయ్ కుమార్(శ్రీ), శివ, సలీం, బాలాజీ అనే నలుగురు మంచి స్నేహితులు. విజయ్ సంధ్య(సుప్రజ)ని చూసి ప్రేమిస్తాడు. విజయ్ – సంధ్య మొదట ఇరు కుటుంబ సభ్యులు వీరి ప్రేమని అంగీకరించకపోయినా ఆ తర్వాత వీరి ప్రేమని అంగీకరించి పెళ్ళికి ఒప్పుకుంటారు. రేపు పెళ్లి అనగా ఈ రోజు నలుగురు ఫ్రెండ్స్ సరదాగా క్రికెట్ ఆడటానికి వెళతారు. అలా ఆడుతున్నప్పుడు విజయ్ కి చిన్న మెదడు దగ్గర చిన్న దెబ్బ తగలడంతో అతనికి టెంపరరీ మెమొరీ లాస్ వస్తుంది. దీని వల్ల విజయ్ గత సంవత్సరం రోజులుగా ఏం జరిగింది అనేది మర్చిపోతాడు. విజయ్ గతాన్ని గుర్తు చేయడం కోసం, అలాగే అనుకున్న టైంకి విజయ్ పెళ్లి జరిపించడానికి మిగిలిన ఫ్రెండ్స్ ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసారు? చివరికి విజయ్ పెళ్లి సంధ్యతో జరిగిందా? లేదా? అలాగే చివరికన్నా విజయ్ కి గతం గుర్తొచ్చిందా? లేదా? అనేదే ఆసక్తి కరమైన అంశాల్ని మీరు తెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ ఈ సినిమా స్టొరీ లైన్ మరియు టేకింగ్. టెంపరరీ మెమొరీ లాస్ పేషంట్ పాత్రలో శ్రీ సరిపోయాడు. కొన్ని కామెడీ సీన్స్ లో ఇంకాస్త కేర్ తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది. సుప్రజ సినిమాలో ఉన్నది చాలా తక్కువ సేపైనా తన పాత్రకి తగ్గట్టు నటించింది. హైదరాబాద్ హిందీ సినిమాల్లో బాగా ఫేమస్ అయిన మస్త్ అలీ సలీం పాత్రలో కాస్త తెలుగువచ్చి రాని విధంగా మాట్లాడుతూ చాలా బాగా నవ్వించాడు. అతని ప్పాత్ర ఆద్యంతం ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. బాలాజీ పాత్ర చేసినతను కూడా కాస్త అయోమయ పాత్రలో బాగా నవ్వించాడు. శివ పాత్ర పోషించినతను పాత్ర పరిధిమేర నటించాడు. సీనియర్ కమెడియన్ రఘుబాబు డాక్టర్ పాత్రలో కాసేపు నవ్వులు పూయించాడు.

సినిమా మొదట్లో వచ్చే క్రికెట్ మ్యాచ్ ఎపిసోడ్, ‘సరదాగా’, ‘అయ్యోరామారే’ పాటల్లో హీరో వల్ల తన ఫ్రెండ్స్ పడే ఇబ్బందులు ఆడియన్స్ కి బాగా నవ్వు తెప్పిస్తుంది. సెకండాఫ్ లో వచ్చే రిసెప్చన్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ అవుతుంది.

మైనస్ పాయింట్స్ :

కథా పరంగా కొన్ని సీన్స్ అవసరమైనప్పటికీ అవి ఆసక్తికరంగా లేనందు వల్ల అవి ప్రేక్షకులకి బోర్ కొడతాయి. అలాగే సినిమాలో కామెడీ ఉన్నా మాస్ కి నచ్చే యాక్షన్ అంశాలు, లవ్ ట్రాక్, డ్యూయెట్ సాంగ్స్ లాంటివి ఏమీ లేకపోవడం వల్ల బి, సి సెంటర్ ప్రేక్షకులకి అంతగా కనెక్ట్ అవ్వదు. సినిమాలో హీరో ‘ఏమైంది.. క్రికెట్ ఆడాము.. నువ్వే కదా కొట్టింది.. బాల్ పైపైకి వెళ్ళింది.. ఓ వదిలేసానా…’ అన్న ఒకే డైలాగ్ చాలా సార్లు సినిమాలో రిపీట్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ తమిళ్ ఆడియన్స్ కి కనెక్ట్ అయినా ఎక్కువ సార్లు వాడడం వల్ల తెలుగు ప్రేక్షకులకి మాత్రం చిరాకు తెప్పించే అవకాశం ఉంది. సినిమాలో హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ ఇంకాస్త బెటర్ గా చూపించి ఉంటే బాగుండేది.

సాంకేతిక విభాగం :

‘నడువుల కొంజెం పక్కత కానం’ అనే సినిమాకి రీమేక్ అయినప్పటికీ కథలో డైరెక్టర్ సాజిద్ ఖురేషి చిన్న చిన్న మార్పులు చేసాడు. ఆ విషయంలో అతన్ని మెచ్చుకోవాలి ఎందుకంటే అవి సినిమాకి చాలా హెల్ప్ చేసాయి. స్క్రీన్ ప్లే కూడా బాగుంది. రీమేక్ సినిమా అని మక్కికి మక్కి దించకుండా, అలాగే ఆ ఫ్లేవర్ ని చెడగొట్టకుండా తీసినందుకు తొలి సినిమాతో డైరెక్టర్ గా సాజిద్ ఖురేషి మంచి మార్కులే కొట్టేసారు. ఈ సినిమాకి మెయిన్ హైలైట్స్ లో మార్టినో జో సినిమాటోగ్రఫీ, గున్వంత్ మ్యూజిక్ గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి సీన్ ని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే రీతిలో గున్వంత్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు, అలాగే సందర్భానుసారంగా వచ్చే పాటలు కూడా బాగున్నాయి. గిరీష్ కిరణ్ డైలాగ్స్ బాగున్నాయి. కొన్ని చోట్ల ఎడిటర్స్ మోహన్ – రామారావులు కాస్త శ్రద్ధ తీసుకొని ఉంటే సినిమా ఇంకా వేగంగా ఉండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

‘పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్’ సినిమా రొటీన్ సినిమాలకు భిన్నంగా కొత్తదనాన్ని కోరుకునే వారికి నచ్చే సినిమా. ‘ఈ రోజుల్లో’ సినిమా తర్వాత వరుసగా బాక్స్ ఆఫీసు వద్ద ఫెయిల్ అవుతున్న శ్రీ ఈ సినిమాతో కాస్త పరవాలేదనిపించే సినిమా చేసాడు. డైరెక్టర్ టేకింగ్, స్టొరీ లైన్, కొన్ని కామెడీ ఎపిసోడ్స్ ప్లస్ పాయింట్స్ అయితే రీపీటెడ్ గా అనిపించే కొన్ని సీన్స్, మాస్ కి కావాల్సిన అంశాలు పెద్దగా ఏమీ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్స్. మొత్తంగా ఎ సెంటర్ ప్రేక్షకులని కొంతవరకూ ఆకట్టుకునే ఈ సినిమా బి,సి సెంటర్ ప్రేక్షకులను ఎంత వరకూ ఆకట్టుకుంటుందో చూడాలి.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు