విడుదల తేదీ : ఫిబ్రవరి 23, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : శ్రీకాంత్, నజియా, సీత నారాయణ
నిర్మాత : ఎం. విజయ్
సంగీతం : రాప్ రాక్ షకీల్
సినిమాటోగ్రఫర్ : పూర్ణ
ఎడిటర్ : శంకర్
కథ:
సినిమా దర్శకుడైన రాజ్ కిరణ్ (శ్రీకాంత్) ఎప్పుడూ ఫ్లాప్ సినిమాలే తీస్తూ ఉంటాడు. అలా కెరీర్లో విఫలమవుతున్న అతను తల్లి అనారోగ్యం పాలవడంతో ఎలాగైనా హిట్ కొట్టాలని హర్రర్ సినిమా తీసేందుకు సిద్దమవుతాడు.
అలా ఒక నిర్మాతను ఒప్పించి సినిమాను తీసేందుకు పాడుబడిన బంగ్లాకు వెళతారు. కానీ అక్కడ ఉన్న దెయ్యాలు వాళ్ళను నా ఇబ్బందులకు గురిచేస్తూ బంగ్లా నుండి బయటకు వెళ్లకుండా చేస్తాయి. అలా దెయ్యాల చేతిలో చిక్కుకు పోయిన రాజ్ కిరణ్ బృందం బయటకు రావడాన్ని ఎలాంటి ప్లాన్ వేశారు, అసలు బయటకు వచ్చారా లేదా అనేదే కథ.
ప్లస్ పాయింట్స్ :
హీరో శ్రీకాంత్ కెరీర్లో తొలిసారి చేసిన హర్రర్ సినిమా ఇదే. వయసు మీద పడినా కూడ అయన చాలా హుషారుగా, ఫిట్ గా కనిపిస్తూ తన పెర్ఫార్మెన్స్ తో సినిమాను భుజాల మీదే మోశాడు. కామెడీ సన్నివేశాల్లో ఆయన హావా భావాలు ప్రేక్షకుల్ని తప్పకుండా నవ్విస్తాయి. హీరో పాత్రలో షకలక శంకర్ కొంత నవ్వించాడు.
అలీ అక్కడక్కడా నవ్వులు పూయిస్తే ఇతర హాస్య నటులు వేణు, గెటప్ శ్రీను, శ్రీకాంత్ కు సహాయ నటులుగా తమ నటనతో మెప్పించారు. ద్వితీయార్థం ముగింపులో ఎంజాయ్ చేయడానికి కొన్ని మంచి మూమెంట్స్ దొరుకుతాయి. సినిమా ముగిసిన విధానం కూడ బాగుంది.
మైనస్ పాయింట్స్ :
సినిమాలో విసిగించే అంశం అవసరమైన దానికన్నా, ప్రేక్షకులు తట్టుకునే స్థాయికన్నా ఎక్కువ మోతాదులో ఉండే కామెడీ. మొదటి అర్ధభాగం మొత్తం ఈ తరహా కామెడీతోనే నిండి ప్రేక్షకుల్ని కొంత ఇబ్బందిపెడుతుంది. రగుబాబు, హేమ, ఇతర నటులతో కూడిన ఆత్మల కుటుంబం, వాటి కథ సిల్లీగా ఉండటమేగాక వారి నటన కొన్ని చోట్ల తలనొప్పి పుట్టిస్తుంది కూడ.
కథను, కామెడీని కలిపిన విధానం కూడ సమపాళ్లలో లేకపోవడంతో సినిమాను ఎంజాయ్ చేసే అవకాశాలు పెద్దగా దొరకలేదు. కేవలం సెకండాఫ్లో మినహా మిగతా ఎక్కడా చిత్రం ఊపందుకోదు. హీరో శ్రీకాంత్ సినిమా తీయాలనుకోవడం, ఆ ప్రయత్నంలో దెయ్యంతో ప్రేమలో పడటం వంటి అంశాలను మరీ సాగదీశారు.
సన్నివేశాల్లో, కథనంలో ఎక్కడా రాజీపడగలిగిన సందర్భాలు దొరక్కపోవడంతో చిత్రం మరీ ఓవర్ గా వెళుతున్నట్టు ప్రేక్షకులకు కొద్దిగా మొహమాటం కలుగుతుంది.
సాంకేతిక విభాగం :
సినిమా నిర్మాణ విలువలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. బంగ్లాలో తీసిన విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకె అనేలా ఉన్నాయి. కొన్ని గొడవల మూలాన దర్శకుడు సినిమా మధ్యలో తప్పుకోవడంతో ఇతర టీమ్ కలిసి ఎలాగోలా సినిమాను పూర్తిచేయాలని చేసిన ప్రయత్నం అభినయందించదగినదే అయినా ఔట్ ఫుట్ మాత్రం సరిగా రాలేదు.
తీర్పు :
తెలుగు పరిశ్రమలో హర్రర్ కామెడీ చిత్రాలు షరా మామూలే. దాదాపు సగం సినిమాల్లో ఓకే తరహా స్టోరీ ఉంటుంది. కానీ కొన్ని చిత్రాలు మంచి కామెడీని అందివ్వడంతో సక్సెస్ అవుతుంటాయి. కానీ ‘రా… రా…’ విషయంలో అలా జరగలేదు. సరైన స్టోరీ, నరేషన్, థ్రిల్ చేసే సన్నివేశాలు పూర్తిగా లోపించాయి. హీరో శ్రీకాంత్, షకలక శంకర్ ల నటన మినహా ఈ చిత్రంలో ఇంప్రెస్ చేసే అంశాలు దొరకవు. కాబట్టి ఈ వారాంతంలో ఈ సినిమా దూరం పెట్టడం మంచిది.
123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team