సమీక్ష : రెమో – నేటివిటీ మిస్సయింది కానీ ఫీల్ ఉంది

సమీక్ష : రెమో – నేటివిటీ మిస్సయింది కానీ ఫీల్ ఉంది

Published on Nov 26, 2016 3:20 PM IST
Remo review

విడుదల తేదీ : నవంబర్ 25, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : బక్కియరాజ్ కన్నన్

నిర్మాత : ఆర్.డి. రాజా

సంగీతం : అనిరుద్ రవిచందర్

నటీనటులు : శివ కార్తికేయన్, కీర్తి సురేష్

తమిళంలో శివ కార్తికేయన్, కీర్తి సురేష్ లు జంటగా నటించిన ‘రెమో’ చిత్రం ఈ మధ్యే విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో ఆ హిట్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో డిస్ట్రిబ్యూటర్, నిర్మాత దిల్ రాజు ఆ సినిమాని తెలుగులో కూడా ‘రెమో’ పేరుతో విడుదల చేశారు. మరి తమిళంలో అంత పెద్ద హిట్టైన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఎలా అలరించిందో ఇప్పుడు చూద్దాం…

కథ :

ఎస్కె (శివకార్తికేయన్) అనే కుర్రాడు సినిమాలో హీరో కావాలనే లక్ష్యంతో సినిమా ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే సమయంలో కావ్య (కీర్తి సురేష్) ను చూసి ప్రేమిస్తాడు. కానీ ఆమెకు అప్పటికే నిశ్చితార్థం అయిపోయి ఉంటుంది. కానీ ఎస్కె మాత్రం ఎలాగైనా ఆమెలో ప్రేమ పుట్టించి తనను ప్రేమించేలా చేయాలని నిశ్చయించుకుని లేడీ నర్స్ గెటప్ లో కావ్య డాక్టర్ గా పని చేసే హాస్పిటల్లో చేరతాడు. ఆ గెటప్ లో ఎస్కె కావ్యకు ఎలా దగ్గరయ్యాడు ? ఆమెలో తన పట్ల ఎలా ప్రేమ పుట్టించాడు ? చివరికి ఆమెకు దగ్గరయ్యాడా ? లేదా ? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా చెప్పుకోవలసింది హీరో శివకార్తికేయన్ నటన గురించి. సాధారణంగా ఎవరైనా హీరో లేడీ గెటప్ వేస్తే ఏదో కొద్దిసేపే చూడగలం లేకపోతే అస్సలు చూడలేం కానీ శివకార్తికేయన్ లేడీ నర్స్ గెటప్ ధరిస్తే చాలా చూడముచ్చటగా ఉంది. ఇంకా కాసేపు చూడాలనిపించింది. ఎక్కడా ఏవగింపు కలగలేదు. అందుకు కారణం అతని నటన, దర్శకుడు బక్కియరాజ్ కన్నన్ లేడీ గెటప్ లో హీరోపై నడిచే సన్నివేశాలని కావలసినంత మేరకు మాత్రమే వాడుకోవడం అని చెప్పొచ్చు. అలాగే ఫస్టాఫ్ లో హీరో, అతని ఫ్రెండ్, రౌడీల పై నడిచే కామెడీ సన్నివేశాలు అక్కడక్కడా పేలాయి.

ఈ సినిమాకి ఇక మరో ముఖ్యమైన ప్లస్ పాయింట్ హీరోయిన్ కీర్తి సురేష్. ఒక సినిమాతోనే తెలుగువారికి బాగా దగ్గరైన ఆమె మరోసారి అద్భుతమైన నటనతో మెప్పించింది. ముఖ్యంగా శివకార్తికేయన్ తో ఆమె కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అయింది. హీరో హీరోయిన్ కు తన లవ్ ప్రపోజ్ చేసే సన్నివేశం సినిమా మొత్తానికి హైలెట్ గా నిలిచింది. క్లైమాక్స్ లో హీరో – హీరోయిన్, హీరో – చిన్నపాప మధ్య నడిచే భావోద్వేగ పూరిత సన్నివేశాలు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

మైనస్ పాయింట్స్ విషయానికొస్తే సినిమా ఫస్టాఫ్ మొదలుపెట్టడం బాగానే ఉన్నా పోను పోను అది నెమ్మదించి బోర్ కొట్టించింది. సెకండాఫ్ లో కూడా కాస్త నెమ్మదించింది. పైగా ఒక పాట మినహా మధ్యలో వచ్చే మిగతా పాటలు ఏమాత్రం ఆకట్టుకునేలా లేకుండా మరింత బోరింగ్ గా అనిపించాయి. అలాగే హీరోలో నటనతో పాటు మాస్ యాంగిల్ ని కూడా ఇంకాస్త ఎక్కువగా ఎలివేట్ చేసుంటే సంతృప్తికరంగా ఉండేది.

ఇక సినిమాలో మరో పెద్ద మైనస్ పాయింట్ తెలుగు నేటివిటీ పూర్తిగా మిస్సవడం. కథనం, సన్నివేశాల చిత్రీకరణ, పాత్రల సంభాషణ, ప్రవర్తన ఏవీ కూడా తెలుగుదనానికి దగ్గరగా కనబడలేదు. దాంతో రొమాంటిక్ ఫీల్ ఉన్నపటికీ సినిమా చూస్తన్నంత సేపు ఎక్కడో కాస్త అసంతృప్తి కలుగుతూనే ఉంది. సెకండాఫ్ క్లైమాక్స్ అన్ని సినిమాల్లాగే ఊహించదగ్గ ముగింపే పైగా ఎక్కువ సేపు సాగదీశారు కూడా.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో ముందుగా చెప్పుకోవాల్సింది పిసి శ్రీ రామ్ సినిమాటోగ్రఫీ గురించి. ఆయన ప్రతి సన్నివేశాన్ని కలర్ ఫుల్ గా అందంగా తీర్చిదిద్దారు. అలాగే హీరో శివకార్తికేయన్ కు లేడీ గెటప్ వేసిన మేకప్ ఆర్టిస్టుల ప్రతిభను మెచ్చుకోవాల్సిందే. లేడీ గెటప్ లో శివకార్తికేయన్ ను పర్ఫెక్ట్ గా అమర్చేశారు.

ఇక దర్శకుడు బక్కియరాజ్ కన్నన్ కథ పాతదే అయినా కథనాన్ని పెద్దగా కొత్తగా ఏమీ రాసుకోలేదుగాని సన్నివేశాల చిత్రీకరణ, నటీనటుల నుండి నటనను రాబట్టుకోవడంలో, వారి మధ్య రొమాన్స్ ను పండించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ఇక కీలక సన్నివేశాల్లో అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఆకట్టుకుంది. ఎడిటింగ్ బాగుంది. ఆర్. డి. రాజా నిర్మాణ విలువలు చాలా గొప్పగా ఉన్నాయి.

తీర్పు :

తమిళంలో సూపర్ హిట్టైన ఈ ‘రెమో’ చిత్రం పక్కా తెలుగు ప్రేక్షకులను మాత్రం అన్ని విధాలా పూర్తిగా మెప్పించలేదు. ముఖ్యంగా తెలుగు నేటివిటీకి దగ్గరగా లేకపోవడం, ఫస్టాఫ్, సెకండాఫ్ లలో కథనం నెమ్మదించడం, రొటీన్ కథ కథనాలు కావడం ఇందులో మైన్స్ పాయింట్స్ కాగా లేడీ గెటప్ లో శివ కార్తికేయన్ అద్భుత నటన, కీర్తి సురేష్ స్క్రీన్ ప్రెజెన్స్, వారి మధ్య సాగే లవ్ రొమాన్స్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు, పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, సినిమాకు ప్రేమ కథ నైపథ్యంగా ఉండటం వంటివి ప్లస్ పాయింట్స్. మొత్తం మీద చెప్పాలంటే నేటివిటీ మిస్సవడం అనే ఇబ్బందిని పట్టించుకోకుండా, స్లో స్క్రీన్ ప్లేని, రొమాంటిక్ ప్రేమ కథలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ తమిళ డబ్బింగ్ సినిమా తప్పక నచ్చుతుంది.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు