విడుదల తేదీ : 26 జూలై 2013 | ||
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5 |
||
దర్శకుడు : దయా.కే |
||
నిర్మాత : నీలిమ తిరుములశెట్టి |
||
సంగీతం : శ్రవణ్ |
||
నటీనటులు : వెంకట్ రాహుల్, అనిశ అంబ్రోస్, నాగేంద్ర బాబు |
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘పంజా’ సినిమా తీసిన నీలిమ తిరుమలశెట్టి నూతన నటీనటులను తెలుగు వారికి పరిచయం చేస్తున్న సినిమా ‘అలియాస్ జానకి’. ఈ సినిమా ద్వారా మెగా ఫ్యామిలీకి బంధువైన వెంకట్ రాహుల్ హీరోగా పరిచయమవుతుండగా, అనిష అంబ్రోసే హీరోయిన్ గా పరిచయం కానుంది. దయా డైరెక్టర్ గా పరిచయమవుతున్న ఈ సినిమాకి శ్రవణ్ సంగీతం అందించాడు. సామాజిక దృక్పథంతో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైరెక్టర్ సామాజిక భాద్యతతో తీసిన ఈ సినిమా ప్రేక్షకులని ఎంతవరకూ ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం..
కథ :
టీచర్ అయిన నాగబాబు తన కొడుకు జానకి రామ్ (వెంకట్ రాహుల్) కి చిన్ననాటి నుంచి బతికినంత కాలం సమాజం పట్ల నీతిగా, న్యాయంగా ఉండాలని చెప్తుంటాడు. అదే భావాలతో పెరిగిన జానకి రామ్ కి హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ లో ఓ ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. దాంతో జానకి రామ్ తండ్రిని విడిచి హైదరాబాద్ కి వస్తాడు. ఉద్యోగంలో జాయిన్ అయిన జానకి రామ్ ఒకరోజు చైత్ర (అనీషా అంబ్రోసే) ని చూసి ప్రేమలో పడతాడు. కొద్ది రోజులకి చైత్ర కూడా జానకి రామ్ ని ప్రేమిస్తుంది. ఇదిలా ఉండగా సిటీలో పెద్ద రౌడీ అయిన వాసుదేవ్ మైసా (శత్రు) లాల్ నగర్ అనే ఏరియాలో ఉంటున్న కొంతమంది పేదవాళ్ళ గుడిసెలను ఖాళీ చేయించి ఆ స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తుంటాడు. ఆ విషయం తెలుసుకున్న జానకి రామ్ ఆ స్థలం లీగల్ గా అయితే పేదలకే చెందుతుందని మైసాపై తిరగబడతాడు.
దానివల్ల మైసా నుంచి జానకి రామ్ ఎదుర్కొన్న సమస్యలేమిటి? సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఉన్న జానకి రామ్ లైఫ్ లోకి ప్రియదర్శిని(శ్రీ రమ్య) ఎలా వచ్చింది? అసలు ప్రియదర్శిని కథేమిటి? చివరికి జానకి రామ్ తన సమస్యని, ప్రియదర్శిని సమస్యని ఎలా పరిష్కరించాడు? అనే అంశాన్ని మీరు తెరపైనే చూడాలి.
ప్లస్ పాయింట్స్ :
హీరోయిన్ అనీషా అంబ్రోసే చూడటానికి అందంగా ఉంది, ముఖ్యంగా పాటల్లో చూడటానికి బాగుంది. ఆమె నటన కూడా పాత్రకి తగ్గట్టుగా ఉంది. సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన శ్రీ రమ్య పాత్రకి పర్ఫెక్ట్ గా సరిపోయింది, ఇచ్చిన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. తనికెళ్ళ భరణి పరవాలేదనిపించాడు. విలన్ పాత్రలో కనిపించిన శత్రు నటన జస్ట్ ఓకే.
ఈ సినిమా కోసం ఎంచున్న మూలకథ(స్టొరీ లైన్) బాగుంది. అక్కడక్కడా వచ్చే కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. పాటలని చాలా బాగా షూట్ చేసారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు సినిమాటోగ్రఫీ బాగుంది.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన వెంకట్ రాహుల్ లో సీరియస్ గా ఉండే ఒక్క ఎక్స్ ప్రెషన్ తప్ప వేరే ఎక్స్ ప్రెషన్ ఏదీ ఉండదు. సినిమా మొదటి నుంచి చివరి దాకా చాలా నిధానంగా సాగుతుంది. సినిమాలో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే సీన్స్ ఒకటో రెండో ఉన్నాయి, ఆడియన్స్ ఆ ఫీల్ కి కనెక్ట్ అయ్యే లోపే వారి ఫీలింగ్ ని అడ్డంగా నరికేసాడు. దానికి తోడు పెద్ద సస్పెన్స్ లేకపోవడం, స్క్రీన్ ప్లే ఆకట్టుకునే విధంగా లేకపోవడం వల్ల సినిమా చాలా వరకూ ఊహాజనితంగా ఉండడం పెద్ద మైనస్. సినిమాలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. సెకండాఫ్ లో చాలా సేపు మెమరీ కార్డ్ కోసం ట్రై చేసినా సినిమా చివరికొచ్చేసరికి ఆ విషయాన్ని గాలికొదిలేశారు. మొదట్లో చూపించిన రెండు మూడు సీన్స్ లో విలన్ చాలా పవర్ఫుల్ అనుకునేలా ఉన్నా అసలు టైం వచ్చేసరికి హీరోకి పోటీ ఇచ్చే స్థాయిలో లేకపోగా పరమ రొటీన్ గా విలనిజంని ముగించడం అంతగా ఆకట్టుకోలేదు.
సినిమాలో జీరో ఎంటర్టైన్మెంట్, నవ్వుకోవడానికి అసలు ఆస్కారం లేదు. ఈ సినిమా కథ ఇప్పటికి చాలా సినిమాల్లోనే వచ్చింది. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ రొటీన్ అనే పదానికే సిగ్గోచ్చేలా ఉంది. బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే సాంగ్ బిట్స్ ని పక్కన పెడితే, మిగతా పాటలు పర్ఫెక్ట్ ప్లేస్ లో రాలేదు. అలాగే చాలా నిదానంగా వెళుతున్న సినిమాని పాటలు ఇంకాస్త స్లో చేసిన ఫీలింగ్ ని తెప్పిస్తాయి. హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ ట్రాక్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది.
సాంకేతిక విభాగం :
ఈ సినిమాకి సంబందించిన ఒకటి రెండు మేజర్ హైలైట్స్ సాంకేతిక విభాగంలోనే ఉన్నాయి. సినిమాలో మొదటి హైలైట్ గా చెప్పుకోవాల్సింది శ్రవణ్ మ్యూజిక్. శ్రవణ్ అందించిన ఆడియో ఎంత హిట్ అయ్యిందో, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దానికన్నా డబుల్ హిట్ అయ్యింది. ప్రతి సన్నివేశానికి సూపర్బ్ గా రీరికార్డింగ్ చేసాడు. తదుపరి చెప్పాల్సింది సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ, సినిమాలో విజువల్స్ చాలా బాగున్నాయి. ఆర్ట్ డైరెక్టర్ హరి వర్మ పనితనం కూడా బాగుంది. సినిమా మొత్తం మీద అక్కడక్కడా వచ్చే కొన్ని సింగల్ లైన్ డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది.
ఈ సినిమా మూలకథ పాతకథే కావడం వల్ల కొత్తదనం ఏమీ లేదు. ఇక దయా అందించిన స్క్రీన్ ప్లే ఆకట్టుకునేలా, ఆడియన్స్ ని సీట్లలో కూర్చోబెట్టే అంత రేజ్ లో లేదు. ఇక డైరెక్షన్ కూడా జస్ట్ యావరేజ్ మాత్రమే. దయా.కె ఈ రెండు విభాగాలనే కాకుండా డాన్స్, యాక్షన్ సీక్వెన్స్ కంపోజ్ విషయాలను కూడా డీల్ చేసాడు. డాన్స్ అనేదాన్ని పక్కన పెడితే యాక్షన్ సీక్వెన్స్ లు ఏదో పర్లేదు అనేలా ఉన్నాయి కానీ ఈ సినిమాకి వావ్ అనే రేంజ్ లో యాక్షన్ ఎపిసోడ్స్ ఉండాలి. ఆయనే యాక్షన్ ఎపిసోడ్స్ కంపోజ్ చేయడం మానేసి జస్ట్ తనకెలా కావాలో చెప్పి దాన్ని పర్ఫెక్ట్ గా కెమెరాల్లో బందించి ఉంటే సినిమాకి చాలా హెల్ప్ అయ్యేది. నీలిమ తిరుమలశెట్టి తక్కువ బడ్జెట్ తో తీసినా ఆ ఫీల్ ని తెరపై కనిపించకుండా చాలా గ్రాండ్ గా ఉండేలానే చూసుకున్నారు.
తీర్పు :
‘అలియాస్ జానకి’ సామాజిక బాధ్యత అనే అంశం చుట్టూ తిరిగే రొటీన్ సినిమా. ఈ సినిమా మూలకథ పాతదే అయినప్పటికీ మంచి కాన్సెప్ట్ కానీ దాన్ని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా తీయడంలో ఈ చిత్ర టీం విఫలమయ్యారు. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, పరవాలేదనిపించే నటీనటుల పెర్ఫార్మన్స్ తప్ప సినిమాలో చెప్పదగిన ప్లస్ పాయింట్స్ ఏమీ లేవు. వీక్ స్క్రీన్ ప్లే, ఎఫ్ఫెక్టివ్ గా లేని డైరెక్షన్, ఎంటర్టైన్మెంట్ లేకపోవడం, సినిమా నత్తనడకలా సాగడం మైనస్ పాయింట్స్.
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
రాఘవ