విడుదల తేదీ : 21 సెప్టెంబర్ 2013 | ||
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.25/5 |
||
దర్శకుడు : ఎన్. ఎ తార |
||
నిర్మాత : వి.వి.రాజ్ కుమార్ |
||
సంగీతం : సాకేత్ |
||
నటీనటులు : రాజ్ కుమార్, దివ్యప్రభ.. |
మొదట సినిమాలలో నటించి ప్రస్తుతం టీవీ సీరియల్స్ లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న నటుడు రాజ్ కుమార్. మళ్ళీ సినిమాలపై వున్న ప్రేమతో ఈ బారిష్టర్ శంకర్ నారాయణ్ సినిమాని చేయడం జరిగింది. ఈ రోజు విడుదలైన ఈ సినిమాలో రాజ్ కుమార్ హీరోగా, దివ్య ప్రభ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాలో రాజ్ కుమార్ ద్విపాత్రాభినయం చేశాడు. డాన్స్ మాస్టర్ తార దర్శకత్వం వహించిన ఈ సినిమాని నందవరం చాముండేశ్వరి దేవీ పిక్చర్స్ బ్యానర్ పై రాజ్ కుమార్ నిర్మించడం జరిగింది. ఈ సినిమాకి సాకేత్ సంగీతాన్ని అందిచారు. ఇప్పుడు సినిమా ఎలా వుందో చూద్దాం….
కథ :
బారిష్టర్ శంకర్ నారాయణ్( రాజ్ కుమార్) ఒక సక్సస్ ఫుల్ లాయర్. తను కేసు వాదిస్తే ఓడిపోవడం అంటూ ఉండదు. అంతటి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటాడు. కానీ అతని కల మాత్రం జస్టిస్ శంకర్ నారాయణ్ కావాలని ఉంటుంది. అతని మేనల్లుడు వేణు(రాజ్ కుమార్) కూడా తనలానే లా చదువుతూ ఉంటాడు. ఇదిలా వుండగా ఒక రోజు మోహన్ దాస్ అనే ఒక వ్యక్తి ఆస్తి కోసం తన భార్యని చంపేస్తాడు. సాక్ష్యాలు అన్నీ మోహన్ దాస్ కి వ్యతిరేఖంగా వుండడంతో అతని కేసు వాదిస్తే కచ్చితంగా ఓడిపోతామని ఎవరు ముందుకురారు. ఆ విషయాన్ని చాలెంజింగ్ గా తీసుకున్న శంకర్ నారాయణ్ తన సత్తా ఏమిటో నిరూపించుకోవడానికి మోహన్ దాస్ కేసును వాదించి గెలుస్తాడు.
ఇంతలో రాజ్ కుమార్ లాయర్ అవుతాడు. అదే సమయంలో మోహన్ దాస్ ప్రేమించి పెళ్లి చేసుకున్న రెండవ భార్య కూడా ఊహించని విధంగా చనిపోతుంది. అప్పుడు మోహన్ దాస్ తనకి ఆ చావుకి ఎలాంటి సంబంధం లేదని తనని రక్షించమని శంకర్ నారాయణ్ ని కోరతాడు. అదే కేసు విషయంలో శంకర్ నారాయణ్ కి పోటీగా ప్రత్యర్థి లాయర్ గా రాజ్ కుమార్ ఒప్పుకుంటాడు. దానితో మామ అల్లుళ్ళ మద్య పోటీ మొదలవుతుంది. ఆ పోటీలో అదేనండి ఆ కేసులో మామ గెలిచాడా లేక అల్లుడు గెలిచాడా? అసలు మోహన్ దాస్ రెండవ భార్య చావుకి కారణం ఏమిటి? తదితర విషయాలు తెలియాలంటే బారిష్టర్ శంకర్ నారాయణ్ సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
రాజ్ కుమార్ యంగ్ గా కనిపించే వేణు పాత్రని బాగా చేశాడు. అలాగే ఫస్ట్ హాఫ్ లో ఎవీఎస్ చేసిన కొన్ని కామెడీ సీన్స్ ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. హీరోయిన్ కి పాత్ర లేకపోయినా వచ్చిన రెండు పాటల్లో గ్లామర్ తో ఆకట్టుకుంది. బారిష్టర్ శంకర్ నారాయణ్ కి భార్య పాత్ర చేసిన ఆమె ఎమోషనల్ సీన్స్ బాగా చేసింది.
మైనస్ పాయింట్స్ :
బారిష్టర్ శంకర్ నారాయణ్ పాత్ర కాస్త యెబ్బెట్టుగా అనిపిస్తుంది. ఆ పాత్రలో చేయాల్సిన నటన కన్నా ఎక్కువగా చేసినట్టు అనిపిస్తుంది. ప్రతి డైలాగ్ కు ముందు వెనక శంకర్ నారాయణ్ అని చెప్పుకోవడం చిరాకుగా అనిపిస్తుంది. సినిమాలో ఎవరి పాత్రకు పెద్దగా ప్రాదాన్యం లేదు, ఒక్క శంకర్ నారాయణ్ పాత్రకు తప్ప. కానీ ఆపాత్రే సరిగా చెయ్యలేదు. అంతకన్నా ముఖ్యంగా, పోస్టర్లు మరియు బారిష్టర్ అనే పేరు చూసాక కోర్టులు, పోటాపోటీగా సాగే వాదనలు, నేరస్తులని తప్పించడానికి వేసే ప్లాన్స్ చాలా ఆసక్తికరంగా ఉంటాయనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.. సినిమా మొదట్లో, చివర్లో తప్ప మధ్యలో ఒక్క కోర్టు సీన్ కూడా లేదు. ఉన్న ఆ రెండు సీన్స్ లోనైన వాదనలు మరి బలంగా వినిపిస్తారా అంటే అదీలేదు. ఏదో తు తు మంత్రంగా వాదనలు జరుగుతాయి.
ఈ సినిమాలో హీరోయిన్ కు పెద్దగా ప్రాముఖ్యం లేదు. కేవలం పాటలకు మాత్రం పరిమితం చేశారు. అలాగే ఈ సినిమాలో వున్నకొన్ని కామెడీ సన్నివేశాలు కూడా ప్రేక్షకులని నవ్వించలేకపోయాయి. మోహన్ దాస్ కేసుని శంకర్ నారాయణ్ కోర్టులో అదిరిపోయేలా వాదిస్తాడని అందరూ అనుకుంటారు. కానీ మామ అల్లుడు కలిసి ఇంట్లో వాదించుకుంటారు కట్ చేస్తే కోర్టులో జడ్జి తీర్పు ఇస్తాడు. అది చూస్తుంటే కోర్టు సన్నివేశాలను ఇలా కూడా తీయవచ్చా అనే భావన కలుగుతుంది. అన్నిటికంటే సినిమా కథ మొత్తం తిరిగే కేసుకి సరైన జస్టిఫికేషన్ ఇవ్వకుండా, అది ప్రేక్షకుల ఊహకే వదిలేసి కథని ముగించడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఆడియన్స్ మైండ్ ని బ్లాక్ చేసింది.
దాదాపు సినిమా మొత్తాన్ని ఒకే ఇంట్లో నాలుగైదు పాత్రల మధ్యే చూపించడం ఆడియన్స్ కి విరక్తి కలిగిస్తుంది. సినిమా ముందు ముందు ఎం జరుగుతుందో అనే విషయాలు మనకు ముందే తెలిసిపోతూ ఉండడం వల్ల స్క్రీన్ ప్లే అస్సలు బాలేదనే విషయాన్ని మీరు గ్రహించి ఉంటారని ఆశిస్తున్నాం.
సాంకేతిక విభాగం :
డైరెక్టర్ గా తొలి ప్రయత్నం చేసిన కొరియోగ్రాఫర్ తార దర్శకత్వం పరవాలేధనిపించేలా ఉంది. కొత్త కావడం వాళ్ళ నటీనటుల నుండి ఎలాంటి నటనను రాబట్టుకోవాలో అనే విషయంలో కాస్త తడబడడం వల్ల శంకర్ నారాయణ్ పాత్ర ఆడియన్స్ ని మెప్పించ లేకపోయింది. కథ ఓకే అనేలా ఉన్నా స్క్రీన్ ప్లే మాత్రం చాలా వీక్. పాటలో లిరిక్స్ అర్థంకాకపోయినా, సంగీతం, నేపధ్య సంగీతం అస్సలు బాలేకపోయినా తార కొరియోగ్రాఫర్ కావడం వల్ల పాటల్లో స్టెప్స్ ని మాత్రం బాగానే కంపోజ్ చేసారు. ఎడిటింగ్ కూడా బాగా నాసిరకంగా ఉంది.
తీర్పు :
‘బారిష్టర్ శంకర్ నారాయణ్’ సినిమాని భరించడం ప్రేక్షకులకు కష్టమైనా పనే. సినిమాలో కోర్టు వాదనల కన్నా మామ అల్లుళ్ళ వాదనలు ఎక్కువగా వినిపిస్తాయి. సెంటిమెంట్ చూస్తే చిరాకు, కోర్టు వాదనలు వింటే విరక్తి కలిగే ఈ సినిమాలో చెప్పుకోవడానికి ప్లస్ లు లేకపోయినా మైనస్ లు మాత్రం ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి ఈ సినిమాలో ఏదో ఉంటుందని ఆశించి వెళ్ళడం కన్నా…. ఇక ఏమి చెయ్యాలో మీకు తెలుసనుకుంటా.!
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.25/5
రివ్యూ : నగేష్ మేకల