విడుదల తేదీ: 23 నవంబర్ 2012 | ||
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5 |
||
దర్శకుడు : శ్రీనివాస్ రెడ్డి |
||
నిర్మాత : వెంకట్ | ||
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ |
||
నటీనటులు : నాగార్జున, అనుష్క, రవిశంకర్ |
గత రెండు నెలల నుండి ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అంటూ ఊరిస్తున్న ఢమరుకం ఎట్టకేలకు ఈ రోజు విడుదలైంది. గ్రాఫిక్స్ వర్క్ వల్ల దాదాపు సంవత్సర కాలం నుండి ఆలస్యమవుతూ నాగ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జునకి జోడీగా ఆయన ఆస్థాన హీరొయిన్ అనుష్క నటించింది. అరుంధతి సినిమాలో బొమ్మాలి అంటూ తన గాత్రంతో భయపెట్టిన రవి శంకర్ విలన్ కాగా కామెడీ చిత్రాల దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాని ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై వెంకట్ నిర్మించారు.
కథ :
అమృతం కోసం దేవతలకి, రాక్షసులకి మధ్య జరిగిన యుద్ధంలో రాక్షసులు అందరూ చనిపోగా అంధకాసురుడు (రవి శంకర్) ఒక్కడే మిగిలిపోతాడు. తన అనుచరుడు మాయి (జీవా)తో కలిసి ఒక గుహలోకి వెళ్ళిపోతాడు. కొన్ని వేల సంవత్సరాల తరువాత పంచాగ్రహ కూటమి జరిగిన రోజు పుట్టిన మహేశ్వరి (అనుష్క) ని అంధకాసురుడు పెళ్లి చేసుకొని బలి ఇస్తే లోకాన్ని పాలించే శక్తులు వస్తాయి అని తెలుసుకుంటాడు. ఆ శక్తులతో దేవతల మీద పగ తీర్చుకోవాలనుకుంటాడు. మహేశ్వరికి యుక్తవయసుకి రాగానే పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. ఆమెని పెళ్లి చేసుకోకుండా శివుడు అడ్డుపడకూడదు అని తపస్సు చేసి శివుని వరం కోరితే శివుడు అంగీకరిస్తాడు. అంధకాసురుడు ఆమెని పెళ్లి చేసుకోకుండా మల్లిఖార్జున (నాగార్జున) అడ్డుపడుతుంటాడు. తనకు అడ్డుపడుతున్న మల్లిఖార్జునని చంపాలనుకుంటాడు. లోక కళ్యాణం కోసం మల్లిఖార్జునకి ఎవరు సహాయం చేసారు. చివరికి అంధకాసురుడి కోరిక తీరిందా? ఇవన్ని తెలుసుకోవాలంటే ఢమరుకం చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
నాగార్జున హలో బ్రదర్ సినిమా స్టైల్లో గోదావరి జిల్లా యాసలో అలరించాడు. లేటు వయసులో కూడా అందంగా ఉన్నాడు. ఆయన రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో ఆయన పాత్ర తగ్గినప్పటికీ ఉన్నంతలో బాగా చేసాడు. అనుష్క అందాల ఆరబోత విషయంలో బావుంది. రెప్పలపై, కన్యాకుమారి పాటల్లో అందాల ఆరబోత బాగా చేసింది. నటన పరంగా పాస్ మార్కులు మాత్రమే. అరుంధతి సినిమాలో బొమ్మలి అంటూ భయపెట్టిన రవిశంకర్ ఈ సినిమాకి బాగా మంచి ప్లస్ అయ్యాడని చెప్పుకోవాలి. డైలాగ్ డెలివరీ, గెటప్ సినిమాకి హైలెట్. ఫైర్ ఫ్లై వారు అందించిన గ్రాఫిక్స్ అంధకాసురుడి సన్నివేశాల్లో, క్లైమాక్స్ సన్నివేశాల్లో బావున్నాయి. ఇంటర్వెల్ ముందు సన్నివేశాలు, క్లైమాక్స్ సన్నివేశాలు బావున్నాయి. ఛార్మి నర్తించిన సక్కుభాయి చాయ్ పాట మాస్ ప్రేక్షకులని అలరించింది.
మైనస్ పాయింట్స్ :
కామెడీ చిత్రాల దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి సోషియో ఫాంటసీ సినిమాని తెరకెక్కించే విషయంలో తడబడ్డాడు. మంచి కాన్సెప్ట్ ఎంచుకున్న దర్శకుడు అనుకున్న దానిని తెర మీద చూపించడంలో పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు. అంధకాసురుడి ఎపిసోడ్స్ వరకు బాగా హ్యాండిల్ చేసినా తనకు బాగా కలిసొచ్చిన కామెడీ సన్నివేశాల విషయంలో పూర్తిగా తడబడ్డాడు. బ్రహ్మి, కృష్ణభగవాన్, ఎం.ఎస్ నారాయణ, రఘుబాబు కామెడీ సీన్స్ మరీ పేలవంగా ఉన్నాయి. సినిమా చూస్తున్నంతసేపు తరువాత రాబోయే సన్నివేశం ఏమిటో ముందే తెలిసిపోయేలా ఉన్నాయి. ప్రకాష్ రాజ్ గెటప్ విషయంలో కేర్ తీసుకోకపోవడం కూడా భాధాకరం. అయన గెటప్ శివుడుని కాకుండా స్వామి పరమహంసని తలపించింది. నాగార్జున, అనుష్క మధ్య లవ్ ట్రాక్ కూడా పండలేదు.
సాంకేతిక విభాగం :
పైన చెప్పుకున్నట్లు ఫైర్ ఫ్లై వారు అందించిన గ్రాఫిక్స్ బావున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ పాటల్లో శివ శివ శంకర, కన్యాకుమారి, లాలి లాలి, అరుణ ధవళ పాటలు చాలా బావున్నాయి. నేపధ్య సంగీతం సినిమాకి మెయిన్ హైలెట్. చోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ కూడా బావుంది.
తీర్పు :
విడుదల కావడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డ ఢమరుకం బాగానే ఉన్నప్పటికీ దర్శకుడి అనుభవలేమి వల్ల తడబడింది. ఢమరుకం మోగింది కానీ పూర్తి స్థాయిలో మొగలేదనే చెప్పుకోవాలి.
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
అశోక్ రెడ్డి .ఎమ్
Click Here For ‘Dhamarukam’ English Review