సమీక్ష : క్రిష్ 3 – బోర్ కొట్టించిన ఇండియన్ సూపర్ హీరో..

సమీక్ష : క్రిష్ 3 – బోర్ కొట్టించిన ఇండియన్ సూపర్ హీరో..

Published on Nov 2, 2013 3:50 AM IST
krrish-3-telugu-review విడుదల తేదీ : 01 నవంబర్ 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
దర్శకుడు : రాకేష్ రోషన్
నిర్మాత : రాకేష్ రోషన్
సంగీతం : రాజేష్ రోషన్
నటీనటులు : హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా, వివేక్ ఒబెరాయ్, కంగన రనౌత్..

‘క్రిష్’ సినిమాతో ఇండియన్ సూపర్ హీరోగా అవతారం ఎత్తిన హృతిక్ రోషన్ ఈ దీపావళికి ‘క్రిష్ 3’ సినిమాతో ప్రేక్షకులని మెప్పించడానికి సిద్దమయ్యాడు. ‘క్రిష్ 3’ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయ్యింది. వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటించిన ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, కంగన రనౌత్ హీరోయిన్స్ గా కనిపించారు. రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి రాజేష్ రోషన్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను రీచ్ అయ్యే రేంజ్ లో ఉందో? లేదో? అనేది ఇప్పుడు చూద్దాం…

కథ :

కథ.. చెప్పాలంటే ఈ సినిమా ట్రైలర్ చూడగానే ఈ సినిమా కథ ఏంటనేది మీరు ఊహించవచ్చు. లేదు కథ చెప్పాలి అంటే … క్రిష్ సినిమాకి కొనసాగింపుగా ఈ సినిమా మొదలవుతుంది. డా. రోహిత్ మెహ్రా(హృతిక్ రోషన్), కృష్ణ(హృతిక్ రోషన్, అలాగే మన కథలో సూపర్ హీరో క్రిష్ కూడా ఇతనే), ప్రియ(ప్రియాంక చోప్రా) హ్యాపీగా ముంబైలో జీవితాన్ని గడుతుంటారు. అదే ముంబైలో ఏదన్నా ప్రమాదాలు జరిగితే మన కృష్ణ అదే క్రిష్ వెళ్లి కాపాడుతుంటాడు.

అదే సమయంలో సినిమాలో విలన్ కాల్(వివేక్ ఒబెరాయ్) ఎంటర్ అవుతాడు. కాల్ బిగ్గెస్ట్ సైంటిస్ట్ కానీ ఇక్కడ విలన్ కి ఉన్న సమస్య ఏమిటంటే అతని బ్రెయిన్ మాత్రమే పనిచేస్తుంది, మిగతా బాడీ మొత్తం నిర్జీవంగా ఉంటుంది. తను ఎలాగన్నా అందరిలా లేచి నడవాలని, ఈ ప్రపంచాన్ని తన కంట్రోల్ పెట్టుకోవాలని కొన్ని జంతువుల డిఎన్ఏ లతో కొన్ని ప్రయోగాలు చేస్తుంటాడు. అలాగే ధనార్జన కోసం తన ఫార్మాసిటికల కంపెనీ ద్వారా కొన్ని సంఘ విద్రోహ పనులకు పాల్పడుతుంటాడు.

వాటిని రోహిత్ మెహ్రా కంట్రోల్ చేస్తాడు. అసలు తను చేసే పనులను రోహిత్ మెహ్రా ఎలా ఆపుతున్నాడా? అనే అనుమానం రావడంతో అసలు కథ మొదలవుతుంది. అప్పుడే కథలో అసలు సిసలైన ట్విస్ట్. దాంతో కాల్ కి మరింత శక్తి వంతుడిగా మారతాడు. ఆప్పుడు మన హీరో క్రిష్ కాల్ ని ఎలా ఎదుర్కొన్నాడు? ఎలా అంతమొందించాడు? అసలు సిసలైన ఆ ట్విస్ట్ ఏంటి? అనేది తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో హృతిక్ రోషన్ రెండు పాత్రలు పోషించాడు. అందులో ఒకటి రోహిత్ మెహ్రా – ఈ పాత్రలో కాస్త ముసలి వాడిగా, చిన్న పిల్లల మనస్తత్వం ఉన్నవాడిగా ప్రేక్షకులను మెప్పించాడు. ఇక రెండవది కృష్ణ – కృష్ణ అనేది ఒకే పాత్ర అయినప్పటికీ ఇందులో హృతిక్ రోషన్ రెండు గెటప్స్ లో కనిపిస్తాడు, కృష్ణ గా చాలా స్టైలిష్ గా కనిపించాడు. అలాగే తన పర్ఫెక్ట్ సిక్స్ ప్యాక్ బాడీతో మరోసారి అమ్మాయిలను ఆకట్టుకున్నాడు. ఇక క్రిష్ గెటప్ లో ఎప్పటిలానే అదిరిపోయే స్టంట్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా హృతిక్ రోషన్ ఈ రెండు విభిన్న పాత్రల్లో చూపించిన వైవిధ్యం మెచ్చుకోదగినది. ప్రియాంక చోప్రా జస్ట్ ఓకే.

సినిమాలో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్, కొన్ని సీన్స్ పిల్లల్ని బాగా ఆకట్టుకుంటాయి. ఓ సీన్స్ లో హృతిక్ రోషన్ ఓ చిన్న పిల్లవాడిని కాపాడి అతనితో కాసేపు చేసే చిట్ చాట్ సీన్ పిల్లలకి బాగా కనెక్ట్ అవుతుంది. సినిమాని అన్ని విజువల్స్ ఎఫెక్ట్స్ బాగోలేక పోయినా కొన్ని కొన్ని మాత్రం బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

నేను మొదట కథలో చెప్పినట్టు ఈ సినిమాకి మొదటి మైనస్ పాయింట్ స్టొరీ లైన్. ట్రైలర్ చూసి గెస్ చేయలేనివారు సినిమాలో విలన్ ఇంట్రడక్షన్ సీన్ అవ్వగానే కథలో క్లైమాక్స్ ని, కథలో వచ్చే ట్విస్ట్ లని ఊహించేయవచ్చు. ఊహించేసిన దాన్ని కథనంలో కూడా ఆసక్తిగా చూపించలేకపోయారు. అలాగే ఈ సినిమా స్టొరీ లైన్ చాలా హాలీవుడ్ సినిమాలను పోలి ఉంటుంది. ఈ సినిమాలోని పాత్రలని హాలీవుడ్ X-మెన్ సినిమా నుంచి మక్కికి మక్కి దించేసారు. కానీ ఆ పాత్రలు మనకు కాస్త కోపాన్ని, చిరాకుని తెప్పిస్తాయి, అలాగే అ పాత్రలని కథలో సరిగా ఉపయోగించుకోలేదు.

కంగన రనౌత్ చాలా మంచి బ్యూటీ మరియు నటి కూడా, కానీ ఆమెని ఇలాంటి పాత్రలో చూడాలంటే కాస్త కష్టంగా అనిపించింది. అలాగే టాలెంటెడ్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్ ని కూడా సరిగా ఉపయోగించుకోలేదు. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా ఉందని అనుకున్న ప్రేక్షకుడు సెకండాఫ్ చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ చాలా బెటర్ అనుకుంటాడు. సెకండాఫ్ మొదటి నుంచి క్లైమాక్స్ ఫైట్ వరకు చాలా నిధానంగా సాగుతుంది. దానికి తోడు మధ్యలో పాటలు వచ్చి ఇంకాస్త చిరాకు పెడుతుంటాయి. అలాగే సినిమాలో ఉన్న మూడు పాటల్లో ఏదీ కూడా ప్రేక్షకులను సీట్లలో కూర్చో బెట్టలేకపోయింది.

క్రిష్ సినిమాకి సీక్వెల్ గా వస్తోంది కాబట్టి అందరూ సూపర్బ్ యాక్షన్ ఎపిసోడ్స్, ఎంతో ఆసక్తి కరమైన కథనాన్ని ఆశిస్తారు. ఈ రెండు విషయాల్లో క్రిష్ 3 యూనిట్ ప్రేక్షకులను సంతృప్తిపరచలేకపోయారు. సినిమాలో హీరోని ఎలివేట్ చేసే సీన్స్ కొన్ని ఉంటాయి, ఆ సీన్స్ ‘ ఆపరేషన్ సక్సెస్ పేషంట్ డైడ్ ‘ అన్న రీతిలో ఉంటాయి. హై రేంజ్ లో ఉండాల్సిన సీన్ యావరేజ్ గా ఉందని ఆడియన్స్ బాధపడుతుంటే వాళ్లకి ఆ సంతోషం కూడా లేకుండా మ్యూజిక్ డైరెక్టర్స్ సలీం – సులేమాన్ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఇంకా నీరుగార్చారు. ఇది వరకు చెప్పినట్టు కొన్ని విజువల్ షాట్స్ బాగున్నాయి కానీ కొన్ని సిజి షాట్స్ మాత్రం అస్సలు బాలేవు. చెప్పాలంటే క్రిష్ 3 కంటే క్రిష్ లో విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి.

సాంకేతిక విభాగం :

సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త బాగుండాల్సింది, కానీ స్క్రీన్ ప్లే అలా ఉన్నప్పుడు ఆయన కూడా ఏమీ చేయలేకపోయాడేమో మరి.. రాజేష్ రోషన్ అందించిన పాటలు బాలేవు. అలాగే సలీం – సులేమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి మరో మైనస్. రాకేశ్ రోషన్ కి డైరెక్టర్ గా ఎంతో మంచి పేరుంది, కానీ ‘క్రిష్ 3’ విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. క్రిష్ సినిమాలో సూపర్ హీరో కాన్సెప్ట్ తో ప్రేక్షకులని ఆకట్టుకున్న ఆయన ఈ సినిమాలో సూపర్ హీరోతో అదే మేజిక్ ని రిపీట్ చేయలేకపోయాడు.

తీర్పు :

క్రిష్ సినిమాకి సీక్వెల్ గా ‘క్రిష్ 3’ రావడం వల్ల భారీ అంచనాలుంటాయి. ఆ అంచనాలను అందుకోవడం లో క్రిష్ 3 పూర్తిగా విఫలమైందని చెప్పుకోవాలి. అంచనాలు ఏమీ లేకుండా చూస్తే ఎక్కడో ఓ చోటైనా నచ్చే అవకాశం ఉంది. చెప్పాలంటే క్రిష్ 3 సినిమా కొన్ని సూపర్ హిట్ హాలీవుడ్ సినిమాల కాన్సెప్ట్ లని, పాత్రలని అలానే కాపీ కొట్టి తీయడం వల్ల కలగాపులగంలా ఉంది. హృతిక్ రోషన్, వివేక్ ఒబెరాయ్ లాంటి నటులు ఎంత ట్రై చేసినా సినిమాకి ఈజీగా ఊహించదగిన కథ, బోరింగ్ కథనం తోడవడంతో సినిమాని విజయం వైపు నడిపించలేకపోయాయి. ఈ సినిమా ఎవరన్నా చూడచ్చా అంటే చెప్పదగిన వాళ్ళు అంటే పిల్లలు మాత్రమే.. ఎందుకంటే వాళ్ళు అన్ని హాలీవుడ్ సినిమాలు చూసి ఉండరు కాబట్టి.. కానీ ఈ సినిమాకి వేరే సినిమా ఏదీ పోటీ లేకపోవడం, దీపావళి సీజన్ కావడం వల్ల బాక్స్ ఆఫీసు వద్ద కాస్త కాసులు రాలే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఇండియన్ సూపర్ హీరో క్రిష్ 3 తో ఆడియన్స్ మెప్పించకపోగా బోర్ కొట్టించాడు…

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు