సమీక్ష : మహేష్ – లాజిక్ లేని బోరింగ్ మూవీ

సమీక్ష : మహేష్ – లాజిక్ లేని బోరింగ్ మూవీ

Published on Sep 21, 2013 3:50 AM IST
Mahesh-Telugu-Review విడుదల తేదీ : 20 సెప్టెంబర్ 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
దర్శకుడు : మదన్ కుమార్
నిర్మాత : సురేష్ కొండేటి
సంగీతం : గోపి సుందర్
నటీనటులు : సందీప్ కిషన్, డింపుల్, జగన్..

తన టాలెంట్ తో తెలుగు ఇండస్ట్రీలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సందీప్ కిషన్ హీరోగా పరిచయమవుతూ తమిళ్ లో చేసిన సినిమా ‘యారుడా మహేష్’. ఈ సినిమాని డబ్ చేసి తెలుగులో ‘మహేష్’ గా రిలీజ్ చేసారు. ‘రొమాన్స్’ ఫేం డింపుల్ హీరోయిన్. సురేష్ కొండేటి నిర్మించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ డబ్బింగ్ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం..

కథ :

శివ(సందీప్ కిషన్) పెద్ద సోంబేరి, దద్దమ్మ, చదువు కూడా సరిగ్గా చదవకుండా సబ్జెక్టులు బాలన్స్ పెట్టుకొని ఆకతాయిగా తిరుగే కుర్రాడు. శివ తన పనుల కోసం తన ఫ్రెండ్ అయిన వసంత్(జగన్) ని తెగ ఇబ్బంది పెడుతుంటాడు. శివ తన కాలేజ్ లో చదివే సంధ్య(డింపుల్)ని చూసి ప్రేమలో పడతాడు. ఆ తర్వాత సంధ్య కూడా శివపై మనసు పారేసుకుంటుంది. ఆ ప్రేమ మత్తులో ఇద్దరూ చెయ్యకూడని తప్పు చేస్తారు. కట్ చేస్తే పెళ్లై ఒక పిల్లాడు. అదే టైంలో శివకి సంధ్య విషయంలో గుండె బద్దలయ్యే ఓ వార్త వింటాడు. ఆ వార్త పేరే మన సినిమా టైటిల్ ‘మహేష్’. దాంతో మన శివ మహేష్ ని వెతికే పనిలో పడతాడు. అసలు ఈ మహేష్ ఎవడు? మహేష్ గాడి కథేంటి? అసలు సంధ్య – మహేష్ కి ఉన్న సంబంధం ఏమిటి? శివ చివరికి మహేష్ ని పట్టుకోగలిగాడా? లేదా అనే అంశాల్ని మీరు తెరపైనే చూడాలి..

ప్లస్ పాయింట్స్ :

వసంత్ పాత్ర పోషించిన జగన్ తన నటనతో, కొన్ని అడల్ట్ డైలాగ్స్ తో కాసేపు ప్రేక్షకులను నవ్వించాడు. జగన్ కి డబ్బింగ్ చెప్పిన ధన్ రాజ్ వాయిస్ కూడా బాగానే కుదిరింది. డింపుల్ నటన బాగుంది. అలాగే ‘ఉరికే వయసే’ పాటలో కాస్త గ్లామరస్ గా కనిపించింది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని అడల్ట్ కామెడీ సీన్స్ ఆడియన్స్ ని నవ్విస్తాయి. సినిమాలో ఐటెం సాంగ్ చేసిన భామ తన అందాలతో ముందు బెంచ్ వారిని ఆకట్టుకుంటుంది. సందీప్ కిషన్ నటన కొన్ని సీన్స్ లో జస్ట్ ఓకే అనేలా ఉంది.

మైనస్ పాయింట్స్ :

సందీప్ కిషన్ సినిమాలో తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండే హీరోలా కనిపించలేదు. ఎమోషనల్, తాగుబోతు సీన్స్ సరిగా చెయ్యలేదు. ఇప్పటి వరకూ ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్త రకం పాత్రతో ఆకట్టుకుంటున్న సందీప్ కిషన్ ఈ సినిమాలోని తన నటనతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆయన ‘ప్రస్థానం’ సినిమాలో లాంటి పాత్రలు ట్రై చేస్తే బాగుంటుంది.

ఇక సినిమా విషయానికి వస్తే.. ఇది స్క్రీన్ ప్లే ఓరియెంటెడ్ మూవీ. ఇలాంటి సినిమాలకు స్క్రీన్ ప్లే చాలా పగడ్బందీగా ఉండాలి, ఆడియన్స్ ని సీట్లలో నుంచి కదలనివ్వకుండా ఉండేలా చూసుకోవాలి. కానీ ఆవిషయంలో మన డైరెక్టర్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. అలాగే సినిమాలో వచ్చే ఒకే ఒక్క ట్విస్ట్ బాగున్నప్పటికీ కానీ దాన్ని ఆడియన్స్ ఊహించేలా చెప్పడం సెట్ అవ్వలేదు. సెకండాఫ్ ఈ సినిమాకి చాలా పెద్ద మైనస్ పాయింట్. సెకండాఫ్ చాలా నెమ్మదిగా సాగుతుంది.దానికి తోడుక్లిమాక్స్ ఇంకా చాలా దారుణంగా ఉంది. అలాగే మహేష్ అనే పేరు సినిమాలో ఎంటర్ కాగానే అప్పటి వరకూ ఏదో అలా అలా ఉన్న సినిమా ఇంకా డల్ అయిపోతుంది.

ఇది తమిళ్ సినిమాకి డబ్బింగ్ సినిమా కావడం వల్ల కొన్ని సీన్స్ ని కత్తిరించారు. కత్తిరించడంలో తప్పులేదు కానీ కథకి అవసరమైన కీలక సీన్స్ ని కట్ చెయ్యడం తప్పు. ఎందుకంటే సినిమా క్లైమాక్స్ కి హెల్ప్ అయ్యే ఒక లీడింగ్ సీన్ ని ఎత్తేసి ఆ సీన్స్ లోని ఓ షాట్ ని క్లైమాక్స్ లో వాడుకోవడం వల్ల అసలు ఆ సీన్ సినిమాలోనే రాలేదు కదా అనే ఫీలింగ్ ఆడియన్స్ కి కలుగుతుంది. డబ్బింగ్ సినిమా కావడం వల్ల చాలా మంది నటీనటులకి డబ్బింగ్ సరిగ్గా కుదరలేదు. అలాగే కథా పరంగా నటీనటులకు క్లోజ్ షాట్స్ ఎక్కువగా పెట్టారు. డైరెక్ట్ వెర్షన్ అయ్యుంటే లిప్ సింక్ సెట్ అయ్యేది కానీ డబ్బింగ్ మూవీ కావడంతో లిప్ మూమెంట్ కి డైలాగ్స్ కి అస్సలు సింక్ అవ్వదు. అది ప్రేక్షకులకి కాస్త చిరాకు తెప్పిస్తుంది. సినిమాలో లాజిక్ లేదు, అది అవసరం లేదు అనుకుంటే ఈ సినిమాని కాస్త ఎంజాయ్ చెయ్యొచ్చు. కానీ లాజిక్ ఎతుక్కుంటేనే ప్రేక్షకుడి పరిస్థితి అయోమయంలో పడుతుంది.

సాంకేతిక విభాగం :

తమిళ ప్రేక్షకులకి తగ్గట్టు సింపుల్ పాయింట్ ని కథగా రాసుకొని స్క్రీన్ ప్లే తో ఆకట్టుకోవాలని చూసిన డైరె క్టర్ మదన్ కుమార్ ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. డైరెక్షన్ పరంగా కూడా విఫలమయ్యాడు. సందీప్ కిషన్ లాంటి టాలెంట్ ఉన్న ఓ నటున్ని వినియోగించుకోవడంలో విఫలమయ్యాడు. టెక్నికల్ డిపార్ట్మెంట్ లో చెప్పుకోదగినది సినిమాటోగ్రఫీ. తెలుగులో డబ్ చేస్తున్నాం అనగానే కొన్ని సీన్స్ ని లేపేసినప్పటికీ ఎడిటర్ సెకండాఫ్ పై కాస్త శ్రద్ధ పెట్టాల్సింది. ఏది అవసరం ఏది అనవసరం చూసుకోవాల్సింది. మ్యూజిక్ ఓకే కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెద్దగా సినిమాకి సాయపడలేదు. డైలాగ్ రైటర్ రాసిన కొన్ని అడల్ట్ డైలాగ్స్ బి,సి సెంటర్ ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి, మిగతా డైలాగ్స్ ఓకే అనేలా ఉన్నాయి. డబ్బింగ్ అంతగా సెట్ అవ్వలేదు.

తీర్పు :

‘మహేష్’ పెద్దగా ఆకట్టుకోలేని ఓ అడల్ట్ కామెడీ ఎంటర్టైనర్. ఈ సినిమాకి హీరో అయిన సందీప్ కిషన్ ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం ఈ సినిమాకి పెద్ద మైనస్. అయితే వీక్ స్క్రీన్ ప్లే, బోర్ కొట్టించే సెకండాఫ్ బోనస్ మైనస్ పాయింట్స్. కొన్ని అడల్ట్ కామెడీ సీన్స్, జగన నటన, డింపుల్ గ్లామర్ కాస్త చెప్పదగిన అంశాలు. ఓవరాల్ గా ప్రేక్షకులను మెప్పించలేని మెప్పు పొందలేని సినిమా..

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు