సమీక్ష : మిర్చి – కాస్త ఘాటు తగ్గింది కానీ టేస్ట్ బాగుంది

సమీక్ష : మిర్చి – కాస్త ఘాటు తగ్గింది కానీ టేస్ట్ బాగుంది

Published on Feb 8, 2013 12:12 PM IST
Mirchi2 విడుదల తేదీ : 8 ఫిబ్రవరి 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
దర్శకుడు : కొరటాల శివ
నిర్మాత : వి. వంశి కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు : ప్రభాస్, అనుష్క, రిచా గంగోపాద్యాయ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి చత్రపతి తరువాత సరైన మాస్ హిట్ లేదు. మధ్యలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు సంతృప్తినిచ్చినా ప్రభాస్ కట్ అవుట్ కి సరైన మాస్ హిట్ లేదు. గత చిత్రం రెబల్ నిరాశపరిచినా డీలా పడకుండా మిర్చి అంటూ ప్రభాస్ రెడీ అయిపోయాడు. కొత్త దర్శకులకి పెద్దగా ఛాన్స్ ఇవ్వని ప్రభాస్ మిర్చికి కొరటాల శివకి మొదటిసారి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ప్రభాస్ కి జోడీగా అనుష్క, రిచా గంగోపాధ్యాయ నటించిన మిర్చి వంశికృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకి వచ్చిన మిర్చి ఎంత ఘాటుగా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ :

దేవా (సత్యరాజ్), లత (నదియా) ఏకైక సంతానం జై (ప్రభాస్). దేవా సొంత ఊరు గుంటూరులోని రెంటచింతల గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా తండ్రిని పోగొట్టుకుంటాడు. వూరి ప్రజల కోసం దేవా అక్కడే ఉంటానంటాడు. అక్కడే ఉంటే తన కొడుకుని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని జై ని తీసుకుని లత హైదరాబాద్ వెళ్ళిపోతుంది. జై పెద్దయ్యాక గతం తెలుసుకుని తండ్రి దగ్గరికి వెళ్తాడు. సొంత మరదలు వెన్నెల (అనుష్క) ప్రేమని గెలుచుకుంటాడు. ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉన్న ఆ వూరికి జై వల్ల మళ్లీ సమస్యలు మొదలవుతాయి. వెన్నెలతో జై పెళ్లి నిశ్చయమై పెళ్లి జరుగుతున్న సమయంలో దేవాకి సంభందించిన శత్రువులు రాజయ్య (నాగినీడు) మనుషులు దేవా కుటుంబం మీద కాపు కాసి దాడి చేస్తారు. ఇదే సమయంలో కథ కీలక మలుపులు తిరుగుతుంది.

ప్లస్ పాయింట్స్ :

మిర్చిలో ప్రభాస్ చాలా మెచ్యూర్డ్ రోల్ ప్లే చేసాడు. దూకుడున్న పల్నాటి బిడ్డగా, వీలైతే ప్రేమిద్దాం డూడ్ అంటూ ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసాడు. ఈ రెండిట్లో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పల్నాడు ఎపిసోడ్లో ప్రభాస్ కట్ అవుట్ కి తగ్గ సీన్స్ పడటంతో ఒంటి చేత్తో అల్లడించాడు. సినిమా అంతా న్యూ లుక్ తో బావున్నాడు. డార్లింగే ఓసి నా డార్లింగే, యాహూ యాహూ పాటల్లో కొన్ని డాన్సు స్టెప్స్ పర్వాలేదనిపించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తండ్రిని అవమానించిన వారిని ఎవరికీ తెలియకుండా కొట్టి వచ్చే ఫైట్, ఇంటర్వెల్ ముందు ఫైట్, పెళ్లి సన్నివేశంలో ఫైట్ బాగా చేసాడు. అనుష్క సెకండ్ హాఫ్ వరకే పరిమితం అయినా ఉన్నంత వరకు చాలా బావుంది. నటన వరకు రొటీన్ గానే చేసినా ఇదేదో బావుందే పాటలో అందాల ఆరబోసిన తీరు బావుంది. డార్లింగే ఓసి నా డార్లింగే పాటలో మాస్ డాన్సులు బాగానే చేసింది. రిచా గంగోపాధ్యాయ మానసగా పరిమితి ఉన్న పాత్ర చేసింది. ఆమె నటన కూడా కొత్తగా చేసిందేమీ లేదు. యాహూ, యాహూ, బార్బీ గర్ల్ పాటల్లో మాత్రం పర్వాలేదనిపించింది. మిగతా వారిలో దేవాగా సత్య రాజ్ ఎక్కడా శృతి మించకుండా బాగా చేసాడు. జై పెళ్లి సన్నివేశంలో ప్రభాస్ తో ‘ఏం పాపం చేస్తే నువు నాకు పుట్టావురా’ అంటూ చెప్పే డైలాగ్స్ చాలా బాగా పండాయి. నదియా చిన్న పాత్రే అయినా బాగానే చేసింది. వీర ప్రతాప్ పాత్రలో బ్రహ్మానందం ఒకటి రెండు సన్నివేశాల్లో మాత్రం నవ్వించాడు. సంపత్, నాగినీడు, ఆదిత్య, సుబ్బరాజు, అజయ్, సుప్రీత్ అందరూ పాత్ర పరిధి మేరకు చేసారు .

మైనస్ పాయింట్స్ :

మిర్చి కథని దర్శకుడు గతంలో వచ్చిన రెండు మూడు సినిమాల నుండి స్ఫూర్తి పొంది రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు చాలా స్లోగా ఉన్నాయి. ప్రభాస్, రిచా మధ్య కెమిస్ట్రీ వర్క్ అవుట్ కాలేదు. సుబ్బరాజుతో వచ్చే సీన్స్ కూడా బోర్ కొట్టించాయి. ఊరట కలిగిస్తాడు అనుకున్న బ్రహ్మి కూడా నా వల్ల కాదని చేతులెత్తేసాడు. ఫస్ట్ హాఫ్ అంతా గతంలో వచ్చిన బిందాస్ సినిమాని గుర్తు చేయగా, సెకండ్ హాఫ్ శంఖం సినిమాని పోలి ఉంది. ఇంటర్వెల్ ముందు చెప్పిన ట్విస్ట్ కూడా అంతగా పండలేదు. క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు కూడా ఆశించిన స్థాయిలో రాలేదు.

సాంకేతిక విభాగం :

మది అందించిన సినిమాటోగ్రఫీ బావుంది. పాటల్లో సినిమాటోగ్రాఫర్ పనితనం బాగా కనిపించింది. ఎడిటింగ్ మాత్రం సరిగా లేదు. ఫస్ట్ హాఫ్ అనవసరమైన కొన్ని సుబ్బరాజు మీద తీసిన లాంటి సన్నివేశాలకి కత్తెర వేయాల్సింది. సెకండ్ హాఫ్ లో జంప్ కట్స్ కొన్ని పడ్డాయి. దేవి శ్రీ ప్రసాద్ ఆడియో సూపర్ హిట్ అయితే స్క్రీన్ మీద మాత్రం మిర్చి, ఇదేదో బావుందే, పండగలా పాటలు బాగా వచ్చాయి. ముఖ్యంగా ఇదేదో బావుందే పాటలో కోరియోగ్రఫీ హైలెట్. కొరటాల శివ దర్శకుడిగా సగం మార్కులు మాత్రమే సంపాదించాడు. డైలాగుల విషయానికి వస్తే “నువు మా వూరికి రావాలంటే స్కెచ్ వేసి రావాలి, అదే నేను నీ వూరికి రావాలంటే హ్యాంగర్ కి ఉన్న షర్ట్ వేసుకుంటే చాలు’, వాడు దేవా కొడుకు, వాడికి తిక్క రేగి మన వూరి మీదకి వస్తే ఒక్కొక్కరిని మేక తలని నరికినట్లు నరుకుతాడు’ లాంటి కొన్ని డైలాగ్స్ మాస్ ఆడియెన్స్ కి కావాల్సిన జోష్ ఇచ్చాయి.

తీర్పు :

మిర్చి ఘాటు కాస్త తగ్గింది కానీ స్పైసిగా మాత్రం బావుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా నడిపించినా కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగా తీసి సక్సెస్ అయ్యాడు దర్శకుడు. కామెడీ విషయంలో కాస్త వెనకబడినా మాస్ ఆడియెన్స్ కి కావాల్సిన అంశాలు అన్ని సెకండ్ హాఫ్ వరకు బాగానే అందించాడు. ఫుల్ మీల్స్ కాకపోయినా ప్లేట్ మీల్స్ మాత్రం ఖాయం.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

అశోక్ రెడ్డి

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు