సమీక్ష : నీడ – సస్పెన్స్ లేని సస్పెన్స్ థ్రిల్లర్

సమీక్ష : నీడ – సస్పెన్స్ లేని సస్పెన్స్ థ్రిల్లర్

Published on Sep 14, 2013 3:00 AM IST
Needa విడుదల తేదీ : 13 సెప్టెంబర్ 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 1/5
దర్శకుడు : జె.ఎస్ చౌదరి
నిర్మాతవి. శ్రీనివాస చౌదరి
సంగీతం : విజయ్ కూరాకుల
నటీనటులుదేవ్న పాని, విపిన్, రవిబాబు..

దేవ్న పాని, విపిన్ లను పరిచయం చేస్తూ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన సినిమా ‘నీడ’. రవిబాబు ఓ కీలక పాత్రలో కనిపించిన ఈ సినిమా ద్వారా జెఎస్ చౌదరి డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. ఇప్పటికే నూతన దర్శకులు చాలా మంది మొదటి ప్రయత్నంగా తమ టాలెంట్ నిరూపించుకోవడానికి సస్పెన్స్ థ్రిల్లర్స్ తీసి తమ చేతులు కాల్చుకున్నారు. మరి జెఎస్ చౌదరి ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకున్నాడో ఇప్పుడు చూద్దాం..

కథ :

సంజయ్(అనూజ్ రామ్) – పూజ(దేవ్న పాని) ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. వీరిద్దరికీ పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా జరుగుతుంది. అదే సమయంలో పూజ ఆఫీస్ లోని కొంతమంది అనుమానాస్పదంగా చనిపోతుంటారు. పూజకి పెళ్ళైన మరుసరోజే సంజయ్ సింగపూర్ కి వెళ్ళాల్సి వస్తుంది. దాంతో పూజ కూడా ఇంట్లో బోర్ కొట్టి ఆఫీస్ కి వెళుతుంది. పూజ ఆఫీస్ పార్కింగ్ డిపార్ట్మెంట్ లో సెక్యూరిటీగా పనిచేసే రాజు(విపిన్) ఆ రోజు సాయంత్రం ఎవరూ లేని సమయం చూసి పూజని కిడ్నాప్ చేస్తాడు. అసలు రాజు పూజని ఎందుకు కిడ్నాప్ చేసాడు? రాజుకి – పూజకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? పూజ ఆఫీస్ లో జరుగుతున్నా హత్యలు ఎవరు చేస్తున్నారు? అసలు సంజయ్ నిజంగానే సింగపూర్ వెళ్ళాడా? లేదా? పూజ తనని కిడ్నాప్ చేసిన రాజు నుంచి చివరికన్నా తప్పించుకుందా? లేదా? అనేది తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

దేవ్న పానికి ఈ సినిమా తొలి పరిచయం అయినప్పటికీ థ్రిల్లింగ్ సన్నివేశాల్లో హావ భావాలను బాగానే పలికించింది. ఓ పాటలో మరియు కొన్ని సీన్స్ లో గ్లామర్ తో కూడా బాగానే ఆకట్టుకుంది. అలాగే సైకో పాత్ర పోషించిన విపిన్ తన పాత్రకి పూర్తి న్యాయం చేసాడు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో రెండు మూడు సీన్స్ లో మెరిసిన రవిబాబు జస్ట్ ఓకే అనిపించాడు.

మైనస్ పాయింట్స్ :

సినిమాకి మొదటి మైనస్ పాయింట్ సినిమా నిడివి. సినిమా సుమారు రెండు గంటలు ఉంటుంది. కానీ ఈ సినిమా కాన్సెప్ట్ ని మహా అయితే 20 నిమిషాల కంటే మించి సాగదీస్తే ఆడియన్స్ కి పిచ్చెక్కుతుంది. డైరెక్టర్ కూడా తను సినిమా కథ ఏమిటనేది మొదటి పది నిమిషాల్లోనే చెప్పేయడం వల్ల ఇక చెప్పేదేమీ లేక అక్కడి నుంచి కథని అల్లుకుంటూ పోవాల్సి వచ్చింది. దాంతో ప్రేక్షకులకు ఎలాంటి సస్పెన్స్ లేకపోగా మిగతా 90 నిమిషాలు సినిమా ప్రేక్షకులకి పెద్ద సహన పరీక్ష. అడవిలో తీసిన ఓ ఎపిసోడ్ లో అస్సలు లాజిక్ లేదు.

సెకండాఫ్ మొత్తాన్ని ఒక బిల్డింగ్ పార్కింగ్ ఏరియాలోనే తీసేయడం ఆడియన్స్ కి చిరాకు తెప్పిస్తుంది. ఎందుకంటే మనకు హీరోయిన్, విలన్ కంటే ఎక్కువగా బిల్డింగ్ పిల్లర్స్ కనపడుతుంటాయి. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో సస్పెన్స్ అనేది లేకపోవడం అనే విషయాన్ని ఏమని వర్ణించాలో చెప్పండి. నాకు తెలిసి డైరెక్టర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో సస్పెన్స్ లేకుండా తీస్తే ఎలా ఉంటుందో అని ఈ సినిమా ట్రై చేసినట్టు ఉన్నాడు. అలాగే టెక్నికల్ పరంగా కూడా ఈ సినిమా చాలా చెత్తగా ఉంది.

సినిమాలో ఉన్న రెండు పాటలు సినిమాకి అవసరం లేదు, ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే ఐటెం సాంగ్. గ్లామర్ ఉంటే ముందు బెంచ్ వారిని ఆకట్టుకోవచ్చు అని అనుకున్న మన డైరెక్టర్ ఓ అనవసరపు సీన్ ని, ఓ ఐటెం సాంగ్ ని క్రియేట్ చేసాడు. అప్పటికే బోర్ కొట్టిన ప్రేక్షకులకి ఈ పాట రాగానే పుండు మీద కారం జల్లినట్టు అనిపిస్తుంది. అలాగే పాటతో పాటు సెకండాఫ్ లో హీరోయిన్ పై ఓ హాట్ సీన్ ని షూట్ చేసాడు. సినిమాలో ఎంటర్టైన్మెంట్ అస్సలు లేకపోవడం మరో బిగ్ మైనస్.

సాంకేతిక విభాగం :

జెఎస్ చౌదరి ఎంచుకున్న కథ – స్క్రీన్ ప్లే – డైరెక్షన్, ఇలా ఏ ఒక్క విభాగాన్ని సరిగా డీల్ చెయ్యలేకపోవడంతో ఆడియన్స్ ని మెప్పించలేకపోయాడు. ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో థ్రిల్లింగ్ సీన్స్ పై కేర్ తీసుకోక పోవడం కాస్త బాధాకరమైన విషయం. ఇంతకంటే ఆయన గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవద్దు. సినిమాటోగ్రఫీ బాలేదు, ఆయన కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితి ఎందుకంటే మొత్తం పిల్లర్స్ ఉన్న పార్కింగ్ ఏరియాని ఇచ్చి షూట్ చెయ్యమంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు. ఎడిటర్మనసుపెడితే సినిమాలో చాలా ఉపయోగంలేని సీన్స్ ని కత్తిరించి పారేయచ్చు. సినిమాలో విజయ్ కూరాకుల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే కాస్త పరవాలేదనిపిస్తుంది. కానీ పాటలు మాత్రం బాలేవు. డైలాగ్స్ కూడా బాలేవు.

తీర్పు :

‘నీడ’ సినిమా మీ నీడకు జాడ లేకుండా చేస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో ఉండాల్సిన ఏ ఒక్కటీ ఈ సినిమాలో లేవు. ఇది చెప్పటానికే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కానీ సినిమాలో మాత్రం సస్పెన్స్ ఉండదు. ఒకవేళ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారినే ఈ సినిమా నిరుత్సాహపరుస్తుంది. అదే మామూలు ఎంటర్టైన్మెంట్ సినిమాలు కోరుకునే వారికైతే అస్సలు ఎక్కదు. ఇక సినిమా చూడాలా వద్దా అన్నది మీ చాయిస్..

123తెలుగు.కామ్ రేటింగ్ : 1/5

రాఘవ

సంబంధిత సమాచారం

తాజా వార్తలు