జగపతి బాబు, కోట శ్రీనివాస రావు, పోసాని కృష్ణ మురళీ ప్రధాన తారాగణంగా నటించిన సినిమా ‘ఆపరేషన్ దుర్యోధన2’. ఈ సినిమా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అంతట విడుదలైంది. గతంలో వచ్చిన ‘ఆపరేషన్ దుర్యోధన’ సినిమా మంచి విజయాన్ని సాదించిన విషయం తెలిసిందే. ఆ సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమాని నిర్మించడం జరిగింది. నందం హరిశ్చంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఏ.బి శ్రీనివాస్ లు నిర్మించారు. ఈ సినిమాకి ఎమ్. ఎమ్. శ్రీ లేఖ సంగీతాన్ని అందించింది. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ :
కృష్ణ (పోసాని కృష్ణ మురళీ)హవాలా చేస్తూ వుంటాడు. అనగా రాజకీయ నాయకులు సంపాదించిన అవినీతి డబ్బును విదేశాలలో దాస్తు ఉంటాడు. వేంకటాద్రి (కోట శ్రీనివాస రావు) అవినీతి రాజకీయ నాయకుడు. ముఖ్యమంత్రి చనిపోవడంతో అదిస్టానం ఎటువంటి రాజకీయ అనుభవం లేని ఒక యంగ్ రాజకీయ నాయకుడికి ముఖ్యమంత్రి పదవిని అప్పగిస్తుంది. దానితో ఎలాగైనా ఆయన్ని గద్దెదించి తను ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు వేంకటాద్రి. ఈ తరుణంలో ఇద్దరు మంత్రుల అవినీతి సొమ్మును విదేశాలకు పంపించే పనిలో పోలీసులకు కృష్ణ మనిషి దొరికి పోతాడు.
ఆ ఇద్దరి వల్ల ముఖ్యమంత్రిపై నింద పడుతుంది. ఆయనపై పడిన మచ్చను తుడిపేయడానికి ఒక పవర్ ఫుల్ సీబీఐ ఆఫీసర్ అయిన జగపతిబాబుని రంగలోకి దిగుతాడు. జగపతిబాబు కృష్ణని ఎలా మనిషిగా మార్చి నిజం చెప్పించాడు? ముఖ్యమంత్రి పై వేసిన నిందని ఎలా పోగొట్టాడు? అనేది మీరు తెరపైనే చూడాలి.
ప్లస్ పాయింట్స్ :
జగపతి బాబు నటన బాగుంది. అలాగే చివర్లో వచ్చే రెండు పైట్స్ బాగా చేసాడు. పోసాని నటన ఎప్పటిలాగే బాగుంది. కోట శ్రీనివాస్ రావు తనకిచ్చిన పాత్రలో పరవాలేదనిపించాడు. సినిమాలో మాటలు బాగున్నాయి. వి6 రిపోర్టర్ కత్తి కార్తీక తెలంగాణ భాషలో చాలా బాగా మంత్రులను ఇంటర్వ్యూ చేసింది. స్వర్గీయ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల గురించి చాలా చక్కగా చెప్పారు. అలాగే అవినీతి రాజకీయ నాయకుల గురించి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి నటనలో మాట్లాడిన మాటలు మనిషిని కాస్త ఆలోచింపజేస్తాయి.
మైనస్ పాయింట్స్ :
సినిమాలో కథ పెద్దగాలేదు. సినిమా చూస్తుంటే ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి గురించి చూపిస్తూనే ముఖ్యమంత్రి మంచివాడని చెప్పడం ఈ సినిమా ముఖ్య ఉద్దేశం కావడంతో ప్రేక్షకుడు బోర్ ఫీలవుతున్నాడు. ప్రతిసారి మీటింగ్ పెట్టడం అవినీతి గురించి మాట్లాడటం, అదికూడా ఒకే రూంలో చూపించే సారికి ప్రేక్షకునికి చిరాకు కలుగుతుంది. స్క్రీన్ ప్లే కూడా బాగాలేదు. అసలు కొన్ని సీన్స్ ఎందుకు వస్తాయో అర్థం కాదు. రావు రమేష్ నవ్వించడానికి ప్రయత్నించాడు కానీ అసలు సెట్ అవ్వలేదు.
ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బోర్ గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో జగపతి బాబు ఎంట్రీ ఇచ్చిన తరువాతైన బాగుంటుందనుకుంటే అప్పుడు కూడా ఒకే రూంను, టెలిఫోన్ బూత్ ను చూపిస్తూ మళ్ళీ ఫస్ట్ హాఫ్ లాగే చిరాకు తెప్పిస్తాడు. ఎడిటింగ్ కూడా బాగాలేదు. దర్శకుడు సినిమాకు తగిన న్యాయం చేయలేకపోయాడు. సినిమాలో పాటలు లేకపోవడం, అలాగే కామెడీ కూడా సరిగా చిత్రికరించకపోవడంతో సినిమా మొత్తం మొదటి నుండి చివరి వరకూ సాగదీస్తూ ఉండడంతో చూసే ప్రేక్షకునికి చిరాకుగా అనిపిస్తుంది.
సాంకేతిక విభాగం :
సినిమాలో కథ ఏమిలేదు. స్క్రీన్ ప్లే అంత ఆసక్తికరంగా లేదు. నందం హరిశ్చంద్రరావు సినిమాకు దర్శకుడిగా సరైన న్యాయం చేయలేకపోయాడు. గౌతంరాజు ఎడిటింగ్ కూడా బాగాలేదు. అసలు అవసరం లేని కొన్ని సన్నివేశాలు, మాటిమాటికి వచ్చే మీటింగ్ లలో కొన్ని అనవసరమైన వాటిని తీసివేసి వుంటే బాగుండేది. సినిమాలో ఉన్న రెండు పైట్స్ ని బాగా కంపోజ్ చేసారు. ఎం.ఎం శ్రీ కేఖ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పరవాలేదు. ప్రొడక్షన్ విలువలు కూడా ఒక మాదిరిగా వున్నాయి.
తీర్పు :
ఈ సినిమా చూస్తుంటే ప్రస్తుత ప్రభుత్వం గుర్తుకొస్తుంది. వై ఎస్ చనిపోయిన తరువాత జరిగిన పరిణామాల గురించి ఈ సినిమాలో చెప్పడం జరిగింది. జగపతి బాబు నటన, సినిమాలో కొన్ని డైలాగులు తప్పితే ఏమిలేదు. ఈ సినిమాను చూస్తుంటే మన ముఖ్యమంత్రి మంచివాడని చెప్పడానికే ఈ సినిమాని తీశారని అనిపిస్తుంది. కావున ఈ సినిమా చూడాలా వద్ద అనేది మీ నిర్ణయానికే వదిలేస్తున్నాం.
123తెలుగు.కామ్ రేటింగ్ :1.5/5
నగేష్ మేకల