విడుదల తేదీ : మార్చి 31, 2017
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
దర్శకత్వం : పూరి జగన్నాథ్
నిర్మాత : సి. ఆర్. మనోహర్
సంగీతం : సునీల్ కశ్యప్
నటీనటులు : ఇషాన్, మంటారా చోప్రా, ఏంజెలా క్రిస్లిన్జ్కి
కొన్నేళ్లుగా సరైన హిట్ అందుకోవడానికి ప్రయత్నిస్తున్న దర్శకుడు పూరి జగన్నాథ్ అందులో భాగంగా చేసిన చిత్రమే ఈ ‘రోగ్’. ఇషాన్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నాడు. మరి పూరి ప్రయత్నం ఫలించిందో లేదో ఇప్పుడు చూద్దాం..
కథ :
ఇష్టం వచ్చినట్టు హాయిగా బ్రతికుతూ కాలం గడిపే కుర్రాడు చంటి (ఇషాన్) తన గర్ల్ ఫ్రెండ్ (ఏంజెలా) చేతిలో మోసపోతాడు. దాంతో అప్పటి నుండి అమ్మాయిల మీద ద్వేషం పెంచుకుంటాడు. ఆ కోపంతోనే ఒక పోలీసాఫీసర్ కాళ్ళు విరగ్గొడతాడు. కానీ ఆ తర్వాత ఆ పోలీస్ కుటుంబం పడుతున్న కష్టాలు చూసి వాళ్లకు సహాయం చేయాలనుకుంటాడు.
అలా వాళ్లకు సహాయం చేస్తున్న సమయంలోనే ఆ కుటుంబంలోని అమ్మాయి అయిన అంజలి (మన్నార చోప్ర)ని ఒక సైకో (అనూప్ సింగ్ ఠాకూర్) వెంటాడుతుంటాడు. అలా కష్టల్లో ఉన్న అంజలిని చంటి ఎలా కాపాడతాడు ? ఆ సమయంలోనే వాళ్ళ మధ్య ప్రేమ ఎలా పుడుతుంది ? అనేదే సినిమా కథ…
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో వినోదం పంచే ప్లస్ పాయింట్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి. వాటిలో మొదటిది డెబ్యూట్ హీరో ఇషాన్. ఒక హీరో ఫిగర్ కు కావలసిన అన్ని ఫీచర్స్ కలిగిన ఇషాన్ స్క్రీన్ మీద కూడా చాలా బాగా కనిపించాడు. అతని లుక్ దగ్గర్నుంచి నటన వరకు అన్నీ బాగానే ఉన్నాయి. అతన్ని ఒక మాస్ హీరోగా పరిచయం చేసేందుకు పూరి బాగానే కష్టపడ్డాడు. ప్రతి నాయకుడి పాత్రలో నటంచిన అనూప్ సింగ్ ఠాకూర్ కూడా బాగానే నటించాడు.
హీరోయిన్ మన్నార చోప్రా కూడా చాలా అందంగా కనిపించింది. ఇదివరకటి సినిమా కంటే ఇందులో బాగుంది కూడ. పైగా తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించింది. ఫస్టాఫ్ మొత్తం మాజీ గర్ల్ ఫ్రెండ్స్ మీద వేసే సెటైర్లు, జోకులతో జస్ట్ ఓకే అనిపించింది.
మైనస్ పాయింట్స్ :
సినిమా సెకండాఫ్ అస్సలు బాగోలేదు. ప్రతి సీన్ ఓవర్ గానే అనిపించింది. పూరి కథనంలో క్లారిటీ, లాజిక్ రెండూ లోపించాయి. సైకో కిల్లర్ దాదాపు 50 మంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేసినప్పటికీ అతన్ని పోలీసులు ఏమీ చేయలేకపోవడం వంటి సిల్లీ పాయింట్స్ సినిమాలో చాలానే ఉన్నాయి. వాటిని చూస్తే పూరి లాంటి గొప్ప దర్శకుడు ఇలాంటి సినిమాలు తీయడమేమిటి అనే ఆశ్చర్యంకలుగుతుంది.
ఆడవాళ్లను విమర్శించడం ఆరంభంలో బాగానే ఉన్నా పోను పోను అది కాస్త ఎక్కువై, ఇంక చాలు అనేంత చిరాకు పెట్టింది. సైకో కిల్లర్ ను హీరో డీల్ చేసిన విధానం, ఆ సన్నివేశాలు మరీ అతిగా అనిపించాయి. సెకండాఫ్లో నడిచే హీరోయిన్ కుటుంబానికి సంబందించిన కథనం కాస్త కూడా ఆకట్టుకోలేదు.
అలీ కామెడీలో కూడా ఏమాత్రం కొత్తదనం లేక బోర్ కొట్టింది. అనూప్ సింగ్ ఠాకూర్ సైకో పాత్రలో బాగా నటిద్దామని ప్రయత్నించినప్పటికీ అతన్ని సరిగా చూపించలేదు. దాంతో కథ చాలా చోట్ల పక్కదారి పడుతున్నట్లు తోచింది.
సాంకేతిక విభాగం :
సినిమా నిర్మాణ విలువలు చాలా గొప్పగా ఉన్నాయి. ఎంచుకున్న లొకేషన్స్, కెమెరా వర్క్ బాగున్నాయి. సునీల్ కయ్యప్ సంగీతం పర్వాలేదనిపించినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. పూరి స్టైల్లో ఉండే డైలాగులు హీరో ఇషాన్ కు చాలా బాగా యాప్ట్ అయ్యాయి. ఎడిటింగ్ పర్వాలేదనిపించే స్థాయిలో ఉంది.
ఇక పూరి విషయానికొస్తే ఆయన సినిమా చేసిన విధానం తీవ్రంగా నిరుత్సాహపరిచింది. అసలు సినిమాలో కథ అనేదే లేదు. పూరి ట్రేడ్ మార్క్ ఫన్, దమ్ము కూడా మిస్సయ్యాయి. మొత్తం మీద ఈ సినిమా విషయంలో ఆయన విజయం సాధించిన అంశం ఏమిటంటే కొత్త హీరో ఇషాన్ ను బాగా చూపించడమొక్కటే.
తీర్పు :
పూరి చేసిన ఈ ‘రోగ్’ అనే ఈ రొటీన్ రొమాంటిక్ డ్రామా బిలో యావరేజ్ గానే ఉంది. సెకండాఫ్ అంతా నిరుత్సాహపరచడం, కథ మిస్సవడం, ఆకట్టుకునే కథనం లేకపోవడం, అతిగా అనిపించే సన్నివేశాలు వంటివి సినిమాను దిగజార్చాయి. కేవలం ఇషాన్ ను హీరోగా పరిచయం చేయడం అనే అంశంలో మాత్రమే పూరి కాస్తో కూస్తో సక్సెస్ అయ్యాడు. కానీ మిగతా ముఖ్యమైన కథ, కథనం, ఎంటర్టైన్మెంట్ అనే అంశాలను పట్టించుకోకపోవడంతో ప్రేక్షకులకు ఈ ‘రోగ్’ పూరి యొక్క పాత చింతకాయ పచ్చడిలానే అనిపిస్తుంది.
123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team