సమీక్ష : సహస్ర – అరుంధతికి కట్, కాపీ, పేస్ట్.. కానీ..

సమీక్ష : సహస్ర – అరుంధతికి కట్, కాపీ, పేస్ట్.. కానీ..

Published on Oct 4, 2013 11:30 PM IST
Sahasra విడుదల తేదీ04 అక్టోబర్ 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5
దర్శకుడు : శ్రీవిశాల్ కందుకూరి
నిర్మాత : పిఎల్ఎన్ రాజు
సంగీతం గీతా పూనిక్
నటీనటులురాజీవ్ కనకాల, శ్రీ ఐర, రేవ, కృష్ణుడు.. 

మన టాలీవుడ్ లో చాలా మంది కొత్త దర్శకులు హారర్ థ్రిల్లర్ సినిమాలు చేసి విజయాన్ని అందుకోవాలని కలలు కంటుంటారు. కానీ అందులో ఏ ఒక్కరో ఇద్దరో మాత్రమే సక్సెస్ అయ్యారు. అయినప్పటికీ చాలా మంది ఇదే ఫార్ములాని ట్రై చేస్తూనే ఉన్నారు. వారిలానే శ్రీవిశాల్ కందుకూరి దర్శకుడిగా పరిచయమవుతూ నూతన నటీనటులకి రాజీవ్ కనకాల, కృష్ణుడు లాంటి సీనియర్ నటులని కలిపి తెరకెక్కించిన హార్రర్ సినిమా ‘సహస్ర’. పిఎల్ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమాకి గీతా పూనిక్ సంగీతం అందించాడు. చాలా మంది కొత్త దర్శకులలానే పిఎల్ఎన్ రాజు కూడా హారర్ సినిమాని సరిగా డీల్ చెయ్యలేక దెబ్బై పోయాడా లేక మెప్పుపొంది విజయాన్ని అందుకున్నాడా అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

చింతపల్లి అనే సంస్థానానికి రాజుగా, అలాగే చుట్టూ ప్రక్కల గ్రామాలకు పెద్దగా రుద్ర నరసింహ రాజు(రాజీవ్ కనకాల) వ్యవహరిస్తుంటాడు. రుద్ర నరసింహ రాజు అందమైన భార్య పేరు మయూక దేవి(రేవ). వారి వంశాచారం ప్రకారం వారి ఇంటి ఆడవారు ఎప్పుడు ప్రజలకు కనపడకూడదు. అందుకే మయూక దేవి ఎప్పుడూ బయటకి రాదు. దాంతో రుద్ర నరసింహరాజు దగ్గర పనిచేసే మూగవాడైన చిన్నప్ప(షఫీ) ఆమె అందమైన రూపాన్ని ఎలాగైనా చూడాలనుకుంటాడు, చూసిన తర్వాత ఆమెని ఎలాగైనా తనదాన్ని చేసుకోవాలనుకుంటాడు. దాని కోసం ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తున్న తరుణంలో అతని ఓ అఘోరా కనిపించడం, అతని నుంచి కొన్ని విద్యలు నేర్చుకోవడం, వాటిని మయూక దేవిపై ప్రయోగించడం లాంటివి చకచకా జరిగిపోతుంటాయి.

అదే తరుణంలో అనుమానాస్పదంగా రుద్ర నరసింహ రాజు, మయూకా దేవి చనిపోతారు. అ తర్వాత మయూక దేవి సహస్ర(శ్రీ ఐర)గా మళ్ళీ జన్మించిందని తెలుసుకున్న చిన్నప్ప సహస్రని ఎలాగైనా తన వశం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. చివరికి సహస్రని చిన్నప్ప వశపరుచుకొని తన కోరికని నేరవేర్చుకున్నాడా? లేదా సహస్ర తనకు జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే తెలుసుకోగలిగిందా? అసలు ఉన్నపాటుగా రుద్ర నరసింహ రాజు, మయూకా దేవి ఎందుకు చనిపోయారు? వాళ్ళు చనిపోయారా లేక ఎవరి చేతైనా చంపబడ్డారా? చివరికి చిన్నప్ప ఎమైపోయాడు? అనేది తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

రుద్ర నరసింహ రాజు అనే యువరాజు పాత్రలో రాజీవ్ కనకాల బాగా నటించాడు. అలాగే మయూక దేవి పాత్ర పోషించిన రేవ కాస్త నటనతో, కాస్త గ్లామర్ తో బాగానే ఆకట్టుకుంది. మూగవాడిగా, అఘోరాగా షఫీ నటన బాగుంది. శ్రీ ఐర, కృష్ణుడు, రవి ప్రకాష్ పరవాలేధనిపించారు. సెకండాఫ్ లో ఆర్ట్ చాలా చోట్ల ఆర్ట్ డైరెక్టర్ పనితనం బాగుంది. కథకి అవసరం లేకపోయినా ఫ్లోరా షైనీ ఐటెం సాంగ్ లో చేసిన అందాల ఆరబోత ముందు బెంచ్ వారిని ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి మొదటిది, బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అంటే ఫస్ట్ హాఫ్. నాకు తెలిసి ఫస్ట్ హాఫ్ లో 5-10 నిమిషాలు తప్ప మిగతా ఏదీ సినిమాకి అసలు అవసరం లేదు. అనుకున్న కాన్సెప్ట్ కి ఫస్ట్ హాఫ్ కి సంబధం లేదు. ఏదో కొన్ని హార్రర్ సీన్స్ పెట్టి ఆడియన్స్ ని భయపెట్టి చివర్లో వేరే కాన్సెప్ట్ చెబితే కనెక్ట్ అయిపోతుందని ఆలోచించినట్టున్నాడు డైరెక్టర్ కానీ డీల్ చెయ్యలేక తను తీసిన గోతిలో తానే పడ్డాడు. అలాగే ఫస్ట్ హాఫ్ లో వచ్చే హార్రర్ సీన్స్ ఏ ఒక్కదానిలోనూ లాజిక్ లేదు, అసలు ఎందుకలా జరుగుతోందని ప్రేక్షకులని మెంటల్ వస్తుంది.

మన డైరెక్టర్ కి ఒక మూగవాడిని అఘోరాలా చూపించాలాని ఎందుకు అనిపించిందో ఆయనకే తెలియాలి. అఘోరా కాన్సెప్ట్ లో లాజిక్ అనేది పూర్తిగా కరువైపోయింది. డైరెక్టర్ కథా పరంగా ఆత్మల గురించి ఒకలా చెప్తాడు కానీ చివర్లో మాత్రం వేరేలా చూపించడంతో ప్రేక్షకులు గందరగోళంలో పడతారు. సినిమాలో ఎంటర్టైన్మెంట్ అస్సలు లేదు. సినిమాలో వాడిన సిజి ఎఫెక్ట్స్ చాలా నాశిరకంగా ఉన్నాయి. అస్సలు బాగాలేవు. మనకు సినిమాలో మొత్తం 3 పాటలు ఉంటాయి. కథా పరంగా అయితే ఒక్కటే అవసరం మిగతా రెండిటిలో హీరోయిన్ ప్రమోషన్ కోసం ఒకటి చేస్తే, మరొకటి డైరెక్టర్ ఐటెం సాంగ్ తియ్యాలి అనే సరదా తీర్చుకోవడానికి చేసినట్లుంది. ఈ మధ్య కాలంలో కొంతమంది కొత్త దర్శకులకి అవసరం ఉన్నా లేకపోయినా ఐటెం సాంగ్స్ పెట్టడం ఫ్యాషన్ అయిపొయింది.

చివరిగా ఈ సినిమా కాన్సెప్ట్ లో 96% సూపర్ డూపర్ హిట్ అయిన ‘అరుంధతి’ మూవీదనే చెప్పాలి. మక్కికి మక్కి ఉంటే అనుమానం వస్తుంది కాబట్టి ఆ 4% మార్పులు చేర్పులు చేసారు. హాలీవుడ్ లో కొన్ని సూపర్ హిట్ సినిమాలకు పేరడీగా కొన్ని కామెడీ సినిమాలు వస్తుంటాయి. ఆ తరహాలోనే ఈ సినిమా ఉంది కానీ మన డైరెక్టర్ కనీసం ఎంటర్టైన్ కూడా చెయ్యలేకపోయాడు.

సాంకేతిక విభాగం :

ఇప్పటి వరకూ నెగటివ్ చెప్పాము కాబట్టి సాంకేతిక విభాగంలో ఉన్న ఒకటి రెండు ప్లస్ పాయింట్స్ గురించి చెబుతాను. సెకండాఫ్ లో చూపించన పెద్ద భవనం, కొన్ని సెట్స్ విషయంలో ఆర్ట్ డైరెక్టర్ పనితనం బాగుంది. సెకండాఫ్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, కానీ ఫస్ట్ హాఫ్ మరియు పాటల విషయంలో ఫెయిల్ అయ్యాడు. ఎడిటర్ ఎంఆర్ వర్మ అయినా చెప్పుండాల్సింది ఫస్ట్ హాఫ్ అవసరం లేదు తీసెయ్యమని కానీ అలా జరక్కపోవడంతో సినిమా బోరింగ్ గా ఉంటుంది. డైలాగ్స్ జస్ట్ ఓకే.

కథ – మన తెలుగు హిట్ సినిమాల నుంచి కాపీ కొట్టిందే, స్క్రీన్ ప్లే – అస్సలు బాలేదు, దర్శకత్వం – స్క్రీన్ ప్లే కన్నా దారుణంగా ఉంది. నటీనటులను ఎంచుకోవడంలో కాదు ఎంచుకున్న కథని ఆడియన్స్ కి కనెక్ట్ చేసేలా చెప్పడంలోనే డైరెక్టర్ టాలెంట్ ఉంటుంది. ఆ విషయంలో డైరెక్టర్ సింగల్ డిజిట్ మార్క్స్ తెచ్చుకున్నాడు.

తీర్పు :

‘సహస్ర’- తెలుగు ప్రేక్షకులని మెప్పించలేని మరో హర్రర్ సినిమా. ఈ సినిమాలో చూడటానికి, చెప్పుకోవడానికి పరవాలేదనిపించే సీనియర్ నటుల నటన తప్ప ఇంకేమీ లేదు. ఈ సినిమా కాన్సెప్ట్కట్, కాపీ, పేస్ట్ ఫర్ ‘అరుంధతి’. కానీ టేకింగ్ విషయంలో మాత్రం చాలా చెత్త మూవీ అని చెప్పాలి. కాన్సెప్ట్ ఆ రేంజ్ లో ఉంది కదా అని సినిమా కూడా ఆ రేంజ్ లో ఉంటుందని అనే ఆలోచనని అస్సలు మీ మదిలోకి రానివ్వకండి. అలా ఆశించి మీరు సినిమాకి వెళితే మీకు జేబుకి చిల్లు పడటమే కాకుండా మీకు ఫ్రీగా తలనొప్పి కూడా వస్తుంది. మీరు ఈ సినిమాకి వెళ్ళడం కంటే మీ దగ్గర ఉన్న ‘అరుంధతి’ సినిమాని మరోసారి చూడండి. అదే మీకు మంచిది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5

రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు