విడుదల తే3ీ : 13 డిసెంబర్ 2014 | ||
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.75/5 | ||
దర్శకత్వం : శశికిరణ్ నారాయణ |
||
నిర్మాత : నాగేశ్వరరావు కొల్ల |
||
సంగీతం : షాన్ రెహమాన్ |
||
నటీనటులు : దిలీప్ కుమార్, ప్రియల్ గోర్ .. |
2012 జూలైలో మలయాళంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన సినిమా ‘తట్టతిన్ మరయతు’. ఈ సినిమాని తెలుగులో ‘సాహెబా సుబ్రహ్మణ్యం’ గా రీమేక్ చేసారు. ప్రముఖ కమెడియన్ ఎంఎస్ నారాయణ కుమార్తె శశికిరణ్ నారాయణ దర్శకురాలిగా పరిచయం అవుతూ చేసిన సినిమా ఇది. దిలీప్ కుమార్, ప్రియల్ గోర్ హీరో హీరోయిన్స్ గా పరిచయం అయిన ఈ సినిమా ఈ రోజు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా మలయాళ మూవీ మేజిక్ ని ఇక్కడ కూడా రిపీట్ చేసి, తెలుగు ప్రేక్షకులను మెప్పించిందో లేదో అనేది ఇప్పుడు చూద్దాం…
కథ :
కథ భీమిలిలో మొదలవుతుంది.. సుబ్రహ్మణ్య శాస్త్రి అలియాస్ సుబ్బు(దిలీప్ కుమార్) కాలేజ్ చదివే కుర్రాడు. ఓ రోజు తన ఫ్రెండ్ పెళ్లిలో చూసిన అయేషా (ప్రియల్ గోర్)ని చూసి ప్రేమలో పడతాడు. కొద్ది రోజులకి అయేషా కూడా సుబ్బుని ప్రేమిస్తుంది. కానీ అయేషా ముస్లీం అమ్మాయి కావడం వలన, సుబ్బు హిందూ కావడం వలన వాళ్ళ ప్రేమలో కొన్ని సమస్యలు వస్తాయి. మరి సుబ్బు – అయేషాలు తమ ప్రేమలో ఎదురైన ఇబ్బందులను ఎలా ఎదుర్కున్నారు? చివరికి సుబ్బు – అయేషా ఒకటయ్యారా.? లేదా.? అన్నది తెరపైనే చూడాలి..
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకి ప్లస్ అయిన పాయింట్ కథ, ఇదొక ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అవ్వడం.. అలాగే ఆ కథని విజువల్స్ పరంగా అంతకన్నా బ్యూటిఫుల్ గా చూపించారు. సినిమా మొదటి నుంచి మిమ్మల్ని కట్టిపడేసేది ఇద్దరే.. వాళ్ళే సినిమాటోగ్రాఫర్ మరియు మ్యూజిక్ డైరెక్టర్. వీళ్ళిద్దరే ఈ సినిమాకి ప్రాణం పోశారు. అటు సినిమాటోగ్రఫీ కళ్ళకు ఆనందాన్ని ఇస్తుంటే, మ్యూజిక్ చెవులకు వినసొంపైన ఫీల్ ని అందిస్తూ ఉంటుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే.. హీరో దిలీప్ కుమార్, హీరోయిన్ ప్రియల్ గోర్ ఇద్దరూ కొత్త వాళ్ళే.. కానీ హీరో అనే మెటీరియల్ ప్లస్ లో చెప్పుకునేది కాదు.. కావున హీరోయిన్ గురించి చెబుతా.. ప్రియల్ గోర్ ముస్లీం ఉమ్మచ్చి కుట్టి పాత్రలో చూడటానికి చాలా బాగుంది. పరదా కప్పుకొని ఉన్న కొన్ని సీన్స్ లో తనని చూపించిన విధానం, తన ఎక్స్ ప్రెషన్స్ సింప్లీ సూపర్బ్. ముఖ్యంగా క్లైమాక్స్, కొన్ని ఎమోషనల్ సీన్స్ లో తను చూపించిన హావభావాలు సినిమాకి హైలైట్ అయ్యాయి. ప్రతి సినిమాలోనూ తన వంతు బాధ్యతగా తనకిచ్చిన పాత్రలో జీవిస్తున్న రావు రమేష్ ఈ సినిమాలో కూడా ఓ మంచి పాత్ర చేసాడు. పోలీస్ ఆఫీసర్ గా తను గంభీరంగా కనపడుతూనే, తన డైలాగ్ మాడ్యులేషన్ తో ఆడియన్స్ ని నవ్విస్తాడు. వీరితో పాటు హీరో ఫ్రెండ్ గా కనిపించిన రాఘవేంద్ర సూపర్బ్ గా చేసాడు. తన కామెడీ ఫస్ట్ హాఫ్ లో ఆడియన్స్ ని నవ్విస్తుంది.
తాగుబోతు రమేష్ బార్ సీన్ లో నవ్విస్తే, సీనియర్ నరేష్ క్లైమాక్స్ లో హార్ట్ టచ్ చేస్తాడు. ఇకపోతే ఎం.ఎస్ నారాయణ, గిరి, కొండవలన తమ పాత్రల పరిధిమేర నటించారు. సినిమా ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ బాగుంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్ కూడా బాగుంటుంది. అలాగే క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది.
మైనస్ పాయింట్స్ :
ఎవరు ఎలా అనుకున్నా ఈ సినిమాకి మైనస్ పాయింట్ హీరో దిలీప్ కుమార్.. ఎందుకంటే ఈ సినిమా హీరో చుట్టూనే తిరుగుతుంది కనుక తన హావ భావాలే ఈ సినిమాకి ప్రధాన బలం.. కానీ హీరో ఫేస్ లో ఎలాంటి సీన్స్ లో అయినా ఎక్స్ ప్రెషన్స్ మాత్రం అస్సలు కనిపించవు. ముఖ్యంగా హీరో – హీరోయిన్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ లో అటు వైపు హీరోయిన్ మంచి ఎక్స్ ప్రెషన్స్ ఇస్తున్నా హీరో ఫేస్ లో మాత్రం మనకు ఎలాంటి ఎక్స్ ప్రెషన్స్ కనిపించవు. కథనంలో కూడా ఎలాంటి ట్విస్ట్ లు లేకపోవడంతో కథ చాలా సింపుల్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే ఆడియన్స్ లో బాగా ఎగ్జైట్ అయ్యే ఫీలింగ్ మాత్రం ఉండదు.
ఇకపోతే సెకండాఫ్ ఈ సినిమాకి మైనస్ పాయింట్.. ఫస్ట్ హాఫ్ ని చాలా ఆసక్తికరంగా తీసుకువచ్చి ఇంటర్వెల్ బ్రేక్ ఇస్తారు.. కానీ సెకండాఫ్ స్టార్టింగ్ నుంచి చివరి క్లైమాక్స్ వరకూ కథనంతో ఆసక్తిగా నడిపించలేకపోయారు. ఫస్ట్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ సెకండాఫ్ లో అది కరువైంది. అలాగే సెకండాఫ్ లో వచ్చే చాలా సీన్స్ ఎమోషనల్ గా ఉంటాయి, కానీ నటీనటుల నుంచి మాత్రం ఆ ఎమోషన్స్ రాకపోవడంతో ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ అవ్వరు. హీరో – హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కూడా పెద్దగా వర్క్ పోట్ అవ్వలేదు. అదే గనుక ఈ కెమిస్ట్రీ వర్క్ అవుట్ అయ్యి ఉంటే మాత్రం సినిమా రిపోర్ట్ మరోలా ఉండేది.
సాంకేతిక విభాగం :
పైన చెప్పినట్టు సాంకేతిక విభాగంలోని ఇద్దరే ఈ సినిమాకి ప్రాణం పోశారు. వాళ్లిద్దరే షాన్ రెహ్మాన్, సాయి ప్రకాష్.. సాయి ప్రకాష్ అందించిన సినిమాటోగ్రఫీ మీ కళ్ళకు నయనానందాన్ని అందిస్తుంది. కేరళలో షూట్ చేసిన ప్రతి లొకేషన్ ని చాలా బాగా చూపించారు. తన అద్భుతమైన లైటింగ్, గ్రాండ్ విజువల్స్ మన చూపును పక్కకి తిప్పుకోనివ్వవు. ఇంత మంచి విజువల్స్ కి షాన్ రెహ్మాన్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరింత ఫీల్ తెచ్చాయి. సినిమాలో హీరో – హీరోయిన్ మధ్య వచ్చే ఎమోషన్స్ ని చాలా వరకూ మ్యూజిక్ తోనే ఆడియన్స్ కి కనెక్ట్ చెయ్యడానికి ట్రై చేసారు. అందులో రెహ్మాన్ చాలా సక్సెస్ అయ్యాడు. పాటల్లో మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో వచ్చే సాహెబా సాహెబా అనే బిట్ ఆడియన్స్ మదిలో అలానే నిలిచిపోతుంది. ఇకపోతే ప్రవీణ్ పూడి అందించిన ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ కి చాలా బాగుంది, కానీ సెకండాఫ్ పైన ఇంకాస్త శ్రద్ధ తీసుకోవాల్సింది. ఎందుకంటే సెకండాఫ్ చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. మలయాళ వెర్షన్ డైలాగ్స్ ని సేమ్ టు సేమ్ కిట్టు తెలుగులో అనువదించాడు.
ఇకపోతే ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అయిన శశికిరణ్ నారాయణ గురించి చెబుతా.. ఆమె రాసుకున్న కథనంలో సెకండాఫ్ లో ఒరిజినల్ కంటెంట్ లో ఉన్న మేజిక్ ఎక్కడో మిస్ అయ్యింది. అందుకే సెకండాఫ్ ఆడియన్స్ ని కాస్త బోరింగ్ గా అనిపిస్తుంది. ఇకపోతే దర్శకురాలిగా తను చాలా డిపార్ట్ మెంట్స్ లో సక్సెస్ అయ్యింది. కానీ హీరో నుంచి నటనను రాబట్టుకోవడంలో మాత్రం ఫెయిల్ అయ్యింది. ఆమెలో టాలెంట్ ఉంది కానీ ఇక ముందు చేయబోయే సినిమాల్లో తన కథకు పర్ఫెక్ట్ గా సరిపోయే నటీనటులను తీసుకుంటే సక్సెస్ అవకాశం ఉంది. ఇకపోతే నిర్మాతగా నాగేశ్వరరావు కల్లా మంచి సినిమాని అందించాడు.
తీర్పు :
మలయాళ సూపర్ హిట్ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ‘సాహెబా సుబ్రహ్మణ్యం’ ఒరిజినల్ సినిమాలోని మేజిక్ ని పర్ఫెక్ట్ గా రీ క్రియేట్ చెయ్యలేకపోయినా ఇంచు మించుగా మాత్రం చేయగలిగారు.రొటీన్ కి భిన్నంగా ఒక ఫీల్ గుడ్ లవ్ స్టొరీ చూడాలనుకునే వారు ఈ సినిమా చూడటానికి ట్రై చెయ్యచ్చు. కానీ ముందు నుంచే హీరో పెర్ఫార్మన్స్ బాగోదు అనే ఫీలింగ్ ని మీ మదిలో పెట్టుకొని వెళితేనే మీరు ఎంజాయ్ చెయ్యగలరు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, హీరోయిన్ ప్రియల్ గోర్, ఫస్ట్ హాఫ్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అయితే హీరో దిలీప్ కుమార్ పెర్ఫార్మన్స్, బోరింగ్ సెకండాఫ్, ఒరిజినల్ కెమిస్ట్రీని పర్ఫెక్ట్ గా రీ క్రియేట్ చెయ్యలేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్స్. ఒకరిద్దరి పెర్ఫార్మన్స్ బాలేకపోయినా పర్లేదు అనుకుంటే మాత్రం ఈ వారం హ్యాపీగా చూడదగిన ఫీల్ గుడ్ లవ్ స్టొరీ ‘సాహెబా సుబ్రహ్మణ్యం’.
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.75/5
123తెలుగు టీం