సమీక్ష : శీనుగాడి లవ్‌స్టోరీ – శీనుగాడు చెప్పేదీ.. పాత ప్రేమకథే..!

సమీక్ష : శీనుగాడి లవ్‌స్టోరీ – శీనుగాడు చెప్పేదీ.. పాత ప్రేమకథే..!

Published on Jul 4, 2015 3:00 AM IST
Seenugadi Love story

విడుదల తేదీ : 03 జూలై 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : ఎస్. ప్రభాకరన్

నిర్మాత : తుమ్మలపల్లి రామ సత్యనారాయణ

సంగీతం : ప్రవీణ్ ఇమ్మడి

నటీనటులు : ఉదయనిధి స్టాలిన్, నయనతార

ఉదయనిధి స్టాలిన్, నయనతారలు హీరో హీరోయిన్లుగా ఎస్. ప్రభాకరన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ’ఇదు కాథిర్వేలన్ కాదల్’. గత సంవత్సరం తమిళంలో విడుదలైన ఈ సినిమాను తెలుగులో ’శీనుగాడి లవ్‌స్టోరీ’ పేరుతో తుమ్మలపల్లి రామ సత్యనారాయణ అనువదించారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ముడిపెట్టి అల్లిన ఓ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఏమేరకు ఆకట్టుకుంది? చూద్దాం..

కథ :

తండ్రి మాటకు ఎదురుచెప్పని కుటుంబంలో పుట్టి పెరిగిన శ్రీనివాస్ (ఉదయనిధి స్టాలిన్), తండ్రికి చెప్పకుండా ఇంట్లో నుంచి పారిపోయి పెళ్ళి చేసుకున్న తన అక్క దాంపత్య జీవితంలో తలెత్తిన ఇబ్బందులను తీర్చడానికి హైద్రాబాద్ వస్తాడు. ఆ క్రమంలోనే అక్క-బావల మధ్యన గొడవలను తీర్చడంతో పాటు తన అక్క వాళ్ళ ఎదురింట్లోని అమ్మాయి పవిత్ర (నయనతార)ను చూడగానే ప్రేమలో పడిపోతాడు. శీను తన ప్రేమను వ్యక్తపరచడానికి రకరకాలుగా ప్రయత్నిస్తుండగా, పవిత్ర తాను గౌతమ్ అనే ఒకతణ్ణి ప్రేమిస్తున్నానని చెబుతుంది.

గౌతమ్ ఆడవాళ్ళను నీచంగా చూసే సంస్కారం, ఆలోచనలున్న వ్యక్తి. గౌతమ్ అసలు నిజం తెలుసుకున్నాక పవిత్ర అతడికి దూరమవుతుంది. ఆ తర్వాత శీను ప్రేమను అర్థం చేసుకొని అతణ్ణి ప్రేమించడం మొదలుపెడుతుంది. అయితే కూతురు చేసిన తప్పు కొడుకు చేయడన్న ఆలోచనలో ఉన్న తండ్రికి శీను తన ప్రేమ విషయం ఎలా చెప్పాడు? వారి ప్రేమకు శీను తండ్రి ఒప్పుకున్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

ప్లస్‌పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్‌పాయింట్ అంటే అతి సాధారణమైన కథను వీలైనన్ని ఎక్కువ సబ్‌ప్లాట్స్‌తో నడిపించడం గురించి చెప్పుకోవచ్చు. శీనుగాడి లవ్‌స్టోరీకి ఒక అర్థం తీసుకురావడానికి ఈ రకరకాల సబ్‌ప్లాట్స్ బాగా ఉపయోగపడ్డాయి. సినిమా మొత్తాన్నీ చాలావరకు కామెడీ సన్నివేశాలతో చెప్పించే ప్రయత్నం చేయడం మూలాన చివరివరకూ సినిమా సరదా సరదాగా సాగిపోతుంది. ఈ కామెడీయే సినిమాను చాలా చోట్ల కాపాడుతుందంటే అతిశయోక్తి కాదు. నయనతార-ఉదయనిధిల మధ్యన వచ్చే లవ్ సీన్స్ బాగున్నాయి.

హీరో ఉదయనిధి స్టాలిన్ తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించాడు. ఎక్కువ సబ్‌ప్లాట్స్‌తో నడిచే సినిమా కావడంతో సినిమాను తన భుజాలపైనే మోసే బాధ్యతలు లేకపోవడం మూలాన చలాకీగా చేసేశాడు. నయనతార ఎప్పట్లానే బాగా నటించడంతో పాటు పాత్ర పరిధిమేర పద్ధతిగా కనిపిస్తూ, పాటల్లో గ్లామరస్‌గా కనిపించింది. ఇక సంతానం కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమా ఆసాంతం నడిచే ఈ పాత్ర నవ్వుతూ, నవ్విస్తూ సాగిపోతుంది.

ఇక సినిమా పరంగా చూసుకుంటే.. ఫస్టాఫ్ మొత్తం హీరో, హీరోయిన్ చుట్టూ తిరిగే సరదా సరదా సన్నివేశాలతో కూల్‌గా సాగిపోతుంది. ఈ పార్ట్‌లో పెద్దగా కథేమీ చెప్పలేదు. సెకండాఫ్‌లో మాత్రం సినిమాను చాలా చోట్ల ఎమోషనల్ అంశాల వైపు మళ్ళించి అసలు కథలోకి మళ్ళించే ప్రయత్నం చేశారు. పూర్తి కామెడీ కోరుకునే వారికి ఫస్టాఫ్ బాగా నచ్చుతుంది. మంచి ఎమోషన్ కోరేవారికి సెకండాఫ్‌ నచ్చుతుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే ఫార్ములా కథ గురించే చెప్పుకోవాలి. చాలా సార్లు చూసి ఉన్న, ఒక చిన్న లైన్‌నే ఈ సినిమాకు కథగా ఎంచుకోవడం మైనస్‌గా చెప్పుకోవచ్చు. వివిధ సబ్‌ప్లాట్స్‌తో కథను బలమైనదిగా మార్చే ప్రయత్నం జరిగినా చివర్లో మాత్రం ఆ చిన్న లైన్ మాత్రమే కనిపిస్తుంది. ఆ లైన్ కాకుండా సినిమాలోని ఎమోషన్‌ను కానీ, సబ్‌ప్లాట్స్‌తో వచ్చే క్లారిటీనిగానీ సరిగ్గా చూపించగలిగి ఉంటే బాగుండేది. ఒకానొక స్టేజ్‌లో చూసిన సీన్లనే చూపిస్తున్నట్టు రిపీట్ సన్నివేశాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి.

స్క్రీన్‌ప్లే కూడా చాలా సాదాసీదాగా సాగిపోతుంది. ఫస్ట్ సీన్లో మొదలైన సస్పెన్స్ ఎలిమెంట్ క్లైమాక్స్‌లో చూసినప్పుడు తప్ప గుర్తుకురాదు. అంటే ఒక సస్నెన్స్ ఎలిమెంట్ ఉందన్న విషయాన్నే స్క్రీన్‌ప్లేలో కొద్దిసేపటికే మరిపించారు. ఇన్ని సబ్‌ప్లాట్స్ ఉన్న సినిమాలో రెండు బలమైన సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉంటే కథ ఆసక్తికరంగా నడిచేదేమో! ఇక సినిమాలో పాటలు ఇంతకుముందు ఎక్కడో విన్నామే అనే ఫీలింగ్‌నే కల్పిస్తాయి. పాటల విజువల్స్ చాలా అందంగా ఉన్నా సినిమాలో అవి వచ్చే సందర్భమే ఆకట్టుకోదు.

ఇక తమిళం నుంచి తెలుగులో డబ్ అయిన సినిమా కావడం చేత సినిమాలోని పాత్రలు, పాత్రధారులు, పరిస్థితులు తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువ. క్లైమాక్స్ మరీ సినిమాటిగ్గా ఉంది. తండ్రి-కొడుకుల మధ్యన అలాంటి సంభాషణలు ఇప్పటికే తెలుగులో చాలా సినిమాల్లో చూసి ఉన్నాం.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ముందుగా దర్శకుడు ఎస్.ప్రభాకరన్ గురించి చెప్పుకోవాలి. ఒక ఫార్ములా కథను, ఫార్ములా స్క్రీన్‌ప్లేతోనే నడపడంతో రచయితగా ఆయన మరీ ఎక్కువగా చేసిందేమీ లేదు. మంచి కామెడీతో, వివిధ సబ్‌ప్లాట్స్‌లలో కథను చెప్పే విషయంలో మాత్రం రచయితగా, దర్శకుడిగా బాగానే ఆకట్టుకున్నాడు.

సినిమాటోగ్రాఫర్ బాలసుబ్రమణ్యం పనితనానికి మంచి మార్కులే పడతాయి. పాటల్లో అందమైన లొకేషన్లను అంతే అందంగా బంధించారు. ఊరు, సిటీ నేపథ్యాల్లోని తేడాను సరిగ్గా చూపగలిగారు. సంగీత దర్శకుడు హరీస్ జయరాజ్ స్థాయి పాటలు ఈ సినిమాలో ఓ రెండు ఉన్నాయి. మిగతావన్నీ పెద్దగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా తన పాత సినిమాలవే వాడడం ఏమాత్రం ఆకట్టుకోదు. ఎడిటింగ్ ఫర్వాలేదనేలా ఉంది. అందంగా తెరకెక్కాయన్న పేరుకే పాటలను పెట్టొచ్చు తప్ప అవి ఉండి సినిమాకు చేసిన న్యాయమేమీ లేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

తీర్పు :

తెలుగు సినిమాల సందడి ఉన్నప్పుడైనా, లేనప్పుడైనా తమిళ సినిమాలు తెలుగులో రావడం మాత్రం ఎప్పుడూ ఆగలేదు. ఆ కోవలోనే తాజాగా వచ్చిన మరో తమిళ డబ్బింగ్ సినిమాయే ’శీనుగాడి లవ్‌స్టోరీ’. మంచి సున్నితమైన హాస్యం, ప్రేమ, ఫ్యామిలీ సెంటిమెంట్ ఇలా అన్ని అంశాలనూ మేళవించుకొని వచ్చిన ఈ సినిమాకు ఇవే హైలైట్‌గా నిలుస్తాయని చెప్పొచ్చు. ఇక ఫార్ములా కథనే ఫార్ములా సినిమాలానే తెరకెక్కించడం, అసందర్భంగా వచ్చే పాటలు, నేరు తెలుగు సినిమా కాకపోవడం ఈ సినిమాకు మైనస్ పాయింట్స్. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఓ కొత్త కథను చెప్పే ప్రయత్నాన్ని అస్సలు చేయని ఈ సినిమాను కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్ కోసం ఓసారి చూడొచ్చు. ఇక ఓసారి చూడలేకపోయినా పాత తెలుగు సినిమాల్లోనే ఒక ప్రేమకథను, ఒక ఫ్యామిలీ కథను వెంట వెంటనే చూసినా సరిపెట్టుకోవచ్చు. ఇప్పటికిప్పుడు ఈ ఫార్ములా సినిమా తెలుగులో వచ్చి చేయగలిగింది గానీ, చేసేది గానీ పెద్దగా ఏమీ లేదు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
123తెలుగు టీం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు