విడుదల తేదీ : 26 ఏప్రిల్ 2013 | ||
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5 |
||
దర్శకుడు : మెహర్ రమేష్ |
||
నిర్మాత : పరుచూరి శివారం ప్రసాద్ |
||
సంగీతం : ఎస్.ఎస్ థమన్ |
||
నటీనటులు : వెంకటేష్, తాప్సీ, శ్రీ కాంత్.. |
ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే విక్టరీ వెంకటేష్ చాలా రోజుల తర్వాత లుక్ మార్చి మాస్ పాత్రలో నటించిన ‘షాడో’ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో వెంకటేష్ ఎంత మాస్ గా ఉన్నాడో అంతే స్టైలిష్ గా కూడా ఉన్నాడు. తాప్సీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్రీ కాంత్, మధురిమ కీలక పాత్రల్లో నటించారు. బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ హిట్ అందుకోవాలనే కసితో మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ సినిమాని పరుచూరి శివారం ప్రసాద్ నిర్మించారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. విక్టరీ వెంకటేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను అందుకొని మెహర్ రమేష్ కి సూపర్ హిట్ ఇచ్చిందో లేదో ఇప్పుడు చూద్దాం..
కథ :
నానా భాయ్(ఆదిత్య పంచోలి), అతని తమ్ములు జీవ, లాలా కలిసి ఇండియాలో పలుచోట్ల బాంబ్ బ్లాస్ట్ లు చేస్తుంటారు. వారిని ఎలాగైనా ప్రభుత్వానికి పట్టించాలనే ధ్యేయంతో అండర్ కవర్ జర్నలిస్ట్ రఘురాం(నాగబాబు) నానా భాయ్ గ్యాంగ్ లో చేరి సమాచారం మొత్తం సేకరిస్తాడు. ఆ సమాచారాన్ని న్యూస్ పేపర్ ఓనర్ అయిన సిపి(సాయాజీ షిండే)కి ఇస్తాడు. అతను డబ్బుకి ఆశపడి నానా భాయ్ తో చేతులు కలపడంతో నానా భాయ్ రఘురాంని, అతని భార్య, కూతుర్ని దారుణంగా చంపేస్తాడు. అది చూసి అక్కడి నుంచి తప్పించుకున్న రఘురాం కొడుకు రాజారాం అలియాస్ షాడో(వెంకటేష్) చిన్నప్పుడే నానా భాయ్ అతని గ్యాంగ్ ని చంపాలని నిర్ణయించుకుంటాడు. రాజారాంకి బాబా (నాజర్) అండగా ఉండి అన్నీ చూసుకుంటూ ఉంటాడు. అలా పెద్దైన రాజారాం నానా భాయ్ గ్యాంగ్ లోని ఒక్కొక్కర్నీ చంపేస్తూ ఉంటాడు. అందులో భాగంగానే మలేషియాకి ప్రాజెక్ట్ కోసం వచ్చిన మధుబాల(తాప్సీ), పోస్ట్ మార్టం స్పెషలిస్ట్ దొంగ శ్రీనివాస్(ఎం ఎస్ నారాయణ) లను వాడుకుంటాడు.
అదే తరుణంలో ఇండియాలో భారీ ఎత్తున బాంబు బ్లాస్ట్ లు ప్లాన్ చేస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పడంతో ఎసిపి ప్రతాప్(శ్రీ కాంత్) ని నానా భాయ్ ని పట్టుకోవాలని రంగంలోకి దిగుతాడు. ప్రతాప్ పట్టు కోవాలనుకుంటున్న టైంలో నానా భాయ్ మనుషుల్ని షాడో చంపేస్తుండడంతో అసలు ఇతనెవరు ఎందుకు వీళ్ళని చంపుతున్నాడా? అని షాడో కోసం ప్రతాప్ వేట మొదలు పెడతాడు. అటు పోలీసుల్ని తప్పించు కుంటూ నానా భాయ్ గ్యాంగ్ ని షాడో ఎలా ఫినిష్ చేసాడు? అనేదే మిగిలిన కథాంశం.
ప్లస్ పాయింట్స్ :
విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా ఉన్నాడు. ఎంత స్టైలిష్ గా ఉన్నాడో అంతే మాస్ లుక్లో కూడా కనిపిస్తాడు. సీరియస్ ఎలివేట్ చెయ్యాల్సిన సీన్స్ లో, యాక్షన్ ఎపిసోడ్స్ లో వెంకటేష్ నటన బాగుంది. ఈ సినిమాకి వెంకటేష్ గారు వన్ మాన్ ఆర్మీ అని చెప్పుకోవాలి. తాప్సీ చాలా అందంగా ఉంది అలాగే తన గ్లామర్ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా నాటీ గర్ల్’ సాంగ్ లో ముందు బెంచ్ వారిని బాగానే ఆకట్టుకుంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీ కాంత్ పెర్ఫెక్ట్ గా సరిపోయాడు. తనవరకూ తన పాత్రకి న్యాయం చేసాడు. విలన్ గా చేసిన ఆదిత్య పంచోలి నటన యావరేజ్ గా ఉంది. మధురిమ ఓకే. పోస్ట్ మార్టం స్పెషలిస్ట్ దొంగ శ్రీనివాస్ పాత్రలో ఎం.ఎస్ నారాయణ, హోం మినిస్టర్ గా జయప్రకాష్ రెడ్డి కొంతవరకూ ప్రేక్షకులను నవ్వించగలిగారు. టైటిల్ సాంగ్ ‘షాడో’, ‘నాటీ గర్ల్’ సాంగ్స్ చూడటానికి బాగున్నాయి.
మైనస పాయింట్స్ :
సినిమా మొదటి 15 – 20 నిమిషాలు వేగంగా సాగుతుంది. ఆ తర్వాత పెళ్ళిపీటలపై పెళ్లి ఆగిపోయిన పెళ్లి కొడుకు/ కుమార్తె లో జీవకలపోయినట్టుగా సినిమా ఒక్కసారిగా స్లో అయిపోతుంది. అక్కడి నుంచి సినిమా క్లైమాక్స్ వరకూ, ప్రేక్షకులు హైదరాబాద్లో తాగే నీళ్ళ వాటర్ ట్యాంక్స్ కోసం ఎదురుచూసినట్టు ఇక్కడ స్పీడవుతుందేమో అక్కడ స్పీడవుతుందేమో అని ఎదురు చూడడం తప్ప వేరేఏమీ చెయ్యలేరు. ఇంతసేపు ఎదురు చూసాం కదా క్లైమాక్స్ లోపల ఎక్కడన్నా ఆ ఫీల్ ఇస్తాడేమో అనుకుంటే అదీ లేదు.
ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ మెహర్ రమేష్ రాసుకున్న స్క్రీన్ ప్లే. రెండున్నర గంటల పాటు చెప్పాల్సిన కథని కేవలం మొదటి 20 నిమిషాల్లోనే చెప్పేయడం వల్ల ఆ తర్వాత ఎం జరుగుతుందా అనేది ఆడియన్స్ కి ముందే తెలిసిపోతుంది. దాంతో ప్రేక్షకులు ఎలాగో ఖర్చు పెట్టి ఎసి థియేటర్ కి వచ్చాం కాదా అని కొంతమంది రిలాక్స్ అవుతుంటే, ఫ్రెండ్స్ తో వచ్చిన వల్లేమో ఏదో చిట్ చాట్ చేసుకుంటూ సినిమా చూస్తున్నారు, ఏం చూస్తాం లే అనుకున్న వాళ్ళు లేచి వెళ్ళిపోతున్నారు. స్క్రీన్ ప్లే బిగ్గెస్ట్ మైనస్ అంటున్నారు కథ సూపర్ అనుకున్నారో ఏ మూసీ నదిలోనో కాలేసినట్టే. ఎందుకంటే రైటర్స్ క్రీస్తు పూర్వం కథని తీసుకొచ్చి దానికి స్టైలిష్ రివెంజ్ డ్రామా అనే రంగుని అద్ది మనముందు పెట్టారు. అలా రంగులు అద్దిన కథ తెరకెక్కేసరికి ఆ రంగులు కాస్తా పోవడంతో అది పాత కాలం నాటి రొటీన్ రివెంజ్ డ్రామా అని తెలిసిపోయింది. వీటన్నిటికీ తోడూ మెహర్ రమేష్ దారుణమైన డైరెక్షన్ సినిమాని పూర్తిగా చెడగొట్టేసింది. ఏదో ప్రేక్షకుల పపై పగబెట్టుకొని ఈ సినిమా తీసినట్టుగా ఉంటుంది.
‘గబ్బర్ సింగ్’ లో బాగా ఫేమస్ అయిన ‘అంత్యాక్షరి కాన్సెప్ట్’ ని ఈ సినిమాలో పేరడీ చేసారు. ఆ సీక్వెన్స్ ప్రేక్షకులకు నవ్వాలా, ఏడవాలా అనే అనుమానాన్ని కలిగించేలా ఉంటుంది. అలాగే వెంకటేష్ గారి చేత చిన్న పిల్లోడిలా చేయించి తాప్సీని ఆంటీ, మిగతా కమెడియన్స్ అంకుల్ అని పిలిపించిన కామెడీ చాలా చెత్తగా ఉంది. ఈ కామెడీ ట్రాక్ ని ఒక 15 సంవత్సరాల క్రితం వెంకటేష్ గారు ట్రై చేసుంటే బాగుండేదేమో కానీ ఇప్పుడైతే అస్సలు బాలేదు.
సినిమాలో చాలా వరకూ ఎం.ఎస్ నారాయణ ఉంటాడు కానీ ఆయన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. అలాగే కమెడియన్స్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కృష్ణ భగవాన్, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు లాంటి పాత్రలను ఉంచుకొని కూడా సరిగా ఉపయోగించుకోలేకపోయారు. సినిమా క్లైమాక్స్ చాలా దారుణంగా ఉంది. సినిమా క్లైమాక్స్ లో చిన్న పిల్లలు చూసే యానిమేషన్ సీరియల్లో లాగా సౌండ్స్ మాత్రం వినిపించి చీకట్లోనే గన్ ఫైరింగ్ చేసి విలన్స్ ని చంపడం, అలాగే రౌడీలను చీకట్లో హీరో కత్తితో నరుక్కుంటూ పోవడం లాంటి సీన్స్ అప్పటికే విసుగెత్తిపోయి ఉన్న ఆడియన్స్ కి చిరాకుతో పాటు కోపాన్ని కూడా తెప్పిస్తాయి.
సాంకేతిక విభాగం :
సినిమాలో చూపించిన లోకేషన్స్ చాలా రిచ్ గా ఉన్నా ప్రసాద్ మూరెళ్ళ, శ్యాం కె నాయుడుల సినిమాటోగ్రఫీ మాత్రం చెప్పుకోదగ్గ రేంజ్ లేదు. ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ కత్తెర వేసుంటే బాగుండేది. మిగతా పార్ట్ మాత్రం పరవాదనిపించేలా ఉంది. కోనా వెంకట్ – మెహర్ రమేష్ కలిసి రాసిన డైలాగ్స్ అంత ఎఫెక్టివ్ గా లేవు. థమన్ అందించిన మ్యూజిక్ ఆల్బం లోని ఒకటి రెండు పాటలు తప్ప మిగతా ఏవీ ప్రేక్షకులని ఆకట్టుకోలేదు, అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సోసో గా ఉంది. గోపీ మోహన్ – కోనా వెంకట్ లు అందించిన కథ పాత చింతకాయ పచ్చడిలా ఉంది.
మెహర్ రమేష్ స్టైలిష్ స్టైలిష్ అని చెప్పి చాలా సీన్స్ లో అవసరంలేని లోకేషన్స్, వెపన్స్, వెహికల్ బ్లాస్ట్ లు చేసి నిర్మాతకి ఖర్చు పెంచడం తప్ప ఏమీ చెయ్యలేదు. మెహర్ రమేష్ పని తనం ఈ సినిమా కంటే అతని ఇంతకముందు వచ్చిన సినిమాల్లోనే బాగుంది. మెహర్ రమేష్ రాసుకున్న స్క్రీన్ ప్లే, డైలాగ్స్ లో సత్తా లేదు, డైరెక్షన్ లో దమ్ము లేదు. నిర్మాణ విలువలు మాత్రం హై రేంజ్ లో ఉన్నాయి.
తీర్పు :
‘షాడో’ – స్టైలిష్ రివెంజ్ డ్రామా అని చెప్పి తీసిన క్రీస్తుపూర్వం నాటి సినిమా. విక్టరీ వెంకటేష్ స్టైలిష్ లుక్, నటన, తాప్సీ గ్లామర్, శ్రీ కాంత్, మరి కొంతమంది నటీనటుల నటన తప్ప చెప్పుకోదగ్గ అంశాలు ఏమీ లేవు. రొటీన్ స్టొరీ, వీక్ స్క్రీన్ ప్లే, చెత్త డైరెక్షన్ ఈ సినిమాకి మేజర్ మైనస్ పాయింట్స్. ఇకనైనా మెహర్ రమేష్ మేలుకొని ఒక్క స్టైలిష్ నెస్ ఉంటే సరిపోదు సినిమాలో కంటెంట్ ఉండాలని తెలుసుకొని సినిమాలు చేస్తే బాగుంటుంది.
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
రాఘవ