సమీక్ష : శివగంగ – విసుగు పుట్టించే దెయ్యాల కథ!

సమీక్ష : శివగంగ – విసుగు పుట్టించే దెయ్యాల కథ!

Published on Mar 4, 2016 11:54 PM IST
Shiva Ganga review

విడుదల తేదీ : 04 మార్చ్ 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : వడిఉడయాన్

నిర్మాత : శివనాథ్ రెడ్డి, మారెడ్డి శ్రీనివాసరెడ్డి

సంగీతం : జాన్ పీటర్

నటీనటులు : శ్రీరామ్, రాయ్ లక్ష్మి, సుమన్,…


‘ఒకరికి ఒకరు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు శ్రీరామ్ ద్విపాత్రాభినయంలో, రాయ్ లక్ష్మి హీరోయిన్ గా వడిఉడయాన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శివగంగ. హరర్ర్ కథకి డ్రామాని మిక్స్ చేసి చేసిన సినిమా ఇది. తమిళ హర్రర్ సినిమాలకి బాగా అలవాటుపడ్డ తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాపై అంచనాలు బాగానే పెట్టుకున్నారు. మరి అన్ని అంచనాల మధ్య ఈరోజే విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందో లేదో ఇప్పుడు చూద్దాం..

కథ :

శివ (శ్రీరామ్), గంగ (రాయ్ లక్ష్మీ) ఇద్దరూ కాలేజీ రోజుల నుండి ప్రేమించుకుని, వాళ్ళ అమ్మానాన్నల అనుమతితో వివాహం చేసుకోవాలనుకుంటారు. ఇంతలో శివ కుటుంబానికి ఇల్లు కట్టుకోవడానికి అప్పిచ్చిన కాల్ మనీ వ్యాపారస్తుడు గోద్రా సేట్ (సుమన్), ఆ ఇంటిని సొంతం చేసుకోవడానికి శివ కుటుంబాన్ని, గంగను దారుణంగా చంపుతాడు. చనిపోయిన తరువాత ఆత్మలుగా మారిన శివ, గంగలు గోద్రా సేట్ కుటుంబంపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్న సమయంలోనే గతంలో శివ, గంగల ప్రేమకు అడ్డుపడిన వ్యక్తి శంకర్ (శ్రీరామ్) మళ్ళీ తిరిగొచ్చి ఆత్మగా మారిన గంగను తన సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు.

అసలు ఆ శంకర్ ఎవరు..? శివ, గంగలకు అతనికి మధ్యన ఉన్న సంబంధం ఏమిటి..? గంగను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న అతని బారి నుండి శివ, గంగలు ఎలా బయట పడతారు..? తమ చావుకు కారణమైన గోద్రా సేట్ పై ఎలా పగ తీర్చుకున్నారు..? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

‘రివెంజ్ ఆఫ్ టూ సోల్స్’ అన్న ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమాలోని ప్లస్ పాయింట్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది.. శ్రీరామ్, రాయ్ లక్ష్మీల ప్రేమ కథ, అందులో ఎంటరయ్యే విలన్ కథ. శ్రీరామ్, రాయ్ లక్ష్మీల ప్రేమ విషాదాంతంగా ముగిసే సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి. ఈ సన్నివేశాల్లో వీరిద్దరి నటన అద్భుతమనే చెప్పాలి. అలాగే శ్రీరామ్, రాయ్ లక్ష్మీలు ఆత్మలుగా మారాక విలన్ పై పగ తీర్చుకునే విధానం కూడా ఆకట్టుకుంటుంది. కథలో మెయిన్ విలన్ అయిన శంకర్ పాత్రలో శ్రీరామ్ నటన, ఆ పాత్రను డిజైన్ చేసిన విధానం బాగుంటాయి.

ఇంటర్వెల్ కు ముందు సినిమాలో వచ్చే ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై మరింత ఆసక్తిని పెంచుతాయి. దర్శకుడు వడిఉడయాన్ ప్రస్తుతంలో నడుస్తున్న కధను ఫ్లాష్ బ్యాక్ తో కనెక్ట్ చేసిన విధానం ఏ కన్ఫ్యూజనూ లేకుండా చాలా క్లియర్ గా ప్రేక్షకులకు అర్థమవుతూ ఓ క్లారిటీని ఇస్తుంటుంది. అలాగే ఆత్మలుగా శ్రీరామ్, రాయ్ లక్ష్మిల నటన కొత్తగా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో రివిల్ అయ్యే మెయిన్ ట్విస్ట్ ఆసక్తికరంగా ఉంటుంది. కధలో మధ్య మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ కొన్ని బాగానే వర్కవుటయ్యాయి. విలన్ గా సుమన్, మరో కీలక పాత్రలో వడివుక్కరసి తమ పాత్రలకు న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్ :

తమిళం నుండి వస్తున్న హర్రర్ సినిమా కాబట్టి ప్రేక్షకులు ‘చంద్రముఖి’, ‘కాంచన’ వంటి సినిమాల లెవల్లో అవుట్ పుట్ ను ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ సినిమాలో చెప్పుకోదగ్గ కంటెంట్ ఏమీ లేదు. అన్ని హర్రర్ సినిమాలలాగే చనిపోయి దెయ్యాలుగా మారి పగ తీర్చుకోవడం అనే బోరింగ్ పాయింట్ మీద సినిమా నడుస్తుంటుంది. సరే పగ తీర్చుకునే విధానంలోనైనా కొత్తదనం ఏమైనా ఉంటుందా అంటే అదీ సాదాసీదాగా నడుస్తూ నిరాశపరుస్తుంది. ఇక సినిమాలో ముఖ్య నటులకన్నా కామెడీ పాత్రలు ఎక్కువసేపు తెరపై కనిపించి విసుగు తెప్పిస్తాయి. మధ్యలో వచ్చే పాటలు సిట్యువేషన్ కు సింక్ అవకుండా చికాకు పుట్టిస్తాయి.

ఆత్మలు విలన్ పై పగ తీర్చుకునే విధానం కొంత మేర బాగానే ఉన్నా, చాలా వరకూ బోరింగ్ గా సాగుతుంది. విలన్ గా సుమన్ పాత్రను మొదట్లో బాగా హైలెట్ చేసి ఉన్నట్టుండి డౌన్ చేయడంతో సినిమా అంతా వన్ సైడ్ డ్రామాగా నడుస్తుంది. హర్రర్ సినిమా కొచ్చే ప్రేక్షకుడు దెయ్యం తనను భయపెట్టాలనే భావనతోనే సినిమాకొస్తాడు. అయితే ఈ సినిమాలో ఆత్మలు ఏ ఒక్క సన్నివేశంలోనూ భయపెట్టవు. సినిమాని కామెడీ మీద లాగించేద్దాం అనుకున్న దర్శకుడి ఆలోచన పూర్తిగా ఫెయిల్ అయి మెయిన్ కథని పక్కదారి పట్టించింది. ఇక క్లైమాక్స్ లో వచ్చే ముగింపు సన్నివేశాలు ఎప్పుడెప్పుడు సినిమా అయిపోతుందా అన్న ఫీలింగ్ ను కలిగిస్తాయి.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో ముందుగా శ్రీనివాస రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ గురించి చెప్పుకోవాలి. ఒక పూర్తి స్థాయి హర్రర్ సినిమాకి కావలసిన నేపధ్యాన్ని బాగానే సృష్టించారు. కథ మొత్తాన్ని రెండు బంగ్లాల్లో, ఒక స్మశానంలో చెప్పడంతో ఇక్కడ సినిమాటోగ్రాఫర్ చూపిన ప్రతిభ బాగుంది.

ఇక దర్శకుడు వడిఉడయాన్ ఒక ప్రేమ కథకు రెండు రివెంజ్ స్టోరీలను జోడించి ఓ కథ చెప్పాలన్న ఆలోచన చేయడం అభినందనీయమే, అయితే కథ పరంగా దర్శకుడు శ్రద్ధ పెట్టి ఇంకొన్ని కీలక సన్నివేశాలను సృష్టించి ఉంటే బాగుండేది. సంగీతం విషయానికొస్తే సంగీత దర్శకుడు జాన్ పీటర్ కీలక సన్నివేశాల్లో అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది.

తీర్పు :

సాధారణంగా హర్రర్ సినిమా అంటే ఎక్కువ శాతం రివెంజ్‌కే కనెక్టయి ఉంటుంది. ఈ ‘శివగంగ’ సినిమా కూడా అదే! ఓ ప్రేమకథకి రెండు రివెంజ్ స్టోరీలను కలిపి చెప్పిన ఈ సినిమా అసలైన హర్రర్ ఎలిమెంట్‌నే మిస్ చేసింది. హీరో, హీరోయిన్ల నటన, అక్కడక్కడా ఫర్వాలేదనిపించే కామెడీ, ప్రధాన కథకు ఎంచుకున్న పాయింట్ లాంటి ఓకే అనిపించే ప్లస్‌లతో వచ్చిన ఈ సినిమాలో మెప్పించడానికి ఇంతకు మించి అంశాలేమీ లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మల రివెంజ్ కథకే ఒక ట్విస్టును, బోరింగ్ కామెడీని జోడించుకుని వచ్చిన ఈ సినిమా కొత్తదనం కోరుకునే వారికే కాక, హర్రర్ ఫీల్‌ను ఆశించేవారికి కూడా పెద్దగా నచ్చదు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు