విడుదల తేదీ : జనవరి 12, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
నటీనటులు : సూర్య, కీర్తి సురేష్, రమ్య కృష్ణ ఆర్.జే బాలాజీ, శివ శంకర్ మాస్టర్, సుధాకర్ తదితరులు
దర్శకత్వం : విగ్నేష్ శివన్
నిర్మాత : జ్ఞాల్ వేల్ రాజా
సంగీతం : అనిరుద్
సినిమాటోగ్రఫర్ : దినేష్ కృష్ణన్
ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్
సూర్య- కీర్తిసురేష్ జంటగా నటించిన సినిమా ‘గ్యాంగ్’. విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ రోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘గ్యాంగ్’ తెలుగు ప్రేక్షకులను ఏమాత్రం అలరించింది ఈ రివ్యూ లో చూద్దాం.
కథ:
ఉత్తమ్ దాస్ (సూర్య) ఉద్యోగం కోసం ప్రయత్నించే ఒక సాధారణ పౌరుడు. అలాంటి సమయంలో తన స్నేహితుడు తన చదువుకు సరైన జాబ్ రాలేదని ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. ఆ సంఘటన తరువాత చలించిపోయిన ఉత్తమ్ వ్యవస్థలో నిజాయితీ లేదని గుర్తిస్తాడు. తన స్నేహితుడికి జరిగిన దుస్థితి మరెవరికి జరగరాదని సిద్ధపడతాడు. ఆ తర్వాత అతనేం చేశాడనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్:
సమాజంలో చదువుకు తగ్గ ఉద్యోగం ఎవ్వరికీ అందడం లేదు. పలుకుబడితో జనాలు డబ్బులు కట్టి దొంగదారిన జాబ్స్ సంపాదించుకుంటున్నారు. ఇలాంటి వ్యవస్థపై హీరో చేసే యుద్ధం బాగుంది. సీబీఐ ఆఫీసర్ గా ఒక సామాన్య పౌరుడిగా రెండు విభిన్న పాత్రల్లో బాగా నటించాడు సూర్య. కీర్తి సురేష్ కూడా పద్ధతి గల అమ్మాయిగా సాంప్రదాయ దుస్తుల్లో బాగా కనిపించింది. ఆర్.జె బాలాజీ చేసింది చిన్న పాత్రే అయినా కామెడి టైమింగ్ తో మెప్పించాడు. రమ్య కృష్ణ ఈ సినిమాలో ఫుల్ లెన్త్ సపోర్టింగ్ క్యారెక్టర్ లో నటించి మెప్పించింది.
సూర్య , రమ్యకృష్ణ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. సూర్య సొంతంగా ఈ సినిమా కోసం డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. సినిమా మొత్తం ఆయన వాయిస్ ఎక్కడా తడబడకుండా నీట్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ లో హీరో తన గ్యాంగ్ తో చేసే రాబరీ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్లో వచ్చే ట్విస్ట్ బాగుంది. తరువాత ఏంజరుగుతుందనే ఆసక్తి కలిగేలా దర్శకుడు దాన్ని చిత్రీకరించాడు. 1980’ల కాలంలో సెట్ చేసిన సినిమా నైపథ్యం బాగుంది. కొన్ని సోషల్ ఇష్యూలను వివరించితిన్ విధానం కూడా బాగుంది.
మైనస్ పాయింట్స్:
సినిమాను ఎంటర్టైనింగానే నడిపినా సన్నివేశాల్లో, కథనంలో పెద్దగా లోటు కనిపించలేదు. దీంతో సినిమాలో సీరియస్ నెస్ లోపించింది. ఇంటర్వెల్ తరువాత కూడా సినిమా కొద్దిసేపు నిధానంగానే సాగింది. పైగా ఈ ద్వితీయార్థం మొత్తం తమిళ సినిమా చూస్తున్నట్టే ఉంటుంది. అనిరుధ్ అందించిన పాటలు ఒకటి రెండు తప్పా మిగతావి పెద్దగా ఆకట్టుకోలేదు.
సెకండాఫ్లో హీరో గ్యాంగ్ కొన్ని దొంగతనాలు చేస్తారు. భారీ సెక్యూరిటీ ఉండగా జరిగే ఆ దొంగతనాలు ఎలా సాధ్యపడ్డాయనే విషయాలను ఇంకాస్త క్లారిటీగా చూపించి ఉంటే బాగుండేది. అంతేగాక క్లైమాక్స్ కూడా హడావుడిగా ఎలాంటి ఎగ్జైట్మెంట్ లేకుండా ముగిసిపోవడంతో కొంత అసంతృప్తి కలిగింది.
సాంకేతిక వర్గం :
హిందీలో విజయం సాధించిన ‘స్పెషల్ 26’ సినిమా ఆధారంగా తీసుకున్న పాయింట్ ను కొంత మార్చి దక్షిణాది ప్రేక్షకులకు తగ్గట్టు తెరమీద చూపించడంలో ఒకటి రెండు చోట్ల తప్ప ఎక్కువ శాతమే సక్సెస్ అయ్యాడు దర్శకుడు. అనిరుద్ అందించిన పాటలకంటే నేపధ్య సంగీతం బాగుంది.
దినేష్ కృష్ణన్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించిన సన్నివేశాలు బాగా వచ్చాయి. స్టూడియో గ్రీన్ నిర్మాణ విలువలు బాగున్నాయి. సామాన్యులు ఎలా ఉంటారు ? వారి భాదలు ఏంటి ? వంటి అంశాలు బాగా చూపించారు.
తీర్పు:
డిగ్రీ పూర్తి చేసిన ప్రతి భారతీయుడు ఉద్యోగం కోసం పరీక్షలు రాస్తాడు.. కానీ మెరిట్ ఉన్నవాడికి జాబ్ ఇవ్వకుండా డబ్బు ఉన్నోడికి ఉద్యోగం లభిస్తోన్న ఈ సమాజం మారాలనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది. మంచి కథతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో మంచి కాన్సెప్ట్, ఎంటర్టైన్మెంట్, సూర్య పెర్ఫార్మెన్స్, ఇంటర్వెల్ ట్విస్ట్ మెప్పించే అంశాలు కాగా నెమ్మదిగా సాగే సెకండాఫ్ కథనం, తీవ్రత లోపించిన కీలక సన్నివేశాలు, లాజిక్స్ కు అందని కొన్ని రాబరీ సీన్స్ నిరుత్సాహపరిచే అంశాలు. మొత్తం మీద సంక్రాంతి బరిలో నిలిచిన ‘గ్యాంగ్’ మంచి మెసేజ్ ఇచ్చి సంతృప్తిని కలిగిస్తుండడంలో సందేహం లేదు.
123telugu.com Rating : 3.25/5
Reviewed by 123telugu Team