సమీక్ష 2 : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు – స్వచ్చమైన కుటుంబ కథా చిత్రం

సమీక్ష 2 : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు – స్వచ్చమైన కుటుంబ కథా చిత్రం

Published on Jan 12, 2013 9:00 AM IST
SVSC4 విడుదల తేదీ : 11 జనవరి 2013
దర్శకుడు : శ్రీకాంత్ అడ్డాల
నిర్మాత : దిల్ రాజు
సంగీతం : మిక్కి జె మేయర్
నటీనటులు : వెంకటేష్, మహేష్ బాబు, సమంత, అంజలి


వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటిస్తున్నారు అనగానే అంచనాలు పెరిగాయి. ఇది మాస్ సినిమా కాదు మంచి సినిమా, మంచి మనుషుల సినిమా అంటూ సినిమా థీమ్ విడుదలకి ముందే చెప్పారు. శ్రీకాంత్ అడ్డాల రెండవ ప్రయత్నంగా వచ్చిన ఈ సినిమాలో సమంత, అంజలి కథానాయికలుగా నటించారు. కుటుంబ కథా చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ రోజే విడుదలైంది. ఈ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ :

సీతమ్మ వాకిట్లో చిత్ర కథ రేలంగి అనే ఊరిలో మొదలవుతుంది. ఆ ఊరిలో ఉండే ప్రకాష్ రాజ్ మంచి మనిషి, ఎవరిని నొప్పించకుండా మిగతావారికి సహాయపడే తత్వం ఆయనది. ఆయన కొడుకులు పెద్దోడు (వెంకటేష్), చిన్నోడు (మహేష్ బాబు) ఇద్దరూ చదువు పూర్తి ఉద్యోగం కోసం అన్వేషణలో ఉంటారు. పెద్దోడుకి కోపం ఎక్కువ, తనకి నచ్చినట్లు ఉండాలనుకునే మనస్తత్వం. చిన్నోడు హైదరాబాదులో ఉద్యోగాన్వేషణలో ఉంటాడు. పెద్దోడు మరదలు సీత (అంజలి) తల్లి తండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో వీరి ఇంట్లోనే పెరుగుతుంది. పెద్దోడినే తన భర్తగా భావిస్తుంది. మరో వైపు వరసకి మరదలు అయిన గీత (సమంత) మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. వీరి చెల్లి పెళ్లిలో మనస్పర్ధల వల్ల అపార్ధాలు మొదలవుతాయి. చివరికి ఏమైంది? ఈ అన్నదమ్ములు తమ సమస్యని ఎలా పరిష్కరించుకొన్నారు అనేది మిగతా చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్ :

చాలా రోజుల తరువాత ఒక అచ్చ తెలుగు సినిమా చూసాము అన్న ఫీలింగ్. మంచి మనుషుల కథ, మంచి మనసుల మధ్య సంఘర్షణ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాల విలువని తెలియజెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు. ముందుగా శ్రీకాంత్ అడ్డాలని మెచ్చుకోవాలి. ఇద్దరు స్టార్ హీరోలని ఒప్పించి ఎవరినీ నొప్పించకుండా ఎవరి పాత్ర తగ్గించకుండా చూపించాడు. వెంకటేష్ కి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. ఇంటర్వెల్ ముందు సన్నివేశాల్లో, తరువాత సన్నివేశాల్లో చాలా బాగా చేసాడు. మహేష్ బాబు ఈ సినిమాలో ఇంకా కుర్రాడిలాగా కనిపించాడు. మహేష్ చెప్పిన పంచ్ డైలాగ్స్ బాగా పేలాయి. వెంకటేష్, మహేష్ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇద్దరు స్టార్ హీరో హోదా పక్కనపెట్టి పాత్రల్లో ఒదిగిపోయారు. సినిమా చూస్తున్నంతసేపు పెద్దోడు, చిన్నోడు రెండు పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. జర్నీ సినిమా నుండి తెలుగు వారికి దగ్గరైన అంజలి ఈ సినిమాలో అచ్చమైన తెలుగింటి ఆడపడుచు లాగా చేసింది. సమంత అందంగా క్యూట్ గా ఉంది. మహేష్, ఆమెకి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఆరడుగులుంటాడా పాటలో యువతని గిలిగింతలు పెట్టింది. ప్రకాష్ రాజ్ ఇలాంటి పాత్రలు కొత్తేమి కాకపోయినా ఉన్నంత వరకు బాగానే చేసాడు. జయసుధ, రోహిణి హట్టంగడి ఇద్దరూ బాగా చేసారు. రావు రమేష్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో బాగా నటించాడు. మిగతా వారిలో కోట శ్రీనివాస రావు, తనికెళ్ళ భరణి మిగతా వారంతా పాత్ర పరిధి మేరకు చేసారు.

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు సినిమా వేగాన్ని తగ్గించాయి. వాన చినుకులు పాట తరువాత కథనంలో వేగం మందగించింది. ఇద్దరు స్టార్ హీరోలు చేసిన సినిమా కదా అని భారీ అంచనాలు పెట్టుకొని చూడకండి. ఇది సింపుల్ బట్ బ్యూటిఫుల్ ఫామిలీ డ్రామా. కమర్షియల్ అంశాలు మాస్ ఆశించే ఫైట్స్, డాన్సులు లేకపోవడం మైనస్. టైటిల్ సాంగ్ ప్లేస్ మెంట్ కూడా దెబ్బతింది. ఆ పాట చిత్రీకరించిన విధానం కూడా రుచించలేదు.

సాంకేతిక విభాగం :

గుహన్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి హైలెట్. రిచ్ ఫ్రేమింగ్ తో సినిమా అంతా కలర్ఫుల్ గా చూపించాడు. మిక్కీ జె మేయర్ సంగీతంలో ఏం చేద్దాం, ఆరడుగులుంటాడా, మేఘాల్లో పాటల చిత్రీకరణ బావుంది. మణిశర్మ నేపధ్య సంగీతం మేజర్ అసెట్. కొన్ని కీలకమైన సన్నివేశాలకి ఊపిరిపోశాడు. నిడివి ఎక్కువ అవడం వల్ల ఎడిటింగ్ ఎక్కువ చేయడం వల్ల కొన్ని సన్నివేశాలు గందరగోళం గురి చేసాయి.

తీర్పు :

పైన చెప్పుకున్నట్లుగా చాలా రోజుల తరువాత వచ్చిన ఒక అచ్చమైన తెలుగు సినిమా, పైగా ఇద్దరు స్టార్ హీరోలు నటించిన పెద్ద సినిమా. కమర్షియల్ అంశాలు తక్కువగా ఉండటం వల్ల భారీ అంచనాలు లేకుండా మీ కుటుంబ సభ్యులతో వెళ్లి సరదాగా చుడండి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మంచి మనుషుల కథ.


123తెలుగు.కాం రేటింగ్ :
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రానికి మేము అఫీషియల్ మీడియా పార్టనర్ గా ఉన్నాము. మేము ప్రమోట్ చేసిన చిత్రానికి రేటింగ్ ఇవ్వడం సబబు కాదు. అందువల్ల ఈ చిత్రానికి మేము రేటింగ్ ఇవ్వడం లేదు.

అశోక్ రెడ్డి .ఎమ్

సంబంధిత సమాచారం

తాజా వార్తలు