సమీక్ష : తడాఖా – మాస్ ప్రేక్షకుల్ని మెప్పించే యాక్షన్ ఎంటర్టైనర్

సమీక్ష : తడాఖా – మాస్ ప్రేక్షకుల్ని మెప్పించే యాక్షన్ ఎంటర్టైనర్

Published on May 10, 2013 2:10 PM IST
Thadaka1 విడుదల తేదీ : 10 మే 2013 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
దర్శకుడు : కిషోర్ పార్దాసాని(డాలీ)
నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు
సంగీతం : ఎస్.ఎస్ థమన్
నటీనటులు : నాగ చైతన్య, సునీల్, తమన్నా, ఆండ్రియా జెరేమియా..


యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, కామెడీ హీరో సునీల్ అన్నదమ్ములుగా కనిపించనున్న సినిమా ‘తడాఖా’. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తమిళంలో విజయం సాదించిన ‘వేట్టై’ మూవీకి రీమేక్. తమన్నా, ఆండ్రియా జెరేమియా అక్క చెల్లెళ్ళుగా కనిపించనున్న ఈ సినిమాకి కిషోర్ కుమార్(డాలీ) దర్శకత్వం వహించాడు. బెల్లంకొండ గణేష్ బాబు నిర్మించిన ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఈ సినిమాతో నాగ చైతన్య తనకి మాస్ హీరోగా బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నాడు. నాగ చైతన్య, సునీల్ ‘తడాఖా’ సినిమాతో వాళ్ళ కెరీర్ కి బ్రేక్ ఇచ్చే హిట్ అందుకున్నారో లేదో ఇప్పుడు చూద్దాం..

కథ :

పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ నాగబాబుకి ఇద్దరు కొడుకులు వారే శివరామకృష్ణ(సునీల్), కార్తీక్(నాగ చైతన్య). ఇందులో శివరామకృష్ణ బాగా భయస్తుడు, కార్తీక్ ఎంతో ధైర్యంగా ఎవరితోనైనా గొడవ పెట్టుకునే మనస్తత్వం కలవాడు. అలాంటి తరుణంలో గుండె పోటుతో నాగబాబు మరణిస్తాడు. కార్తీక్ ఎలా గోలా శివరామకృష్ణని ఒప్పించి నాగబాబు పోలీస్ జాబ్ తనకి వచ్చేలా చేస్తాడు. సునీల్ కి పోస్టింగ్ వచ్చిన ఏరియాలో బగ్గా(అశుతోష్ రానా), కాశీ అనే ఇద్దరు రౌడీలు దోపిడీలు, రౌడీయిజం, స్మగ్లింగ్ చేస్తూ ప్రజల్ని, పోలీసుల్ని తమ గుప్పెట్లో పెట్టుకొని ఉంటారు. అలాంటి ఊరికి ఎస్ఐ గా వచ్చిన శివరామకృష్ణ అదే ఊర్లో నందు(ఆండ్రియా జెరేమియా)ని పెళ్లి చేసుకుంటాడు. మరోపక్క కార్తీక్ నందు చెల్లెలైన పల్లవి(తమన్నా) ప్రేమించుకుంటారు. ఇలా సాఫీగా సాగుతున్న సమయంలో శివరామకృష్ణకి ఓ కేస్ అప్పగిస్తాడు. తన తమ్ముడు కార్తీక్ సాయంతో శివరామకృష్ణ ఆ కేస్ ని క్లోజ్ చేస్తాడు. అలాగే ఒకసారి బగ్గా స్మగ్లింగ్ చేస్తున్న లారీలను సీజ్ చేస్తాడు. దాంతో శివరామకృష్ణకి – బగ్గాకి మధ్య వైరం మొదలవుతుంది.

ఆ తర్వాత శివరామకృష్ణ పిరికోడని కార్తీక్ అతని వెనకుండి నడిపిస్తున్నాడని తెలుసుకున్న బగ్గా అతన్ని చంపాలని ప్లాన్ చేస్తాడు. కార్తీక్ ద్వారా చావు నుంచి తప్పించుకోగలగిన శివరామకృష్ణ ఆ తర్వాత ఎలా మారాడు? అన్నదమ్ములిద్దరూ కలిసి బగ్గా సామ్రాజ్యాన్ని ఎలా నాశనం చేసారు అనేదే మిగిలిన కథాంశం.


ప్లస్ పాయింట్స్ :

దూకుడు ప్రదర్శించే పాత్రలో నాగ చైతన్య నటన బాగుంది. ఈ సినిమాలో సరికొత్త హెయిర్ స్టైల్ తో చాలా స్టైలిష్ గా ఉన్నాడు. ముఖ్యంగా ఫైట్ సీక్వెన్సులు చాలా బాగా చేసాడు. నాగ చైతన్య నటుడిగా ఈ సినిమాతో మరో స్టెప్ పైకి ఎక్కాడని చెప్పుకోవాలి. ఫస్ట్ హాఫ్ లో భయస్తుడిగా కామెడీ పండించిన సునీల్ చివరి 30 నిమిషాల్లో డేరింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మంచి నటనని కనబరిచాడు. అల్లరిపిల్ల పాత్రలో తమన్నా నటన బాగుంది. అలాగే ఫుల్ గ్లామరస్ గా కనిపించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ముఖ్యంగా ‘మార ఓ మార’ పాటలో అందాలు ఆరబోసింది. తమన్నా సినిమాలో సీన్స్ లో కంటే ఎక్కువగా పాటలలోనే కనపడుతుంది. ఆండ్రియా జెరేమియా చాలా అందంగా, పక్కింటి అమ్మాయిలా ఉంది. తనకిచ్చిన పాత్రకి న్యాయం చేసింది.

విలన్ పాత్ర పోషించిన అశుతోష్ రానా పాత్ర బాగుంది. కొన్ని చోట్ల విలనిజంతో బాగానే భయపెడతాడు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ సినిమాలో అక్కడక్కడా బాగా నవ్వించడానికి ప్రయత్నించారు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండాఫ్ చివరి 30 నిమిషాలు బాగుంటుంది. రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, రామా ప్రభ తమ పరిధిమేర నటించారు.

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్ లో ఒక ఫీల్ తీసుకొచ్చి బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ సెకండాఫ్ మొదటి నుంచి అదే ఫీల్ ని కలుగ జేయలేకపోయాడు. చివరి 30 నిమిషాల వరకూ సినిమా కాస్త నిదానంగా సాగడం బోర్ కొడుతుంది.
యాక్షన్ ఎపిసోడ్స్ లో బాగా కేర్ తీసుకున్న డైరెక్టర్ డాలీ ఎంటర్టైన్మెంట్ మీద కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాల్సింది. సునీల్ – ఆండ్రియా మధ్య ఉన్న రిలేషన్ ఇంకా బాగా చూపించాల్సింది. వారిద్దరి మధ్య వచ్చే సీన్స్ పెట్టాలి కదా అని పెట్టినట్టుగా అనిపిస్తుంది. మాస్ ఎంటర్టైనర్ సినిమా కావడంతో కొన్ని నమ్మ శక్యం లేని సీన్స్ ని పెట్టారు ఉదాహరణకి నాగ చైతన్య ట్రైన్ ని క్రాస్ చేసుకొని వచ్చి సునీల్ ని కాపాడే సీన్ నమ్మశక్యంగా లేదు. ఇప్పటికే తమిళ్ వెర్షన్ ‘వేట్టై’ చూసిన వారికి ఈ సినిమా అంతగా కనెక్ట్ అవ్వదు.

సాంకేతిక విభాగం :

కిషోర్ పార్ధసాని సినిమాలో మూడు విభాగాలను డీల్ చేసాడు. మొదటగా స్క్రీన్ ప్లే – స్క్రీన్ ప్లే అక్కడక్కడా అంత ఎఫెక్టివ్ గా ఉండదు. డైలాగ్స్ బాగున్నాయి, ముఖ్యంగా విలన్ కి రాసిన డైలాగ్స్, హీరో – విలన్ మధ్య వచ్చే చాలెంజింగ్ డైలాగ్స్ బాగున్నాయి. మొదటి ప్రయత్నంతో క్లాస్ ప్రేక్షకులని ఆకట్టుకున్న డాలీ ద్వితీయ యజ్ఞంతో మాస్ ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాడు. కానీ ఇంకాస్త ఎంటర్టైన్మెంట్, స్క్రీన్ ప్లే మీద జాగ్రత్తలు తీసుకోవాల్సింది.

ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ బాగుంది, సినిమాలోని పాటలని, ఫైట్స్ ని బాగా తీసాడు. థమన్ మ్యూజిక్ ఇచ్చిన పాటలు పరవాలేదనిపించగా, యాక్షన్ సీక్వెన్సల్లో, హీరోని ఎలివేట్ చేసే సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎడిటర్ గౌతంరాజు కాస్త కేర్ తీసుకొని సెకండాఫ్ లో వచ్చే కొన్ని బోరింగ్ సీన్స్ ని కత్తిరించి ఉంటే బాగుండేది. యాక్షన్ ఎపిసోడ్స్ కంపోజింగ్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

నాగ చైతన్య – సునీల్ కాంబినేషన్లో వచ్చిన తడాఖా సినిమా మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. నాగ చైతన్య మాస్ పాత్ర, యాక్షన్ ఎపిసోడ్స్, తమన్నా – ఆండ్రియాల గ్లామర్ మేజర్ ప్లస్ పాయింట్స్. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే తగ్గినట్టు అనిపించే సెకండాఫ్, ఎంటర్టైన్మెంట్ లేకపోవడం, సందర్భం లేకుండా వచ్చే పాటలు సినిమాలోని మైనస్ పాయింట్స్. నాగ చైతన్యకి మాస్ ఇమేజ్ ని తెచ్చిపెట్టే ‘తడాఖా’ ఈ సమ్మర్లో చూడదగిన మాస్ ఎంటర్టైనర్.


123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు