విడుదల తేదీ : డిసెంబర్ 08, 2017
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
దర్శకత్వం : ప్రతీక్
నిర్మాత : లంక కరుణాకర్ దాస్
సంగీతం : లంక ప్రభు ప్రవీణ్
నటీనటులు : లంక ప్రతీక్, శ్రావ్య
లంక ప్రతీక్ తానే హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన సినిమా ‘వానవిల్లు’. ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ:
ప్రతీక్ (ప్రతీక్) చదువుకుంటూ హాయిగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. స్నేహితులకు ఎక్కువ విలువ ఇచ్చే ప్రతీక్ వాళ్ళ కోసం ఏమైనా చేయడానికి సాహసిస్తుంటాడు. అలాంటి అతని జీవితంలోకి శ్రావ్య (శ్రావ్య) అనే అమ్మాయి ప్రవేశించి అతన్ని ఒక పెద్ద ఛాలెంజ్ ఎదుర్కొనేలా చేస్తుంది.
ఆ ఛాలెంజ్ ఏంటి ? అసలు శ్రావ్య ఎవరు ? ఆమె కథేమిటి ? ఎదురైనా సవాళ్ళను ప్రతీక్ ఎలా ఎదుర్కున్నాడు ? చివరికి గెలిచాడా లేదా ? అనేదే సినిమా..
ప్లస్ పాయింట్స్ :
సినిమాలోని అసలు కథ రివీల్ అయ్యే చివరి 20 నిముషాలు బాగుంది. ఆ బ్లాక్ తో ప్రేక్షకులకు సినిమాపై పూర్తి క్లారిటీ వస్తుంది. కొత్త హీరోనే అయినా ప్రతీక్ పెర్ఫార్మెన్స్ పరంగా మెప్పించాడు. జాలీగా తిరిగే కుర్రాడి పాత్రలో సరిగ్గా ఇమిడిపోయాడు. పాటల్లో అతని డాన్స్, కొని ఎలివేషన్ సీన్లలో స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నాయి.
హీరోయిన్ శ్రావ్య కూడా మంచి పాత్ర లభించడంతో మంచి నటన కనబర్చింది. అలాగే రెండవ హీరోయిన్ కూడా కాస్త గ్లామర్ టచ్ తో మెప్పించింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాత విలువలు కూడా రిచ్ గా ఉన్నాయి. పెట్టిన ఖర్చు స్క్రీన్ మీద కనబడటంతో క్వాలిటీ ఫిల్మ్ చూస్తున్న భావన కలిగింది.
మైనస్ పాయింట్స్ :
సినిమా మొదటి అర్థ భాగంలో అసలు కథేమిటి, కథనం ఎటువైపు నడుస్తుంది, దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అనే అంశాల్లో క్లారిటీ లేకపోవడం, ఎంజాయ్ చేయదగిన కంటెంట్ లేకపోవడంతో ఇంటర్వెల్ వరకు సినిమా చాలా నిదానంగా నడిచింది. సినిమా అసలు కథలోకి వెళ్ళడానికి చాలా సమయం తీసుకోవడంతో ఆఖరు 20 నిముషాలు తప్ప ఎక్కడా ఆసక్తి కలుగలేదు.
ఇక స్టోరీ కొద్దిగా రొటీన్ గానే ఉన్నా కనీసం సన్నివేశాలైనా కొత్తగా రాసుకుని ఉంటే కొంత బెటర్ గా ఉండేది. కానీ అలాంటివేవీ సినిమాలో కనబడవు. దాంతో ఇద్దరు హీరోయిన్లతో ట్రైయాంగిల్ లవ్ స్టోరీని కొత్తగా చెప్పాలనుకున్న దర్శకుడి ప్రయత్నం బెడిసికొట్టింది. దానికి తోడు ఉన్న సీన్లు కూడా కొన్ని మరీ లాజిక్స్ కు అందకుండా ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. కమర్షియల్ సినిమాల్లో ఉండాల్సిన కామెడీ అనే అంశం కూడా ఇందులో కనబడలేదు.
సాంకేతిక విభాగం :
దర్శకుడు, హీరో ప్రతీక్ ప్రేమ్ సినిమాను థ్రిల్లర్ పాయింట్ టోన్ నడపాలనుకున్నా అది మధ్యలో అనేక మలుపులు తీసుకుని అనవసరమైన ట్రాక్స్ లోకి వెళ్ళిపోయింది. అతను కథ చెప్పిన విధానంలో ఆసక్తికరమైన, ఆకట్టుకునే అంశాలేవీ లేవు. కానీ కొన్ని ఎలివేషన్ సీన్లు, పాటల్ని ఇంప్రెసివ్ గా చిత్రీకరించారు.
సినిమాను సులభంగా ఒక 15 నిముషాల పాటు ఎడిట్ చేయవచ్చు. అరకు లొకేషనల్లో చేసిన సినిమాటోగ్రఫీ బాగుంది. పాటల సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపించాయి. లిమిటెడ్ బడ్జెట్లోనే తీసినా సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
మొత్తం మీదా కొన్ని ముఖ్యమైన రంగులు అస్సలు కనబడని ఈ ‘వానవిల్లు’ సినిమాలో ఆకట్టుకునే కథనం, ఆసక్తికరమైన సన్నివేశాలు లేనందు వలన సినిమాలో కొత్తదనం కానీ, ఎంజాయ్ చేయదగిన అంశాలు కానీ దొరకవు. అసలు కథ రివీల్ అయ్యే చివరి 20 నిముషాలు కాస్త ఆసక్తికరంగానే అనిపించినా మిగతా సినిమా మొత్తం బోరింగానే కొనసాగింది. కాబట్టి ఈ వారాంతంలో ఈ సినిమాను దూరం పెడితే మంచిది.
123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team