సమీక్ష : వెన్నెల్లో హాయ్ హాయ్ – హాయి లేదు.. అంతా నీరసమే!!

సమీక్ష : వెన్నెల్లో హాయ్ హాయ్ – హాయి లేదు.. అంతా నీరసమే!!

Published on Feb 6, 2016 9:55 AM IST
Vennello Hai Hai review

విడుదల తేదీ : 05 ఫిబ్రవరి 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : వంశీ

నిర్మాత : డి. వెంకటేష్

సంగీతం : కీ.శే. చక్రి

నటీనటులు : అజ్మల్, నిఖితా నారాయణ్..

తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా వంశీది ఓ ప్రత్యేక శైలి. 1980, 90వ దశకంలో దర్శకుడిగా తనదంటూ ఒక బ్రాండ్‌ను సెట్ చేసిన ఆయన దర్శకత్వంలో రూపొందిన 25వ సినిమాయే ‘వెన్నెల్లో హాయ్ హాయ్’. చాలాకాలంగా విడుదలకు నోచుకోకుండా ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి స్టార్ డైరెక్టర్ 25వ సినిమా అయినా కూడా పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా కనీసం ఆయన మార్క్ సినిమా అని అయినా అనిపించుకుందా? చూద్దాం..

కథ :

ముంబైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసే సుశీల్ (అజ్మల్), తన తల్లిదండ్రుల బలవంతం మీద సత్య (నిఖితా నారాయణ్) అనే అమ్మాయిని చూడడానికి పెళ్ళిచూపులకు హైదరాబాద్ వస్తాడు. ఈ క్రమంలోనే సుశీల్ తల్లిదండ్రులు అతడి జాతకాన్ని ఒక స్వామిజీకి చూపించగా, ఆయన సుశీల్‌కు అంతకుముందే పెళ్ళి జరిగిపోయిందనే విషయం చెబుతాడు. ఈ విషయంతో షాక్‌కు గురైన సుశీల్, చిన్నతనంలో తనూజ అనే అమ్మాయితో తనకు బొమ్మల పెళ్ళి లాంటిది జరిగిందనే విషయం గుర్తు తెచ్చుకుంటాడు.

ఇక అప్పట్నుంచి సుశీల్, తనూజను వెతుక్కుంటూ ఎన్నో ఊర్లు తిరుగుతాడు. ఈ ప్రయాణంలో సుశీల్‌కు తోడుగా సత్య కూడా సహకరిస్తుంది. ఈ ప్రయాణం చివరకు ఎటువెళ్ళింది? సుశీల్, తనూజను కలిశాడా? సుశీల్ అంటే ఎంతో ఇష్టపడే సత్యకు అతడు దక్కాడా? అన్న ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ అంటే పెళ్ళి అనే బంధం గురించి, ఒక జంట కలకాలం కలిసి జీవించడమనే అంశం గురించి ప్రస్తావించడం గురించి చెప్పుకోవచ్చు. సుశీల్ తన ప్రయాణంలో కలిసే రకరకాల వ్యక్తులు, వారి జీవితాల ద్వారా పెళ్ళి అనే బంధం యొక్క విశిష్టతను తెలుసుకొని చివరకు తనకు కావాల్సినది అందుకుంటాడు. ఈ పాయింట్ ఉన్నంతలో బాగుంది. ఇక వంశీ సినిమా అంటే మేకింగ్ పరంగా కొన్ని ప్రత్యేకమైన షాట్స్ బాగా ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలోనూ కొన్నిచోట్ల ఆయన తన స్టైల్ మేకింగ్‌తో ఆకట్టుకుంటారు. ఇక కీ.శే. చక్రి అందించిన మ్యూజిక్ కూడా మంచి రిలీఫ్. ‘యూ ఆర్ మై లవ్’ అనే పాటలో వంశీ చూపిన కొత్తదనం బాగుంది. సినిమా పరంగా చూసుకుంటే ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ఫర్వాలేదనిపిస్తాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే అతి సాదాసీదా, పాతకాలం కథను ఏమాత్రం ఆసక్తికరంగా లేని సన్నివేశాలు, అర్థం పర్థం లేని ఆలోచన విధానంతో ముడిపెట్టి నడిపిన విధానం గురించి చెప్పుకోవచ్చు. సుశీల్ పాత్ర చేస్తున్న ప్రయాణమే అర్థం లేనిదై, మరీ అసహజంగా కనిపించినపుడు ఇక సినిమాలోనూ ఎక్కడా ఎమోషన్ అన్న మాటే లేదు. ఈ ప్రయాణంలో అక్కడక్కడా ఫర్వాలేదనిపించే కొన్ని సన్నివేశాలు తప్పితే ఎక్కడా ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా కట్టిపడేసేలా లేదు. వంశీ కెరీర్‌లో ఎప్పటికీ మరచిపోలేని సినిమాగా నిలిచిన ‘లేడీస్ టైలర్’ తరహా కథను ఎంచుకొని, దానికి ఏమాత్రం ఫన్ కానీ, లాజిక్ కానీ, ఎమోషన్ గానీ కలపకుండా చేసిన ప్రయత్నమే ‘వెన్నెల్లో హాయ్ హాయ్’. వంశీ మార్క్ కామెడీ అనేదే లేదు.

హీరో అజ్మల్ నటన అసహజంగా ఉంది. హీరో పాత్రకే ఒక అర్థం లేకపోగా, అందుకు అజ్మల్ అసహజ నటన తోడై అది మరింత బోరింగ్ వ్యవహారంలా తయారైంది. నిఖితా నారాయణ్ నటనలో అతితప్ప మరింకేమీ లేదు. టైటిల్ ‘వెన్నెల్లో హాయ్ హాయ్’ అనేదాన్ని కేవలం క్రేజ్ కోసమే పెట్టినట్లు కనిపిస్తుంది. దీనికంటే మొదట్లో అనుకున్న ‘తను మొన్నే వెళ్ళిపోయింది’, ‘మెల్లిగా తట్టింది మనసు తలుపు’ టైటిల్స్ బెటర్ గా ఉండేవి. సినిమా చూస్తున్నంతసేపూ ఇంత సిల్లీగా పాయింట్ కోసమా హీరో చేస్తోంది అనే ఫీలింగ్ వస్తుంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా ఈ సినిమాలో అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేసేది కీ.శే.చక్రి అని చెప్పుకోవాలి. ఆయన అందించిన పాటలన్నీ వినడానికి బాగానే ఉన్నాయి. ఒకటి, రెండు పాటల్లో ప్రయోగం కూడా బాగుంది. ఇక సినిమాటోగ్రఫీ పనితనం ఫర్వాలేదు. కొన్ని పాటల్లో వంశీ మార్క్ మేకింగ్‌లో సినిమాటోగ్రాఫర్ ప్రతిభను గమనించొచ్చు. ఎడిటింగ్ ఏమాత్రం ఆకట్టుకునేలా ఉంది. ఎక్కడ, ఏ కట్, ఎందుకొస్తుందో అర్థం కానంత విచిత్రంగా ఎడిటింగ్ ఉంది. ఇక దాదాపుగా 70% పైనే షూటింగ్ పూర్తై ఆగిపోయిన సినిమాను కొనడం, మళ్ళీ ఆ సినిమాను మూడేళ్ల తర్వాత విడుదలవుతోన్న ఓ పాత సినిమా అనే ఫీలింగ్ కలిగించకుండా చూడడంలో నిర్మాత డి.వెంకటేష్ కొంత మేర ఫర్వాలేదనిపించుకున్నాడు.

ఇక దర్శకుడు వంశీ గురించి చెప్పుకోవాలి. ఒకప్పుడు తనదైన బ్రాండ్‌తో మ్యాజిక్ చేసిన వంశీ తీసిన సినిమాయేనా అనే ఫీలింగ్ ఈ సినిమా చూస్తున్నంతసేపూ కలుగుతుంది. ఒక పాతబడిన అర్థం లేని కథను, ఏమాత్రం కొత్తదనం గానీ, ఫన్ గానీ లేని సినిమాగా తెరకెక్కించి దర్శకుడిగా వంశీ పూర్తిగా విఫలమయ్యారు. అక్కడక్కడా కొన్ని పాటలు, డిఫరెంట్ షాట్ కంపోజిషన్స్‌లో తప్ప వంశీ మార్క్ అస్సల్లేదు. చెందు అందించిన మాటలు బలవంతంగా జొప్పించినవే అయినా అక్కడక్కడా కాస్త ఫన్ ఉంది.

తీర్పు :

వంశీ సినిమా అంటే ఆహ్లాదకరంగా సాగిపోయే ఓ కథ, చిన్న సస్పెన్స్, దానిచుట్టూ అల్లుకొని రాసుకున్న కథనంతో పాటే వచ్చే సహజత్వానికి దగ్గరగా ఉంటూ నవ్వించే కామెడీ.. ఇలాంటివి చూస్తూంటాం. ‘లేడీ టైలర్’ తర్వాత ఏ తరహా కథ చెప్పినా ఇలాంటి అంశాలను కథతో పాటే తెలివిగా చెప్తూ విజయం సాధిస్తూ వచ్చిన వంశీ దర్శకత్వంలో వచ్చిన 25వ సినిమాయే ‘వెన్నెల్లో హాయ్ హాయ్’. విచిత్రమేమంటే పైన చెప్పిన అంశాలేవీ లేకపోవడం, ఒక అర్థవంతమైన కథంటూ లేకపోవడం, సిల్లీ కథనం, నటీనటుల సాదాసీదా ప్రతిభ.. లాంటి మైనస్‌లతో ఆ 25వ సినిమా నిలవడం. అక్కడక్కడా కనిపించే వంశీ మార్క్ మేకింగ్, పాటలు, చెప్పాలనుకున్న చిన్న పాయింట్ లాంటివి మినహాయిస్తే ఈ సినిమాలో ఆకట్టుకోవడానికి ఏమీ లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. వంశీ మార్క్ సినిమా అనే ఫీలింగ్‌తో చూసినా, ఏదో అనామక సినిమా చూస్తున్నామన్న ఫీలింగ్‌తో చూసినా ఆకట్టుకోలేనంత నీరసమైన సినిమా ‘వెన్నెల్లో హాయ్ హాయ్’!

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు