సమీక్ష : వినవయ్యా రామయ్యా – ఈ రామయ్య బాగున్నాడు.!

సమీక్ష : వినవయ్యా రామయ్యా – ఈ రామయ్య బాగున్నాడు.!

Published on Jun 20, 2015 8:40 PM IST
Vinavayya-Ramayya-review

విడుదల తేదీ : 19 జూన్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : జి. రామ్ ప్రసాద్

నిర్మాత : ‘సింధూర పువ్వు’ కృష్ణారెడ్డి

సంగీతం : అనూప్ రూబెన్స్

నటీనటులు : నాగ అన్వేష్, కృతిక జయకుమార్, ప్రకాష్ రాజ్..


‘ఇంట్లో ఇల్లాలు – వంటింట్లో ప్రియురాలు’, ‘సాహస బాలుడు – విచిత్ర కోతి’ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించి మెప్పించిన నాగ అన్వేష్ ని హీరోగా పరిచయం చేస్తూ చేసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘వినవయ్యా రామయ్యా’. ‘సింధూర పువ్వు’ నిర్మాత కృష్ణారెడ్డి తనయుడే ఈ నాగ అన్వేష్. సి. రామ్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో దృశ్యం ఫేం కృతిక జయకుమార్ హీరోయిన్ గా పరిచయం కానుంది. కామెడీ, లవ్, ఫ్యామిలీ సెంటిమెంట్ కలగలిపిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన నాగ అన్వేష హీరోగా ఎంతవరకూ మెప్పించాడు అన్నది ఇప్పుడు చూద్దాం…

కథ :

ఓపెన్ చేస్తే వీరయ్య పాలెం.. అందులో ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా తనకేమీ పట్టనట్టు అల్లరి చిల్లరగా తిరిగే చంటి (నాగ అన్వేష్)కి తన ఎదురింట్లో ఉండే జానకి (కృతిక) అంటే ఎంతో ఇష్టం. చిన్నప్పట్నుంచీ కలిసి పెరగడం, కలిసే ఆడుకోవడం వల్ల జానకిని దగ్గరగా చూసిన చంటి తన ఇష్టాన్ని ప్రేమగా మార్చుకుంటాడు. జానకి తండ్రి చౌదరి (ప్రకాష్ రాజ్) ఆ ఊరికే పెద్దమనిషి. చౌదరి, జానకికి ఓ పెద్ద జమీందారునిచ్చి పెళ్ళి చెయ్యాలని ఓ సంబంధం కుదురుస్తాడు. ఈ విషయం తెలుసుకున్న చంటి, జానకికి తన ప్రేమ విషయాన్ని చెప్పగా, తనకలాంటి ఆలోచనలు లేవని తేల్చి చెప్పేస్తుంది. ఆ తర్వాత ప్రేమ విఫలమవ్వడాన్ని తట్టుకోలేని చంటి పరిస్థితి అయోమయంగా తయారవుతుంది.

కాగా ఇదే సమయంలో చంటి పరిస్థితిని చూసిన అతడి ఫ్రెండ్స్ పెళ్ళి వేడుక నుంచి జానకిని కిడ్నాప్ చేస్తారు. చంటి, జానకి ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారనుకొని జానకిని కిడ్నాప్ చేసిన అతడి ఫ్రెండ్స్, ఆ తర్వాత నిజం తెలుసుకొని చేసిన తప్పు తెలుసుకుంటారు. ఇక ఆ తర్వాత వారేం చేశారు? జానకి ఇంట్లో నుంచి లేచిపోయిందని అనుకున్న అతడి కుటుంబం మళ్ళీ ఆమెను దగ్గరకు రానిస్తుందా? చంటి ప్రేమను జానకి అర్థం చేసుకుంటుందా? వీరిద్దరి ప్రేమ చివరకు ఏమైంది? అన్న ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

ముందుగా ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరో నాగ అన్వేష్ మరియు హీరోయిన్ కృతిక జయకుమార్ గురించి చెబుతా.. నాగ అన్వేష్ కి ఇది మొదటి సినిమా కానీ చైల్డ్ ఆర్టిస్ట్ గా అనుభవం ఉండడం వలన ఎలాంటి ఇబ్బంది లేకుండా కెమరా ముంది నటించేసాడు. నాగ అన్వేష్ లో మంచి ఈజ్ ఉంది, అలాగే నటుడిగా ది బెస్ట్ ఇవ్వాలన్న తపన ఉంది. అందుకే మొదటి సినిమా అయినా రెండు మూడు సినిమాల అనుభవం ఉన్న హీరోలా నటించాడు. అలాగే నాగ అన్వేష్ లో కామెడీ టైమింగ్ బాగుంది. ఇకపోతే డాన్సులు కూడా ఇరగదీస్తున్నాడు. నాగ అన్వేష్ రొటీన్ కమర్షియల్ సినిమాలను కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను ఎంచుకొని ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యగలిగితే మంచి కెరీర్ ఉంటుంది. దృశ్యం ఫేం కృతిక జయకుమార్ లంగా ఓనీల్లో బాగా ఆకట్టుకుంది. కృతిక ఎనర్జీ లెవల్స్ చాలా బాగున్నాయి. పాటల్లో బాగా గ్లామరస్ గా కనిపించిన ఈ భామ ఉన్నతలో బాగానే చేసింది, కానీ నేర్చుకోవాల్సింది కూడా ఇంకా ఉంది.

ఇక సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కథకి బలమైన పాత్రలో మంచి నటనని కనబరిచారు. కామెడీ కింగ్ బ్రహ్మానందం పటేల్ పహిల్వాన్ పాత్రలో బాగానే నవ్వించాడు. అలాగే అలీ, సప్తగిరి, షకలక శంకర్, జబర్దస్త్ శీను, హరీష్ లు హీరో ఫ్రెండ్స్ గా బాగా నవ్వించారు. ముఖ్యంగా షకలక శంకర్ తన వైఫ్ తో దెబ్బలు తినే ఎపిసోడ్ బాగా నవ్విస్తుంది. ఓవరాల్ గా సినిమాలో ఫస్ట్ హాఫ్ లోని కొన్ని కామెడీ ఎపిసోడ్స్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తే సెకండాఫ్ లోని కొన్ని ఫ్యామిలీ మోమెంట్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. అలాగే కేరళ ఎపిసోడ్ లో కుటుంబ విలువలను బాగా చూపించారు. సినిమాలోని విజువల్స్ చాలా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి చెప్పదగిన మైనస్ పాయింట్స్ చాలానే ఉన్నాయి. ముందుగా చెప్పాల్సింది రెగ్యులర్ కథని నాగ అన్వేష్ సెలక్ట్ చేసుకోవడం. ఎందుకంటే ఈ సినిమా కథలో ఎలాంటి కొత్తదనం లేదు, ఇలాంటి పాయింట్స్ ని ఇది వరకే మనం చాలా సార్లు చూసాం. కథ పాతది అయినా కథనంలో కాస్త కొట్టడం ఉండేలా చూసుకొని ఉంటే ఈ సినిమాకి హెల్ప్ అయ్యేది. సినిమాలో ఆడియన్స్ సర్ప్రైజ్ ఫీలయ్యేలా ఒక్కటి కూడా లేదు. ఇవి బాలేకపోయినా చెప్పాలనుకున్న పాయింట్ ని చాలా వేగంగా అన్నా చెప్పాల్సింది. కానీ అది కూడా చెయ్యలేదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా అసలు కథలోకే వెళ్లరు.

ఇకపోతే ఈ సినిమా కథ మొత్తం తిరిగే ప్రధాన పాయింట్ హీరో – హీరోయిన్ మధ్య నడిచే లవ్ స్టొరీ. కానీ దానిని సరిగా ప్లాన్ చేసుకోలేదు. క్లైమాక్స్ అంత ఎమోషనల్ గా ఉన్నప్పుడు వారిద్దరి మధ్యా లవ్ స్టొరీని డెవలప్ చెయ్యాలి కానీ ఎక్కడా లవ్ ట్రాక్ ని సరిగా చూపలేదు. సెకండాఫ్ లో ఇంకాస్త ఎంటర్టైన్మెంట్ ని ప్లాన్ చేసుకోవాల్సింది. ఒక్క క్లైమాక్స్ లో అందరి పాత్రలని సింపుల్ గా మార్చేయడం అంత నమ్మశక్యంగా లేదు. పాటలు, వాటి పిక్చరైజేషన్ బాగుంది కానీ వాటి ప్లేస్ మెంట్ మాత్రం సినిమా వేగాన్ని తగ్గించేలా ఉన్నాయి.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో ఈ సినిమాకి హెల్ప్ చేసిన డిపార్ట్ మెంట్స్ చాలానే ఉన్నాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది.. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ. సినిమాలోని ప్రతి ఫ్రేంని చాలా కలర్ఫుల్ గా, గ్రాండ్ గా చూపించాడు. కొత్తవారిన హీరో, హీరోయిన్స్ ని కూడా చాలా బాగా చూపించారు. అనూప్ రూబెన్స్ అందించిన పాటలు బాగున్నాయి. పాటల కంటే అనూప్ రూబెన్స్ నేపధ్య సంగీతం సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. కొన్ని చోట్ల కత్తిరింపు వేసుంటే సినిమా ఇంకా బెటర్ గా ఉండేది. వీరబాబు బాసిన రాసిన డైలాగ్స్ లో పంచ్ లు ఎక్కువైనా బాగున్నాయి. ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ ఆర్ట్ వర్క్ డీసెంట్ గా ఉంది.

ఇక దర్శకుడు రామ్ ప్రసాద్ విషయానికి వస్తే.. ఆయన కథ విషయంలో ఎక్కువ కేర్ తీసుకోవాల్సింది అనిపిస్తుంది. ఎందుకు అంటే సినిమా అయ్యేటప్పటికి చాలా రెగ్యులర్ సినిమానే కదా అనే ఫీలింగ్ ఆడియన్స్ కి కలుగుతుంది. స్క్రీన్ ప్లే లో కొన్ని ఆసక్తికర ఎలిమెంట్స్ రాసుకోవాల్సింది. ఇక దర్శకుడిగా మాత్రం కొంతమేర సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. కొత్తవారే అయినా అందరి నుంచి మంచి పెర్ఫార్మన్స్ రాబట్టుకున్నాడు. చివరిగా అయినా కచ్చితంగా చెప్పాల్సిన పేరు, ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ అతనే నిర్మాత కృష్ణారెడ్డి. తన కొడుకు సినిమా అని ఊరికే డబ్బు కుమ్మరించకుండా కథను నమ్మి కథకి ఎంత కావాలో చూసుకొని చాలా ఉన్నత విలువలతో ఎంతో గ్రాండ్ గా సినిమాని నిర్మించాడు.

తీర్పు :

చైల్డ్ ఆర్టిస్ట్ గా అందినీ మెప్పించిన నాగ అన్వేష్ హీరోగా కూడా ‘వినవయ్యా రామయ్యా’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు. ఈ రెగ్యులర్ స్టొరీకి మన తెలుగు సినిమా కమర్షియల్ ఫార్మాట్ ని పర్ఫెక్ట్ గా మిక్స్ చేసి తీసారు. నటీనటుల పెర్ఫార్మన్స్, కమెడియన్స్ కామెడీ, సెకండాఫ్ లో ఫ్యామిలీ ఎమోషన్స్, సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి హెల్ప్ అయితే కాస్త స్లో అనిపించే ఫస్ట్ హాఫ్, రెగ్యులర్ స్టొరీ, కథనం చెప్పదగిన మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా కొత్తదనం సినిమాలే కోరుకునే వారికి రెగ్యులర్ గా అనిపించినా, రెగ్యులర్ స్టొరీ అయినా అన్ని కమర్షియల్ అంశాలు ఉండాలి అనుకునే వారికి మాత్రం చూడదగిన సినిమా ‘వినవయ్యా రామయ్యా’.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు