విడుదల తేదీ : 18 అక్టోబర్ 2013 | ||
123తెలుగు.కామ్ రేటింగ్ : 1/5 |
||
దర్శకుడు : రవి |
||
నిర్మాత : గాజుల మాణిక్యరావు |
||
సంగీతం : జి.కె |
||
నటీనటులు : ఉపేంద్ర, సెలీనా జెట్లీ, ప్రియాంక త్రివేది.. |
2004లో అక్షయ్ కుమార్ హీరోగా వచ్చి సూపర్ హిట్ అయిన ‘ఐత్ రాజ్’ సినిమాని 2011లో కన్నడలో ఉపేంద్ర హీరోగా ‘శ్రీమతి’ అనే పేరుతో తెరకెక్కించారు. కానీ ఆ సినిమా కన్నడలో ఫ్లాప్ అయ్యింది. తెలుగులో ఉపేంద్ర అంటే కాస్తో కూస్తే క్రేజ్ ఉండడం వల్ల ఆ ఫ్లాప్ సినిమాని రెండేళ్ళ తర్వాత డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేసారు. సెలీనా జెట్లీ, ప్రియాంక త్రివేది హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి రవి డైరెక్టర్. ఉపేంద్ర పేరుని క్యాష్ చేసుకుందామని నిర్మాతలు చేసిన ప్రయత్నం ఎంతవరకూ ఫలించిందో ఇప్పుడు చూద్దాం..
కథ :
రాజ్ కుమార్(ఉపేంద్ర) వాయిస్ మొబైల్ కంపెనీలో సీనియర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తుంటాడు. ఒకరోజు ఇల్లు మారి తన ఇంటికి వచ్చిన ప్రియ కామత్(ప్రియాంక త్రివేది)ని చూసి రాజ్ కుమార్ మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. ప్రియ కూడా ఒక అనడంతో ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది. అదే సమయంలో వాళ్ళ కంపెనీ ఎండీ తన స్థానాన్ని తన భార్య సోనియా రాయ్(సెలీనా జెట్లీ)కి అప్పగిస్తాడు. కట్ చేస్తే రాజ్ కుమార్ – సోనియాకి గతమలోనే పరిచయం ఉంటుంది.
దాంతో సోనియా రాజ్ కుమార్ తో ఫిజికల్ గా సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. దానికి రాజ్ కుమార్ ఒప్పుకోడు. దాంతో ఎలాగైనా రాజ్ కుమార్ ని తన వశం చేసుకోవాలనుకున్న సోనియా తనపై అపద్దపు కేసు పెడుతుంది. ఆ అపద్దపు కేసు నుండి రాజ్ కుమార్ తప్పించుకున్నాడా? లేదా? అసలు సోనియా రాజ్ పై పెట్టిన కేసు ఏమిటి? గతంలో రాజ్ కుమార్ కి సోనియాకి మధ్య ఉన్న సంభంధం ఏంటి? అనే అంశాలను మీరు తెరపైనే చూడాలి.
ప్లస్ పాయింట్స్ :
రెండు పాటల్లో సెలీనా జెట్లీ అందాల ఆరబోత మరియు కొన్ని హాట్ సీన్స్ బి, సి సెంటర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. సెకండాఫ్ మొదట్లో వచ్చే ఓ కోర్టు సీన్ బాగుంది. కోట శ్రీనివాసరావు నటన బాగుంది.
మైనస్ పాయింట్ :
ఈ సినిమాకి చాలా మంది ఉపేంద్ర మొహం చూసే వెళ్తారు అనడంలో ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే ఉపేంద్ర సినిమా ఎలా ఉన్నా ఉపేంద్ర ఏదో ఒకటి కొత్తగా ట్రై చేస్తాడు, ఆయన యాక్టింగ్ చూడొచ్చు అని అనుకుంటారు. కానీ ఈ సినిమాలో ఉపేంద్ర టాలెంట్ ని ఒక పర్సెంట్ కూడా వాడుకోలేదు. ఆయన సినిమాలు ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటాయి. కానీ ఈ మూవీలోఆ ఎనర్జీ మిస్సింగ్. ఉపేంద్ర నటన కూడా అంతంత మాత్రంగానే ఉంది. కావున ఉపేంద్ర కోసం ఈ సినిమా చూడాలనుకునే ఉద్దేశం ఉంటే ఇకనైనా మానుకోండి. ఇక హీరోయిన్ ప్రియాంక త్రివేది ఫేస్ లో ఎలాంటి సందర్భానికైనా ఒకటే ఎక్స్ ప్రెషన్ కనిపిస్తుంది. కావున మీరు సినిమాలో ఆమెని చూడలేరు. షాయాజీ షిండే పాత్ర, సీన్ కంటే మించి ఇచ్చిన అతని భావ భావాలు కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తాయి.
సినిమా మొదటి నుంచి చాలా నిధానంగా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో పెద్ద విషయం ఏం లేదు. ఫస్ట్ హాఫ్ అయ్యేటప్పటికి సెకండాఫ్ అసలే విషయంలేదని, అసలు ఎం జరగబోతుంది అనేది ఆడియన్స్ కి తెలిసిపోతుంది. దాంతో ప్రేక్షకుడు ఉత్కంఠకి గురయ్యే సీన్స్ ఏమీ ఉండవు. థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడు నవ్వుకోవడానికి ఒక్క కామెడీ బిట్ కూడా లేదు. విజువల్స్ చాలా దారుణంగా ఉన్నాయి. ఈ సినిమాలో విజువల్స్ కంటే ఈ మధ్య వస్తున్న పైరసీ ప్రింట్స్ చాలా క్లారిటీగా ఉంటున్నాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు విజువల్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో..! పాటలు ఒక్కటి కూడా ఆకట్టుకునేలా లేవు. సినిమాలో వచ్చే నాలుగు పాటలు అప్పటికే మెల్లాగా నడుస్తున్న సినిమాని ఇంకా నెమ్మది చేయడమే కాకుండా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేలా ఉన్నాయి.
మ్యూజిక్ డైరెక్టర్ హాలీవుడ్ మ్యూజిక్ ని కాపీ కొట్టడం ఎందుకు అని అనుకున్నాడేమో మణిశర్మ గారు అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బిట్స్ అన్నిటిని కలిపి ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొట్టాడు. సినిమాలో చాలా డైలాగ్స్ తప్పుగా రాసారు. ఉదాహరణకి సెలీనా జెట్లీ చెప్పాల్సిన డైలాగ్ ‘మీ ఆయన అపరాధిగా నిరూపణ అయితే 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది’ అని చెప్పాలి కానీ ‘ మీ ఆయన నిరపరాధిగా నిరూపణ అయితే 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని’ చెప్పడంతో.. నిరపరాదిగా నిరూపణ అయినా శిక్ష వేస్తారా ఇదెక్కడి లాజిక్ రా.. అని ఆడియన్స్ అవాక్కయ్యారు. ఇలాంటి కొన్ని డైలాగ్స్ ఆడియన్స్ ని షాక్ కి గురి చేసాయి.
సినిమాలో ముఖ్య పాత్రల్లో తెలుగు నటీనటులు కనిపిస్తారు. కానీ వారికి వేరే వారు డబ్బింగ్ చెప్పారు. ఒక్కరికి కూడా డబ్బింగ్ సెట్ అవ్వలేదు. ఆ డబ్బింగ్ వినడానికి కర్ణకఠోరంగా ఉంది. ఉపేంద్ర – ప్రియాంక, ఉపేంద్ర – సెలీనా జెట్లీ ఏ ఒక్క ట్రాక్ ని కూడా సరిగా చూపించలేదు.
సాంకేతిక విభాగం :
సినిమాటోగ్రఫీ చాలా చెత్తగా ఉంది. నేను పైన చెప్పినట్టు ఈ సినిమాలో విజువల్స్ లో కంటే పైరసీ ప్రింట్స్, షార్ట్ ఫిల్మ్ లు చాలా క్లారిటీగా ఉంటున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారి సినిమాలు చూస్తూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేసినట్టుంది. నచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బిట్స్ అన్ని లేపి ఈ మూవీకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొట్టాడు. పాటలను కూడా అదే విధంగా కొట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ జికె అని పేరు వేసుకోవడం కంటే థాంక్స్ టు మణిశర్మ అని వేసుంటే బాగుండేది. ఎడిటింగ్ కూడా అస్సలు బాగోలేదు. డబ్బింగ్ చాలా నాశిరకంగా ఉంది.
కథ – డైరెక్టర్ కష్టపడి రాసుకున్నది కాదు, హిందీ నుంచి తీసుకున్నదే, స్క్రీన్ ప్లే – అదో పెద్ద మైనస్. డైరెక్షన్ – ఉపేంద్ర లాంటి హీరోని చేతిలో పెట్టుకొని అతని టాలెంట్ ని ఒక పర్సెంట్ కూడా వాడుకోలేదు అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు డైరెక్టర్ గా రవి టాలెంట్ ఏంటనేది. కావున డైరెక్టర్ రవి విషయంలో మాటల్లేవ్..
తీర్పు :
XYZ – సినిమాకి వెళ్ళిన ఆడియన్స్ థియేటర్ నుండి జంప్ అవుతున్నారు. ఉపేంద్ర ఏదో కొత్త పాత్ర ట్రై చేసి ఉంటాడని అనుకోని సినిమాకి వెళ్ళే ప్రతి ఒక్కరూ నిరుత్సాహానికి గురవుతారు. ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది అంటే సెలీనా జెట్లీ అందాల ఆరబోత, చెప్పుకోకూడనివి అంటే ఎ టు జెడ్ అన్ని వస్తాయి. కావున సినిమాకి వెళ్ళాలా వద్దా అన్నది మీరే నిర్ణయించుకోండి.
123తెలుగు.కామ్ రేటింగ్ : 1/5
రాఘవ