విడుదల తేదీ : ఫిబ్రవరి 24, 2017
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
దర్శకత్వం : జీవ శంకర్
నిర్మాతలు : సుభాస్కరన్, ఫాతిమా ఆంటోనీ
సంగీతం : విజయ్ ఆంటోనీ
నటీనటులు : విజయ్ ఆంటోనీ, మియా జార్జ్
‘బిచ్చగాడు, భేతాళుడు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటించిన తాజా చిత్రం ‘యమన్’. ప్రచార కార్యక్రమాలు భారీగా చేయడం, టీజర్, ట్రైలర్ బాగుండటంతో ఈ సినిమా మీద మంచి అంచనాలున్నాయి. ఇన్ని అంచనాల మధ్య తమిళంతో పాటలు తెలుగులో కూడా ఈరోజే రిలీజైన ఈ చిత్రం ఎలా ఉంది ఇపుడు తెలుసుకుందాం..
కథ :
ఈ చిత్ర కథ 30 ఏళ్ల క్రితం ఒక గ్రామంలో మొదలవుతుంది. ఆ గ్రామంలో ఉండే ఆదర్శవాది అయిన దేవరకొండ గాంధీ (విజయ్ ఆంటోనీ) ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేగా నిలబడేందుకు పోటీపడుతుంటారు. అతనికి రాజకీయ ప్రత్యర్థి, స్నేహితుడు అయిన పాండురంగ అతన్ని హత్య చేస్తాడు. దీంతో గాంధీ భార్య కూడా తమ బిడ్డను వదిలేసి ఆత్మహత్య చేసుకుంటుంది. అలా అనాధ అయిన ఆ పిల్లాడు పెరిగి పెద్దై అశోక్ చక్రవర్తిగా (విజయ్ ఆంటోనీ) మారతాడు.
అలా ఉన్న అశోక్ తన తాతయ్యకు డబ్బు అవసరమై ఒక కేసు విషయంలో వేరొకరి బదులుగా జైలుకు వెళతాడు. అక్కడ రెండు గ్యాంగ్స్ మధ్య జరిగే గొడవల్లో ఇరుక్కుంటాడు. ఆ సమయంలో కరుణాకర్ అనే పెద్ద మనిషి అశోక్ కు అందులో నుండి బయటపడేందుకు, సొంతగా బిజినెస్ పెట్టుకునేందుకు హెల్ప్ చేస్తాడు. ఆ తర్వాత అశోక్, అతని తండ్రిని చంపి ఎంపీగా ఎదిగిన పాండురంగ ఇద్దరు రాజకీయాల్లో ఒకరికొకరు ఎదురవుతారు. ఆ సమయంలోనే అతను ప్రేమలో కూడా పడతాడు. అశోక్ తనకున్న రాజకీయ ఆశయాలను నెరవేర్చడానికి కరుణాకర్, పాండురంగా ఇద్దరికీ ఎదురు తిరుగుతాడు. ఆ పోరాటంలో అశోక్ తన తండ్రి చావుకు ఎలా పగ తీర్చుకున్నాడు ? తన ఆశయాలను ఎలా నెరవేర్చుకున్నాడు ? అనేదే ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకు విజయ్ ఆంటోనీ వలనే మంచి హైప్ వచ్చిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే అతన్ని ఎక్కువ సన్నివేశాల్లో ఉండేలా చూశారు. అతని కోసమే సినిమా చూస్తున్న ప్రేక్షకులకు అలా విజయ్ ప్రతి సీన్లో కనిపిస్తుండటం సంతృప్తిగా ఉంటుంది. అలాగే అతని నటన చాలా బాగుంది. ఒక సాధారణమైన మనిషి నుండి చిన్నస్థాయి రాజకీయ నాయకుడిగా అతను మారిన విధానం చాలా బాగా చూపించారు. అలాగే కరుణాకర్ పాత్ర చేసిన త్యాగరాజన్ నటన కూడా మెప్పించింది.
సినిమాలో మరో ప్రధానమైన అంశం ఏమిటంటే కథలోని మూడు ప్రధాన పాత్రలు ఒకరిని ఒకరు మోసం చేయడాని చేసే ప్రయత్నం, ఎత్తుకు పై ఎత్తులు వేయడం వంటి వాటిని కథనంలో చాలా బాగా చూపించారు. దీంతో పాటే నడిచే హీరో లవ్ ట్రాక్ ఈ ప్రధాన కథనానికి ఏమాత్రం అడ్డు తగలకపోవడం విశేషం.
మైనస్ పాయింట్స్ :
సినిమా కథనం బాగానే ఉన్నా ప్రత్యర్థుల మధ్య జరిగే పొలిటికల్ గేమ్ లోని కొన్ని సందర్భాల్లో ప్రేక్షకుడికి చాలా వరకు కనెక్ట్ కాలేదు. దీంతో ఆ సందర్భాల్లో కాస్త నిరుత్సాహం ఏర్పడింది. ఇంకొన్ని సందర్భాల్లో అయితే చిత్రం సరిగా కనెక్టవకపోవడం కాస్త ఇబ్బందిగా తోచింది కూడా. హీరోయిన్ మియా జార్జ్ కు కేవలం రెండు పాటలు, 5 సన్నివేశాలకు మాత్రమే పరిమితమవడం కాస్త నెగెటివ్ ప్రభావం చూపింది.
సినిమా మాతృక తమిళం కావడం వలన తెలుగు వర్షన్ లో సైతం చాలా చోట్ల తమిళ వాతావరణం కనబడింది. నటీనటుల నటన కూడా తమిళ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగించింది. దర్శకుడు నేమ్ బోర్డ్స్ వంటి వాటిని కవర్ చేసినా ఆ ఫీల్ పోవడం కష్టమైంది.
తీర్పు :
కొందరు వ్యక్తుల మధ్య జరిగే ఈ పొలిటికల్ గేమ్ అనే అంశం చాలా ఆసక్తికరంగా ఉంది. సినిమాలో విజయ్ ఆంటోనీ తనకు ఎదురైన కష్టమైన పరిస్థితులను ఎలా ఎదుర్కున్నాడు, ఎలాంటి మైండ్ గేమ్ ఆడాడు, అనుకున్నది ఎలా సాధించాడు అనే అంశాలు ప్రేక్షకులకు మంచి ఆసక్తిని కలిగిస్తాయి. సినిమా ఏకైక బలహీనంగా ఉన్న కథనం యొక్క నిదానాన్ని పట్టించుకోకపోతే ఈ చిత్రాన్ని ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు.
123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team