సమీక్ష : అవతారం – కోడి రామకృష్ణ అన్ని మూవీల మిక్సింగ్..

Avataram-review విడుదల తేదీ : 18 ఏప్రిల్ 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.25/5
దర్శకత్వం :కోడిరామకృష్ణ
నిర్మాత : యం. యుగంధర్ రెడ్డి
సంగీతం:ఘంటాడి కృష్ణ
నటీనటులు: రాధిక, రిషి, భాను ప్రియ .

‘అమ్మోరు’, ‘దేవీ’, ‘దేవుళ్ళు’, ‘అరుంధతి’ లాంటి లేడీ ఓరియెంటెడ్ భక్తిరస చిత్రాలకు దర్శకత్వం వచించిన కోడిరామకృష్ణ చాలా కాలం గ్యాప్ తీసుకొని చేసిన సినిమా ‘అవతారం’. ఎక్కువ గ్రాఫిక్స్ కి స్కోప్ ఉన్న ఈ సినిమాని యం. యుగంధర్ రెడ్డి నిర్మించారు. నూతన నటీనటులు నటించిన ఈ సినిమాకి ఘంటాడి కృష్ణ సంగీతం అందించాడు. కోడి రామకృష్ణ చాలా రోజులు గ్యాప్ తీసుకొని చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం..

కథ :

ఎనిమిది కొండలపై ఉన్న అక్కమ్మ అమ్మవారి(భాను ప్రియ)కి శక్తులు లేకుండా గరుల కోట శక్తులు బందించి ఉంటాయి. ఆ గరుల కోట శక్తుల నుంచి అక్కమ్మని విడిపించాలంటే ఎవరన్నా సింహరాశిలో పుట్టిన వారు అగ్నికి తమకు తాముగా బలవ్వాలి. చిన్ననాటి నుంచి అక్కమ్మ దగ్గరే పుట్టి పెరిగిన నలుగురు అక్క చెల్లెళ్ళు అగ్నికి బలై అక్కమ్మని దుష్టశక్తుల చెర నుండి విడిపిస్తారు. దాంతో అక్కమ్మ, వారిని చెల్లెళ్ళుగా స్వీకరించి అక్కడి నుంచి ఈ ఐదుగురు కలిసి ఊరిని కాపాడుతుంటారు.

ఆ తర్వాత అదే ఊరిలో పుట్టిన రాజేశ్వరి(రాధిక) ఈ అక్కమ్మ చెల్లెళ్ళను పూజిస్తూ ఒంటరిగా బతుకుతూ ఉంటుంది. అదే ఊరి రాజా కుటుంబానికి చెందిన ప్రసాద్(రిషి) తమ బంధువులు తన ఆస్తి కోసం ప్రసాద్ ని పిచ్చి వాడిని చేస్తారు. పిచ్చివాడైన ప్రసాద్ ని రాజేశ్వరి మార్చడానికి ట్రై చేస్తున్న టైంలో 1000 సంవత్సరాలకు వచ్చే అన్ని గ్రహాల కూటమి వల్ల కర్కోటకుడు(సత్య ప్రకాష్) భూమిపైకి వస్తాడు.

భూ ప్రపంచాన్ని నాశనం చేసి తన వశం చేసుకోవాలి అనుకుంటాడు. కానీ అప్పుడే అతనికి సింహరాశిలో పుట్టిన రాజేశ్వరి వల్ల మరణగండం ఉందని తెలుస్తుంది. దాంతో అతను రాజేశ్వరిని చంపడానికి ఏం చేసాడు? దైవ శక్తులు రాజేశ్వరిని కాపాడి, కర్కోటకుడిని అంతం చేశాయా? లేదా? అన్నదే ఈ సినిమా కథాంశం.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి మొదటి ప్లస్ పాయింట్ ఈ సినిమా ప్రారంభం. మొదటి 10 నిమిషాలు దైవశక్తి గురించి, దుష్టశక్తి గురించి చెప్పే సీన్స్ ఆడియన్స్ ని కట్టిపడేసేలా ఉన్నాయి. ఆలాగే చివరి 10 నిమిషాలు వచ్చే లక్ష్మీ నరసింహస్వామి ఎపిసోడ్ బాగుంటుంది. ఇకపోతే సినిమాలో లీడ్ రోల్ చేసిన రాధిక ఈ సినిమాకి ప్లస్ పాయింట్. రాధిక మంచి నటనని కనబరిచింది. సెంటిమెంట్ సీన్స్ కూడా బాగా చేసింది. సినిమా మొదట్లో వచ్చే గ్రాఫిక్స్ పరవాలేదనిపిస్తుంది. అలాగే చివర్లో వచ్చే లక్ష్మీ నరసింహ స్వామి గెటప్ బాగుంది.

మైనస్ పాయింట్స్ :

మైనస్ పాయింట్స్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలబ్బా… ముందుగా దైవశక్తి – దుష్టశక్తి కాన్సెప్ట్ తో తీసే భక్తి సినిమాలకు ప్రప్రధమంగా బాగుండాల్సింది గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్. కానీ ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్. సినిమాలో 50% వరకూ గ్రాఫికల్ వర్క్ ఉంటుంది. కానీ అందులో ఏదో ఒకటి రెండు సీన్స్ లో తప్ప మిగతా అన్ని చోట్లా ఇదేం గ్రాఫిక్స్ రా బాబు అనుకునేలా ఉంది. గ్రాఫిక్స్ బాలేవు కాబట్టి ప్రేక్షకులు అక్కడే సగంపైగా నిరాశకి గురవుతారు. ముఖ్యంగా కర్కోటకుడు భూమిపైకి వచ్చే సీన్, అలాగే ఆ కర్కోటకుడు పెరిగి పెద్దయ్యే సీన్, నంది – దుష్టశక్తికి మధ్య ఫైట్ సీక్వెన్స్, ప్రీ క్లైమాక్స్ ఇలా చాలా కీలకమైన సీన్స్ కి గ్రాఫిక్స్ అస్సలు బాలేదు.

గ్రాఫిక్స్ పోతే పోయింది.. కాన్సెప్ట్, కథ ప్రకారం అన్నా కొత్తగా ఉందా అంటే అదీలేదు. కోడి రామకృష్ణ గతంలో తీసిన అమ్మోరు, దేవీ, దేవుళ్ళు లాంటి సినిమాల్లోని కొన్ని కొన్ని పాయింట్స్ ని తీసుకొని ఈ సినిమాని కథని రాసేసుకున్నారు. సినిమా చూసినంత సేపు ఇది ఆ సినిమాలో ఉందిగా, ఈ సినిమాలో ఉందిగా అనుకోవాలి. ముఖ్యంగా దేవుళ్ళు క్లైమాక్స్ సీన్ ని అవతారం క్లైమాక్స్ సీన్ లో మక్కికి మక్కిదించారు. అక్కడ అయ్యప్ప స్వామి ఉంటాడు ఇక్కడేమో లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడు అంతే తేడా మిగతా అంతా సేమ్ టు సేమ్ ఫీల్.

కర్కోటకుడు అనే విలన్ పాత్రకి పవర్ఫుల్ గా ఎంట్రీ ఇచ్చినా కథలో మాత్రం ఎక్కడా ఎలివేట్ చేయలేదు. అలాగే ఆ పాత్రలో సత్య ప్రకాష్ లుక్ అస్సలు సెట్ అవ్వలేదు. ఇకపోతే రిషి పాత్రకి అస్సలు జస్టిఫికేషన్ లేదు. అసలు అతనికి ఎందుకు పిచ్చి పట్టింది, అసలు ఏ కారణం వల్ల అతనిలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తుంటాయి అనేదానికి అసలు కారణమే చూపలేదు. సెకండాఫ్ చాలా చాలా స్లోగా ఉంది. సుమారు 145 నిమిషాల ఈ సినిమాలో ఒక 40 నిమిషాలని అన్నా కట్ చేస్తే బాగుండేది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో సూపర్బ్ అని చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేకపోవడం దురదృష్టకరం. ఓవరాల్ గా ఒక 20 సీన్స్ లో తప్ప మిగతా అన్ని సీన్స్ లో సినిమాటోగ్రఫీ చాలా నాశిరకంగా ఉంది. నటీనటుల ఫేస్ లు చాలా బ్లర్ గా కనిపిస్తాయి. ఎడిటింగ్ అస్సలు బాలేదు. సెకండాఫ్ లో చాలా వరకూ ఎడిట్ చేసి ఉంటె బాగుండేది. ఘంటాడి కృష్ణ అందించిన పాటలు పెద్దగా లేవు, చిన్నా అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. పైన చెప్పినట్టు గ్రాఫిక్స్ అనేది అస్సలు బాలేదు.

ఇక కోడి రామకృష్ణ డీల్ చేసిన కథ – స్క్రీన్ ప్లే – డైరెక్షన్ విషయాలకు వస్తే, పైన చెప్పినట్టు కోడి రామకృష్ణ అన్ని సినిమాల స్టొరీల మిక్సింగ్ ఏ ఈ సినిమా కాన్సెప్ట్. స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా లేదు. ఇక డైరెక్షన్ పరంగా నటుల నుంచి యాక్టింగ్ రాబట్టుకున్నా గ్రాఫిక్స్ విషయంలో మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. నిర్మాణ విలువలు కూడా అంతంతమాత్రంగా ఉన్నాయి.

తీర్పు :

కోడి రామకృష్ణ గతంలో తీసిన అన్ని భక్తి సినిమాల కలగూరగంపే ఈ ‘అవతారం’. ఈ సినిమాలో మీకు ఆయన కొత్తగా చూపించడానికి ట్రై చేసింది ఒక్క గ్రాఫికల్ విజువల్స్ మాత్రమే.. కానీ ఆ గ్రాఫికల్ విజువల్స్ చాలా దారుణంగా, నాశిరకంగా ఉండడం వల్ల అదే ఈ సినిమాకి పెద్ద మైనస్, దాంతో ‘అవతారం’ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సినిమా మొదటి 10 నిమిషాలు, లీడ్ రోల్ చేసిన రాధిక పెర్ఫార్మన్స్ తప్ప మీరు చూడటానికి సినిమాలో ఏమీలేదు. కోడి రామకృష్ణ గత సూపర్ హిట్ గ్రాఫికల్ సినిమాలను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాకి వెళితే మీరు కచ్చితంగా నిరుత్సాహపడతారు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version