సమీక్ష : జంప్ జిలాని – నవ్వించలేకపోయిన రొటీన్ జంప్ జిలాని.!

jump-jilani-rev విడుదల తేదీ : 12 జూన్ 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.5/5
దర్శకత్వం : ఇ. సత్తిబాబు
నిర్మాత : అంబిక రాజా – రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ 
సంగీతం : విజయ్ ఎబెంజర్ 
నటీనటులు : అల్లరి నరేష్, ఇషా చావ్లా, స్వాతి దీక్షిత్..

గత కొంతకాలంగా బాక్స్ ఆఫీసు వద్ద సరైన హిట్ కోసం తెగ ట్రై చేస్తున్న కామెడీ కింగ్ అల్లరి నరేష్ తన కెరీర్ లో మొట్ట మొదటి సారిగా ద్విపాత్రాభినయం చేసిన సినిమా ‘జంప్ జిలాని’. తమిళ హిట్ సినిమా ‘కలకలప్పు’ కి రీమేక్ గా నిర్మించిన ఈ సినిమాలో ఇషా చావ్లా, స్వాతి దీక్షిత్ హీరోయిన్స్ గా నటించారు. గతంలో అల్లరి నరేష్ తో కామెడీ పండించిన ఇ. సత్తిబాబు డైరెక్ట్ చేసిన ఈ మూవీని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి అంబిక రాజా నిర్మించారు. హిట్ కోసం ఎదురు చూస్తున్న అల్లరి నరేష్ కి మొదటి సారి చేసిన డ్యూయల్ రోల్ కలిసొచ్చి రీమేక్ తో అన్నా హిట్ అందుకున్నాడో లేదో ఇప్పుడు చూద్దాం..

కథ :

‘జంప్ జిలాని’ కథ శ్రీ కాంత్ వాయిస్ ఓవర్ తో నిడదవోలులో ప్రారంభమవుతుంది. నిడదవోలులో తరతరాలుగా వస్తున్న హోటల్ సత్యనారాయణ విలాస్ కాఫీ క్లబ్. కానీ ప్రస్తుత పరిస్థితుల వల్ల ఆ హోటల్ నష్టాల్లో నడుస్తూ ఉంటుంది. అలా కష్టాల్లో నడిచే హోటల్ కి మన సత్తిబాబు(అల్లరి నరేష్) ఓనర్. అతని మరదలైన గంగ(స్వాతి దీక్షిత్) సత్తిబాబుకి సాయం చేస్తూ ఉంటుంది. అదే టైంలో ఆ ఊరికి ఫుడ్ ఇన్స్పెక్టర్ గా వచ్చిన మాధవి(ఇషా చావ్లా) సత్తిబాబు హోటల్ ని మూసేయాలని ఆర్డర్ వేస్తుంది.

దాంతో తన హోటల్ మూతపడకుండా ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న తరుణంలో దొంగతనం కేసులో అరెస్టైన సత్తిబాబు తమ్ముడు రాంబాబు(అల్లరి నరేష్) రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఆ హోటల్ ని బాగా డెవలప్ చేస్తారు. ఆ టైములో సత్తిబాబు-మాధవి, రాంబాబు-గంగ ప్రేమలో పడతారు. కానీ మాధవి ప్రేమ వల్ల సత్తిబాబు ఫ్యాక్షనిస్ట్ అయిన ఉగ్రనరసింహారెడ్డి(పోసాని కృష్ణ మురళి) చేతిలో ఇరుక్కుంటే, పేకాట వ్యసనం వల్ల రాంబాబు హోటల్ ని పోగొట్టుకుంటాడు. దానివల్ల రాంబాబుకి గంగ దూరం అవుతుంది.

అప్పుడు ఈ ఇద్దరూ తమ ప్రేమని ఎలా కాపాడుకున్నారు? అలాగే వంశపారపర్యంగా వస్తున్న తమ హోటల్ ని ఎలా చేజిక్కించుకున్నారు? అసలు మాధవికి ఉగ్రనరసింహా రెడ్డికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అనే విషయాలు మీరు వెండితెరపై చూసి తెలుసుకోండి.

ప్లస్ పాయింట్స్ :

అల్లరి నరేష్ మొదటిసారి ఈ మూవీలో ద్విపాత్రాభినయం చేసాడు. సత్తిబాబు పాత్రలో కాస్త అమాయకంగా, రాంబాబు పాత్రలో ఒక దొంగగా తన పాత్రలకు తన వంతు న్యాయం చేసాడు. కానీ నరేష్ ఇలాంటి రెగ్యులర్ పాత్రలే కాకుండా సరికొత్త తరహా పాత్రలు చేస్తే బాగుంటుంది. ఇక ఇషా చావ్లా సినిమా మొత్తం చీరల్లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అలాగే తన రెబల్ పాత్రని బాగా చేసి మంచి మార్కులు కొట్టేసింది. ఇక స్వాతి దీక్షిత్ చూడటానికి చాలా గ్లామరస్ గా ఉంది. ఉన్నంతలో తనూ బాగా చేసింది.

వీరందరి తర్వాత చెప్పుకోవాల్సింది సెకండాఫ్ లో పోసాని కృష్ణ మురళి చేసిన ఉగ్రనరసింహారెడ్డి పాత్ర. తన పాత్ర సెకండాఫ్ లో ప్రేక్షకులను కాస్త నవ్విస్తుంది. ఇంటర్వల్ ఎపిసోడ్ దగ్గర సినిమా కాస్త వేగవంతం అవుతుంది. సినిమా మొత్తం మీద అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్స్ మాత్రం బాగున్నాయి. కోట శ్రీనివాసరావు, తాగుబోతు రమేష్, ఎంఎస్ నారాయణ, రావు రమేష్, వేణు మాధవ్ లు తమ పాత్రల్ పరిధిమేర నటించారు.

మైనస్ పాయింట్స్ :

ఇదొక రీమేక్ సినిమా. రీమేక్ అంటే మక్కికి మక్కి దించడం కాదు, ఒరిజినల్ వెర్షన్ లో ఉన్న ఫీల్ ని, కంటెంట్ ని, కామెడీని మన నేటివిటీకి తగ్గట్టుగా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చెప్పడం. కానీ ఆ విషయంలో ఈ మూవీ డైరెక్టర్ సత్తిబాబు పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. డైరెక్టర్ సత్తిబాబు ఈ సినిమాలో అల్లరి నరేష్ చేత డ్యూయల్ రోల్ చేయించాలి అనుకోవడం మొదటి మైనస్. సరే అనుకున్నాడు పో అప్పుడు రెండు పాత్రలని పూర్తి వైవిధ్యంగా చూపించాలి. కానీ సత్తిబాబు మాత్రం హీరోల డ్రెస్సెస్, లుక్ లో వైవిధ్యం చూపించాడు కానీ పాత్రల్లో మాత్రం పెద్దగా వైవిధ్యం చూపకపోవడం వల్ల తెరపై ఇద్దరు నరేష్ లు కనిపిస్తున్నా పెద్ద ఉపయోగం లేకపోయింది. అలాగే ఒక్కరూ కూడా ప్రేక్షకులను నవ్వించలేకపోయారు.

ముందుగా సినిమాకి అంత నిడివి లేకుండా షార్ట్ అండ్ కామెడీగా సినిమాని పూర్తి చేయాల్సింది. ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ అంటే సినిమా లెంగ్త్ మరియు స్క్రీన్ ప్లే. 165 నిమిషాల సినిమాలో దాదాపు 30 నిమిషాల సినిమాని కట్ చేస్తే ప్రేక్షకులను కాస్త సేవ్ అవుతారు. అలాగే స్క్రీన్ ప్లే కూడా చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొదలైన 20 నిమిషాల నుంచి ఇంటర్వల్ ఎప్పుడు వస్తుందా అని ఆడియన్స్ తలలు పట్టుకుంటారు అంటే మీరు అర్థ చేసుకోవచ్చు. సినిమాని ఎంత సాగాదీశారు అని.

ఇకపోతే అల్లరి నరేష్ సినిమా అనేగానీ చెప్పుకోదగ్గ స్థాయిలో కామెడీ లేకపోవడం ఈ మొవిఎకి మరో మేజర్ మైనస్. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే ఈ మధ్య బి గ్రేడ్ సినిమాలను చూసి అల్లరి నరేష్ లాంటి వాళ్ళ సినిమాలలో కూడా భూతు కామెడీ పై మొగ్గు చూపడం కాస్తా బాధాకరం. అలాగే స్లాప్ స్టిక్ కామెడీ, పంచ్ డైలాగ్స్ కామెడీ అనే మాయలో పడి హాస్యం అనే పదానికే అర్థం మార్చేస్తుండడం మరో బాధాకరమైన విషయం. సినిమానే బోరింగ్ గా సాగుతోంది అంటే మధ్యలో పాటలు వచ్చి ఆడియన్స్ ని ఇంకాస్త ఇబ్బంది పెడతాయి.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ గురించి. సినిమాటోగ్రాఫర్ దాశరధి శివేంద్ర తనకు ఇచ్చిన లోకేషన్స్ ని, నటీనటుల్ని చాలా చక్కగా చూపించాడు. ఇక విజయ్ ఎబెంజర్ అందించిన పాటలు సినిమాకి పెద్దగా హెల్ప్ కాలేదు అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతంతమాత్రంగానే ఉంది. క్రాంతిరెడ్డి సకినాల డైలాగ్స్ లో భూతు కాకుండా కామెడీ ఉంటే బాగుండేది. సీనియర్ ఎడిటర్ గౌతంరాజు చాలా జాగ్రత్తలు తీసుకొని సినిమాని చాలా భాగం కత్తిరించేసి ఉంటే అది సినిమాకి చాలా హెల్ప్ అయ్యేది.

ఇక డైరెక్టర్ ఇ. సత్తిబాబు విషయానికి వస్తే.. తమిళ సినిమా కథని, అందులోని సీన్స్ ని ఇక్కడ తీయగలిగాడు కానీ అందులోని ఫీల్ ని, కామెడీని తెలుగు ప్రేక్షకులను అందించడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. తను రాసుకున్న స్క్రీన్ ప్లే కూడా బోరింగ్ గా ఉండడంతో ఒక డైరెక్టర్ గా ఈ సినిమాతో పూర్తిగా ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

అల్లరి నరేష్ నటించిన ‘జంప్ జిలాని’ అనే సినిమాని ఆడియన్స్ కి సినిమా థియేటర్స్ నుంచి ఎప్పుడు జంప్ అయిపోదామా అనే ఫీలింగ్ కలిగించేలా ఉంది. అల్లరి నరేష్ ఇక నుంచి హిట్ సినిమాకి రీమేక్ చేస్తున్నామా లేదా డైరెక్టర్ ని చూసి సినిమా చెయ్యడం కాకుండా మనం ఈ సినిమాలో చేసే కామెడీ ఆడియన్స్ ని నవ్విస్తుందా లేదా అనేది ఒకటి పది సార్లు ఆలోచించి కథలను ఎంచుకుంటే బాగుంటుంది. నటీనటుల పెర్ఫార్మన్స్, మచ్చుకి అక్కడక్కడా వచ్చే కామెడీ సీన్స్ తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేని ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, కామెడీ లేకపోవడం, లెంగ్త్ బాగా ఎక్కువవ్వడం మేజర్ మైనస్ పాయింట్స్. అల్లరి నరేష్ కి అభిమానులైతే ఓ సారి చూడటానికి ట్రై చేయవచ్చు కానీ రెండున్నర గంటల పాటు సినిమా చూసి ఎంజాయ్ చెయ్యాలనుకొని ఈ సినిమాకి మీరు వెళితే బాగా నిరుత్సాహపడతారు.

123తెలుగు. కామ్ రేటింగ్ : 2.5/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version