విడుదల తేదీ : 20 జూన్ 2014 |
||
123తెలుగు. కామ్ రేటింగ్ : 3.25/5 | ||
దర్శకత్వం :శ్రీని అవసరాల | ||
నిర్మాత : రజిని కొర్రపాటి | ||
సంగీతం : కళ్యాణి కోడూరి | ||
నటీనటులు : నాగ శౌర్య, రాశి ఖన్నా, శ్రీని అవసరాలు.. |
కమెడియన్ గా బాగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీని అవసరాల దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఊహలు గుసగుసలాడే’. ‘ఈగ’, ‘లెజెండ్’, ‘అందాల రాక్షసి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించే సినిమాలు తీసిన సాయి కొర్రపాటి నిర్మాతగా చేసిన ఈ సినిమాలో నాగ శౌర్య, రాశి ఖన్నా హీరో హీరోయిన్స్ గా నటించారు. కళ్యాణి కోడూరి సంగీతం అందించాడు. శ్రీని అవసరాల దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించిందో ఇప్పుడు చూద్దాం..
కథ :
ఎన్. వెంకటేశ్వరరావు(నాగ శౌర్య)కి న్యూస్ చానల్లో న్యూస్ రీడర్ కావాలనేది లక్ష్యం. అందుకోసం యుబి చానల్ లో టెలీ షాపింగ్ యాంకర్ గా పనిచేస్తూ అదే చానల్ లో న్యూ రీడర్ అవ్వడానికి ట్రై చేస్తుంటాడు. ఆ యుబి చానల్ ఎండి ఎ. ఉదయ్ భాస్కర్(శ్రీనివాస్ అవసరాల). ఎన్నో రోజుల నుంచి పెళ్లి చేసుకోవడానికి సరైన అమ్మాయి కోసం ఎదురుచూస్తున్న ఉదయ్ శిరీషని చూసి ఇష్టపడతాడు. కానీ ఉదయ్ పై శిరీష పెద్దగా ఇష్టం చూపకపోవడంతో వెంకటేశ్వరరావుకి న్యూ రీడర్ పోస్ట్ ఇస్తానని బ్లాక్ మెయిల్ చేసి తన ప్రేమని గెలిపించుకోవడానికి సలహాలు తీసుకొని శిరీష దగ్గర వాడుకుంటూ ఉంటాడు.
ఈ సమయంలోనే వెంకటేశ్వరావు కూడా ప్రభావతి అనే అమ్మాయితో ప్రేమలో పడి విడిపోయి ఉంటాడని ఉదయ్ కి తెలుస్తుంది. కానీ అక్కడే ట్విస్ట్ వెంకటేశ్వరరావు ప్రేమ ఉదయ్ భాస్కర్ – శిరీష పెళ్ళికి పెద్ద అడ్డంగా మారుతుంది. అసలు వెంకటేశ్వరరావు ప్రేమకి ఉదయ్ భాస్కర్ పెళ్ళికి ఉన్న సంబంధం ఏమిటి? అసలు శిరీష – ప్రభావతిలు వేరు వేరా? లేక ఒకటేనా? చివరికి వెంకటేశ్వరరావు విడిపోయిన తన ప్రభావతితో కలిసాడా? లేదా? ఉదయ్ భాస్కర్ కి శిరీషతో పెళ్ళయ్యిందా? లేదా? అన్నది మీరు వెండి తెరపైనే చూడాలి..
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఈ సినిమాకి ఎంచుకున్న నటీనటులు మరియు టెక్నికల్ టీం. నటీనటుల్లో అందరి కంటే ఎక్కువగా శ్రీనివాస్ అవసరాల మార్కులు కొట్టేసాడు. తను మునుపెన్నడూ లేని విధంగా సందర్భానుసారంగా వచ్చే కామెడీతో ప్రేక్షకులని బాగా నవ్వించాడు. అలాగే కొన్ని చోట్ల నెగటివ్ షేడ్స్ కూడా బాగా చూపించాడు. తర్వాత చెప్పుకోవాల్సింది హీరోయిన్ రాశి ఖన్నా గురించి.. రాశి ఖన్నా చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎంతలా అంటే సినిమా అయ్యేలోపు ఆ అమ్మాయితో ప్రేమలో పడేంతగా ఉంది. అలాగే తెలుగు రాకపోయినా ప్రతి ఒక్క సీన్ లోనూ ప్రాణం పెట్టి చేసింది. ఇక చివరిగా చెప్పాల్సింది నాగ శౌర్య గురించి.. నాగ శౌర్య లుక్ బాగుంది. అలాగే తన పాత్రకి, డైరెక్టర్ అనుకున్న ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా స్క్రీన్ పై చూపించాడు. వీరి ముగ్గురు ఒకరికొకరు తీసిపోం అనే రేంజ్ లో పెర్ఫార్మన్స్ చేయడం ఈ సినిమాకి మెయిన్ హైలైట్.
సినిమాలో రాశి ఖన్నాని ఇంప్రెస్ చెయ్యడానికి శ్రీని అవసరాల ట్రై చేసే సీన్స్ అన్ని ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర, సెకండాఫ్ లో వచ్చే రెస్టారెంట్ సీన్స్ బాగా నవ్విస్తాయి. సెకండాఫ్ చాలా ఫాస్ట్ గా, ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. రావు రమేష్, హరీష్, 30 ఇయర్స్ పృథ్వి, పోసాని కృష్ణమురళి కనిపించినది కొంతసేపే అయినా ఉన్నంతలో నవ్వించారు. అలాగే కృష్ణ భగవాన్ వాయ్సి ఓవర్, సినిమా స్టార్టింగ్ కూడా బాగా చేసారు.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాకి చెప్పాల్సిన మైనస్ పాయింట్స్ లో ముందుగా చెప్పాల్సి వస్తే అది ఫస్ట్ హాఫ్ అనే చెప్పాలి.. ఎందుకంటే స్టార్టింగ్ బాగానే మొదలు పెట్టారు, ఇంటర్వల్ ఎండింగ్ బాగానే ఉంది కానీ మధ్యలో వచ్చే 45 నిమిషాలు మాత్రం చాలా బోరింగ్ గా, చాలా రొటీన్ గా ఉంటుంది. అలాగే ఒక 20 నిమిషాల సినిమా పూర్తయ్యాక సినిమా ఎలా ఉంటుంది, క్లైమాక్స్ ఏమవుతుంది అనే విషయాలను ఆడియన్స్ ఈజీగా చెప్పేయగలరు. కావున స్క్రీన్ ప్లే ఈ సినిమాకి పెద్దగా హెల్ప్ అవ్వలేదు.
అలాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ లో ఉండాల్సింది హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ, కానీ ఈ మూవీలో ఏ ఇద్దరి మధ్యా సరైన కెమిస్ట్రీ కనిపించలేదు. స్లోగా సాగుతున్న సినిమాలో పాటలు రావడం మరో మైనస్. ఈ సినిమాలోని రొమాంటిక్ సీన్స్ ఎసెంటర్, మల్టీ ప్లెక్స్ వారికే తప్ప బి, సి సెంటర్స్ వారికి పెద్దగా కనెక్ట్ కావు.
సాంకేతిక విభాగం :
ఈ సినిమాకి ప్రతి టెక్నీషియన్ ఎంతో ప్రాణం పెట్టి పనిచేసాడని చెప్పాలి ఎందుకంటే ఇది లో బడ్జెట్ సినిమానే అయినప్పటికీ తెరపై సినిమా చూస్తున్నంత సేపు భారీ బడ్జెట్ సినిమా చూసిన ఫీలింగ్ నే కలిగించారు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి సీన్ ని చాలా గ్రాండ్ గా చూపించారు. కొన్ని చోట్ల మా లోకల్ లో ఇంతమంచి లోకేషన్స్ ఉన్నాయా అనేంతలా అతను చూపించాడు. కళ్యాణి కోడూరి మ్యూజిక్ మరో ప్లస్ పాయింట్ సినిమాకి. అతని పాటలు సీన్స్ ని ఎలివేట్ చెయ్యడానికి బాగా హెల్ప్ అయితే అతని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలో ఫీల్ ని అందరికీ కనెక్ట్ చేసేలా చేసింది. అలాగే సెకండాఫ్ లో ఎడిటర్ వర్క్ బాగుంది. ఫస్ట్ హాఫ్ పై కూడా కేర్ తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది.
ఇక కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ – దర్శకత్వ భాద్యతలు తీసుకున్న శ్రీని అవసరాల విషయానికి వస్తే.. కథ – పాతదే అయినా ఫ్రెష్ గా చెప్పాడు. స్క్రీన్ ప్లే – ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. డైలాగ్స్ – బాగున్నాయి, కామెడీ సీన్స్ కి చాలా బాగా రాసుకున్నాడు, అలాగే మధ్య మధ్యలో వాడే అచ్చ తెలుగు డైలాగ్స్ ఇంకా బాగున్నాయి. దర్శకత్వం – మొదటి సినిమానే అయినప్పటికీ ఎంతో బాగా సినిమాని డీల్ చేసాడు. ఎక్కడా కథని పక్కదార్లు పట్టించకుండా చెప్పాలనుకున్న దాని చుట్టూనే కథని చెబుతూ సినిమాని తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. శ్రీని అవసరాల డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడు. వారాహి చలన చిత్రం వారి నిర్మాణ విలువలు బాగా రిచ్ గా ఉన్నాయి. ఈ సినిమాతో వారాహి చలన చిత్రం వారు చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ప్రేక్షకులు మెచ్చే సినిమానే తీస్తారని మరోసారి నిరూపించుకున్నారు.
తీర్పు :
ఈ రోజు నుంచి శ్రీని అవసరాల మొదటి ప్రయత్నంగా చేసిన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా గురించి తెలుగు ప్రేక్షకులంతా గుసగుసలాడుకుంటారు. ఎందుకంటే థియేటర్ కి వచ్చిన ప్రతి ప్రేక్షకుడు రిఫ్రెషింగ్ ఫీల్ కి లోనవ్వడమే కాకుండా హాయిగా నవ్వుకుంటారు కాబట్టి.. శ్రీని అవసరాల, రాశి ఖన్నా, నాగ శౌర్యల పెర్ఫార్మన్స్, కామెడీ ఎపిసోడ్స్ సినిమాకి హైలైట్ అయితే ఫస్ట్ హాఫ్ కొన్ని చోట్ల బోరింగ్ గా సాగడం చెప్పదగిన మైనస్ పాయింట్. ఓవరాల్ గా యూత్ ని బాగా ఆకట్టుకునే ఈ సినిమా మల్టీ ప్లెక్స్, ఏ సెంటర్స్ లోబాగా ఆడుతుంది. కానీ బి, సి సెంటర్స్ లోనే అనుకున్నంత స్థాయిలో ఆడకపోవచ్చు.
123తెలుగు రేటింగ్ : 3.25/5
123తెలుగు టీం