తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కామెడీ కింగ్ అల్లరి నరేష్ నటించిన సినిమా ‘బ్రదర్ అఫ్ బొమ్మాళి’. ఈ సినిమాలో అల్లరి నరేష్ కి పోటీగా అతని సిస్టర్ గా కార్తీక కనిపించింది. ఈ సినిమా నవంబర్ 7న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అల్లరి నరేష్ తో కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించాము. ఆయన బ్రదర్ అఫ్ బొమ్మాళి గురించి చెప్పిన విశేషాలు మీ కోసం..
ప్రశ్న) అసలు ‘బ్రదర్ అఫ్ బొమ్మాళి’ అనే సినిమా ఎలా మొదలైంది.?
స) ‘సిద్దు ఫ్రం శ్రీకాకుళం’ సినిమాకి నాతో పనిచేసిన విక్రమ్ రాజు గారు నాకు మొదట ఈ స్టొరీ లైన్ ని వినిపించారు. బ్రదర్ అండ్ సిస్టర్ కాన్సెప్ట్ అనగానే ఇప్పటికే చాలా స్టార్ హీరోలు బ్రదర్ సిస్టర్ కాన్సెప్ట్ తో ఎక్కువ సినిమాలు చేసారు, మళ్ళీ నేను చెయ్యడం ఏంటి అని అడిగితే.. సీనియర్ ఎన్.టి.ఆర్ నుంచి జూనియర్ ఎన్.టి.ఆర్ వరకూ అందరూ సిస్టర్స్ ఎలా ఉండాలో చూపించారు, కానీ సిస్టర్ ఎలా ఉండకూడదో ఈ సినిమాలో చూపిద్దాం అని ఒక సీన్ చెప్పాడు. నాకు బాగా నచ్చడంతో కథని డెవలప్ చేసి సెట్స్ పైకి వెళ్లాం.
ప్రశ్న) మీ సిస్టర్ గా కనిపించిన కార్తీక పాత్ర గురించి చెప్పండి.?
స) మొదటగా హీరోయిన్ గా చేస్తున్న తను సిస్టర్ గా ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నందుకు నా స్పెషల్ థాంక్స్ టు కార్తీక.. ఒక్క మాటలో చెప్పాలంటే తన పాత్ర మన తెలుగు సినిమా హీరోల్లా ఉంటుంది. తన పాత్ర బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే ఏమాత్రం బ్రెయిన్ కి పని చెప్పకుండా ఎప్పుడూ ఆవేశంతో చేతికి పని చెబుతూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి నాకు చుక్కలు చూపిస్తూ ఉంటుంది. అలా అని అందులో ఎలాంటి నెగటివ్ షేడ్స్ ఉండవు. అలాగే కార్తీక ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్ లా ఫ్లోర్ మోమెంట్స్ చేసింది. అవి సూపర్బ్ గా వచ్చాయి. మీరు సినిమా చూసేటప్పుడు ఇలాంటి సిస్టర్స్ కూడా ఉంటారా అని షాక్ అవుతారు.
ప్రశ్న) మీరు చెప్పేదాన్ని బట్టి చూసుకుంటే కార్తీక పాత్ర మిమ్మల్ని డామినేట్ చేసేలా ఉంది. మరి హీరోలా మీరెలా ఒప్పుకున్నారు.?
స) కార్తీక పాత్ర డామినేట్ చేసేలా ఉండదండి. ఎందుకంటే ఈ సినిమాకి ఇద్దరం హీరోలమే..ఇద్దరికీ సమానమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సినిమాలో మేమిద్దరం కవలలం. తనకేమో ఆవేశం ఎక్కువ, నాకేమో ఆలోచన ఎక్కువ. అందుకే కథలో ఫైట్లు ఫీట్లు తను చేసినా కథని నడిపించేది నేనే.. తను ఆవేశం వల్ల చేసే పనులకి నేను ఇచ్చే హావ భావాలు ఆడియన్స్ కి నవ్వు తెప్పిస్తాయి. నాకు సాయం చేద్దామని వచ్చి ప్రతిసారి నన్నే ఇబ్బందుల్లో పడేస్తుంటుంది. వాటి నుంచి నేను, నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎలా భయటపడ్డాం అనేది ఫన్నీగా ఉంటుంది.
ప్రశ్న) బ్రహ్మానందంకి కోన వెంకట్ పేరు పెట్టాలనే కాన్సెప్ట్ ఎవరిది.? ఎందుకు పెట్టారు.?
స) ఈ మధ్య ప్రతి ఒక్కరూ బ్రహ్మానందంకి ఆ సినిమాలో ఏం పేరు పెట్టారు, ఈ సినిమాలో ఏం పెట్టారు అని అడుగుతున్నారు. అంటే బ్రహ్మానందం పాత్రకి మంచి టైటిల్ కావాలని కోలా అనే పేరు పెట్టాం. ఆయన కోలా క్యాటరింగ్ సర్వీసెస్ చేస్తుంటాడు. ఆయనే కోలా అనేది ఫేమస్ కాదుగా వేరే ఏమన్నా పెట్టాలి అని కోన వెంకట్ అని సజెస్ట్ చేసాడు. ఏముందయ్యా ఆయన కథలు కుక్ చేస్తుంటాడు, నేను ఇక్కడ ఫుడ్ కుక్ చేస్తుంటాను పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది పెట్టేయండి అన్నారు. బాగానే ఉంది ఆయన ఏమి అనుకుంటాడో అని ముందే కాల్ చేసి చెప్పి షూటింగ్ చేసాము. ఫైనల్ కాపీ ఆయన చూసి నా పేరు పెట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ పాత్రని తీసిననదుకు చాలా హ్యాపీగా ఉందని అన్నాడు.
ప్రశ్న) బ్రదర్ అఫ్ బొమ్మాళి లో మేజర్ హైలైట్స్ ఏమిటి.? అలాగే సిస్టర్ సెంటిమెంట్ ఏమన్నా ఉంటుందా.?
స) బ్రదర్ అఫ్ బొమ్మాళి’కి కార్తీక చేసిన ఫస్ట్ ఫైట్, పంచ్ డైలాగ్స్ మరియు డాన్సులు మొదట హైలైట్ అని చెప్పుకోవాలి. ఇక బ్రహ్మానందం – మా మధ్య వచ్చే కామెడీ హైలైట్ అవుతుంది. ఇక సెంటిమెంట్ అంటే బ్రదర్ – సిస్టర్ సినిమాలలో లాగా హెవీ డోస్ సెంటిమెంట్ ఉండదు. కేవలం ఒక 2 నిమిషాలు మాత్రం ఉంటుంది. అదికూడా అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది.
ప్రశ్న) మీరు అనుకున్న కాన్సెప్ట్ కి డైరెక్టర్ చిన్ని ఎంతవరకూ న్యాయం చేసాడు.?
స) మేము అనుకున్న కాన్సెప్ట్ కి 100% చిన్ని న్యాయం చేసాడు. తనే కాన్సెప్ట్ చెప్పి కార్తీకని కూడా ఒప్పించింది. అలాగే శేఖర్ చంద్ర కూడా మంచి క్యాచీ ట్యూన్స్ ఇచ్చాడు.
ప్రశ్న) సుడిగాడు తర్వాత మీరు ఎక్కువగా స్పూస్ చేస్తున్నారు దానివల్ల మీ స్టైల్ అఫ్ కామెడీ మిస్ అవుతోందని పలువురు అంటున్నారు. దానిపై మీ కామెంట్.?
స) అవునండి.. అదే విషయం నాకు తెలిసింది. నేను స్పూఫ్స్ మాత్రమె చెయ్యాలి అని చేసిన సినిమా సుడిగాడు. కానీ ఆ సినిమా కలెక్షన్స్ పరంగా నాకు ‘మగధీర’లా తయారయ్యింది. దాంతో మీ సినిమాలో స్పూఫ్స్ కోరుకుంటున్నారని పలువురు అడుగుతూ ఉండడం వలన, కచ్చితంగా ఉండాలి అని కొంతమంది కోరడం వల్ల ఇష్టం లేకపోయినా చేసేవాడిని. ఎందుకంటే ఇండస్ట్రీలో నో చెప్పడం చాలా కష్టం. ఉదాహరణకి చాలా మంది లడ్డుబాబు లో స్పూఫ్ లేవండి అందుకే ఫెయిల్ అయ్యింది అన్నారు. కానీ ఈ సినిమాలో మాత్రం నో స్పూఫ్స్.. కేవలం కథాపరంగా మాత్రమే కామెడీ ఉండేలా చూసుకున్నాం. ఒకే రైటర్స్ కంటిన్యూగా నాకు పనిచేస్తున్నారు. అందుకే ఈ సినిమాకి రైటర్స్ ని కూడా మార్చి పర్ఫెక్ట్ గా పేలేలా పంచ్ డైలాగ్స్ రాయించాం..
ప్రశ్న) మీ గత సినిమాలు వరుసగా పరాజయాన్ని చవిచూసాయి. మరి వాటి నుంచి ఏమి నేర్చుకున్నారు.?
స) కచ్చితంగా ప్రతి సినిమా నుంచి ఏదో నేర్చుకుంటాం. ఉదాహరణకి… లడ్డుబాబు సినిమా కామెడీ మూవీ కాదు అదొక ఫీల్ గుడ్ మూవీ. మేము ఆ విషయాన్నీ ఆడియన్స్ కి ముందు నుంచే చెప్పకపోవడం వలన వారు కామెడీ ఫిల్మ్ అని వచ్చి నిరాశపడ్డారు. అందుకే ఈ సినిమా విషయంలో ముందు నుంచే కార్తీక హీరోయిన్ కాదు, సిస్టర్ అని చెప్తూ వస్తున్నాం. ఇక పైన చెప్పినట్టు స్పూఫ్స్ కి కాకుండా నా స్టైల్ అఫ్ కామెడీ సినిమా కథలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాను.
ప్రశ్న) మీ తదుపరి సినిమాలతో పాటు మీ 50వ సినిమా గురించి మరియు మీ దర్శకత్వం వహించబోయే సినిమా గురించి చెప్పండి.?
స) ప్రస్తుతం బందిపోటు చేస్తున్నాను.అదికాకుండా ఎ టీవీ వారితో చేస్తున్న సినిమా కూడా సెట్స్ ఫై ఉంది. వీటి తర్వాత చేసే 50వ సినిమాకి ఇంకా కథ ఫైనలైజ్ కాలేదు. భీమనేని శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి మరియు క్రిష్ లాంటి వారు అప్రోచ్ అయ్యారు కానీ ఇంకా కథ అండ్ ఎవరితో చేస్తాను అనేది ఫైనలైజ్ కాలేదు. చెప్పాలంటే 50వ సినిమా నాకు అన్ని సినిమాల్లానే ఉంది, కానీ ఆ నెంబర్ అందరిలో అంచనాలను పెంచేస్తోంది, ఆ అంచనాలు నాలో భయాన్ని పెంచేస్తోంది. అందుకే కుదిరితే ఆ సినిమా సంగతి ఎవరికీ తెలియకుండా మొదలు పెట్టి మూవీని ఫినిష్ చేసి మీ ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఇక నేను దర్శకత్వం వహించే మూవీకి ఇప్పుడే స్క్రిప్ట్ మొదలు పెట్టాను. 2017లో దర్శకత్వం చేసే అవకాశం ఉంది.
ప్రశ్న) చివరగా ‘బ్రదర్ అఫ్ బొమ్మాళి’ గురించి ప్రేక్షకులకి ఏం చెప్తారు.?
స) ‘బ్రదర్ అఫ్ బొమ్మాళి’ సినిమా మీరు బాగా నవ్వుకునే పర్ఫెక్ట్ కామెడీ ఎంటర్టైనర్. ఈ సారి ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమా చేసాను కనుక ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరినీ నిరుత్సాహపరచదు. కావున ఈ వీకెండ్ మీరు ఈ సినిమా చూసి హ్యాపీ గా ఎంజాయ్ చెయ్యచ్చు.
అంతటితో అల్లరి నరేష్ తో మా ప్రత్యేక ఇంటర్వ్యూని ముగించి, ఈ సినిమా తను కోరుకుంటున్న రీతిలో సక్సెస్ ని అందించాలని ఆల్ ది బెస్ట్ చెప్పాము.