సమీక్ష : జై హింద్ 2 – యాక్షన్ మూవీ విత్ గుడ్ కాన్సెప్ట్..

jaihind-2-movie-review విడుదల తేదీ : 07 నవంబర్ 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.5/5
దర్శకత్వం : అర్జున్
నిర్మాత : అర్జున్
సంగీతం : అర్జున్ జన్యా
నటీనటులు : అర్జున్, సిమ్రాన్ కపూర్, సుర్విన్ చావ్లా, రాహుల్ దేవ్, షార్లెట్ క్లైరే, బ్రహ్మానందం, అలీ

1994లో యాక్షన్ కింగ్ అర్జున్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘జై హింద్’ సినిమా సూపర్ హిట్టయింది. టెర్రరిస్ట్ బ్యాక్ డ్రాప్ లో దేశభక్తి ప్రధానాంశంగా తెరకెక్కిన ఆ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సరిగ్గా 20 ఏళ్ళ తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ ‘జై హింద్ 2’తో అర్జున్ తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ శుక్రవారం, నవంబర్ 7న ‘జై హింద్ 2’ సినిమా విడుదలైంది. అబ్దుల్ కలాం స్ఫూర్తితో విద్య ప్రాముఖ్యతను వివరిస్తూ తెరకెక్కిన ఈ సీక్వెల్ ‘జై హింద్’ తరహాలో ప్రేక్షకులను ఆకట్టుకుందో..? లేదో..? ఈ సమీక్ష చదివి తెలుసుకోండి.

కథ :

తన కూతురిని పెద్ద కార్పొరేట్ స్కూల్ లో చదివించాలి అని కలలు కన్న ఓ పేదవాడు చందు (షఫీ). కార్పొరేట్/ ప్రైవేట్ స్కూల్ లో ఫీజులు కట్టలేక, సగటు గవర్నమెంట్ స్కూల్ లో జాయిన్ చేయించడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ ఆత్మహత్యకు ప్రధాన కారణం కార్పొరేట్ స్కూల్ యాజమాన్యం, వారు పేదవాళ్ళను కించపరుస్తూ మాట్లాడిన మాటలు అని తెలుసుకున్న అభిమన్యు (అర్జున్) మనసు చలించిపోతుంది.

విద్య ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి జన్మహక్కు. కేవలం పేదవాళ్ళుగా జన్మించడం వలన ఏ ఒక్క పసివాడు కూడా నిరక్ష్యరాసుడిగా మిగిలిపోకూడదు అని అభిమన్యు ప్రణాళిక రచిస్తాడు. ఎడ్యుకేషన్ సిస్టం మారాలని ఒక ఆశయంతో ముందడుగు వేస్తాడు. అభిమన్యు ఐడియా నచ్చిన మీడియా దానికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తుంది. ప్రజల నుండి, విద్యార్ధుల నుండి మద్దతు లభిస్తుంది. ఒక ఉద్యమంగా మారుతుంది. ఈ పరిణామాలు చూసిన అల్ ఇండియా కార్పొరేట్ స్కూల్స్ అసోసియేషన్, ఎలాగైనా అభిమన్యు చేపట్టిన ఈ ఉద్యమాన్ని ఆపాలని విక్రమ్ ఠాకూర్ అనే ఒక రౌడీని కలుస్తుంది.

అభిమన్యు చేపట్టిన ఉద్యమం నుండి మీడియా దృష్టి మళ్ళించడానికి విక్రమ్ ఠాకూర్ ఏం చేశాడు..? ఎడ్యుకేషన్ సిస్టం మారాలన్న అభిమన్యు ఆశయం నెరవేరిందా..? ఈ ప్రయాణంలో అతను ఎదుర్కున్న సంఘటనలు ఏంటి..? అతనికి సహాయం చేసిన వ్యక్తులు ఎవరు..? అనే ప్రశ్నలకు సమాధానాలు వెండితెరపై సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్ :

అభిమన్యు పాత్రలో అర్జున్ జీవించాడు. 50 ఏళ్ళ వయసులో కూడా 30 ఏళ్ళ యువకుడిలా కనిపించడం ఒక్క అర్జున్ కి మాత్రమే సాధ్యం. పర్ఫెక్ట్ బాడీతో యాక్షన్ కింగ్ అనే టైటిల్ కు న్యాయం చేస్తూ ప్రతి యాక్షన్ సీక్వెన్స్ లో 100 శాతం ప్రతిభను కనబరిచాడు. లండన్ లో షూట్ చేసిన యాక్షన్ సన్నివేశాన్ని దీనికి మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. యాక్షన్ సన్నివేశాలతో పాటు, సెంటిమెంట్ సన్నివేశాలలో కూడా అద్బుతమైన నటన కనబరిచాడు.

సినిమా కథ ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిణామాలకు అద్దం పట్టేలా ఉంది. ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి విద్య అనేది ప్రాధమిక హక్కు అనే పాయింట్ కి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. ఎడ్యుకేషన్ సిస్టం మారాలని సినిమాలో ఒక సన్నివేశంలో అర్జున్ వివరిస్తుంటే, థియేటర్లో ప్రేక్షకుడికి అర్జున్ చెప్పే విషయం సబబుగా అనిపిస్తుంది. సినిమా ప్రారంభమైన ఒక్క 20 నిముషాలు మినహాయిస్తే తర్వాత ప్రేక్షకుడిని కథతో పాటు ట్రావెల్ అయ్యేలా చేయడంలో అర్జున్ సక్సెస్ అయ్యాడు. ‘ఇది ప్రణయమా..’ పాట వినడానికి, తెరపై చూడడానికి బాగుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమాకి నిడివి ప్రధాన అడ్డంకిగా మారింది. 2 గంటల్లో పూర్తవ్వాల్సిన సినిమాను కమర్షియల్ సినిమా అనే ముసుగు వేయడం కోసం పాటలు, కామెడీ ఎపిసోడ్స్ ని ఇరికించారు. అందులో ప్రధమంగా చెప్పుకోవాల్సింది బ్రహ్మానందం, అలీల ట్రాక్. ఇటీవలి కాలంలో రొటీన్ నటనతో విసిగిస్తున్న బ్రహ్మానందం ఈ సినిమాలో కూడా తన ఎక్స్ ప్రెషన్స్ తో విసుగు తెప్పించాడు.

హీరోయిన్లు సుర్విన్ చావ్లా, సిమ్రాన్ కపూర్ లు కేవలం పాటలకు మాత్రమే పరిమితం అయ్యారు. కథలో వారికి ప్రాముఖ్యత లేదు. తర్వాత విలన్ పాత్రను సరిగా డిజైన్ చేయకపోగా, అతని పాత్ర గురించిన వివరణ కూడా సరిగా ఇవ్వలేదు. బాంబ్ బ్లాస్ట్ లు, హత్యలను విక్రమ్ ఠాకూర్ అలవోకగా చేసినా పట్టించుకోని పోలీసులు హీరోను మాత్రం హత్య కేసులో ముద్దాయిగా అరెస్ట్ చేస్తారు. ఈ సీన్స్ లో లాజికల్ గా చాలా లోపాలు ఉన్నాయి. సినిమా కథకు కీలకమైన చందు ఎపిసోడ్ ను డీల్ చేయడంలో దర్శకుడిగా అర్జున్ ఫెయిల్ అయ్యాడు. ఆ పాత్ర నిడివిని తగ్గించి త్వరగా పాయింట్ చెప్పాల్సింది.

సాంకేతిక విభాగం :

‘జై హింద్ 2’ సినిమాకు ఇద్దరు సంగీత దర్శకులు పని చేశారు. అమర్ మొహిలే అందించిన నేపధ్య సంగీతం ప్రతి సన్నివేశంలోని ఫీలింగ్ ను ఎలివేట్ చేసింది. అటు యాక్షన్, ఇటు సెంటిమెంట్ సన్నివేశాలకు అద్బుతంగా రీ రికార్డింగ్ చేశాడు. ‘ఇది ప్రణయమా.. ‘ పాట మినహా అర్జున్ జన్యా స్వరపరిచిన పాటలు సీరియస్ గా సాగిపోతున్న సినిమాలో స్పీడ్ బ్రేకర్స్ లా అడ్డు తగిలాయి. సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే. ఎడిటర్ ఫస్ట్ హాఫ్ ప్రారంభంలో నిడివి ఎక్కువైన సన్నివేశాలను ఒక 20 నిముషాలు కత్తిరించి ఉంటే ప్రేక్షకులు అర్జున్ చెప్పిన పాయింట్ కు బాగా కనెక్ట్ అయ్యేవారు.

‘జై హింద్ 2’ సినిమాకు హార్ట్ & సోల్ అంతా తానై నిలిచాడు యాక్షన్ కింగ్ అర్జున్. కథ, స్క్రీన్ ప్లే, నిర్మాణం, దర్శకత్వం ఇలా నాలుగు భాద్యతలను అర్జున్ నిర్వర్తించాడు. సినిమా ప్రారంభంలో తను చెప్పాలనుకున్న పాయింట్ ను వివరించడంలో తడబాటుకు గురయ్యాడు. కొంచం ఎక్కువ సమయాన్ని వృధా చేశాడు. ఆ తర్వాత చక్కటి స్క్రీన్ ప్లే, యాక్షన్ సన్నివేశాలతో చెలరేగిపోయాడు. మంచి కథను ప్రేక్షకులకు చేరువయ్యేలా చెప్పడంలో కొంత మేరకు సక్సెస్ అయ్యాడు. నటుడిగా 100 శాతం విజయవంతమైన అర్జున్. దర్శకుడిగా, కథకుడిగా పర్వాలేదు అనిపించాడు. నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి.

తీర్పు :

ఎడ్యుకేషన్ సిస్టం మారాలి, విద్య ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి జన్మహక్కు అని అర్జున్ చెప్పిన పాయింట్ బాగుంది. అతను సూచించిన మార్పులు ఆచరణ సాధ్యమా..? మన దేశంలో మార్పు మొదలవుతుందా..? అంటే చెప్పడం కష్టమే. నిజాయితితో, దేశభక్తితో అర్జున్ ఒక మంచి సినిమా రూపొందించారు. సినిమా ప్రారంభంలో కొంత తడబాటుకు గురైనా, 30 నిముషాల తర్వాత కథతో పాటు మనల్ని ట్రావెల్ అయ్యేలా చేశాడు. అర్జున్ నటన, యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఒక మంచి సినిమా చూశామన్న సంతృప్తి కోరుకునేవారు, యాక్షన్ ఓరియెంటెడ్ కమర్షియల్ సినిమాలను ఇష్టపడే వారు ఈ సినిమాకు నిర్భయంగా వెళ్ళొచ్చు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version